‘అన్నదమ్ముల్లా విడిపోదాం.. ఆత్మీయుల్లా కలిసుందాం’

తెలంగాణ ఉద్యమానికి అనేకమంది సీమాంధ్ర సృజనకారులు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వీరిలో అనేకమంది కొంతకాలం క్రితం ఆంధ్రజ్యోతి “వివిధ” శీర్షిక కింద తమ అభిప్రాయాలు పంచుకోగా తాజాగా మరికొంతమంది కవులు సెప్టెంబర్ 4 నాడు ‘కావడి కుండలు’ అనే పేరుతో ఒక ప్రత్యేక సంకలనం తెస్తున్నారు. ఈ సంకలనాన్ని పరిచయం చేస్తూ కోయి కోటేశ్వరరావు గారు ఆంధ్రజ్యోతి “వివిధ” లో రాసిన వ్యాసం ఇది. విభజన సాగతీత వల్ల ఇరు ప్రాంతాల ప్రజల మధ్య నెలకొంటున్న అవాంఛనీయమైన ఘర్షణ వాతావరణం తగ్గించి ఒక సుహృద్భావ వాతావరణం నెలకొల్పడానికి ఇటువంటి పుస్తకాలు ఎంతో మేలు చేస్తాయి. ఈ సంకలనంలోని ప్రతీ అక్షరంలోనూ తెలంగాణ పట్ల, ఇక్కడి ప్రజల పట్ల ప్రేమ, ఆప్యాయత, సహానుభూతీ కనపడుతున్నాయి:

‘రచయిత, ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యపైన తన అభిప్రాయం చెప్పాలి. అది మన కు సంబంధించింది కాదు. మన కెందుకులే అనుకోవడం పిరికితనం. దేశం గడ్డు సమస్యల కత్తెర్లెకు లోనైనప్పుడు రచయిత మౌనంగాని, ఉదాసీనతగాని ప్రజాద్రోహం కన్నా తక్కువేమి కాదు’ (సృజన-సంపాదకీయం, మే 1971)
మాట్లాడాల్సిన చారిత్రక సందర్భంలో కవి మౌనం పాటించడం ప్రజాద్రోహం.
సమకాలీన ఉద్యమాల స్వరూపస్వభావాలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో అర్థం చేసుకొని సమ్యక్ దృష్టితో వ్యాఖ్యానించడం కవి నిరంతర కర్త వ్యం. మనిషి ఆరోగ్య సంరక్షణకు వైద్యుడు మార్గదర్శకత్వం వహించినట్లు ఉద్యమ విజయసాధనకు కవి దిశానిర్దేశం చేయాలి. సామాజిక ఉద్యమ గమనానికి కవి సాంస్కృతిక రహదారిగా భాషించాలి.
ప్రజాపోరాటానికి తలలోని నాలుకలా భాషించాలి. నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కవులు, రచయితలు, కళాకారులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ, ఉద్యమ లక్ష్యాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకవాదం అనేకరకాల ఆటుపోట్లకు, రాజకీయ వెన్నుపోట్లకు గురైనప్పుడల్లా తెలంగాణ రచయితలు ఉద్యమానికి ‘పెన్ను’దన్నుగా నిలిచారు. వీరందించిన సిరాచుక్కల చైతన్యం కోట్లాది హృదయాలను కదిలించి కొడిగట్టిపోతున్న ఆకాంక్షలకు కొత్త ఊపిరిపోసింది.
కళాకారుల ‘పాటల కష్టం’ వల్ల ప్రత్యేక రాష్ట్ర నినాదం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతిధ్వనించింది. కవులు, కళాకారులు నిర్మించిన సాంస్కృతికోద్యమ విద్యుత్ కాంతిని విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ అసమాన త్యాగాలతో మరింత తేజోవంతం చేశారు.
వీర తెలంగాణ పోరాటబాటలోకి ఆంధ్రప్రాంత కవులు, నాయకులు మేము ‘సైతం’ అంటూ కదలివచ్చిన ముచ్చట చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు. కృష్ణా జిల్లాకు చెందిన శేషాద్రిరమణ కవులు తెలంగాణలో స్థిరపడి, ఈ ప్రాంత ప్రాచీన సాహిత్య పరిశోధనకు ఎంతగానో పరిశ్రమించారు.
‘నిజాం రాష్ట్రంలో ఆంధ్రకవులు పూజ్యము’ అన్న ముడుంబ రాఘవాచార్యుల సృజనాత్మక దురహంకారాన్ని, ప్రాంతీయ దురభిమానాన్ని ఖండించిన శేషాద్రి రమణ కవులు గోలకొండ కవుల సంచికను వెలువరించడంలో సురవరం ప్రతాపరెడ్డికి చేదోడువాదోడుగా నిలిచారు. ‘భళిరే నైజాము రాష్ట్రాంద్రులారా! విఖ్యాత సమత్వ దృజ్మహితులారా!’ అంటూ జాషువ తెలంగాణ ప్రజల్ని ఆత్మీయంగా పలకరించాడు.
డా.ఆవంత్స సోమసుందర్ తెలంగాణ రైతాంగ పోరాటానికి వజ్రాయుధాన్ని అందించాడు. ఆరుద్ర, బొల్లిమంత శివరామకృష్ణ, మహీధర, తమ్మల వెంకటరామయ్య లాంటి అభ్యుదయ వాదులెందరో తెలంగాణ సాయుధ పోరాటం కేంద్రంగా రచనలు చేశారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ పోరాటంలో ఆయుధాల్ని కొనటానికి నిధుల్ని సమకూర్చటం కోసం గుంటూరు ప్రాంతం నుంచి ప్రజలు చందాలు వసూలు చేసి పంపించారని ఆచార్య యస్వీ సత్యనారాయణ తన ‘ఉద్యమ గీతాలు’ గ్రంథంలో పేర్కొన్నాడు.
1969లో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో గోదావరి ప్రాంతానికి చెందిన పదహారణాల ఆంద్రుడు కొర్రపాటి పట్టాభిరామయ్య తొమ్మిది రోజులపాటు నిరాహార దీక్ష చేశాడు. ఇదే సందర్భంలో సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన ఊరేగింపుకు సర్దార్ గౌతులచ్చన్న నాయకత్వం వహించి ఉద్యకారులకు బాసటగా నిలిచారు.
ఎన్జీ రంగా లాంటి నాయకులు నాడు ప్రత్యేక రాష్ట్రాన్ని బాహాటంగానే బలపరిచారు (చూ: ‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర’ -శోభాగాంధీ). చాలాకాలం పాటు ‘సమైక్యవాది’గా చెలామణి అవుతూ ఎన్నో నీలాపనిందల్ని మూటగట్టుకున్న శ్రీశ్రీ కూడా ఆత్మవిమర్శ చేసుకుని ‘ఇంటిగ్రేషన్’ను బలపరుస్తూ రాయటం తప్పేనని అంగీకరించి (శ్రీశ్రీ ఉపన్యాసాలు) తెలంగాణ బావుటాకు అభివాదం చేశాడు.
తెలంగాణ బహుముఖీన ప్రాశస్త్యాన్ని సీమాంధ్రకవులు ఎంతో ఆప్యాయంగా కొనియాడుతున్నారు. తెలంగాణను కన్నతల్లిగా ఆరాధిస్తూ, ప్రజల విరోచిత పోరాటాన్ని తనవి తీర గానం చేస్తున్నారు. ‘జిలుగు వెలుగుల తెలుగు జాబిల్లి’గా ‘విప్లవాల మల్లి’గా ‘ప్రజాపోరులో పునీతమైన పుడమి’గా ‘సామ్యవాదానికి గుండెకాయ’గా ‘వేలాది అమరత్వాలను పెనవేసుకున్న యోధ’గా ‘చరిత్రలో పోరు కేతనా ల విత్తనాలు నాటుకొని త్యాగాల పంటల్ని సంచులకెత్తిన వీరమాగాణం’గా ‘ఉద్యమాల్ని ప్రసవిస్తూ రాష్ట్ర సాధనకోసం తపిస్తున్న పచ్చి బాలింతరాలు’గా తెలంగాణను అభివర్ణించారు సీమాంధ్ర కవులు.
‘తెలంగాణ చరిత్ర కళ్లముందు కదులుతున్నప్పుడు/పోరాట రూపాలెన్నో పాఠం చెబుతున్నట్టుగా ఉంటుంది’ (మంచికంటి) అంటూ నేటి సీమాంధ్ర కవులు తెలంగాణ పోరాట వారసత్వాన్ని ప్రశంసిస్తున్నారు.
విశాఖ ఉక్కు ఉద్యమం నుంచి సోంపేట ఉద్య మం వరకు ఆంధ్రాలో జరిగిన అనేక సామాజిక దాడులకు, సంఘటనలకు కూడా తెలంగాణ కవులు, కళాకారులు స్పందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. ఈ పరస్పర సంఘీభావమే ప్రజాస్వామ్య మనుగడకు పట్టుగొమ్మగా విలసిల్లుతుంది.
‘కావడి కుండలు’ సంకలనంలో ‘అన్నదమ్ముల్లా విడిపోదాం-ఆత్మీయుల్లా కలిసుందాం’ అంటూ చారిత్రాత్మక నినాదంతో సీమాంధ్ర కవులు తెలంగాణకు క్రియాశీలక సంఘీభావం ప్రకటిస్తున్నారు. ‘కుండల్లా విడిపోదాం-కలిసివుంచే కావడిబద్దను బలోపేతం చేద్దాం’ (పైడి తెరేష్‌బాబు) అని మహోన్నత ప్రేమతత్వాన్ని వాగ్దానం చేస్తున్నా రు.
‘నీ జెండాకు నే అండగా ఉంటా/నీ ఉద్యమానికి నా ఊపిరినిస్తా/నీ ధూంధాంలో దండోర నవుతా’ (రావినూతల ప్రేమకిషోర్) అంటూ తెలంగాణ ప్రజల అడుగులో అడుగేసి నడుస్తున్నారు.
‘నీది ధర్మ పోరాటం’/నీ రణ క్షేత్రానికి నా శ్వాసను కాపలాగా పెడుతున్నాను’ (కలెకూరి ప్రసాద్) అని తెలంగాణ ప్రజల చేతిలో చేయివేసి ఒట్టు పెట్టుతున్నారు. ఘనత వహించిన సీమాంధ్ర ప్రజా ప్రతినిధులంతా కపట నాటకంతో కలిసుండాలని రాత్రికి రాత్రే రాజీనామాలు చేస్తే, ఉద్యమ దర్శనంతో సీమాంధ్ర కవులు రాష్ట్రం విడిపోవాలని వీలునామా రాస్తున్నారు. తెలంగాణ ప్రజల పట్ల సానుభూతితోనో లేక తమ సృజనాత్మక ఔదార్యాన్ని నిరూపించుకోవాలనో వీరు సంఘీభావం ప్రకటించలేదు.
ఉద్యమ వాస్తవికతను, చిన్న రాష్ట్రాల ఆవశ్యకతను గుర్తెరిగి ‘ఎవరి రాజ్యాన్ని/వారు ఏలడంలోనే/జీవన సౌందర్యముంది (అరసవిల్లి కృష్ణ) అనే తాత్విక ఎరుకతో ఈ కవులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను బలపరుస్తున్నారు. ‘ప్రాంతాలు విడిపోవడం అనేది కేవలం భావన కాదు.
దాని వెనుక ఉన్న ఆర్థిక అసమానత. ఈ అసమానతలు కొన్ని సామాజిక వర్గాల అస్తిత్వాన్ని తుంచివెయ్యడం దీర్ఘకాలంగా జరుగుతున్నప్పుడు సామ్రాజ్యాల నుంచి దేశాలు, దేశాల నుంచి రాష్ట్రాలూ, రాష్ట్రాల నుంచి ప్రాంతాలు విడిపోవడం అస్తిత్వం కోసమే.
తద్వారా తమ ప్రాంతంలోని వనరులపై తమకు స్వయం నిర్ణయాధికారం ఉండాలని బలంగా చెప్పడమే. ప్రపంచమంతటా ఇది అనివార్య పరిస్థితి’ అని ప్రాంతీయ అస్తిత్వ ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేశారు సుప్రసిద్ధి కవి విద్యాసాగర్ తన ముందుమాటలో. ‘ఏకపక్ష దోపిడీకి ఏకైక సూత్రం/ కలిసి ఉంటే కలదు సుఖం/ దగాపడ్డ బిడ్డలకు తారక మంత్రం వేరుపడితే ప్రగతి సులభం’ (కావడి కుండలు) అంటూ ఐక్యతకు-విభజనకు మధ్య ఉన్న దోపిడీ వ్యూహాన్ని రాజకీయ రహస్యాల్ని బట్టబయలు చేశాడు కవి.
సీమాంధ్ర కవులు ప్రత్యేక వాదాన్ని భుజాలకెత్తుకోవడంతో పాటు, సమైక్యవాదాన్ని తమ భావనా పటిమతో తుత్తునియలు చేయడం గొప్ప విశేషం. మేడిపండు వంటి సమైక్యవాదానికి తాత్విక పునాది లేదని ఈ కవులు వాదిస్తున్నారు.
దశాబ్దాల తరబడి నిర్మించుకున్న పెట్టుబడుల స్వర్ణసౌధాలు పేకమేడల్లా కుప్పకూలిపోతాయనే భయంతో కొందరు పెద్దమనుషులు కుహనా ఐక్యతను వల్లిస్తున్నారని సీమాంధ్ర కవులు నిరూపిస్తున్నారు. ‘ఐక్యత అనేది ఓ కుట్ర/ విభజన అనేది ఓ ప్రజాస్వామ్య సూత్రం’ (డా.జి.వి. రత్నాకర్) సమత్వంలేని ఐక్యతకు అర్ధం లేదని, తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామ్య బద్ధమైనదని కవి తన సమ్మతిని తెలియజేస్తున్నాడు.
సమైక్యవాదం ఒక శుష్క నినాదమని ‘కన్నీళ్లను హైజాక్‌చేసే పేరడి ఉద్యమ’మని ఈ కవులు తీర్పు చెబుతున్నారు. బౌద్ధాన్ని అణచివేయడానికి పుష్యమిత్ర శుంగుడు ప్రతీఘాత ఉద్యమం చేసినట్టుగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అంతం చేయడానికి సీమాంధ్ర రాజకీయ నాయకులు సమైక్యవాదాన్ని ముందుకు తెస్తున్నారని డా.చల్లపల్లి స్వరూపరాణి చారిత్రక అవగాహనతో వ్యాఖ్యానిస్తుంది.
సమైక్యాంధ్ర ఉద్యమంలోని ‘లోగుట్టు’ను ఎంతో సాహసోపేతంగా తేటతెల్లం చేసిన సీమాంధ్ర కవులు ‘విభజన’లోని ఆంతర్యాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారు. ‘నువ్వు పురిటిబల్ల ఇవ్వనంత మాత్రాన/పురిటినొప్పులు ఆగవు/ వాలుతనం లేదని దూకే జలపాతం నిమ్మళించదు/ ఇప్పుడికక అక్కడి నెమళ్లకు పురివిప్పి నాట్యం చేసేందుకు/చుక్కరాల్చని మేఘంతో పనిలేదు/అగ్ని చెప్పులు తొడుకున్న పాదాలకు/ ఇక కాలిబాటలు అవసరం లేదు’ తెలంగాణ ఉద్యమ పరాకాష్ఠ స్థితిని తెలియజేస్తున్నాడు షేక్ కరీముల్లా.
ప్రాధేయపడే దశ నుంచి ప్రతిఘటనాత్మక దశకు చేరుకున్న ఉద్యమ తీవ్రతను కవి సమర్థవంతంగా కవిత్వీకరించాడు. ‘పువ్వు పుష్పించడానికి కొమ్మను ప్రాధేయపడనట్లు/ బిడ్డ జన్మించడానికి అమ్మనైనా సరే అడగనట్టు/ తెలంగాణ ఉదయించడానికి/ ఏ ఆంద్రుడి అనుమతి అవసరం లేదు’ (జననం ఒక జన్మహక్కు) అని అసాధారణ సాదృశ్యంతో తిరుగులేని వాదనా గరిమతో న్యాయవాదిలా గర్జిస్తున్నాడు ప్రతాప్‌కుమార్.
‘స్వయం వ్యక్తిత్వ ప్రకాశానికి/ అవిభక్త కవలలకు శస్త్ర చికిత్స చేసి/ శిరస్సులను వేరు చేయాల్సిందే’ (దాట్ల దేవదానం రాజు); ‘ప్రాంతములు వేరుపడినను చింతలేదు/స్వాంతములు వేరుపడకున్న చాలునదియే’ (డా.గరికపాటి నరసింహారావు); ‘గాయాలను కెలుక్కుంటూ ఎగిరెగిరిపడటం కంటే/తీయని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ/సోదర భావనారేఖ మీద/ చెరో సంతకంగా విడిపోదాం’ (కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి);
‘ఏం? మొగుడూ పెళ్ళాలకు /తల్లిదండ్రులకు పిల్లలకూ/ అన్నదమ్ములకు పార్టీలకు/ విడిపోతే లేని నష్టం/ రాష్ట్రాలు విడిపోతే ఏంటంట? (రాచపాళం చంద్రశేఖర్‌రెడ్డి); ‘కొమ్మ ఎంత అందమైనదైనా/ నీరు ఎంత స్వచ్ఛంగా ఉన్నా/నగర హృదయపు ఔదార్యం ఎంత గొప్పదైనా/ అనుబంధం ఎంతగా పెనవేసుకున్నా/ అతిథికి ఎప్పుడూ…/విడిది సొంతం కాదు’ (దేశరాజు).
రాష్ట్ర విభజనలోని ఔచిత్యాన్ని న్యాయబద్ధతను ఈ కవులు నిజాయితీగా తమ కవిత్వంలో చిత్రిస్తున్నారు. కోటి రత్నాలవీణ మీటి సీమాంధ్ర కవులు నవ జీవన విముక్తి గీతాలను ఆలపిస్తున్నారు.
సీమాంధ్ర కవులు కొత్త రాష్ట్రంలో రాజకీయాలను కూడా నిర్దేశిస్తూ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. శివసాగర్, డా.కత్తి పద్మారావు, ఉ.సా. లాంటి ఆంధ్రా కవులు తెలంగాణలో బహుజన రాజ్యం కావాలని ఎన్నాళ్లుగానో వాదిస్తున్నారు.
జాతీయోద్యమ సందర్భంలో అంబేద్కర్ ‘స్వాతంత్య్రం అనే మంత్ర దండం, దోపిడి పాలక వర్గాలని అంతం చేయగలదా? స్వరాజ్య భారతంలో దళితుల హక్కులకు హామీ లభిస్తుందా? అని ప్రశ్నించాడు. ఈ రకమైన రాజకీయ స్పష్టతలేని జాతీయోద్యమం వల్ల నా జాతికి మేలు జరగదని ఆయన నిర్ద్వంద్వంగా చెప్పాడు.
అప్పుడాయనని అందరూ జాతీయోద్యమ వ్యతిరేకని రాజకీయ అభాండాలు వేశారు. స్వాతంత్య్రానంతరం దళితుల ఏర్పాటు సందర్భంలో కూడా అంబేద్కర్ ముందుచూపు అర్థమవుతుంది. అదే విధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు సందర్భంలో కూడా ఆయన చాలా సూటిగా నిర్దిష్టంగా మాట్లాడారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో కింది కులాల వారు ఆశించడానికి ఏమి మిగిలింది? నాయకత్వంలో వారికి భాగస్వామ్యం లభిస్తుందా? అని ప్రశ్నించాడు. అలా జరగకపోతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని కాకుండా జాట్ రాష్ట్రం, మరాఠా రాష్ట్రం, రెడ్డి రాజ్యాలుగా మిగిలిపోతాయని చెప్పారు.
ఇవాళ ఆయన మాటలు ఎంత నిజమో మనకర్ధమవుతుంది. ఈ అనుభవాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో దళిత బహుజనుల నాయకత్వముండాలని చాలామంది సీమాంధ్ర కవులు పట్టుబడుతున్నారు.
‘తెల్లదొరల నుండి స్వాతంత్య్రం తెచ్చి / నల్లదొరల చేతుల్లో పోసినట్టు/ తెలంగాణను మళ్లీ దొరల పాల్జేయకు/రామరాజ్యం పేరుతో మనురాజ్యం రానీయకు/భీమరాజ్యం ఆశ్రయంగా/బహుజన తెలంగాణ సాధించు (నేతల ప్రతాప్‌కుమార్); ‘కాలం కత్తుల వంతెన మీద నుంచి/ ఐలమ్మల వారసత్వం ఉరికి వస్తానంటుంది (డా. నూకతోటి రవికుమార్); ‘ఎప్పుడు యాడ-అరవనోణ్ణి యానాదోడ్ని/ ఇప్పుడు గొంతెత్తి అరవబోతుండ ‘ఆడ తెలంగాణా మా అలగా జనానిదే/ ఈడ ఆంధ్రా మా అలగా జనానిదే/ ఆడా మేమే-ఈడ మేమే’ (ఇ.వి.); తెలంగాణ రాజ్యంలో దళిత బహుజన విజయ కేతనం రెపరెపలాడాలని ఈ కవులు మనసారా ఆకాంక్షిస్తున్నారు. ఈ న్యాయమైన ఆకాంక్షలు నెరవేరితేనే ఉద్యమ త్యాగాలకు సార్ధకత చేకూరుతుంది.
డా.వినోదిని దళిత స్త్రీ కోణంలో నుంచి ప్రత్యేక వాదానికి స్వాగతం పలుకుతుంది. తెలంగాణ పోరాటంలోని కుల పితృస్వామ్య భావజాల తీరుతెన్నుల్ని పరిశీలనాత్మకంగా విశ్లేషిస్తూ ‘తెలంగాణ రావాల్సిందే, ఎల్లమ్మ ముఖ్యమంత్రి కావాల్సిందే’నని కొత్త నినాదాన్ని తెలంగాణ ఎజెండాలో ప్రవేశపెట్టింది. పసుపులేటి గీత రాయలసీమ వెనుకబాటుతనాన్ని ఎత్తిచూపుతూ తెలంగాణ వాదానికి చేయూతనందిస్తుంది.
ఆదర్శ సమాజంలో ఒకచోట మార్పు జరిగితే ఆ మార్పు అన్ని చోట్ల ప్రతిఫలించాలి. ఆదర్శ సమాజంలో అందరూ ఇష్టంగా పంచుకోగల సమాన హక్కులుండాలి అంటూ అంబేద్కర్ ఆదర్శ రాజ్యానికి కొత్త భాష్యం చెప్పాడు. ఈ విధమైన రాజకీయ కార్యాచరణ, పాలనాపరమైన సమతౌల్యం చిన్న రాష్ట్రాల్లో వెల్లివిరియాలని సీమాంధ్ర కవులు భావిస్తున్నారు.
అప్పుడే తెలంగాణలో మరింత వెనుకబడిన ప్రాంతాలతో పాటు ‘రాయలసీమ’ ‘ఉత్తరాంధ్ర’లకు సమాన న్యాయం జరుగుతుందని సీమాంధ్ర కవులు భావిస్తున్నారు.
‘రావమ్మ తెలంగాణ/ నువ్వొస్తే మా కవి దోస్తుల యింట/ ముక్క బువ్వ తినాలని/ఒట్టు పెట్టుకున్నానమ్మా’ అంటాడు సజ్జా వెంకటేశ్వర్లు. ఈ చారిత్రాత్మక పసందైన దావత్ కోసం సీమాంధ్ర కవులు ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నారు. సీమాంధ్ర కవులు ‘కావడి కుండల’ నిండా సంఘీభావ కవితా జీవజలాన్ని మోసుకొస్తున్నారు. ఈ జీవ జలం సమైక్యవాద మంటల్ని ఆర్పడంలోను, తెలంగాణ ప్రజల ఉద్యమ దాహార్తిని తీర్చడంలోను మహత్తరమైన పాత్ర పోషిస్తుంది.
– కోయి కోటేశ్వరరావు
(సెప్టెంబర్ 4న ఒంగోలులో ఆవిష్కరించనున్న సీమాంధ్ర కవుల తెలంగాణ సంఘీభావ కవితాసంకలనం ‘కావడి కుండలు’ సంపాదకీయంలోని కొన్ని భాగాలు
ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: