కలమూ కులమూ జులుమూ

మొన్న జరిగిన సంఘటనలో విషాదం ఏమిటంటే మంద కృష్ణ కోపం ఆంధ్ర జ్యోతి ఎండి రాధాకృష్ణ మీద అయితే దానికి బలి అయ్యింది మాత్రం కె.శ్రీనివాస్ కావటం. దళితుల పట్ల ఎంతో ప్రేమగా ఉండే ఆయనను ఈ కేసులో ఇరికించడం ద్వారా మంద కృష్ణ తన కంట్లో తానే పొడుచుకున్నట్టు అయ్యింది. మీడియాలో అగ్రవర్ణాల ఆధిపత్యం నిజమే అయినా అగ్ర వర్ణాల్లోనూ దళిత పక్షపాతులు ఉంటారనే చిన్న సత్యాన్ని మంద కృష్ణ వంటి వారు విస్మరించడమే బాధాకరం. ఇటువంటి సంఘటనలు మాదిగల వర్గీకరణ ఉద్యమానికి చేటు చేస్తాయే తప్ప ఇసుమంతైనా మేలు చేయవు. దళితుల ఆత్మగౌరవం కొరకు పోరాడే సందర్భాలు ఎన్నో ఉంటాయి కానీ ఇది అటువంటి సందర్బం కానే కాదు.

మంద కృష్ణ, ఆర్. కృష్ణయ్య  ప్రజల్లోంచి వచ్చిన నాయకులు. ఉద్యమాల ద్వారా పేరు, ప్రతిష్ట సంపాదించుకున్న వారు. ఆంధ్ర జ్యోతి రాసిన కధనం పై అభ్యంతరం ఉంటే దానిని శాంతియుతంగా ఖండించడానికి మంద కృష్ణకు,  ఆర్. కృష్ణయ్యకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. వాటన్నిటినీ వదిలి కలం పై జులుం చేయడం ద్వారా ఇన్నాళ్లూ ఎంతో కష్టపడి సంపాదించుకున్న మంచి పేరు మట్టిలో కలిసింది. తాము దళితులం కాబట్టి తమను ఎవరూ విమర్శించొద్దు అనడం నియంతృత్వం అవుతుంది. ఇటువంటి నియంతృత్వ పోకడలే చివరికి ఉద్యమాలను బలహీనపరుస్తాయి. కొన్నాళ్లు చంద్రబాబు నాయుడుకి, కొన్నాళ్లు వై ఎస్ రాజశేఖర రెడ్డికీ వంత పాడటం అలవాటు చేసుకున్న మంద కృష్ణ చివరికి తన వారి వద్దే విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉంది. ఏ ఆత్మగౌరవం కొరకైతే మంద కృష్ణ పోరాటం చేస్తున్నారో దానిని ఆయన ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టడమే బాధ కలిగించే విషయం.

బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇంత మొండిగా మీడియాతో తలపడ్డ రాజకీయ నాయకుడు (వైయెస్) మరొకరు లేరేమో.

ఇన్నాళ్లూ రామోజీ, రాధాకృష్ణల ఇతర వ్యాపారాలపై, అక్రమాలపై ప్రభుత్వం దాడులు చేస్తుంటే ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది. పత్రికాధిపతులు చట్టాలను నిస్సిగ్గుగా ఉల్లంఘించి పత్రికా స్వేచ్చ మాటున దాక్కోలేరు. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఇది నేరుగా పత్రికా స్వేచ్చపైనే దాడి. విధినిర్వహణలో ఉన్న ఒక దినపత్రిక ఎడిటర్ ను ఒక చిన్న కారణంపై అర్ధరాత్రి అరెస్టు చేయటం ఏ రకంగా చూసినా సమర్ధనీయం కాదు. 

వెయ్యిగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే చచ్చినట్టు రేపో ఎల్లుండో వైయెస్ గారికి కూడా ప్రజలు సరైన స్థానం చూపిస్తారు. అంత దాకా ఆయనగారి ఆగ్రహం నుండి తప్పించుకునేదెట్లా అనేదే ఇప్పుడు రాష్ట్ర మీడియా ముందు ఉన్న ప్రశ్న. పైకి ఎన్ని ముఖాలు చూపినా లోలోపల వైయెస్ లో ఓ రాక్షస ఫ్యాక్షనిస్టు దాగి ఉన్నాడని, తనని ఎదిరించిన వాడిని వేటాడే ఆటవిక లక్షణం ఇంకా ఆయనను వీడలేదని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: