అణు ఒప్పందం ఒక ధృతరాష్ట్ర కౌగిలి

[వీక్షణం ఆగస్ట్ సంచికలో ప్రచురితం]

అర్థ సత్యాలను ఎంత అలవోకగా మీడియా సాయంతో ప్రచారం చేయవచ్చో అమెరికా-భారత్ అణు ఒప్పందం మరో సారి రుజువు చేసింది. మన నేతలు వాషింగ్టన్ దొరలకు జీ హుజూర్ అని ఎలా సలాం కొడుతున్నారో మన్మోహన్ సింగు గారి తాజా నిర్వాకం తేటతెల్లం చేసింది. ఈ ఒప్పందం పుణ్యమా అని దేశ రాజధానిలో జరుగుతున్న ఎంపీల బేరసారాలు దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నాయి. అడ్డ దారిలో అయినా సరే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని మన్మోహన్ ప్రయత్నిస్తున్న తీరు చూస్తే జుగుప్స కలుగుతోంది. ప్రతిపక్షాలు ఏమీ తక్కువ తినలేదు. అణు ఒప్పందం తెర వెనుక కుదురుతున్న డబ్బుల, పదవుల , పొత్తుల, ఓట్ల, సీట్ల ఒప్పందాలు మీడియాకు చేతినిండా పని సమకూర్చుతుంటే, ప్రజలు మాత్రం తలపట్టుకుని కూర్చుంటున్నారు. దేశ హితమంటే ఎవరి హితమో అణు ఒప్పందం సాక్షిగా భారత ప్రజలు నేడు తెలుసుకుంటున్నారు.

దేశంలో నాటికీ పెరుగుతున్న విద్యుత్ డిమాండును తట్టుకోవడానికి అణు విద్యుత్ తప్పనిసరి అని, అందుకు కొత్త రియాక్టర్లు, వాటికి ఇంధనం కావాలంటే మనం అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోక తప్పదని గత కొన్ని నెలలుగా ఈ ఒప్పందాన్ని సమర్ధించే వర్గం ప్రచారం చేస్తుంది. ఈ ఒప్పందం పై సంతకం పెట్టడం ద్వారా మన దేశం అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుందని, అంతర్జాతీయంగా మన పేరుప్రఖ్యాతులు ఇనుమడిస్తాయనీ కూడా ఈ బాకావాదులు సెలవిస్తున్నారు.

ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమని నమ్మే ప్రజలు పుష్కలంగానే ఉంటారు కాబట్టి ఈ ఒప్పందాన్ని సమర్ధించడం నేడు ఫ్యాషనై కూర్చుంది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని ప్రశ్నించే వారు దేశద్రోహులతో సమానం అయిపోయారు.

అలీనోద్యమానికి ఊపిరులూదిన దేశం ఇవ్వాళ అణు ఒప్పందం చేసుకోవడం ద్వారా అమెరికా పంచన చేరినట్టయ్యింది. ముందుగా అణుఒప్పందాన్ని దానికదిగా విడిగా చూడడమే ఒక పెద్ద తప్పిదం. గత కొన్నేళ్లుగా మన్మోహన్ ప్రభుత్వం అమెరికాతో అంటకాగుతూ ఒక్కొక్కటిగా అమెరికా వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. అమెరికన్ సైన్యంతో కలిసి జంటగా విన్యాసాల్లో పాల్గొనడం, వ్యవసాయ ఒప్పందం కుదుర్చుకోవడం వంటి చర్యలన్నీ అగ్రరాజ్యం మన దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు రచించిన ఒక భారీ ప్రణాళికలో భాగమే అని అర్థం చేసుకోవాలి మనం. అణు ఒప్పందం కుదుర్చుకున్నందుకు బదులుగా మన చిరకాల మిత్ర దేశం ఇరాన్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ అణు ఇందన సంస్థలో (IAEA) ఓటు వేయాలని అమెరికా మన మెడలు వంచింది. భవిష్యత్తులో అగ్ర రాజ్యం మనల్ని ఎలా వాడుకోబోతుందో తెలిపే స్పష్టమైన సూచిక ఇది.

ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు భారత్ తన ఇంధన రంగంలో స్వావలంబన సాధించకుండా ఎప్పటికీ విదేశాలపై ఆధారపడేట్టు చేయడం, అదే సమయంలో మన దేశ రక్షణ అణు కార్యక్రమంపై పట్టు బిగించడం అనే జంట లక్ష్యాలు ఉన్నాయి అమెరికాకు ఈ అణు ఒప్పందం వెనుక. ఒప్పందం కుదిరిన తరువాత అయినా మన విద్యుత్ అవసరాల్లో అణు విద్యుత్ ఒక చిన్న భాగం మాత్రమే తీర్చగలదని ప్రభుత్వం ఇచ్చిన అంకెలే చూపిస్తున్నాయి. అసలు రానున్న ఏళ్లలో విద్యుత్ డిమాండ్ పెరుగుదలపై ప్రభుత్వం చూపిస్తున్న అంకెలే తప్పుల తడకలు. ఒక పెద్ద అంకెను బూచిగా చూపడం, దాని ఆధారంగా వివిధ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించడం గత పదిహేడేళ్లలో లెక్కలేనన్ని సార్లు చూశాం.

మొదలైనప్పుడు పూర్తిగా ఏకపక్షంగా ఉన్న భారత్-అమెరికా అణు ఒప్పంద స్వరూపం అనేక చర్చలు, దిద్దుబాట్ల తరువాత చాలా మారింది. అయితే ఈ ఒప్పందం వల్ల నిజంగానే మనకు బ్రహ్మాండమైన లాభాలు చేకూరుతాయా? ఎందుకు మనపై అమెరికా ఇంత ఔదార్యం కురిపిస్తున్నదో ఒక సారి లోతుగా పరిశీలన చేయవలసి ఉన్నది. అణు ఒప్పందం వెనుక అమెరికా వ్యూహాత్మక, మరియు వ్యాపార లక్ష్యాలే ఎక్కువ. దాని వల్ల తక్షణం మనకు ఒనగూడే ప్రయోజనాల కన్నా దీర్ఘ కాలంలో జరిగే నష్టాలే ఎక్కువ.

అణువూ మనమూ

1957లో మొదలైన మన అణు విద్యుత్ కార్యక్రమం ఇప్పుడు యూరేనియం అన్వేషణ, వెలికితీత మొదలుకొని భారజలం ఉత్పత్తి, రియాక్టర్ల నిర్మాణం, రీప్రాసెసింగ్ వరకూ విస్తరించింది. చిన్న చిన్న ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లను మనం తయారు చేయగలుగుతున్నాం.  అన్నిటికన్నా ముఖ్యమైనది థోరియం ఆధారిత రియాక్టర్లను తయారు చేయగలగడం. ఈ చివరి అంశం పైనే అణు ఒప్పందం మూలంగా తీవ్ర ప్రభావం పడనుంది. దీని గురించి తరువాత మాట్లాడుకుందాం.

అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి అన్ని దేశాల కన్నా ముందు నడుం కట్టింది, ఇతోధికంగా కృషి చేసింది మన దేశమే. 1954లో అణు పరీక్షలు నిలిపివేయాలని తొలుత ప్రతిపాదించింది మన దేశమే. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT-Nuclear Non-proliferation Treaty) సూత్రాలను మొదట ప్రతిపాదించింది భారత దేశమే. కొన్ని దేశాలకు అణ్వస్త్రాల గుత్త హక్కును కలుగజేసే విధంగా ఆ ఒప్పందాన్ని మార్చడంతో చివరికి మన దేశం ఆ ఒప్పందం పై సంతకం పెట్టలేదు.

1982లో అణ్వాయుధాలు నిషేధించడానికి ఒక ఒప్పందం ఉండాలని మొట్టమొదట ప్రతిపాదించింది కూడా మన దేశమే.

1988 ఐక్యరాజ్య సమితి నిరాయుధీకరణపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధి ఇలా అన్నారు:

“మానవాళి భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తూ కొద్ది దేశాలు తమ భద్రత కొరకు ప్రయత్నించడంలోని తర్కాన్ని మేము ఒప్పుకోలేం…అలాగే ఇప్పటికే అణ్వాయుధాలు ఉన్న వారిపై ఆంక్షలు ఎత్తివేసి అణ్వాయుధాలు లేని దేశాలపై నిఘా పెట్టడమూ మాకు సమ్మతం కాదు. ఇటువంటి వివక్షాపూరిత విధానాలు చరిత్రలో అనేకం కనిపిస్తాయి మనకు: స్త్రీలకన్నా పురుషులు గొప్పవారనీ, శ్వేత జాతి ప్రజలు ఇతర జాతుల కన్నా గొప్పవారని, వలస పాలన అనాగరికులను నాగరీకరీకరించే ప్రయత్నమని; ఇప్పటికే అణ్వాయుధాలు ఉన్న దేశాలు బాధ్యతాయుతమయిన శక్తులనీ, మిగతా దేశాలు బాధ్యత తెలియనివని…”

అయితే మనం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం పెట్టకపోవడం వల్ల, 1974లో, 1998లో అణు పరీక్షలు జరపడం వల్లా మనకు ఇతర దేశాల నుండి అణు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, అణు ఇంధనం అందడం లేదు. సరిగ్గా ఈ కారణం వల్లనే ఇవ్వాళ మనం ప్రపంచంలోనే అత్యుత్తమ అణు సాంకేతిక పరిజ్ఞానం దేశీయంగా అభివృద్ధి పరచుకోగలిగాం.

తొలి రోజుల్లో అమెరికా, కెనడా, రష్యా వంటి దేశాలనుండి రియాక్టర్లు దిగుమతి చేసుకున్నా, ఇప్పుడు స్వయంగానే రియాక్టర్లు నిర్మించే స్థితికి ఎదిగాం. చిన్న రియాక్టర్ల తయారీలో మన సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా మన్ననలందుకుంది.

వారు ఇస్తే మనం తీసుకునే పరిస్థితి ఉన్నదా?

అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకుంటే మనకు ఆ దేశం నుండి అణు ఇంధనం (యురేనియం), సాంకేతిక సహకారం వస్తుందని చాలా మంది భారత పౌరులు ఇవ్వాళ విశ్వసిస్తున్నారు. ఒక పథకం ప్రకారం మన్మోహన్ సర్కారు చేసిన ప్రచార ఫలితమే ఇది. అయితే అణు ఒప్పందం వల్ల అమెరికా నుండి మనకు ఒరిగేది పెద్దగా లేదని ఈ కింది వివరాలు పరిశీలిస్తే మనకు ఇట్టే అర్థం అవుతుంది.

1980లో అమెరికాలో 250 యురేనియం గనులు ఉండేవి. ఇవి ఆ యేడాది 16,800 టన్నుల యురేనియం ఉత్పత్తి చేశాయి. 1984 నాటికి గనుల సంఖ్య 50 కి తగ్గగా ఉత్పత్తి కూడా 5700 టన్నులకు పడిపోయింది. ఇక 2003 నాటికి అమెరికాలో రెండంటే రెండే చిన్న గనులు మిగిలాయి. వీటి ఉత్పత్తి 1000 టన్నుల లోపే. తమ దేశంలోనే రియాక్టర్లకు అవసరమైన యురేనియంను స్వయంగా దిగుమతి చేసుకుంటుంది అమెరికా. కనుక ఆ దేశం నుండి మనకు యురేనియం రావడం అనేది ఒక కల మాత్రమే.

ఇక అణు ఒప్పందం పైన సంతకం పెడితే కనీసం అణు సరఫరా బృందం (NSG)లోని ఇతర దేశాల నుండి అయినా యురేనియం లభ్యమవుతుందా అంటే ఈ బృందంలో ఉన్న అతి పెద్ద యురేనియం ఎగుమతిదారు ఆస్ట్రేలియా గత జనవరిలోనే “భారత్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) పై సంతకం పెట్టేదాకా యురేనియం సరఫరా చేసేది లేదు” అని కరాకండిగా చెప్పింది.

అంతే కాదు అమెరికన్లు ఉపయోగించే అణు రియాక్టర్ల కన్నా మన సైంటిస్టులు మెరుగైన అణు రియాక్టర్లు కనిపెట్టారు. మూడు దశల్లో అణు విద్యుత్ ఉత్పాదన చేయడం ద్వారా అతి తక్కువ వ్యర్ధాలను వదిలే బ్రీడర్ రియాక్టర్ విధానాన్ని మన శాస్త్రవేత్తలే అభివృద్ధి చేశారు. ఈ విధానం ఇప్పటి దాకా అమెరికాకు చేతకాలేదన్నది సత్యం. అణు వ్యర్ధాలను మనలా తిరిగి ఇంధనంలా వాడుకోలేక పోవడం వల్లనే అమెరికాలో గుట్టలు గుట్టలుగా అణు వ్యర్ధాలు పేరుకుపోయాయి. దాదాపు 60,000 టన్నుల పైగా ఉన్న ఈ అత్యంత ప్రమాదకరమైన అణు వ్యర్ధాలను నిలువ చేయడానికి అమెరికా సతమతమవుతోంది. అణు రియాక్టర్ల నుండి ఈ వ్యర్ధాలను తరలించే బాధ్యతను అక్కడి ఇంధన శాఖ సరిగ్గా నిర్వహించడంలేదని విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు ఆ శాఖపై ఎన్నో దావాలు కూడా వేశాయి.

1952లో నెలకొల్పిన తారాపూర్ అణు విద్యుత్ రియాక్టర్ ను మనం అమెరికన్ కంపెనీ అయిన జనరల్ ఎలెక్ట్రిక్ నుండి దిగుమతి చేసుకున్నాం. ఈ రియాక్టర్ నుండి వెలువడే వ్యార్ధాలను తిరిగి ఇంధనంగా వాడరాదని అమెరికా షరతు పెట్టింది. మనల్నీ వాడనీయక, తిరిగి తమ దేశమూ తీసుకుపోకపోవడం వల్ల ఆ రియాక్టర్ నుండి వెలువడ్డ దాదాపు 300 టన్నుల విషతుల్యమైన అణు వ్యర్ధాలు మన వద్ద పోగుపడ్డాయి.

ఇటువంటి చరిత్ర కలిగిన అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకుంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కాదు

అణు విద్యుత్ చౌకనా?

యురేనియం ఎగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలో దాదాపు 12,43,000 టన్నుల యురేనియం నిల్వలు ఉన్నాయి. ఇక్కడ లభ్యమయ్యే యురేనియం అత్యంత చౌకగా లభ్యమయ్యే రకం. కానీ ఆ దేశం ఒక్క యూనిట్ అణు విద్యుత్ కూడా ఉత్పత్తి చేయడం లేదు. 2006లో అక్కడి ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటయిన టాస్క్ ఫోర్స్, బొగ్గు ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ కన్నా అణు విద్యుత్ 20-50% ఎక్కువ ఖరీదయినదని పేర్కొంది. భారీగా స్వంత యురేనియం నిల్వలు ఉన్న ఆ దేశానికే అణు విద్యుత్ ఖరీదయినదయితే మనకు చౌక ఎలా అవుతుంది?

అమెరికాలో గత ముప్పై ఏళ్లలో కొత్తగా ఒక్క అణు విద్యుత్ కేంద్రం కూడా మొదలు కాలేదు. ఒక వేళ అణు విద్యుత్ అంత సురక్షితమయినది, చౌకైనదీ అయితే అమెరికాలో ఎందుకు ఇన్నేళ్లుగా ఒక్క కొత్త అణు విద్యుత్ కేంద్రమూ నెలకొల్పలేదో మన్మోహన్, అతని వంది మాగధులూ చెప్పాలి మనకు.

1979లో అమెరికాలోని త్రీ మైల్ ఐలాండ్ అణు రియాక్టర్ లో ఒక పెద్ద ప్రమాదం సంభవించిన దరిమిలా అక్కడి ప్రజలు అణు విద్యుత్తు పై విముఖత చూపసాగారు. 1979 నుండి 1984 మధ్య నిర్మాణ వ్యయం పెరిగిపోవడం వంటి కారణాల వల్ల అక్కడి విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు 58 అణు విద్యుత్ కేంద్రాల స్థాపనను అర్ధాంతరంగా నిలిపివేశాయి. ఇందులో 28 విద్యుత్ కేంద్రాలయితే నిర్మాణం సగంలో ఉండగా నిలిపివేశారు. ఒక సారి ఊహించుకోండి మనదేశమే కనుక అటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే ఎంత భారీ నష్టం సంభవిస్తుందో.

ఇవ్వాళ ఇంధన రంగం సంక్షోభంలో ఉన్నది. చమురు ధరలు మున్నెన్నడూ లేనంత పైకి ఎగబాకడంతో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇదే అవకాశంగా తీసుకుని చమురు ధరల కారణంగా అణు విద్యుత్ మనకు ఇంధన భద్రత కలిగిస్తుందని అర్ధ సత్యాలు ప్రవచిస్తున్నారు. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మనం చమురు ఆధారిత ఉత్పత్తులు ముఖ్యంగా రవాణా రంగంలో వాడుతాము. ఒక వేళ మనం నిజంగానే అణు విద్యుత్ ఉత్పత్తి పెంచినా కూడా మన చమురు దిగుమతులు ఏమీ తగ్గబోవు అనేది వాస్తవం.

గత కొంత కాలంగా చమురు బ్యారెల్ ధరలు పెరిగినట్టే యురేనియం ధరలు కూడా ఆకాశానికి ఎగిశాయన్నది మనం తెలుసుకోవాల్సిన మరో నిజం. గత అయిదేళ్ళలో యురేనియం స్పాట్ ధరలు మూడు రెట్లు పెరిగాయి. 2006 సంవత్సరంలో ప్రపంచం మొత్తం 180 మిలియన్ పౌండ్ల యురేనియం వినియోగిస్తే అందులో భూగర్భం నుండి ఉత్పత్తి అయింది 100 మిలియన్ పౌండ్లే (55%). మిగతాది పాత అణు బాంబుల నుండి వెలికి తీసిందే. ఇలా పాత అణుబాంబుల నుండి లభ్యమయ్యే యురేనియం మరో ఏడేండ్లకు మించి రాదని అంచనా. అప్పుడు యురేనియం ధరలు భగ్గుమనడం ఖాయం.

యూనిట్ ధరల ఆధారంగా అణు విద్యుత్తును చౌక విద్యుత్తుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అరకొర మేధావులు. విద్యుత్ వ్యయం లెక్క వేసేటప్పుడు ఆ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ వ్యయం, ఇతర నిర్వహణ ఖర్చులు, చివరికి అణు రియాక్టర్ పని కాలం ముగిశాక దాన్ని డీ కమీషన్ చేసే ఖర్చులూ (అమెరికాలో ఒక్క రియాక్టర్ డీ కమీషన్ చేసేందుకు 1200 కోట్ల దాకా అవుతోంది) కూడా పరిగణలోకి తీసుకోవాలన్న ప్రాధమిక విషయం వీరు విస్మరిస్తున్నారు. ముందు రియాక్టర్లు, యురేనియం అమ్మి సొమ్ముచేసుకునే బెక్టెల్ వంటి బహుళజాతి కంపెనీలు రియాక్టర్ కాలపరిమితి ముగిసాక అనేక ఏళ్ల పాటు అణు వ్యర్ధాలను తొలగించేందుకు వందల కోట్ల డాలర్ల కాంట్రాక్టులు పొందుతారు. ఇప్పుడు సదరు కంపెనీలు అమెరికాలో చేస్తున్నదదే. ఈ ఖర్చంతా అణు విద్యుత్ ఉత్పత్తి వ్యయంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా?

ఇవన్నీ కలిపితే అణు విద్యుత్ ఖర్చు తడిసి మోపెడవుతుంది. హెచ్చు స్థాయిలో ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా అణు విద్యుత్ ఎక్కడా ఉత్పత్తి కావడం లేదన్నది కళ్లముందే ఉన్న నిజం.

అణు విద్యుత్ సురక్షితమా?

అణు విద్యుత్తు ఎంత సురక్షితమయినది అనే చర్చ చాలా పెద్దది. 1952లో మొదలుకొని ఇప్పటిదాకా అణు విద్యుత్ రియాక్టర్లలో ఆరు పెద్ద ప్రమాదాలు జరిగాయి. సంఖ్యాపరంగా ఇది తక్కువైనా అణు ధార్మికత అత్యంత ప్రమాదకరమైనది అవటం వల్ల, అణు ధార్మికత ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు పరిసర ప్రాంత ప్రజలపై, పర్యావరణంపై ఉండటం వల్లా అణు విద్యుత్ పట్ల ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. అమెరికాలో త్రీ మైల్ ఐలాండ్, రష్యాలోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాల్లో జరిగిన పెద్ద ప్రమాదాలు మనకు గుణపాఠాలు కావాలి.

ఒక్క విషయం మాత్రం తెలుసుకుందాం మనం. ఈనాటికీ అణు శక్తి రంగానికి పూర్తిగా ఇన్స్యూరెన్స్ చేయడానికి ఏ ఇన్స్యూరెన్స్ సంస్థా ముందుకు రాకపోవడం బట్టి అసలు ఈ అణు విద్యుత్ ఎంత సురక్షితమయినదో అర్థం చేసుకోవచ్చు.

ఫ్రాన్స్ ను చూసి మనం వాతలు పెట్టుకోవాలా?

ఫ్రాన్స్ లో 79% విద్యుత్ ఉత్పత్తి అణు విద్యుత్కేంద్రాల ద్వారా అవుతుందని చెప్పేవారు అక్కడ చమురు, సహజ వాయువు ఉత్పత్తి చాలా స్వల్పంగా ఉన్నదని చెప్పరు. ఏప్రిల్ 2004 తరువాత ఫ్రాన్స్ లో ఒక్క తట్ట బొగ్గు కూడా ఉత్పత్తి కాలేదని అసలే చెప్పరు.

అణు రియాక్టర్లను చల్లబరచడానికి ఎక్కువమొత్తంలో చల్లని నీరు అవసరం. ఇందువల్లనే అణు రియాక్టర్లన్నీ సముద్రపు ఒడ్డున కానీ, నదీ తీరాల్లో కానీ నిర్మిస్తారు. ఈ రియాక్టర్లు చల్లని నీటిని స్వీకరించి వేడి నీటిని వదులుతాయి. 2003లో సంవత్సరంలో వడ గాలుల తీవ్రత పెరిగిపోవడం వల్ల ఫ్రాన్స్ లోని 17 రియాక్టర్లను పాక్షికంగానో, పూర్తిగానో నిలిపివేశారు. 95 యూరోలకు ఒక మెగావాట్ యూనిట్ ఉత్పత్తి చేసే ఫ్రాన్స్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఆ కాలంలో విద్యుత్ డిమాండును తట్టుకోవడానికి ఒక్క మెగావాట్ యూనిట్ కొనుగోలుకు 1350 యూరోల దాకా వెచ్చించాల్సి వచ్చింది. జర్మనీ, స్పెయిన్ దేశాల్లో కూడా ఇదే వడగాలుల కారణం వల్ల రియాక్టర్లను నిలిపివేయవలసి వచ్చింది.

ఫ్రాన్స్ లో పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన అణు వ్యర్ధాలపై ఆందోళన వెలిబుచ్చుతూ గ్రీన్ పీస్ వెలువరించిన ఒక నివేదికను ఇక్కడ చదవండి

ఫ్రాన్స్ లో 70 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం గల బ్రెన్నిలిస్ అణు విద్యుత్ కేంద్రం పై 1979లో టెర్రరిస్టులు దాడులు చేశారని వార్తలు వచ్చాయి. దీని ఫలితంగా ఈ అణు విద్యుత్ కేంద్రం మూతబడింది. 23 ఏళ్లుగా ఫ్రాన్స్ ఆ అణు విద్యుత్ కేంద్రాన్ని డీ కమీషన్ చేయడానికి తంటాలు పడుతోంది. ఇప్పటికే డీ కమీషనీంగ్ వ్యయం తడిసిమోపెడై 482 మిలియన్ యూరోలకు (3216 కోట్లు) చేరింది. ఇంతింత ఖర్చులు మనం భరించగలమా?

ఫ్రాన్స్ అణు విద్యుత్ వెనుక ఉన్న ఈ బాగోతాలను మనకు తెలియనివ్వరు అణు విద్యుత్ బాకావాదులు.

ఒప్పందంలోని “వాణిజ్య అవకాశం”

2006 జనవరి రెండో వారంలో అణు శక్తి రంగంలో పేరొందిన బహుళజాతి కంపెనీలకు చెందిన 25 మంది సభ్యులతో కూడిన బృందం ఒకటి మనదేశంలో పర్యటించిందని ఫోర్బ్స్ పత్రిక రాసింది. ఇంత భారీ వ్యాపారవేత్తల బృందం అమెరికన్ చరిత్రలోనే ఇప్పటి దాకా ఏ దేశంలోనూ పర్యటించలేదనీ, అణు ఒప్పందం వల్ల 4 లక్షల కోట్ల రూపాయల వాణిజ్యానికి వీలున్నదని ఆ కథనం రాసింది. ఇదిగో ఈ “వాణిజ్య అవకాశమే” అమెరికాకు మన పట్ల అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన ప్రేమకు ప్రధాన కారణం.

అభివృద్ధి చెందిన దేశాల్లో బేరాలు పెద్దగా లేక అణు రియాక్టర్లు, ఇంధనం అమ్ముకునే బహుళజాతి కంపెనీలు గత కొన్నేళ్ళుగా సతమవుతున్నాయి. ఇప్పుడు వాటికి మార్కెట్ కల్పన కొరకే అమెరికా మనతో అణు ఒప్పందం కుదుర్చుకుంటుందని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.

మన థోరియం నిల్వలపై, థోరియం ఆధారిత రియాక్టర్ పరిజ్ఞానంపై కన్నేసిన అమెరికన్ కంపెనీలు అప్పుడే ఈ రంగంలో పనిచేస్తున్న ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్, బాబా ఆటమిక్ రిసెర్చ్ సెంటర్ వంటి సంస్థలతో సంప్రదింపులు మొదలుపెట్టాయి. చమురు, సహజ వాయువు, బొగ్గు, ఇనుము, బాక్సైట్ వంటి సహజ వనరులను పూర్తిగా ప్రైవేట్, బహుళజాతి కంపెనీల చేతిలో పెట్టడం మొదలుపెట్టిన మన నేతలు రేపు అణు ఒప్పందం కుదరగానే థోరియం విషయంలోనూ అదే విధంగా చేసే అవకాశాలు కనపడుతున్నాయి.

థోరియం భవిష్యత్ కాంతిరేఖ

ఇప్పుడు అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి చాలామంది చెప్పే సాకు మన రియాక్టర్లను నడపడానికి అవసరమైన యురేనియం లభ్యం కావట్లేదని. అణు విద్యుత్ మనకు అవసరమే అని అనుకున్నా దాన్ని ఉత్పత్తి చేయడానికి యురేనియంకు ప్రత్యామ్న్యాయంగా థోరియంను ఉపయోగించొచ్చు. థోరియం ప్రకృతిలో మోనజైట్ అనే ఖనిజంలో ఉంటుంది. ప్రపంచంలో 1 కోటీ ఇరవై లక్షల టన్నుల మోనజైట్ ఖనిజం ఉన్నట్టు అంచనా వేస్తే అందులో రెండింట మూడొంతులు మన భారతదేశంలోనే ఉంది. గత దశాబ్దకాలం నుండి శ్రమించి  మన శాస్త్రవేత్తలు థోరియం నుండి అణు విద్యుత్ తయారు చేసే రియాక్టర్లను విజయవంతంగా తయారుచేశారు. థోరియంను సక్రమంగా వినియోగించుకుంటే మనకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేసుకుని అభివృద్ధిపథంలో నడవచ్చు.

దశాబ్దంపై చిలుకు మన శాస్త్రవేత్తలు ఎంతో శ్రమకోర్చి అభివృద్ధిపరచిన థోరియం ఆధారిత రియాక్టర్ డిజైన్లు అణు ఒప్పందం నేపధ్యంలో అమెరికాకు లభ్యం అవుతాయి, ఈ రంగంలో కొత్తగా పరిశోధన జరగకపోయే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అణు విద్యుత్ రియాక్టర్లు ఇప్పుడు అంతర్జాతీయ తనిఖీ కొరకు తెరిచి ఉంచాలి. ఈ తనిఖీల ముసుగులో మన జాతీయ రహస్యాలు అమెరికాకు చేరుతాయి. అన్నిటికీ ఇతర దేశాల ఆధారపడటం ద్వారా అణు శాస్త్ర సాంకేతిక ప్రగతి కుంటుపడుతుంది. రేపు అమెరికా మనకు చెయ్యిస్తే మనం చతికిలపడటం ఖాయం. అగ్ర రాజ్యంతో ఈ ఒప్పందం మన దేశం పాలిట ధృతరాష్ట్ర కౌగిలి ఆయ్యే ప్రమాదం స్పష్టంగా కనపడుతుంది.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: