ఎక్కడ మొదలు పెట్టాలి మనం?

సీలేరు సంఘటన మరొకసారి మానవహక్కుల సంఘాల పాత్రపై చర్చను లేవనెత్తింది. మనలో చాలామందికి మానవహక్కుల సంఘాల వాళ్లు నక్సలైట్లు ఎన్ కౌంటర్ అయితేనో, అరెస్టు అయితేనో మాత్రమే మాట్లాడుతారు పోలీసులు చనిపోతే మాట్లాడరు అనే అభిప్రాయం ఉంది.

ఇదే విషయంపై ఆవేదన చెందుతూ చదువరి ఒక పోస్టు చేశాడు.

దానికి జవాబిచ్చే ప్రయత్నం చేస్తున్న కత్తి మహేశ్ కుమార్ పోస్టును ఇక్కడ చూడండి

ముప్పై ముగ్గురు యువకులు అంత దారుణంగా చనిపోతే హక్కుల సంఘాలు ఎందుకు స్పందించలేదు అనే ప్రశ్న అడిగే ముందు ఒకసారి చరిత్రలోకి వెళ్లాలి. జరిగినది ఒక isolated incident కాదు. It is a part of a long and bloody battle అని అర్థం చేసుకుంటేనే ఈ హక్కుల సంఘాల మౌనం అర్థం అవుతుంది మనకు. హక్కుల సంఘాలు ఎందుకు నక్సలైట్ల సంఘాలుగా ముద్రవేయబడ్డాయో, అవి ఎవరి హక్కుల కొరకు పోరాటం చేస్తున్నాయో కొంచెం లోతుగా పరిశీలిస్తే అర్థం అవుతుంది. 

ఈ క్రమంలో ఇది మొదటి పోస్టు. రెండోది ఒకటిరెండ్రోజుల్లో…

పోలిసుల హత్య ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. మరే కుటుంబానికీ అటువంటి దురవస్థ రాకుండా ఉండాలని కోరుకుందాం. దాని కొరకు ఏమి చెయ్యాలో అలోచిద్దాం. మొదట్లో కింది స్థాయి పోలీసుల పట్ల నక్సలైట్లు కొంచెం కనికరం చూపేవారు. “పొట్టకూటి కొరకు నువ్వు పోలీసు వైనావు అన్నా” అంటూ గద్దర్ పాడిన ఒక పాట అప్పట్ట్లో చాలా ప్రాచుర్యం పొందింది. కానీ ఇటీవలి కాలంలో కింది స్థాయి పోలీసుల పట్ల కూడా నక్సలైట్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారని వార్తలు చెబుతున్నాయి. పరిస్థితి ఇక్కడి దాకా ఎలావచ్చిందో ఒక సారి ఆలోచించాలి మనం.

తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుందా రాదా అనే చర్చ కాసేపు పక్కన పెడదాం. జరుగుతున్న యుద్ధం గురించీ, యుద్ధంలో అవలంభిస్తున్న విధానాల గురించీ, పోతున్న ప్రాణాల గురించే మాట్లాడుదాం.

ఇన్ని వేలమంది యువకులు ఈ గడ్డపై ఎందుకు ప్రాణాలకు తెగించి విప్లవోద్యమాల్లోకి వెళ్తున్నారో సరిగ్గా అర్థం చేసుకోకపోతే, సమస్యను పరిష్కరించకపోతే ఈ రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న రేపటి తరం ప్రతినిధులు అటు పోలీసుల్లో, ఇటు నక్సలైట్లలో చేరి ఒకరినొకరు వేటాడుకోవడం మన సమాజానికి తీరని నష్టం.

ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. ఒకరి ప్రాణం విలువైనదీ మరొకరి ప్రాణం విలువలేనిదీ అవదు. ప్రభుత్వమే తను ఏర్పరుచుకున్న చట్టం అతిక్రమించి నిర్బంధానికి తెగబడినప్పుడు అనివార్యంగా సీలేరు వంటి ఘటనలు జరుగుతాయి. చర్చ సీలేరు ఒక్కదాని గురించే ఎందుకు? ముప్పై ఏళ్ల క్రితం శ్రీకాకుళంలో మొదలుపెట్టి నేటి దాకా ప్రభుత్వమే ఎన్ కౌంటర్ల పేరిట ఈ రాష్ట్రంలో ఎంత నెత్తురు పారించిందో తప్పకుండా చర్చించాల్సిందే.

నక్సలైట్లు మన ప్రభుత్వాలనీ, చట్టాలనీ గుర్తించరు. వారు చేసే పనులన్నీ చట్టవ్యతిరేకమయినవే అవుతాయి. వారు చేసిన ప్రతి హింసాత్మక కార్యక్రమాన్ని మన ప్రభుత్వాలు తయారు చేసుకున్న చట్టాల ద్వారా శిక్షించవచ్చు. అది చేతకాక హత్యాకాండ జరపడమే ఈ సమస్యకు విరుగుడుగా మన ప్రభుత్వాలు భావించడం వల్లనే పరిస్థితి ఇక్కడిదాకా దిగజారింది. ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తే, ప్రజాస్వామ్య స్పూర్తిని వదిలి ఆటవిక రాజ్యం నెలకొల్పితే ఎలా?

నక్సలిజం ఒక సామాజిక సమస్య అనేది అర్థం చేసుకోకుండా మొండిగా అది శాంతి భద్రతల సమస్య అని వాదించే ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి ఉండటం మన దురదృష్టం. జరిగిన తప్పులు దిద్దుకునే బదులు మొన్నటి ఘటన తరువాత ఇంతకు పదిరెట్ల మందిని ఖతం చేస్తాం అని రంకెలు వేస్తున్న తెలివితక్కువ హోం మంత్రి మన జానా రెడ్డి గారు.

ప్రతి ఏటా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నక్సలైట్లను “వేటాడడానికి” ఇస్తున్న వందల కోట్ల రూపాయల డబ్బు ఎలా దుర్వినియోగమవుతున్నదో సాక్షాత్తూ మాజీ పోలీసు అధికారులే బయటపెడుతున్నారు. ఇప్పటిదాకా నక్సలైట్ల అదుపు పేరిట దుబారా చేసిన డబ్బునే కనుక ఆయా ప్రాంతాలా అభివృద్ధికి కేటాయిస్తే ఈపాటికి ప్రజలకు నక్సలైట్లతో పనే ఉండేది కాదు.

గ్రే హౌండ్స్ పేరిట నూనుగు మీసాల యువకులను శిక్షణ ఇచ్చి, ప్రాణం తీస్తే లక్షలు ఇస్తామని వారిని ప్రలోభపెట్టి వారిని లైసెన్సెడ్ కిల్లర్స్ గా మారుస్తున్నారు. అరెస్టు చేస్తే ఏ లాభమూ ఉండదు, కాల్చిపారేస్తే లక్షలు వస్తాయి అంటూ గ్రే హౌండ్స్ పోలీసులను వేటగాళ్లను చేశారు. చంపడానికీ చావడానికీ వారిని అడవుల్లోకి పంపి వినోదం చూస్తున్న ప్రభుత్వ విధానాలే సీలేరు వంటి దుర్ఘటనలకు కారణమవుతుందని మనం తెలుసుకోవాలి.

గత ముప్పై ఏళ్లలో ఇరువైపులా జరిగిన అన్ని హింసాత్మక ఘటనలు మొత్తం తెలుసుకున్నాకే ఒక అవగాహనకు రావాలి మనం. కాకతీయ ఎక్స్ ప్రెస్ పై దాడితో పాటు నక్సలైట్లు చేసిన అన్ని హింసాత్మక చర్యలనూ ఖండించాలి. పోలీసులు ఉన్నారనుకుని బస్సును పొరపాటుగా పేల్చేసిన ఘటనను తప్పకుండా విమర్శించాలి.  ఇన్ ఫార్మర్ల పేరిట వారు చంపేసిన ప్రతి ఒక్కరి ప్రాణమూ విలువైనదే.

రెండు దశాబ్దాల క్రితం ఇంద్రవెల్లిలో గిరిజనులపై విచక్షణారహితంగా పోలీసులు కాల్పులు జరిపితే మరణించిన డజన్లకొద్దీ గిరిజనుల గురించీ,  మానాల అడవుల్లో మత్తుమందుపెట్టి కాల్చి చంపిన పదిమంది గురించీ, బెంగులూరులో పట్టుకుని చిత్రహింసలు పెట్టి కాల్చిచంపి కొయ్యూరు అడవుల్లో పారేసిన ముగ్గురి గురించీ, ఎన్ కౌంటర్ మృతుల కాళ్లు గొడ్డళ్లతో నరకబడి ఎందుకు ఉన్నాయో, వారి శవాలపై కాల్చిన, కోసిన గాయాల గురించీ తప్పక చర్చించాల్సిందే. ఇంట్లో నక్సలైట్లు ఉన్నారని వేలాది మంది ప్రజలు చూస్తుండగా ఇంటి స్లాబుకు రంధ్రం చేసి అందులోంచి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన మన పోలీసుల చట్టబద్ధ హత్యల గురించి తెలుసుకోకపోతే ఎలా మనం?

ఇక నక్సలైట్ కాదని రూడిగా తెలిసినా ఒక పోలీసు అధికారి వ్యక్తిగత కక్ష కారణంగా “ఎన్ కౌంటర్” అయిన వార్త దిన పత్రిక విలేకరి గులాం రసూల్ గురించీ, తార్నాక బస్ స్టాపులో నిలబడి ఉంటే “పొరపాటు”గా పోలీసులు కాల్చిచంపిన నాగార్జున రెడ్డి గురించీ, రెండేళ్ళ క్రితం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్తూ “ఎన్ కౌంటర్” అయిన రైతులు, ఏదో పెళ్లిలో సన్నాయి వాయించి ఇంటికి వెళ్తుండగా “ఎన్ కౌంటర్” అయిన వాద్యకారులు, పశువులు కాసుకుంటు “ఎన్ కౌంటర్” అయిన పేద బాలుడి గురించి కూడా తెలుసుకోవాలి మనం.

నల్లగొండ జిల్లా రాచకొండ గుట్టల్లో ఇదే గ్రే హౌండ్స్ చేతిలో “ఎన్ కౌంటర్” అయిన మూడేళ్ల బాలిక మౌళిక గురించి కూడా చర్చించడం మనం మరచిపోవద్దు.

అసలు “ఎన్ కౌంటర్” అన్న పదానికి అర్థమే చట్ట విరుద్ధమైన హత్య అనే స్థాయికి దిగజారింది మన దేశంలో. 

కత్తుల సమ్మయ్య అనే ఒక మాజీ నక్సలైట్ ను సాక్షాత్తూ ఈ రాష్ట్ర డిజీపీ స్వయంగా వ్యాపార భాగస్వామిగా పెట్టుకుని జర్మనీ వీసా ఎందుకు ఇప్పించాడో అడగాల్సిందే.

ఐ.పీ.ఎస్. అధికారి వ్యాస్ ను కాల్చి చంపిన నయీముద్దీన్ అనే మాజీ నక్సలైట్ తదనంతర కాలంలో మన పోలీసు పెద్దల ప్రాపకంతో నగరంలో రియల్ ఎస్టేట్ దందాలు చేయడం, మర్డర్లు చేయడం ఎందుకు చేస్తున్నాడో తప్పక చర్చించాలి మనం.

వారి కంటితో వారినే పొడిచేందుకు గిరిజన బెటాలియన్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ కుటిల నీతిని తప్పక ప్రశ్నించాల్సిందే మనం.

ఒకసారి కేరళలో, మరొకసారి తమిళనాడులో, ఇంకొకసారి ఉత్తరభారతంలో ఎక్కడో ఒక చోట నక్సలైట్ అగ్ర నాయకులను పట్టుకురావడం వారిని మన రాష్ట్రంలోని ఏదో ఒక అడవిలో కాల్చిచంపడం ఏ చట్టాలకు లోబడి చేస్తున్నారు మన పోలీసులు? శాంతి చర్చల ప్రతినిధి, జనశక్తి నేత రియాజ్ ను హైదరాబాద్ లో అరెస్టు చేసినట్టు అన్ని చానెళ్లు వార్త ప్రసారం చేసిన తరువాత, రియాజ్ అరెస్టును గురించి దినపత్రికలు రాసిన తరువాత మరుసటి రోజు అతను కరీంనగర్ జిల్లాలో  “ఎన్ కౌంటర్” అవడం దేన్ని సూచిస్తుంది? ప్రతి ఎన్ కౌంటర్ ను సెక్షన్ 302 కింద హత్యానేరంగా నమోదు చెయ్యాలనే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎందుకు ఖాతరు చేయట్లేదో ఒకసారి తప్పక ప్రశ్నించాలి మనం. మన రాష్ట్రంలో ఎన్ కౌంటర్లు జరిగిన అనేక సందర్భాల్లో వార్తా పత్రికలు అవి బూటకపు ఎన్ కౌంటర్లు అని సాక్ష్యాలతో సహా నిరూపించాయి. అయినా ప్రభుత్వం ఈ ఎన్ కౌంటర్ హత్యలకు పాల్పడ్డవారిపై ఏ చర్యా తీసుకోలేదు.

మొన్నటికి మొన్న పదకొండు మంది గిరిజన యువతులపై గ్రే హౌండ్స్ పోలీసులు ఆఘాయిత్యం చేస్తే సదరు పోలీసులను వెనకేసుకొచ్చి ఆ యువతులదే తప్పని తేల్చింది మన ఘనత వహించిన ప్రభుత్వం. ఇలా చేశాక ఇక ఆ గిరిజనులు ప్రభుత్వాన్ని నమ్ముతారా నక్సలైట్లను నమ్ముతారా?  (తాజా కలం)

నక్సలైట్లను కదా చంపింది అని మనం ఊరుకుంటే, ఈ అపసవ్య విధానాలను ప్రశ్నించకపోతే రేపు మీ చేతిలోనో, నా చేతిలోనో ఒక తుప్పు పట్టిన తపంచా, కొంత “విప్లవ సాహిత్యం” ఉంచి చంపేయగలరు మన పోలీసు సార్లు.

 

ఇక పౌర హక్కుల సంఘాల గురించి వచ్చే పోస్టులో మాట్లాడుకుందాం.


ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 102,458 సందర్శకులు