ఈ అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలి

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్ధుల కేసుల ఎత్తివేతపై అటు అసెంబ్లీ మొదలుకొని ఇటు అంతర్జాలం దాకా సర్వత్రా చర్చ జరుగుతోంది. సహజంగానే కేసుల ఎత్తివేత గురించి జరుగుతున్న చర్చ ముసుగులో తెలంగాణ విద్యార్ధి ఉద్యమంపై బురదజల్లే పనిని కొందరు మొదలుపెట్టారు.

ఏదైనా ఆందోళనలో ఒక బస్సు తగలబడిన, ఒక దుకాణం అద్దాలు పగిలిన ప్రతీ సారి సగటు పౌరుడు ఉలిక్కిపడతాడు. జీవితంలో అసలు రోడ్డెక్కి పోరాటమే చేయవలసిన అవసరమే లేని కొంతమంది మధ్యతరగతి పౌరులైతే గుండెలు బాదుకుంటారు. ప్రభుత్వ. ప్రైవేట్ ఆస్థులను ధ్వంసం చేసే వారిని కఠినంగా శిక్షించాలని గొంతు చించుకుంటారు. ఇప్పుడు సీమాంధ్ర నాయకులనీ, సమైక్యాంధ్ర కోరుకునే మిత్రులనీ చూస్తుంటే అసలు వీరికి తెలిసి అబద్దాలు ఆడుతున్నారా, లేక అజ్ఞానంతో మాట్లాడుతున్నారా అని అనుమానం వస్తుంది.

ఒక సారి చరిత్రలోకి చూస్తే, 1952లో మద్రాసు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేపట్టి చివరికి స్వర్గస్తులయారు. ఆయన మరణంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అనేక చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, దహనం చేశారు. అప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేయలేదు.

ఏ హింసనైతే మీరివ్వాళ వ్యతిరేకిస్తున్నారో, అటువంటి హింస ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం పుట్టిందనే చేదు నిజం మరువకండి.

అసలు మనందరం చర్చించాల్సింది ఆరు దశాబ్దాలు గడిచాక కూడా నేటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల శాంతియుత ఆందోళనలకు స్పందించకపోవడం గురించి. సహనం నశించిన ప్రజలు తిరగబడి హింసకు పాల్పడితేనే ప్రభుత్వాలు సమస్య పరిష్కారం కొరకు చర్యలు చేపట్టడం గురించి. ఈ ధోరణి కొనసాగినంత కాలం ఉద్యమాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.

విద్యార్ధులపై బనాయించిన కేసులు కూడా ఎంత కుట్ర పూరితంగా ఉన్నాయో చూడండి. ఉస్మానియా విద్యార్ధుల్లో కొంతమందిపై 150 కేసులు పెట్టారు. అందులో కొన్ని ఎంత అసంబద్ధంగా ఉన్నాయంటే 10 నిముషాల వ్యవధిలో అటు దిల్సుఖ్ నగర్ లో ఇటు కూకట్ పల్లిలో బస్సులు ధ్వంసం చేశారట వాళ్లు. ఒక్కో విద్యార్ధికి బెయిల్ తీసుకోవడానికే 20 లక్షల దాకా ష్యూరిటీ తీసుకోవాల్సి రావడం బహుశా భారతదేశ ఉద్యమాల చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు. ఇంత షూరిటీ ఎవ్వరూ ఇవ్వలేరు, ఇవి బనాయించిన కేసులు కాబట్టి పోలీసులు కూడా నెలలు గడిచినా  చార్జిషీట్ పెట్టరు,  ఆ తరువాత కూడా విచారణ నత్తనడకన సాగుతుంది. కాబట్టి ఈ విద్యార్ధులు నెలల తరబడి జైల్లోనే మగ్గుతారు. ఇలా చేయటం ద్వారా తెలంగాణా ఉద్యమాన్ని అణచివేయొచ్చు అని పగటి కలలు కంటోంది సీమాంధ్ర ప్రభుత్వం.

సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రే కేసులను ఎత్తివేస్తాం అని ప్రకటించి ఏడాడి గడచినా పట్టించుకోని ఈ జగమొండి రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ పౌరులకు న్యాయం ఎలా జరుగుతుంది?

విద్యార్ధులు రువ్విన రాళ్ల గురించి మాట్లాడుతున్న వారికి అసలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులపై ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి అమానుష హింసాకాండకు పాల్పడిందో తెలియదు.

ఉద్యమంలో విద్యార్ధులు పాల్గొంటున్నారని గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా తెలంగాణ యూనివర్సిటీల్లో మెస్సులు మూసేసింది. ఇది అన్యాయమని, వెంటనే మెస్సులు తెరవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు, మానవహక్కుల సంఘం ఆదేశిస్తే కూడా పట్టించుకోలేదు మన రాష్ట్ర ప్రభుత్వం.

ఆనాడు ఉస్మానియాలో పరిస్థితిని ఇక్కడ చదవండి

ఇక ఫిబ్రవరి 14, 2009 నాడు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు సాగించిన భీభత్సకాండ చూస్తే తెలంగాణ ఉద్యమం అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న పెద్దలకు ఎంత కసి ఉందో ఇట్టే అర్థం అవుతుంది. ఆనాటి సంఘటనలు చూసి చలించిన సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి “ఆనాడు ఒక్కడే డయ్యర్ ఉంటే, ఈనాడు అనేక మంది డయ్యర్ లు ఉన్నారు” అని వ్యాఖ్యానించాడంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం అవుతుంది.

ఫిబ్రవరి 16 నాడు దుర్గాబాయి దేశ్ ముఖ్ అసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉస్మానియా విద్యార్ధులను చూడటానికి వెళ్లినప్పుడు అక్కడ క్షతగాత్రులై పడి ఉన్న ఆ యువతీ యువకులను చూస్తే కళ్లలో నీరు తిరిగాయి.

కరెంటు తీసేసి, మహిళా హాస్టళ్లలోకి జొరబడి వారితో జుగుప్సాకరంగా ప్రవర్తించడం, గాయపడ్డ విద్యార్ధులను, జర్నలిస్టులను తీసుకువెళ్లడానికి వచ్చిన 108 అంబులెన్స్ లను కూడా ఉస్మానియా యూనివర్సిటీలోకి అనుమతించక పోవడం, జర్నలిస్టులను చావగొట్టడం, వారి వాహనాలకు నిప్పంటించి, అవి తగలబడుతుంటే వాటి చుట్టూ కేరింతలు కొడుతూ వాటి పై మూత్ర విసర్జన చేయడం…ఇవీ సీమాంధ్ర ప్రభుత్వ పోలీసుల వికృత చేష్టలు. వీటిని చూస్తుంటే అర్థం కావట్లేదూ తెలంగాణా ఉద్యమం అన్నా, ఇక్కడి ప్రజలు అన్నా సీమాంధ్ర ప్రభుత్వానికి ఎంత కసి ఉందో?

ఒక సారి ఆనాటి దృశ్యాలను, పత్రికా వార్తలను కింద చూడండి:

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: