కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారితో ఓ సాయంత్రం

బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదం మనం చాలాసార్లే చదువుతుంటాం. కానీ అటువంటి అరుదైన వ్యక్తులను కలిసే భాగ్యం మాత్రం ఎప్పుడో కానీ కలగదు. హేతువాదం గురించీ, తెలుగు బ్లాగుల గురించీ, కంకణబద్ధ రామాయణం గురించీ, హిందుస్తానీ సంగీతం గురించీ, అణు ఇంధనం గురించీ అనర్ఘళంగా మాట్లాడగల వారిని మనం రోజూ కలుసుకోం కదా?

అటువంటి అదృష్టం మొన్న నాకు కలిగింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న కొడవంటిగంటి రోహిణీ ప్రసాద్ గారు ఈమధ్యే ప్రజాసాహితి వారు వేసిన స్వీయ వ్యాసాల సంకలనం ఆవిష్కరణ కొరకు హైదరాబాద్ వచ్చారు. మొన్న సాయంత్రం వీక్షణం పత్రిక ఆఫీసుకు వచ్చారాయన. కొంతమంది యువ సాహితీమిత్రులతో కలిసి ఆయనతో గడిపిన ఆ నాలుగు గంటలూ నాలుగు నిముషాల్లా గడిచిపోయాయంటే అతిశయోక్తి కాబోదు.

ప్రముఖ సాహితీవేత్త కొడవంటి కుటుంబరావు గారి పుత్రుడే కొడవటిగంటి రోహిణిప్రసాద్ గారు. ముంబైలోని బాబా ఆటమిక్ పరిశోధనా కేంద్రంలో అణు శాస్త్రవేత్తగా పనిచేసి రిటైరయ్యారు ఆయన. శాస్త్ర సంబంధ విషయాలపై తెలుగులో విరివిగా రాస్తుంటారు. అరుణతార మొదలుకొని వీక్షణం వరకూ, ప్రాణహిత మొదలుకొని పొద్దు వరకూ అనేక అచ్చు పత్రికలు, వెబ్ పత్రికలూ ఆయన వ్యాసాలు ప్రచురించాయి. ఎంతో గొట్టు శాస్త్ర సాంకేతిక సంగతులను కూడా అరటిపండు వలిచి చేతిలోపెట్టినట్టుగా చెప్పడం రోహిణీ ప్రసాద్ ప్రత్యేకత. తెలుగులో ఆనాడు మహీధర నళినీ మోహన్ చేసిన కృషికి కొనసాగింపే ఈనాడు రోహిణీప్రసాద్ రచనలు.

తెలుగులో కొత్త రచయితలు తయారు కావల్సినంత మంది తయారు కావట్లేదని, రాయగలిగిన వారంతా రాయాలని, అది తాము చదివిన పుస్తకం గురించి కావొచ్చు, చూసిన సినిమా గురించి కావచ్చు, విన్న సంగీతం గురించి కావొచ్చునని. విషయం ఏదైనా కానీ తమకు తెలిసిన విషయాలను నలుగురికీ తెలియ జెప్పేందుకు అచ్చ తెలుగులో రాయాలని ఆయన పిలుపునిచ్చారు. తాము రాస్తే అది అచ్చవుతుందో లేదోనని సంశయించవద్దని పేరుమోసిన రచయితలెందరివో రచనలు మొదట పత్రికలచేత తిరస్కరించబడ్డవేనని రెండు ఉదాహరణాలు ఇచ్చారు. ఒకటి తన తండ్రిగారి కథలు కూడా కొందరు సంపాదకులు తిరస్కరించారని, అలాగే శ్రీ శ్రీ మహాప్రస్థానం కూడా భారతి పత్రిక వారు తిప్పి పంపారని చెప్పారు.

అదే సమయంలో తెలుగులో ఇటీవల కవితలు రాయటం కాస్త ఎక్కువైందని. ప్రతి జాతీయ, అంతర్జాతీయ పరిణామంపై పది ఇరవై వాక్యాల్లో ఏదో ఒకటి రాసి పారేయడం సబబు కాదని, ఇది ఆయా అంశాల పట్ల రాసిన వారి బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తుందని ఆయన సున్నితంగా హెచ్చరించారు. ఒక విషయం గురించి రెండు వేల పదాలు రాసేంత సమాచారం ఉంటే, దాన్ని ఒక వ్యాసరూపకంగా రాసే శక్తి ఉన్నప్పుడు మాత్రమే కవితలు రాయలని ఆయన సూచించారు. మనం ఏది రాసిన అది పాఠకులకు సూటిగా అర్థం కావాలని, ఏదో కొంతమందికి మాత్రమే అర్థం ఆయే రచనలు రాయకపోవడమే మేలని, పెద్దగా చదువు రాని గృహిణులు కూడా మనం రాసినదాన్ని చదివి అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు. వ్యక్తిగతంగా తనకు కల్పనాసాహిత్యం కన్నా వ్యాసాలే నచ్చుతాయని అన్నారు.

తెలుగు రచనలు అన్నీ యూనికోడ్ లో ఉండాలని, పత్రికలు కూడా ఇంటర్ నెట్ లో తమ సంచికల యూనికోడ్ కాపీలు ఉంచాలని, అప్పుడే ఏ రచన అయినా పదికాలాల పాటు పదిలంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలుగు బ్లాగుల గురించి మాట్లాడుతూ “నవతరంగం” బ్లాగ్ నిర్వహిస్తున్న వెంకట్ సిద్ధారెడ్డిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈనాటి సమాజంలో పత్రికల బాధ్యత మరింతగా పెరిగిందని చెబుతూ ఆయన పాత్రికేయులు, పౌరులూ సమాచార హక్కు చట్టాన్ని విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. స్పెషల్ ఎకనామిక్ జోన్ల వంటి అన్యాయమైన అభివృద్ధిని ప్రశ్నించాలని, ప్రతిఘటించాలని ఆయన ఈ సమావేశానికి వచ్చిన ప్రతినిధులను కోరారు.

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి బ్లాగుల లంకెలు:

http://rohiniprasadkscience.blogspot.com/

http://rohiniprasadk.blogspot.com/

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: