Archive Page 2

దింపుడు కల్లం ఆశలూ అవిరి

"తెలంగాణపై తెలుగుదేశం వైఖరిలో ఎటువంటి అస్పష్టత లేదని ఆయన (చంద్రబాబు) కుండబద్దలు కొట్టారు:
- 28 మే' 2011

"తెలంగాణపై చేతనైతే నిర్ణయం తీసుకోవాలని, చేతకాకుంటే చేతకాలేదని ప్రజలను క్షమాపణ కోరాలని తెలుగుదేశం అధినేత 
చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు" 
- 30 మే 2011

చూశారా చంద్రబాబు, ఈనాడు పత్రికలు కలిసి చేస్తున్న మాటల గారడీని.

ఎక్కడా తెలంగాణ ఏర్పాటుకు మేము సుముఖమని కానీ, తెలంగాణను వెంటనే ఏర్పాటు చేయాలని కానీ ఒక్క మాట 
ఉండదు. 

ఇదివరకైతే ఇటువంటి డొంకతిరుగుడు మాటలు నమ్మి మోసపోయేవారేమో తెలంగాణ ప్రజలు. కానీ డిసెంబర్ 10, 2009 
నాడు ఈ గోముఖ వ్యాఘ్రాలు ఆడిన రాజీనామాల డ్రామా తరువాత మరోసారి ఈ దొంగమాటలు నమ్మరెవరూ.

"ప్రాంతీయ ఉద్యమాల్లో" (?) మరణించిన వారికి మహానాడులో సంతాపం తెలిపారట. తెలంగాణ అన్న పేరు నేరుగా 
పలకడం కూడా ఇష్టం లేదు తెదేపాకు, ఈనాడు దినపత్రికకు .

ఎన్నడూ లేనిది ఇవ్వాళ కొత్తగా మహానాడులో బతుకమ్మలు బోనాలు నెత్తిన పెట్టుకున్నచంద్రబాబును చూస్తుంటే 
ఇక్కడి ప్రజలకు అరికాలి మంట నెత్తికి ఎక్కుతుంది  

సమైక్యాంధ్ర ఉద్యమానికి కావలసిన సరుకు, సరంజామ అంతా పార్టీ ఆఫీసునుండే సరఫరా అయ్యిందని పార్టీలో 
నెంబర్ 2 గా ఉన్న నాగం జనార్ధనరెడ్డి స్వయంగా చెబుతుంటే ఇంకా ఈ దొంగనాటకాలు ఏమిటి?  

ఇప్పటిదాకా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దింపుడు కల్లం ఆశలైనా ఉండేవి. నాగం జనార్ధనరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ 
చేయడం ద్వారా తెలంగాణలో పార్టీని చరిత్రలో కలిపేశారు. 

ఒకప్పుడు తెలంగాణలో అత్యంత బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం గత సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ
చేసిన 12 స్థానాల్లోనూ డిపాజిట్ కోల్పోయిందని అంటే ఇక్కడి ప్రజలు చంద్రబాబు వైఖరిపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో 
అర్థమవుతుంది. వచ్చే రెండు నెలలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం భూస్థాపితం అవడం ఖాయం. 
 
నమ్మినవాళ్లను మోసం చేయడమే చంద్రబాబు ప్రవృత్తి. మహానాడు వేదికగా బట్టబయలైన కుటుంబ కలహాలు 
చివరికి సీమంధ్రలోనూ పార్టీ పుట్టిముంచడం ఖాయం.  

తెలంగాణ ప్రజల సహనం నశించి వారు మూడో కన్ను తెరవక ముందే రాష్ట్ర ఏర్పాటుపై చంద్రబాబు వైఖరి 
తేల్చాలి.

"Running With The Hares and Hunting With The Hounds" game can't be 
continued forever.

లేకుంటే పార్టీనే కాదు, చంద్రబాబునీ పొలిమేరల దాకా తరిమికొడతారు. ఇక్కడి ప్రజలు.
ప్రకటనలు

బట్టబయలైన రహస్య కుట్ర

దేశ ప్రజలారా వినుడి. ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ఏ అయుధాలు మేలైనవో భారత దేశపు అత్యున్నత న్యాయస్థానపు మాజీ న్యాయమూర్తి సెలవిస్తున్నారు.
నాయకులను ఏ పదవులు ఎరవేసి కొనవచ్చునో, ఉద్యమ పార్టీలను ఎలా లాఘవంగా “మెత్తబరచవచ్చో” బ్లాక్ ఎండ్ వైటులో ఎప్పుడైనా చదివారా మీరు?

కళ్లు తెరుచుకుని చదవండి గణతంత్ర పౌరులారా. ఈ దేశంలో పత్రికా స్వేచ్చ ఎలా అంగడి సరుకుగా మార్చవచ్చో ది గ్రేట్ జస్టిస్ శ్రీ కృష్ణ గారి స్వహస్తాలతో లిఖించిన ఓ రహస్య నివేదికలో బహు చక్కగా వివరించారు.
సంపాదకీయాలు, బ్యానర్ హెడ్ లైన్లు, జిల్లా ప్రత్యేక అనుబంధాలు…ఒకటేమిటి అన్నిటినీ “మేనేజ్” ఎలా చేయాలో, ప్రకటనలిచ్చి మనకు నచ్చిన వార్తలే ఎలా రాయించుకోవచ్చో అరటి పండు వలిచి చేతిలో పెట్టినంత సులభంగా వివరించారు దుగ్గల్, శ్రీకృష్ణలు.
రాష్ట్రంలో ఉన్న దినపత్రికల్లో ఒక్కటి కూడా తెలంగాణా ఉద్యమం పట్ల సానుభూతితో లేదనీ, ఉన్న 13 వార్తా చానెళ్లలో 2 తక్క మిగతా 11 చానెళ్లూ సమైక్యాంధ్రకే మద్ధతిస్తున్నాయని ఎలాంటి సిగ్గూ ఎగ్గూ లేకుండా సెలవిచ్చేశారు మాజీ (అ) న్యాయమూర్తిగారు.
తెలంగాణలో ఉన్న విద్య, వ్యాపార సంస్థల్లో అత్యధికం సీమాంధ్రులవేనని, కొత్త రాష్ట్రం ఏర్పడితే వారి వ్యాపారాలకు చిక్కేనని అసలు చిదంబర రహస్యాన్ని బరితెగించి చెప్పేశారు!
ప్రధాన నివేదికలో 5వ ఆప్షన్ గా తాము చెప్పిన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఇక్కడి ప్రజలను మభ్యపెట్టడానికే అని, తమ అసలు సిఫారసు ఉద్యమాన్ని అణిచివేయడమే నని ఈ గోముఖ వ్యాఘ్రాలు రాసుకున్న బండారం ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు తీర్పుతో బయటపడింది.
నిన్నటి దాకా శ్రీ కృష్ణ కమిటీ రిపోర్టును నెత్తికెత్తుకున్నవారు, ప్రజా ప్రతినిధులను కొనడం, పార్టీలను “మెత్త బరచడం”, మీడియాను ప్రలోభపెట్టడం కూడా “ప్రజాస్వ్యామ్య పరిరక్షణ” కిందికే వస్తాయని దబాయిస్తారేమో చూడాలి ఇప్పుడు.

శ్రీ కృష్ణ కమిటీ రిపోర్టు లోని రహస్య 8 అధ్యాయంలో భాగాలు ఇక్కడ చదవండి

http://missiontelangana.com/?p=404

హైకోర్టు తీర్పుపై సాక్షి పత్రికలో వచ్చిన వార్త:

కౄర నిర్బంధంపై తెలంగాణ ప్రజల విజయం

మిలియన్ మార్చ్ ఫొటోలు ఇక్కడ:

https://picasaweb.google.com/konatham.dileep/TelanganaMillionMarch?feat=directlink

మిలియన్ మార్చ్ కాస్తా 4 గంటల ర్యాలీగా మారినప్పుడు అందరు తెలంగాణవాదుల్లాగే నేనూ నిరాశ చెందాను. కానీ దాన్ని మొత్తానికి వాయిదా వేయడం కంటే ఏదో ఒక రూపంలో కొనసాగించడమే మేలని సరిపెట్టుకున్నాను.
తొలుత మిలియన్ మార్చ్ ను చాలా భారీ ఎత్తున జరపాలనేది తెలంగాణ జేయేసీ వ్యూహం. అయితే మార్చ్ 10 న జరగవలసిన ఇంటర్ మీడియట్ పరీక్షను వాయిదా వేస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ తరువాత తెర వెనుక ఏ శక్తులు పనిచేశాయో గానీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చుంది. దీంతో మిలియన్ మార్చ్ ను కొంచెం వెనకకు జరుపుదామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిపాదించింది. అయితే జేయేసీలోని బీజేపీ, సీ.పీ.ఐ. ఎం.ఎల్, ఇతర ఉద్యోగ, ప్రజా సంఘాలు మాత్రం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవద్దని గట్టిగా పట్టుబట్టాయి. దీనితో ప్రొ. కోదండరాం ఆధ్వర్యంలో జేయేసి ఒక రోజంతా చర్చించి చివరికి మధ్యేమార్గంగా మిలియన్ మార్చ్ ను ఒక ర్యాలీ రూపంలో జరపాలని నిర్ణయించాయి.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యమకారులు చూపించిన విజ్ఞతలో వందోవంతు కూడా చూపలేకపోయింది.

చదవుట కొనసాగించు ‘కౄర నిర్బంధంపై తెలంగాణ ప్రజల విజయం’

10-03-2011

“Those who make peaceful revolution impossible will make violent revolution inevitable.”

John F. Kennedy, 1962

ఒకటి ప్రజా ఉద్యమం – మరొకటి కృత్రిమ ఉద్యమం

ఒకటి తెలంగాణ ప్రజా ఉద్యమం

గత డిసెంబర్ 9 నాడు కేంద్ర హోం మంత్రి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంబిస్తున్నాం అని చేసిన ప్రకటనకు ఏడాది నిండిన సందర్భాన్నిపురస్కరించుకుని డిసెంబర్ 16 నాడు ఓరుగల్లులో “తెలంగాణ మహా గర్జన” బహిరంగ సభ జరిగింది. ఇరవై లక్షల పైచిలుకు ప్రజలు హాజరైన ఈ సభ నభూతో నభవిష్యతి. తెలంగాణా గుండెల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో మరోసారి చాటి చెప్పింది. ఆ సభ మీడియా కవరేజి కింద చూడండి: [click on image to see full size image)

చదవుట కొనసాగించు ‘ఒకటి ప్రజా ఉద్యమం – మరొకటి కృత్రిమ ఉద్యమం’

ఈ అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలి

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్ధుల కేసుల ఎత్తివేతపై అటు అసెంబ్లీ మొదలుకొని ఇటు అంతర్జాలం దాకా సర్వత్రా చర్చ జరుగుతోంది. సహజంగానే కేసుల ఎత్తివేత గురించి జరుగుతున్న చర్చ ముసుగులో తెలంగాణ విద్యార్ధి ఉద్యమంపై బురదజల్లే పనిని కొందరు మొదలుపెట్టారు.

ఏదైనా ఆందోళనలో ఒక బస్సు తగలబడిన, ఒక దుకాణం అద్దాలు పగిలిన ప్రతీ సారి సగటు పౌరుడు ఉలిక్కిపడతాడు. జీవితంలో అసలు రోడ్డెక్కి పోరాటమే చేయవలసిన అవసరమే లేని కొంతమంది మధ్యతరగతి పౌరులైతే గుండెలు బాదుకుంటారు. ప్రభుత్వ. ప్రైవేట్ ఆస్థులను ధ్వంసం చేసే వారిని కఠినంగా శిక్షించాలని గొంతు చించుకుంటారు. ఇప్పుడు సీమాంధ్ర నాయకులనీ, సమైక్యాంధ్ర కోరుకునే మిత్రులనీ చూస్తుంటే అసలు వీరికి తెలిసి అబద్దాలు ఆడుతున్నారా, లేక అజ్ఞానంతో మాట్లాడుతున్నారా అని అనుమానం వస్తుంది.

ఒక సారి చరిత్రలోకి చూస్తే, 1952లో మద్రాసు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేపట్టి చివరికి స్వర్గస్తులయారు. ఆయన మరణంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అనేక చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, దహనం చేశారు. అప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేయలేదు.

ఏ హింసనైతే మీరివ్వాళ వ్యతిరేకిస్తున్నారో, అటువంటి హింస ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం పుట్టిందనే చేదు నిజం మరువకండి.

అసలు మనందరం చర్చించాల్సింది ఆరు దశాబ్దాలు గడిచాక కూడా నేటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల శాంతియుత ఆందోళనలకు స్పందించకపోవడం గురించి. సహనం నశించిన ప్రజలు తిరగబడి హింసకు పాల్పడితేనే ప్రభుత్వాలు సమస్య పరిష్కారం కొరకు చర్యలు చేపట్టడం గురించి. ఈ ధోరణి కొనసాగినంత కాలం ఉద్యమాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.

విద్యార్ధులపై బనాయించిన కేసులు కూడా ఎంత కుట్ర పూరితంగా ఉన్నాయో చూడండి. ఉస్మానియా విద్యార్ధుల్లో కొంతమందిపై 150 కేసులు పెట్టారు. అందులో కొన్ని ఎంత అసంబద్ధంగా ఉన్నాయంటే 10 నిముషాల వ్యవధిలో అటు దిల్సుఖ్ నగర్ లో ఇటు కూకట్ పల్లిలో బస్సులు ధ్వంసం చేశారట వాళ్లు. ఒక్కో విద్యార్ధికి బెయిల్ తీసుకోవడానికే 20 లక్షల దాకా ష్యూరిటీ తీసుకోవాల్సి రావడం బహుశా భారతదేశ ఉద్యమాల చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు. ఇంత షూరిటీ ఎవ్వరూ ఇవ్వలేరు, ఇవి బనాయించిన కేసులు కాబట్టి పోలీసులు కూడా నెలలు గడిచినా  చార్జిషీట్ పెట్టరు,  ఆ తరువాత కూడా విచారణ నత్తనడకన సాగుతుంది. కాబట్టి ఈ విద్యార్ధులు నెలల తరబడి జైల్లోనే మగ్గుతారు. ఇలా చేయటం ద్వారా తెలంగాణా ఉద్యమాన్ని అణచివేయొచ్చు అని పగటి కలలు కంటోంది సీమాంధ్ర ప్రభుత్వం.

సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రే కేసులను ఎత్తివేస్తాం అని ప్రకటించి ఏడాడి గడచినా పట్టించుకోని ఈ జగమొండి రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ పౌరులకు న్యాయం ఎలా జరుగుతుంది?

విద్యార్ధులు రువ్విన రాళ్ల గురించి మాట్లాడుతున్న వారికి అసలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులపై ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి అమానుష హింసాకాండకు పాల్పడిందో తెలియదు.

ఉద్యమంలో విద్యార్ధులు పాల్గొంటున్నారని గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా తెలంగాణ యూనివర్సిటీల్లో మెస్సులు మూసేసింది. ఇది అన్యాయమని, వెంటనే మెస్సులు తెరవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు, మానవహక్కుల సంఘం ఆదేశిస్తే కూడా పట్టించుకోలేదు మన రాష్ట్ర ప్రభుత్వం.

ఆనాడు ఉస్మానియాలో పరిస్థితిని ఇక్కడ చదవండి

ఇక ఫిబ్రవరి 14, 2009 నాడు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు సాగించిన భీభత్సకాండ చూస్తే తెలంగాణ ఉద్యమం అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న పెద్దలకు ఎంత కసి ఉందో ఇట్టే అర్థం అవుతుంది. ఆనాటి సంఘటనలు చూసి చలించిన సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి “ఆనాడు ఒక్కడే డయ్యర్ ఉంటే, ఈనాడు అనేక మంది డయ్యర్ లు ఉన్నారు” అని వ్యాఖ్యానించాడంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం అవుతుంది.

ఫిబ్రవరి 16 నాడు దుర్గాబాయి దేశ్ ముఖ్ అసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉస్మానియా విద్యార్ధులను చూడటానికి వెళ్లినప్పుడు అక్కడ క్షతగాత్రులై పడి ఉన్న ఆ యువతీ యువకులను చూస్తే కళ్లలో నీరు తిరిగాయి.

కరెంటు తీసేసి, మహిళా హాస్టళ్లలోకి జొరబడి వారితో జుగుప్సాకరంగా ప్రవర్తించడం, గాయపడ్డ విద్యార్ధులను, జర్నలిస్టులను తీసుకువెళ్లడానికి వచ్చిన 108 అంబులెన్స్ లను కూడా ఉస్మానియా యూనివర్సిటీలోకి అనుమతించక పోవడం, జర్నలిస్టులను చావగొట్టడం, వారి వాహనాలకు నిప్పంటించి, అవి తగలబడుతుంటే వాటి చుట్టూ కేరింతలు కొడుతూ వాటి పై మూత్ర విసర్జన చేయడం…ఇవీ సీమాంధ్ర ప్రభుత్వ పోలీసుల వికృత చేష్టలు. వీటిని చూస్తుంటే అర్థం కావట్లేదూ తెలంగాణా ఉద్యమం అన్నా, ఇక్కడి ప్రజలు అన్నా సీమాంధ్ర ప్రభుత్వానికి ఎంత కసి ఉందో?

ఒక సారి ఆనాటి దృశ్యాలను, పత్రికా వార్తలను కింద చూడండి:

చారిత్రాత్మక తెలంగాణా ప్రకటనకు ఏడాది!

నాలుగు కోట్ల ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యే దిశగా ఒక నిర్ణయాత్మక ప్రకటన వచ్చి నేటికి సరిగ్గా ఏడాది.

నాటి ప్రకటన ఇక్కడ చూడండి: (http://www.youtube.com/watch?v=ykdfxRFn1ws)

డిసెంబర్ 10, 2009 నాడు చంద్రబాబు, చిరంజీవి మొదలుకొని సీమాంధ్ర నాయకులంతా మూకుమ్మడి నమ్మకద్రోహానికి పాల్పడకుండా ఉండి ఉంటే ఈపాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయ్యుండేది.

“తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మా పూర్తి మద్ధతు ఉంది” అంటూ డిసెంబర్ 8, 2009 వరకూ నమ్మబలికి, తీరా కేంద్ర హోం మంత్రి ప్రకటన రాగానే మాట మార్చిన సీమాంధ్ర నాయకుల నమ్మకద్రోహం స్వతంత్ర భారతదేశ చరిత్రలో జరిగిన అతి పెద్ద నమ్మకద్రోహం.

గత యేడాదిగా పనికిరాని కమిటీ వేసి కాలయాపన చేసినా సహనంతో వేచి ఉన్న తెలంగాణ ప్రజలు, మరో సారి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు చేయి చేయి కలిపి ముందుకు సాగుతున్నారు.

ఈసారి మాత్రం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ పూర్యయ్యేంత వరకూ ఈ ఉద్యమం ఆగదు.


ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు