ఎన్నికల సర్వేలు ఎందుకు గురి తప్పుతాయి?

ఎన్నికల విశ్లేషణ శాస్త్రాన్ని ఇంగ్లీషులో Psephology అంటారు. ఎన్నికల విశ్లేషకులను Psephologists అంటారు. పాశ్చాత్య దేశాల్లో వందేళ్ల క్రితమే ప్రాచుర్యం పొందిన ఈ శాస్త్రం గత రెండు దశాబ్దాలుగా మనదేశంలోనూ విరివిగా ఉపయోగించబడుతోంది. Psephology లో ప్రజాభిప్రాయ సర్వేలు చేయడం ద్వారా ఓటరు నాడిని తెలుసుకోవడం అత్యంత కీలక అంశం.  పూర్వాశ్రమంలో కొన్నాళ్ళు ఎన్నికల సర్వేలు, విశ్లేషణా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఈ పోస్టు రాశాను.
 
ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు పుంఖాను పుంఖాలుగా వచ్చిపడతాయి ప్రజాభిప్రాయ సర్వేలు. ప్రతి వార్తాపత్రికా, టెలివిజన్ చానెల్ తాము ఎంతో శ్రమించి కనుక్కున్న “నిజాన్ని” పాఠకుల/వీక్షకుల ముందు పెడతాయి. ఇప్పుడు మన దేశంలో తామరతంపరగా పత్రికలూ, టీవీ చానెళ్లు పుట్టుకువస్తున్నాయి . అందుకే ప్రతిరోజూ ఏదో ఒక మీడియా సంస్థ సర్వే ఫలితాలను ప్రకటిస్తోంది. అసలే గందరగోళంగా ఉన్న రాష్ట్ర ఎన్నికల ముఖచిత్రం ఈ ప్రజాభిప్రాయ సర్వేల ప్రకటనలతో ఇంకా అయోమయంగా తయారవుతోంది.  ఎలక్షన్ సర్వేలు ఓటింగ్ సరళిపై ప్రభావం వేస్తాయని చాలామంది నమ్ముతారు. అందుకే ఎలక్షన్ కమీషన్ కూడా సాధారణంగా ఎన్నికలు ప్రారంభం అయ్యాక ఇలాంటి ప్రజాభిప్రాయ సర్వేలపై ఆంక్షలు విధిస్తుంది.
ఈ సర్వేల్లో ముఖ్యంగా రెండు రకాలున్నాయి. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే సర్వే చేసి ప్రజాభిప్రాయం తెలుసుకోవడం ఒకటైతే ఓటు వేసి పోలింగ్ బూత్ నుండి బయటికి వస్తున్న ఓటరును మీరు ఓటు ఎవరికి వేశారనే ప్రశ్న అడగి చేసే ఎగ్జిట్ పోల్స్ రెండో రకం. సహజంగానే ఎగ్జిట్ పోల్స్ వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటాయి. ఒకప్పుడంటే ఈ ఎలక్షన్ సర్వేలపై ప్రజలకు చాలా ఆసక్తి ఉండేది కానీ ఇటీవల వస్తున్న కొన్ని సర్వేలు చూశాక చాలా మందికి వీటిపై ఉన్న నమ్మకం పోయింది. అందుకు ముఖ్యంగా కొన్ని కారణాలు చెప్పుకోవచ్చు.
 • అభ్యర్దుల సంఖ్య పెరిగిపోవడం: రోజు రోజుకూ బరిలో నిలిచే పార్టీల, అభ్యర్దుల సంఖ్య పెరిగిపోవడం వల్ల గెలిచే అభ్యర్ది ఎవరో కనుక్కోవడం చాలా సంక్లిష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఎనభయ్యో దశాబ్దంలో మన దేశంలో ప్రాంతీయ పార్టీల పుట్టుక ఎక్కువయ్యింది. అంతకు ముందు దేశంలోని అనేక నియోజకవర్గాల్లో ద్విముఖ పోటీ ఉండేది. కాంగ్రెస్, దానికి ప్రతిగా కమ్యూనిస్టులో, జనతా పార్టీనో లేదా ఇండిపెండెంట్లో పోటీలో ఉండే కాలంలో సర్వే ద్వారా గెలుపోటముల్ని నిర్ధారించడం కొంచెం తేలికగా ఉండేది. ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం తరువాత ఒక్కో నియోజకవర్గం నుండి పోటీ చేసే వారి సంఖ్య పెరిగింది. ఇక పదవి ద్వారా బాగా డబ్బుపోగేసుకునే సంస్కృతి విశ్వరూపం దాల్చిన నేటి జమానాలోనయితే ప్రతి పార్టీ నుండి టికెట్ రాని నాయకులు రెబెల్స్ గా నామినేషన్లు వేస్తుండటంతో ఎన్నికల ముఖచిత్రం మరింత సంక్లిష్టంగా మారింది. ఏ పార్టీతో సంబంధం లేకుండా బరిలో నిలిచే ఇండిపెండెంట్ల సంఖ్య కూడా రాను రానూ పెరిగిపోతోంది. ఇలా అభ్యర్దుల సంఖ్య పెరగడం వల్ల గెలుపోటముల మధ్య ఓట్ల తేడా తగ్గి సర్వే ద్వారా ఫలితాన్ని ఊహించడం క్లిష్టతరంగా మారుతోంది. 
 • స్థానిక సమస్యలు ఎక్కువ అవడం:   

  ప్రజల నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశాలు కూడా చాలా ఎక్కువ అయ్యాయి ఇప్పుడు. జాతీయ పార్టీల వల్ల ప్రాంతీయ సమస్యలకు పరిష్కారం దొరకక పోవడం, వివిధ సమూహాలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేక పోవడం వంటి కారణాలు ప్రాంతీయ పార్టీల పుట్టుకకు దారితీశాయి. ఇప్పుడు పేరుకు జాతీయ ఎన్నికలు జరుగుతున్నా ప్రజలు మాత్రం స్థానిక సమస్యలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకే మన రాష్ట్రంలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కూడా తెలంగాణా, ఎస్సీ వర్గీకరణ వంటి సమస్యల ప్రాతిపదికగా ఓటరు తీర్పునిస్తున్నాడు. ఇలా స్థానిక సమస్యలు ఎక్కువైన కొద్దీ సర్వే ద్వారా ఓటరు నాడిని పట్టుకోవడం కష్టమవుతోంది.  

 • ప్రాయోజిత సర్వేలు:    

  తొలినాళ్లలో ప్రజాభిప్రాయ సర్వేలు ఎన్నికల ఫలితాలకు కాస్త దగ్గరగానే ఉండేవి. వీటికి పాఠకులు/వీక్షకులు చాలా ప్రాముఖ్యత నిచ్చేవారు. ఈ సర్వే ఫలితాలు ఆయా నియోజకవర్గాల్లోని తటస్థులపై, అప్పటికి ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోని ఓటర్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపేవి. ఎలెక్షన్ సర్వేలతో జనాభిప్రాయాన్ని ప్రభావితం చేయవచ్చని ఎప్పుడైతే రాజకీయ పార్టీలకు అర్థం అయ్యిందో అప్పటినుండీ అవి తమ తమ స్వంత సర్వేలు ప్రకటించడం మొదలు పెట్టాయి. ఏదో ఒక సర్వే ఏజెన్సీని పట్టుకోవడం, వారిద్వారా తమకు అనుకూలమైన సర్వే నివేదిక తయారు చేయించుకుని దానిని మీడియాకు అధికారికంగానో అనధికారికంగానో తెలియపర్చడం ఇటీవలి కాలంలో బాగా జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సర్వేలే 2004 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రజా రాజ్యం పార్టీ కూడా ఇటువంటి సర్వేనొకదాన్ని చూపించి రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు తమకే దక్కుతాయని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాయోజిత  సర్వేల వల్లనే ప్రజలకు మొత్తం ఎన్నికల సర్వేలంటేనే విముఖత ఏర్పడింది.

ఇటీవల వెలువడిన రాష్ట్ర ఎన్నికల సర్వేల ఫలితాలు  (లోక్ సభ) :

election-surveys

(సర్వే ఏజెన్సీ పేరు కింద బ్రాకెట్లలో ఉన్నది సాంపిల్ సైజు)

 • సర్వే చేయడంలో సాంకేతిక లోపాలు:
  శాస్త్రీయంగా చేసిన సర్వే ద్వారా ప్రజాభిప్రాయాన్ని కనుక్కోవడం సాధ్యమే. అయితే ఇప్పుడు జరుగుతున్న చాలా సర్వేలు తప్పుడు ఫలితాలు ఇవ్వడానికి కారణం సర్వే సంస్థలు సర్వే చేయడంలో కొన్ని ప్రమాణాలు పాటించకపోవడమే. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలి:
   
  # సాంపిల్ (మచ్చు) లోపాలు (Sampling errors)- ఏదైనా ఒక విషయానికి సంబంధించి మొత్తం జనాభా (Population) అభిప్రాయం తెలుసుకోవడానికి మనం ఒక సాంపిల్  తీసుకుని సర్వే చేస్తాము. బియ్యం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకును పట్టిచూడడం లాంటిది సర్వే చేయడం అంటే. చాలా సార్లు సర్వే ఫలితాలకు అసలు ఫలితాలకూ హస్తమశకాంతరం తేడా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం మచ్చు లోపాలు (Sampling Errors). అవేమిటో ఇప్పుడు చూద్దాం.
  #సాంపిల్ సైజు :
  సర్వే చేయడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం కాబట్టి చాలా సర్వే సంస్థలు చిన్న సాంపిల్ తో సర్వే నిర్వహిస్తాయి. శాంపుల్ సైజు ఎంత చిన్నదైతే ఆ సర్వే ఫలితాలు తప్పయ్యే అవకాశాలు అంత ఎక్కువ ఉంటాయి. పైన ఇచ్చిన పట్టికలో సర్వే చేసిన సంస్థ పేరుకింద సాంపిల్ సైజు బ్రాకెట్లలో ఇచ్చాను. ఉదాహరణకు స్టార్ న్యూస్ వారు. ఇండియా టీవీ వారు చేసిన సర్వేల సాంపిల్ సైజు సుమారుగా 3000 మంది ఓటర్లు. రాష్ట్రంలో మొత్తం 42 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అంటే వీరు ప్రతి లోక్ సభ స్థానం నుండి సుమారుగా 72 మంది ఓటర్ల అభిప్రాయం సేకరించారు. దాదాపు పదిలక్షల మంది ఓటర్లు ఉండే పార్లమెంటు స్థానం నుండి 72 మంది ఓటర్ల అభిప్రాయం సేకరిస్తే సహజంగానే ఆ సర్వే ఫలితాలు తప్పయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.
  # సాంపిల్ ఎన్నిక
  సర్వేకు సాంపిల్ ను ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మనం ఎన్నుకున్న సాంపిల్ మొత్తం జనాభాను ప్రతిబింబించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ నియోజకవర్గపు ఓటర్లలో ఎన్నో కులాల, వర్గాల ప్రజలు ఉంటారు, పట్టణ, గ్రామీణ ఓటర్లు ఉంటారు, విద్యాధికులూ నిరక్షరాస్యులూ ఉంటారు, స్త్రీ, పురుష ఓటర్లూ, యువకులు, వయోధికులూ ఉంటారు. సర్వే సాంపిల్ లో వీరందరికీ సరైన వాటా ఇవ్వాలి. లేకుంటే ఆ సర్వే ఫలితాలు తప్పయ్యే అవకాశం ఉంటుంది. చాలా సార్లు సర్వే సంస్థలు సర్వే చేయడానికి జర్నలిజం, లేదా సోషియాలజీ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్ధులను ఉపయోగించుకుంటాయి. అయితే సమాచార సేకరణకు వెళ్లిన వ్యక్తులకు సరైన శిక్షణ లేకపోవడం వల్లనో లేక సరైన పారితోషికం లభించకపోవడం వల్లనో, ఒకే ప్రదేశంలో ఎక్కువమంది ఓటర్లను ప్రశ్నించడం వల్లనో, అసలు ఓటర్లనే కలవకుండా సర్వే ప్రశ్నావళిని నింపి పంపిస్తేనో మొత్తం సర్వే ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. ఇంటర్నెట్, SMS ద్వారా జరిగే సర్వేల్లో మచ్చు (Sample) ఎన్నిక సరిగా ఉండదు కనుక అవి వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించవు. 

  # ప్రశ్నావళిలో లోపాలు (Questionnaire Errors)

  సర్వే చేసి ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి సాధారణంగా ఒక ప్రశ్నావళి (Questionnaire) ఉపయోగిస్తారు. ప్రశ్నలు తక్కువ ఉన్న సందర్భాల్లో ప్రశ్నావళి లేకుండా మౌఖికంగా ప్రశ్నలు అడగడం కూడా పరిపాటే. ఫలితాల్లో తేడా రావడానికి ప్రశ్నావళిలో సరైన ప్రశ్నలు ఉండటం అవసరం. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. చాలా సర్వేల్లో ఒక ప్రశ్న అడుగుతుంటారు –

  “ఈ కింది వారిలో ఎవరు ఉత్తమ ముఖ్యమంత్రి?”

  1) చంద్రబాబు నాయుడు

  2) వై యెస్ రాజశేఖర రెడ్డి

  3) కే. చంద్ర శేఖర రావు

  4) చిరంజీవి

  అసలైతే ఇటువంటి ప్రశ్న అడగడం చాలా తప్పు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కేవలం చంద్రబాబు, రాజశేఖర రెడ్డిలను మాత్రమే ముఖ్యమంత్రులుగా చూశారు. చిరంజీవి, చంద్రశేఖరరావు ఆ పదవిలో ఎప్పుడూ లేరు, ఇక చంద్రశేఖర రావు గురించి తెలంగాణా బయట ప్రశ్నించడం పెద్దగా ఉపయోగపడదు.

  ఈ మధ్య ఒక టీవీ ఛానెల్ వారు నిర్వహించిన ఎలక్షన్ సర్వేలో “రాష్ట్ర విభజనను మీరు సమర్ధిస్తారా?” అన్న ప్రశ్న అడిగారు. సహజంగానే తెలంగాణాలో అత్యధికులు ఈ ప్రశ్నకు అవును అని, రాయలసీమ, ఆంధ్రలో కాదనీ చెప్పారు. ఈ మూడు ప్రాంతాల అభిప్రాయాలను కలిపి రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని సదరు చానెల్ ప్రకటించేసింది. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నది, అందుకొరకు ఉద్యమిస్తున్నది తెలంగాణా ప్రాంతంలోనే. రాయలసీమకో, ఉత్తరాంధ్రకో వెళ్లి రాష్ట్రాన్ని విభజించాలా, మీకు ప్రత్యేక రాష్ట్రం కావాలా, వంటి ప్రశ్నలు అడగడం వృధా ప్రయాస.

  # తప్పుడు సమాచారం:

  ఎన్నికల సర్వేలు తప్పు అవడానికి మరో కారణం చాలా సందర్భాల్లో ఓటర్లే తప్పుడు సమాచారం ఇవ్వడం. ఓటు ఎవరికి వేస్తున్నారు అనేది అధిక శాతం ఓటర్లు చాలా గోప్యంగా ఉంచాలనుకుంటారు. సర్వే ఇన్వెస్టిగేటర్లు అడిగినప్పుడు అనేక మంది ఓటర్లు నిజం చెప్పడం ఇష్టం లేకనో, చెబితే ఏమవుతుందో అన్న భయంతోనో తప్పు సమాధానం చెబుతారు. దీనివల్ల కూడా సర్వే నివేదికలు తప్పవుతాయి. అందుకనే ఓటర్లను ప్రశ్నలు అడిగినప్పుడు వారి వెంట వేరే వ్యక్తులు లేకుండా జాగ్రత్త పడాలి. గుంపులు గుంపులుగా జనం ఉన్న చోట అస్సలు ఓటర్లను ప్రశ్నించరాదు. ఈ మధ్య రాజకీయ పార్టీలు కూడా టికెట్ ఇచ్చే ముందు వివిధ అభ్యర్దుల విజయావకాశాలు కనుక్కునేందుకు సర్వే సంస్థలను ఆశ్రయిస్తున్నాయి. సర్వే చేసే ఇన్వెస్టిగేటర్ తను ఏ సంస్థ ప్రతినిధో సరిగా వివరించకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు సహజంగానే తమ పార్టీ పరిస్థితి బావుందని చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు.

  # స్థానిక పరిస్థితుల పై అవగాహన లేకపోవడం:

  సర్వే చేసే అనేక సంస్థలకు స్థానిక రాజకీయ, సామాజిక పరిస్థితులపై పెద్దగా అవగాహన ఉండదు. మొన్నటికి మొన్న ఇండియా టుడే వారి సర్వేలో రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీకి 5 పార్లమెంటు సీట్లు ఉన్నాయని, 2009 ఎన్నికల్లో ఆ పార్టీ ఈ 5 స్థానాలనూ కోల్పోతుందని చెప్పారు. ఇక గత స్థానిక సంస్థల ఎన్నికల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల) సమయంలో రాష్ట్రంలో సర్వే నిర్వహించిన ఒక ప్రముఖ సర్వే సంస్థ వారు వారు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సీ.పీ.ఐ, సీ.పీ.ఎం లకు ఒక్క సీటూ రాదని తేల్చిచెప్పారు. ఎప్పుడైనా సర్వేలు నిర్వహించేటప్పుడు ఓటర్లనుండి సేకరించే ప్రాధమిక సమాచారంతో పాటు ప్రతీ నియోజకవర్గం యొక్క పూర్తి సమాచారం వివిధ ప్రభుత్వ రికార్డుల నుండీ, ఆయా నియోజకవర్గంలోని మీడియా ప్రతినిధులనుండీ సేకరించాలి. అప్పుడే మనకు ఆ నియోజకవర్గం యొక్క సమగ్ర ముఖచిత్రం లబిస్తుంది.

   

 • పునర్విభజనతో ఫలితాలు తారుమారు:   ఈ సారి అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దీనివల్ల అసలు ఫలితాలతో పాటు సర్వే ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈసారి చాలా మంది ఓటర్లకు తాము ఏ నియోజకవర్గం కిందికి వస్తామో తెలియని సందిగ్ధ పరిస్థితి ఉంది. చాలా చోట్ల ప్రస్తుత ఎమ్మెల్యే లేదా ఎంపీ మీద ఉన్న వ్యతిరేకత పునర్విభజన వల్ల ఇంకో నియోజకవర్గ అభ్యర్ధి పై ప్రభావం వేసే పరిస్థితి కనపడుతోంది. ఇది సహజంగానే సర్వే ఫలితాలలను తారుమారు చేస్తుంది.
ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

 • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: