బాబు గారి దేవతా వస్త్రాలు

ఎట్టకేలకు బాబుగారు పాయింటుకొచ్చారు. ఇక ఇప్పుడు ముసుగులో గుద్దులాటలు లేవు, ఇజాల గురించిన చర్చ లేదు. సంస్కరణల పోస్టర్ బాయ్ ఇప్పుడు తనని తానే సంస్కరించేసుకున్నారు. అధికారంలో ఉండగా ప్లెయిన్ స్పీకింగ్ (తెలుగులో మనసులో మాట) పేరిట ఆయన ప్రవచించిన విలువల వలువలు విప్పేసి ఇప్పుడు నడిబజారులో నగ్నంగా నిలుచున్నారు.

మొన్నటిదాకా తన యజమానులూ, తానూ అభివృద్ధి మంత్రంగా ఉపదేశించిన స్వేచ్చా వాణిజ్యం, ప్రైవేటీకరణ ప్రపంచవ్యాప్తంగా కుదేలవుతుంటే, సబ్సిడీలు చేదన్న బాబుగారు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి భారత రాజకీయ నాయకులెవరూ గత ఆరు దశాబ్దాల్లో ఇవ్వని హామీని ఓటర్లపై గుప్పించారు. ప్రజలకు నేరుగా డబ్బునే ఇచ్చే పద్ధతికి శ్రీకారం చుట్టారు.

నగదు బదిలీ పధకం పేరిట నిన్న తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ముసాయిదా మానిఫెస్టో లో ప్రకటించిన పధకం నిస్సందేహంగా మన దేశ చరిత్రలో ఒక విషాదకరమైన మైలు రాయి.

ప్రజలు స్వయం సంవృద్ధి సాధించడంలో సాయపడాల్సిన ప్రభుత్వాలు వారిని యాచకులుగా మార్చే ప్రక్రియ ఈనాటిది కాదు. ప్రజా సంక్షేమం కొరకు ఏర్పాటు చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, విద్య, ఆరోగ్య వ్యవస్థలను ప్రైవేటుకు అప్పజెప్పడం అనే ప్రక్రియ గత రెండు దశాబ్దాలుగా బాగా ఊపందుకున్నది. గత అయిదేళ్లలో వైయెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పధకాలు (అరోగ్య శ్రీ, పెన్షన్లు, ఫీజు రాయితీలు) సమాజ హితం కన్న వ్యక్తి హితమే లక్ష్యంగా చేసుకుని సాగాయి.  ప్రజారోగ్య వ్యవస్థకు నిధులు కేటాయించకుండా దానిని మరణశయ్యపైకి చేర్చి ఇప్పుడు అరోగ్య శ్రీ పేరిట ప్రైవేటు ఆసుపత్రులకు, ఇన్స్యూరెన్శ్ కంపెనీలకు వందల కోట్ల రూపాయల పందేరం జరుగుతోంది మన రాష్ట్రంలో. విషాదం ఏమిటంటే ఈ పధకం పేద ప్రజల మన్నన చూరగొనడం. ఇది దీర్ఘకాలంలో సమాజహితం కాదు అని వారికి అర్థం అయ్యేనాటికే పరిస్థితి చేయిదాటిపోతుంది.  ఇటువంటి పధకాలు సహజంగానే ప్రభుత్వానికి కొన్ని అనుకూల ఓట్లను సాధించి పెడతాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఇలాంటి పధకాల వల్లనే కాంగ్రెస్ పార్టీ వైపు ఒకింత మొగ్గు ఉన్నదని వివిధ సర్వేలు సూచిస్తున్నాయి. దీనితో ఠారెత్తిన చంద్రబాబు, చిరంజీవి పోటీలు పడి హామీలు గుప్పిస్తున్నారు. అయితే ఏది ఉచితంగా ఇచ్చినా – చివరికి అది డబ్బైనా – అది వచ్చేది  గోళ్ళూడగొట్టి మన నుంచివసూలు చేసే పన్నులనుండే అని సామాన్య జనానికి అర్థం అయ్యేదాక రాజకీయ నాయకుల ఆటలు ఇలాగేసాగుతాయి.

ఇప్పుడు చంద్రబాబు హామీ వంటిదే ఇతర రాష్ట్రాల నాయకులు కూడా ఇస్తారు. చివరికి దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల పోటీలో పడి ప్రభుత్వ పధకాలకు ఖర్చు చేయాల్సిన సొమ్మంతా ఇలా నేరుగా ప్రజలకే ఇచ్చే పరిస్థితి రావచ్చు. దేశానికి దీర్ఘకాలిక ప్రయోజనం నెరవేర్చే ప్రాజెక్టుల, పధకాల కన్నా ఇలా ప్రజలకే నేరుగా నగదు ఇవ్వడమనే ప్రక్రియ చాలా ప్రమాదకరమైనది. ఇది మన ప్రజాస్వ్యామ్యాన్నే అపహాస్యం చేస్తుంది. దేశ ప్రగతి కుంటుబడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది.

There are no free lunches అంటూ గత పద్దెనిమిదేళ్లలో ఈ దేశంలో అనేక మంది పేద, మధ్య తరగతి ప్రజల నోటి కాడి కూడును లాగేసుకున్నారు బాబు లాంటి రాజకీయ నాయకులు. అటు వ్యవసాయాన్నీ, ఇటు ప్రభుత్వ రంగ సంస్థల్నీ సంస్కరణల ముసుగులో భ్రష్టు పట్టించారు. ఇప్పుడు తామెంతో గొప్పదని ధంకా బజాయించిన అభివృద్ధి నమూనా డొల్లదని తేలిపోతుంటే ఊసరవెల్లుల్లా రంగులు మార్చి ఇలాంటి దగుల్బాజీ పధకాలు ప్రవేశపెడుతున్నారు.  

ఇక రాజకీయ నాయకులు డబ్బులిచ్చి ఓట్లను కొనుక్కుంటున్నారనే చర్చకు అర్థమే ఉండదు.   “ఓటుకు నోటు” ఇవ్వడం ఇప్పుడు మన చంద్రబాబు గారు చట్టబద్ధం చేశారు.  నగదు బదిలీ పధకం చంద్రబాబు దివాళాకోరుతనానికి పరాకాష్ట.


ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 102,470 సందర్శకులు