మీరెవరు మేమెవరు వైయెస్?

“తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సూత్రప్రాయంగా ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఈ విషయంపై నిర్ణయాత్మక చర్యలు చేపట్టే సమయం ఆసన్నమైంది”

ఫిబ్రవరి రెండో వారంలో 12వ శాసన సభ చివరి సమావేశం చివరి క్షణాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయెస్ రాజశేఖరరెడ్డి గారన్న మాటలివి.

అయిదు దశాబ్దాలుగా ఎన్నో వంచనలు ఎదుర్కొన్న తెలంగాణా ప్రజలను ఆనాడు వైయెస్ మరోసారి  కౄరంగా పరిహసించాడు

మొన్న ఏప్రిల్ 7 నాడు కరీంనగర్ బహిరంగసభలో మాట్లాడుతూ సోనియాగాంధీ గారు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కాంగెస్ వ్యతిరేకం కాదనీ, అది తమకు అత్యంత ప్రాధాన్యతాంశమని చిలక పలుకులు వల్లె వేసింది.

గత అయిదేళ్లుగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై వై యెస్, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కలిసి ఆడిన నాటకాలు ఒకటా రెండా. పూటకో మాట మారుస్తూ ప్రజల న్యాయమైన ఆకాంక్షలతో ఆటలాడుకున్నాడు వైయెస్. 

తొలి విడత పోలింగు ఇంకా పూర్తిగా ముగియక ముందే వైయెస్ అటు రాయలసీమలోనూ, ఇటు కోస్తాలోను చేసిన వ్యాఖ్యలు బహుశా వైయెస్ ఒక మనిషిగా ఎంత పతనమయ్యాడో చూపించే సూచిక.

ఆయన అన్న మాటలు చూడండో సారి “మహాకూటమి అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో “మనం” విదేశీయులుగా బ్రతకాల్సి వస్తుంది”

మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగులుతోందని వార్తలు రాగానే వైయెస్ తన ముసుగు తీసి పక్కనపెట్టి నిస్సిగ్గుగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఆ విద్వేషాగ్నిలో చలికాచుకునే పనిమొదలు పెట్టాడు.

నాలుగు వందల ఏళ్ల  పైచిలుకు హైదరాబాద్ చరిత్రను ఒక్కసారి పరికిస్తే ఈ నగరం ఎన్ని ప్రాంతాల ప్రజలను ఆదరించి అక్కునజేర్చుకుందో అర్థం అవుతుంది. ఎంతోమంది విదేశీయులే ఈ నగరాన్ని తమ నివాస ప్రాంతంగా చేసుకున్న ఉదాహరణలు ఓవైపు ఉంటే వైయెస్ మాత్రం బరితెగించి అబద్దపు ప్రచారానికి తెగబడుతున్నాడు. గడచిన అయిదేళ్లుగా హైదరాబాద్ నగరాన్ని ఎన్నివిధాలో పీల్చిపిప్పి చేసి ఇప్పుడు ఇలాంటి కారుకూతలు కూయడం ద్వారా వైయెస్ చరిత్ర హీనుడిగా మిగిలిపోయాడు.

తన ఎత్తుగడ విఫలమై అటు మీడియా, ఇటు ప్రతిపక్షాలు తన మీద దుమ్మెత్తిపోసే సరికి “ఏం కేసీఆర్ అంటే తప్పులేదు నేను అంటే తప్పేంటి?” అని సిగ్గులేకుండా ఎదురు ప్రశ్నిస్తున్నాడు.

నువ్వు రాయలసీమ ప్రాంతీయ నేతవు అయితే మేమెవరం పట్టించుకోం వైయెస్, కానీ దురదృష్టవశాత్తూ నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి.

తెలంగాణా ప్రాంత ప్రజలకు జరిగిన అన్యాయాన్ని గురించి వివరిస్తూ కేసీయార్ కొన్నిసార్లు అధిక ప్రసంగం చేసిన మాట నిజం. అయితే గడచిన ఎనిమిదేళ్లుగా తెలంగాణ వంటి భావోద్వేగ ఉద్యమాన్ని హింసకు తావులేకుండా కేసీయార్ నడిపిస్తున్న తీరు నిజంగా ప్రశంసనీయం. ముఖ్యంగా 1969 ఉద్యమం ఎంత త్వరగా హింసాత్మకం అయ్యిందో గుర్తున్న వాళ్లకు ఇప్పటి ఉద్యమం అత్యంత శాంతియుతంగా రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిందనే విషయం అర్థం అవుతుంది. కేసీయార్ స్వయంగా అనేక సార్లు “పొట్టగొట్టిన వాళ్లతోనే పేచీ గానీ పొట్ట చేతపట్టుకు వచ్చిన వారితో కాదు” అని స్పష్టంగా ప్రకటించి ఉన్నాడు.

ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారేమో నంద్యాలలో  “మనల్ని” బ్రతకనీయరు అంటున్నారు.

చంద్రబాబు దెబ్బకు కోమాలోకి వెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్ కు మళ్లీ ప్రాణం పోసి గెలిపించింది తెలంగాణ ప్రజలు. అయిదేళ్లు ఎన్ని నాటకాలు ఆడినా మా ముఖ్యమంత్రి నువ్వే అని అనుకుంది తెలంగాణా. కానీ నువ్వు మాత్రం నీ కొంచెపు బుద్ధిని బయటపెట్టుకున్నావు.

ఇదివరకోసారి హైదరాబాదును నెత్తుటేర్లలో ముంచి రాజకీయ లబ్ధిని పొందిన నీకు మనుషుల ప్రాణాలను సోపానాలుగా చేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య కావచ్చు.  మొదలు ముస్లిములను ఎగదోసి, ఇప్పుడు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలను రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా నువ్వు గద్దెనెక్కుతుండవచ్చు.

లెక్కల గారడీ ఎన్నికల్లో బొటాబొటి విజయం సాధిస్తుండొచ్చు, కానీ ప్రజల మనసుల్లో మాత్రం ఓడిపోయావు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరి హితం కోరవలసిన నువ్వు  “మనం”  –  “వాళ్ళు” అనే తేడా తీసుకు వచ్చి మానసికంగా అప్పుడే వేరుపడిపోయావు!

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: