లేని 7వ జోన్ పేరిట తెలంగాణ ఉద్యోగాలు కొల్లగొట్టారు

ఇవ్వాళ మధ్యాహ్నం ఆఫీసుకు వెళ్ళేటప్పుడూ, సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడూ తార్నాక వద్ద అదే ఉద్రిక్తత. సాయంత్రం నేను తార్నాక ఫ్లై ఓవర్ పైన ఉన్న సమయంలోనయితే ఏకంగా కాల్పుల శబ్దాలు. ఆ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ జాం అయిపోయింది.

హైదరాబాద్ ఫ్రీ జోన్ వివాదమే సరిగ్గా ఏడాది క్రితం తెలంగాణా రాష్ట్రోద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. మళ్లీ ఏడాది తరువాత అవే దృశ్యాలు…డె జావు…
కాకపోతే అప్పటికీ ఇప్పటికీ ఒక మౌలిక తేడా ఉంది. ఆనాటి ఉద్యమంలో తెలంగాణ వస్తుందో రాదో తెలీయని ఒక సందిగ్ధావస్థ. ఇవ్వాళ వచ్చిన తెలంగాణను అడ్డుకున్నవారిపై ఆగ్రహం. డిసెంబర్ 9, 2009 నాటి ప్రకటనను ఆచరణరూపంలోకి తీసుకురావాలనే పట్టుదల ఇప్పుడు ప్రతి తెలంగాణ పౌరునిలో కనపడుతోంది.
ఇప్పుడు జరుగుతున్న జోన్ వివాదం గురించి ఇదివరకు రాసిన ఒక విషయం మరో సారి గుర్తు చేసుకుందాం.
1969 ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేశాక ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు రక్షణలు కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్రాన్ని మొత్తం 6 జోన్లుగా విభజించారు. APPSC -Andhra Pradesh Public Service Commission చేసే నియామకాల్లో అధిక శాతం ఈ జోన్ల వారీగానే జరుగుతాయి.
ఆ జోన్ల వివరాలు ఇవీ:
జోన్ 1: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం

జోన్ 2: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా

జోన్ 3: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు

జోన్ 4: అనంతపూర్, కర్నూల్, కడప, చిత్తూరు

జోన్ 5: అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం

జోన్ 6: హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ
ఇందులో గమనించాల్సింది ఏమిటంటే తెలంగాణా జిల్లాలైన జోన్ 5 వారు కూడా జోన్ 6 లో నాన్-లోకల్ కోటాకు మించి ఉండటానికి వీలులేదు.
టీచర్ పోస్టుల వంటివి మాత్రం DSC -District Service Commission భర్తీ చేస్తుంది. డిఎస్సీ ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాల్లో మాత్రం ఏ జిల్లా వారు ఆ జిల్లాలోనే లోకల్ అభ్యర్దులు. పక్క జిల్లాలో వారు నాన్ లోకల్ అభ్యర్ధులవుతారు.
వాస్తవం ఇలా ఉంటే, ఆంధ్రా లాబీ పైరవీలు ఎక్కడిదాకా పోయాయంటే, రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి అక్రమంగా ఒక “జోన్ 7″ ను సృష్టించారు.
సాక్షాత్తూ APPSC వెబ్ సైట్ (పాతది) ఎంత అసంబద్ధంగా పైలైనులో రాష్ట్రంలో 6 జోన్లు ఉన్నాయని రాసి కింద టేబుల్ లో మాత్రం జోన్ 7 గురించి రాసిందో చూడండిక్కడ.  (పూర్తి సైజు బొమ్మను చూడడానికి బొమ్మపై క్లిక్ చేయండి)

ఇలా ఆరో జోన్లో ఉన్న హైదరాబాద్ ను కొత్తగా ఏడో జోన్ అనే ఊహాజనితమైన జోన్లో ఉంచి కొన్ని వేల ఉద్యోగాలను సీమాంధ్రులతో నింపేశారు. తెలంగాణ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారు.

[హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాబట్టి ఇక్కడి ఉద్యోగాలు అన్ని ప్రాంతాల వారికీ దక్కాలనే వాదనతో ప్రజలను గందరగోళ పరుస్తున్నారు కొందరు సీమాంధ్ర నాయకులు. ఇక్కడ మేము అడుగుతున్నది హైదరాబాద్ లో ఉన్న రాష్ట్ర స్థాయి ఉద్యోగాల గురించి కాదు. అవి ఎలాగూ జోన్ పద్ధతిలో నింపరు. మేమిక్కడ మాట్లాడుతున్నది హైదరాబాద్ (జిల్లా) లో ఉన్న జోనల్ పోస్టుల గురించి మాత్రమే. ]


దేశ అత్యున్నత పదవిలో ఉన్న భారత రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులనే ఇంత బహిరంగంగా ఉల్లంఘించి, ఇప్పుడు మీది తెలుగే, మాది తెలుగే కాబట్టి కలిసుందాం అంటే విని మరోసారి మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: