తెలంగాణా సాయుధ పోరాటం – ప్రశ్న-జవాబు

గొప్పలు చెప్పుకునే తత్వం భారతీయులకు సహజంగానే తక్కువ. చేసిన పనులను గురించి రాసుకోవడం కూడా తక్కువే. ఇలా సమకాలీన చరిత్రను కావలసినంతగా డాక్యుమెంట్ చేయకపోవడం మనవాళ్లు చేసిన పెద్ద పొరపాటు. మన పూర్వీకులకు చెందిన అనేక గొప్ప విషయాలు మన తరానికి అందలేదు. మన చరిత్రకు సంబంధించిన కొన్ని విషయాలు పాశ్చాత్య పర్యాటకులు, చరిత్రకారులు చెబితే తెలుసుకోవలసి వస్తుంది.

చరిత్ర రచన చాలా సంక్లిష్టమైనది. విజేతలే చరిత్ర రాయడం వలన పరాజితుల గాధలు ఎప్పటికీ వెలుగు చూడకుండా ఉండే అవకాశం ఉంది. సరిగ్గా ఈ కారణం వల్లనే తెలంగాణా సాయుధ పోరాటాన్ని “అధికారిక” చరిత్ర పుస్తకాలు పట్టించుకోలేదు. ప్రభుత్వాలైతే అసలు అటువంటి పోరాటమే ఒకటి జరిగినట్టు మరచిపోయాయి. ఈ మహోజ్వల పోరాటం గురించి తెలుసుకోవడానికి మిగిలిన ఏకైక సాధనం అప్పటి పోరాట యోధులు రాసిన పుస్తకాలు. వీటిలో ఎంతో విలువైన సమాచారం లభ్యం అవుతుంది కూడా. ఈ పుస్తకాలతో ఒక చిన్న సమస్య ఉంది అదేమంటే ఈ పుస్తకాల్లో అత్యధిక భాగం సాయుధ పోరాట విరమణ తరువాత దాదాపు పది పదిహేను సంవత్సరాల తరువాత వచ్చాయి. కాబట్టి ఇందులోని సమాచారం రాసినవారి జ్ఞాపకశక్తిపై ఆధారపడి ఉంటుంది.

ఇక విషయంలోకి వద్దాం.

తెలంగాణా సాయుధ పోరాటం గురించి నేను రాసిన “తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం – ఒక జ్ఞాపకం” పోస్టులో ఒక వాక్యం గురించి మిత్రుడు పాములపర్తి  సిద్ధార్థ ఒక సందేహం లేవనెత్తాడు.

“ఉరిశిక్ష పడ్డవారిలో నిండా 15 యేళ్లు లేని రాంరెడ్డి ఫోటో అప్పటి టైం పత్రిక తన ముఖచిత్రంగా వెలువరించింది.” అనేదే ఆ వాక్యం.

టైం పత్రిక పాత సంచికలు ఇప్పుడు అంతర్జాలంలో లభ్యం అవుతునాయి. నిజంగానే అందులో వెతికితే రాం రెడ్డి ఫొటో ఉన్న సంచిక దొరకలేదు.

ఆ వాక్యం నేను ఇదివరకు చాలా చోట్లనే చదివాను. తెలంగాణ విమోచనా వార్షికోత్సవాల సందర్భంగా దినపత్రికలు వేసిన స్పెషల్ ఎడిషన్లలో ఈ విషయం చదివిన గుర్తు.

అంతకన్నా ముఖ్య విషయం ప్రముఖ తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, అప్పట్లో ఉరిశిక్ష పడి జైలునుండి తప్పించుకున్న శ్రీ నంద్యాల నర్సిమ్హారెడ్డి గారిని నేను మూడేళ్ల క్రితం స్వయంగా కలిసి ఇంటర్వ్యూ చేశాను. ఆయన కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆ ఇంటర్వ్యూ 2006 జూలై వీక్షణం పత్రికలో ప్రచురితమయ్యింది. తెలంగాణా సాయుధపోరాటంపై కొంతమంది మిత్రులం భవిష్యత్తులో నిర్మించాలనుకుంటున్న డాక్యుమెంటరీలో ఆ ఇంటర్వ్యూ ఉంటుంది.

పుచ్చలపల్లి సుందరయ్య గారు రాసిన Telangana People’s Struggle and Its Lessons పుస్తకంలోని 241 పేజీలో ఇలా రాసి ఉంది:

 

 

URL: http://books.google.com/books?id=TPjIh1G0TmcC&pg=PA294&dq=telangana+armed+struggle&lr=&sig=Le_fd8XLOO5JCxXSiDInpxnPcQQ

 

దీన్ని బట్టి నాకు అర్థమయ్యిందేమిటంటే రాం రెడ్డి కేసును అమెరికన్ మీడియా ప్రముఖంగా ప్రచురించిందని. అయితే అది Time పత్రికనా లేక మరేదైనా “Times” పత్రికనా అన్నది స్పష్టంగా లేదు. దీని పై ఇంకేదైనా సమాచారం దొరికితే దానిని బ్లాగ్ముఖంగా పంచుకుంటాను.

 

ప్రకటనలు

2 Responses to “తెలంగాణా సాయుధ పోరాటం – ప్రశ్న-జవాబు”


  1. 1 మల్లికార్జున శర్మ 7:37 సా. వద్ద అక్టోబర్ 17, 2010

    నేను ఎరబోతు రాం రెడ్డి గార్ని సవివరంగా ఇంటర్వ్యూ చేసి, ఆ పాఠాన్ని నా సంకలిత In Retrospect, Vol. 5, Part I లో పొందుపర్చి వున్నాను. ఆయన జననం 23 అక్టోబరు 1933 వ తేదీ, అప్పాజీపేట గ్రామం (నల్లగొండ జిల్లా, నల్లగొండకు 5-10 మైళ్ల దూరంలోనే). నైజాం పాలనకాలం లోని అపరాధాలకుగాను ఆయనకు, ఆయనతోబాటు మరి ఏడుగురికి 1949 జూన్‌-జూలైలో కావచ్చు జనరల్‌ జె.ఎన్‌. చౌధురీ సైనిక పాలన కాలంలోనే మరణ శిక్షలు విధించడం జరిగింది. అంటే అప్పటికి రాంరెడ్డిగార్కి ఇంకా 16 ఏళ్లు నిండలేదన్నమాట. ఆనక హైకోర్టు ఆదేశం ప్రకారం జరిగిన పునర్విచారణలో అందరినీ నిర్దోషులుగా తేల్చి విడుదల చేయడం జరిగింది. కాని ఇంకో గ్రామాధికారిని కొట్టిన కేసులో 10 ఏళ్ల శిక్ష పడివుండడం, పొరపాటున దానిపై ఆయన అప్పీలుకు వెళ్లివుండకపోవడం వల్ల 1958 దాకా జైలులోనే మగ్గవలిసి వచ్చిందాయనకు, పాపం!

  2. 2 మల్లికార్జున శర్మ 7:51 సా. వద్ద అక్టోబర్ 17, 2010

    సారీ, 1956 దాకా అంటే హైదరాబాదుపై పోలీసు యాక్షన్‌ తర్వాత 8 ఏళ్ల పాటు జైలులో వుండాల్సి వచ్చింది. నేడు పెద్ద పెద్ద మర్డర్లు చేసి లైఫులు పడ్డ వాళ్లే అనేకులు 5-7 ఏళ్లలో విడుదలై పోతున్నారు!


Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: