దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది!

చాలా అరుదుగా వస్తుంటాయి ఎన్నికల్లో ఇటువంటి ఫలితాలు. భారత దేశంలో ఎన్నికలనేవి చాలా సంక్లిష్టమైన వ్యవహారం. రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుండి రావడం వల్లా, కొంతకాలం పాటు ఎన్నికల విశ్లేషణ రంగంలో పనిచేయడం వాళ్ళ క్షేత్ర స్థాయిలో ఎన్నికల వ్యవహారం ఎలా జరుగుతుందో చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం దొరికింది నాకు.

కానీ, ఈ సారి ఎన్నికల్లో ఓటరు కనబరచిన విజ్ఞత, స్థితప్రజ్ఞత నేనైతే ఇంతవరకు చూడలేదు. నిజామాబాదులో ఓటుకు వెయ్యి రూపాయల లెక్కన డి. శ్రీనివాస్ చేసిన ఖర్చు, మైనారిటీలను బిజెపికి ఓటు వెయ్యకుండా చేసిన ప్రయత్నాలు చూశాక వీటన్నిటిని తోసిరాజని తెలంగాణా ఓటరు ఇచ్చిన తీర్పు నభూతో…

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇస్తామని చెప్పి 2004, 2009 ఎన్నికల్లో గెలిచి మాట నిలబెట్టుకోని కాంగ్రెస్ పార్టీకి, 2009 ఎన్నికల్లో జై తెలంగాణా అంటూ తెరాస తో పొత్తుపెట్టుకుని మరీ పోటీచేసి తెలంగాణలో ఛాలా స్థానాలు గెలిచి, డిసెంబర్ 9 తరువాత మాట మార్చిన ఊసరవెల్లి తెలుగుదేశం పార్టీకి ఏకకాలంలో ఓటరు షాక్ ఇచ్చాడు.

ఒకప్పుడు తెలంగాణలో ఎంతో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసిన వారిలో ఒక్కరికి కూడా డిపాజిట్ దక్కలేదంటే ఇక్కడి ప్రజలకు ఆ పార్టీ అధినాయకుడు చేసిన ద్రోహంపై ఎంత కోపం ఉన్నదో అర్థం అవుతుంది. ఒకప్పుడు తెలంగాణా అన్న పదం శాసనసభలో వాడకూడదు అంటూ హుంకరించిన బాబు గారు, చివరికి మారు మనసు పొంది జై తెలంగాణా అనడం, తీరా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రాగానే ఆయన తీసుకున్న యు-టర్న్ ప్రజలకు ఆయనపై కోపం పెంచితే, వీటికి పరాకాష్టగా మొన్న ఎన్నికల్లో ప్రచారం చేసే మొహం లేక మహారాష్ట్రకు వెళ్లి ఆయన చేసిన బాబ్లి నాటకం ద్వారా ఆయన కపటత్వం మరింత స్పష్టమయ్యింది. అందుకే ఆయన పార్టీకి దాదాపు 7500 మంది క్రియాశీలక సభ్యులు ఉన్న నిజామాబాదులో మొన్న కేవలం 1700 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అధికార పార్టీగా ఉండి, ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసినా కనీసం తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని గెలిపించుకోలేక, 4 స్థానాల్లో ధరావత్తు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి కూడా గర్వభంగమైంది. ఇచ్చినట్టే ఇచ్చి నోటికాడి కూడును లాగేసుకున్న పార్టీకి తెలంగాణా ప్రజలు బాగా బుద్ధిచెప్పారు .

2004, 2008, 2009 ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితికి ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలు రాలేదు కాబట్టి తెలంగాణా రాష్ట్ర ఉద్యమానికి పెద్దగా ప్రజల మద్దతు లేదని “సమైక్యవాదులు” తరచు చెబుతుంటారు. అయితే ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఎంత ఉందో మొన్నటి ఎన్నికల ఫలితాలు విస్పష్టంగా చాటి చెప్పాయి. సాధారణంగా ఎన్నికల్లో కులం, మతం, డబ్బు, మద్యం, స్థానిక సమస్యలు, అభ్యర్ధి గుణగణాలు వంటి ఎన్నో అంశాలు అభ్యర్ధుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తాయి. ప్రజల సమస్యలపై రెఫరెండం నిర్వహించే అవకాశం మనదేశంలో లేదు కాబట్టి మళ్లీ అటుతిరిగి ఇటుతిరిగి ప్రజాభిప్రాయాన్ని కనుగోవడానికి ఎన్నికలనే ఆశ్రయించాల్సి వస్తుంది.

ఏదో ఒకే అంశంపై ప్రజలు తీర్పు ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే తెరాస ఎమ్మెల్యేలు ఇదివరకు రాజీనామా చేసినప్పుడు ప్రతికూల ఫలితాలు వచ్చింది. అంతే కాదు పోటీ చేసే అన్ని పార్టీలు తెలంగాణా కు మద్దతు ఇస్తే అది ఒక ఎన్నికల అంశం కాకుండా పోతుంది. మూడు ప్రధాన పార్టీలు – కాంగ్రెస్, మహా కూటమి, ప్రజా రాజ్యం పార్టీల మధ్య చీలిన తెలంగాణా వోటు వల్ల 2009 ఎన్నికల్లో ఇక్కడి ప్రజల ప్రత్యేక రాష్ట్ర కాంక్ష స్పష్టమవలేదు.

డిసెంబర్ 10 నాడు తెలంగాణాకు కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం, లోక్ సత్తా పార్టీలు చేసిన ద్రోహం ఇక్కడి ప్రజలు ఎప్పుడు మర్చిపోరు.

తమ తమ జెండాలపై తెలంగాణా రాష్ట్రపు గుర్తు వేసుకుని ప్రచారం చేసుకోవడం, పొరపాటున తాము గెలిస్తే “అబ్బే టి.ఆర్.ఎస్ ఓడిపోయింది కదా తెలంగాణావాదం ఎక్కడుంది” అని ఇన్నాళ్ళు కాంగ్రెస్, తెదేపాలు ఆడిన డ్రామాలు ఇప్పుడు ప్రజలు గమనించారు కాబట్టే ఆ రెండు పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టారు.

ఇప్పుడు సమైక్యాంధ్ర (సీమాంధ్ర) జే.ఎ.సి. అధ్యక్షుడు ప్రొఫెసర్ సామ్యుల్ గారు అంటున్నట్టు ఆంద్ర, రాయలసీమ MLAలు కూడా రాజీనామా చేసి “సమైక్యాంధ్ర” నినాదంపై మూడు పార్టీలను (కాంగ్రెస్, తెదేపా, ప్రజా రాజ్యం) పోరాడమని చెప్పండి. ఫలితాలు మీకే అర్థం అవుతాయి.

ఇప్పటికయినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణపై స్పష్టమైన వైఖరితో ముందుకు రావాలి. సమైక్యాంధ్ర నినాదం తలకెత్తుకున్న రెండు పార్టీలు – లోక్ సత్తా, ప్రజా రాజ్యం ఇవ్వాళ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయాయి. తమ ద్వంద్వ వైఖరి మార్చుకోకపోతే రేపు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ఇదే గతి పడుతుంది. తమ రాజకీయ ప్రయోజనాల కొరకు అటు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని, ఇటు తెలంగాణా ఉద్యమాన్ని ఏకకాలంలో ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ నుండి, గాంధీభవన్ నుండి నడుపుతున్న ఈ రెండు పార్టీలు ఇకనైనా రాష్ట్ర విభజనకు ప్రతిబంధకంగా మారిన కొన్ని అంశాలపై చర్చల ద్వారా పరిష్కారం కనుగునే ప్రయత్నం చేయాలి.

అలా చేయకుండా “2014లో పరిస్థితి ఇలా ఉండదు”, “ఇదేమీ టి.ఆర్.ఎస్ గొప్పతనం కాదు”, “మేము బాబ్లి పోరాటం లో బిజీగా ఉన్నాం కాబట్టి ఓడిపోయాం” అని తమని తాము మోసం చేసుకుని ప్రజలను మోసం చేయడం మానకపోతే ముందుంది ముసళ్ళ పండగే.

——————-

ఇదీ తెలంగాణా సత్తా!

౨౦౧౦ ఉప ఎన్నికల విశ్లేషణ (మిత్రుడు రాకేశ్ దుబ్బుడు కు థాంక్స్)

ప్రకటనలు

10 Responses to “దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది!”


 1. 1 Praveen Sarma 9:47 ఉద. వద్ద ఆగస్ట్ 2, 2010

  సమైక్యాంధ్ర నినాదంతో ఇక్కడ పోటీ చేస్తే రాజకీయ నాయకులకి వోట్లు పడవు. రాజకీయ పార్టీలు కేవలం హైదరాబాద్ కోసమే తెలంగాణాని వ్యతిరేకిస్తున్నాయని ఇక్కడ వాళ్లకి తెలుసు. ఆంధ్రా యూనివర్శిటీలో పత్రికలవాళ్లు సమైక్యవాదులని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్లు హైదరాబాద్ గురించి తప్ప వేరే మాట మాట్లాడలేదు. ప్రాంతీయ అభివృద్ధి గురించి పట్టించుకోకుండా కేవలం హైదరాబాద్ కోసం సమైక్యాంధ్ర నినాదం చేపడితే ఎవరు వోట్లు వేస్తారు?

 2. 2 ఏకలింగం 10:10 ఉద. వద్ద ఆగస్ట్ 2, 2010

  ఇప్పట్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కోలుకోదని నేను స్నేహితుల నుండి విన్నాను. ఈ ఎన్నికలను బాబు ఒక గుణపాఠంలా భావిస్తే ఆయనకు, పార్టీకి మంచిది. ఇప్పుడు కూడా రెండువైపులా ఎగేస్తూ గోడ మీద పిల్లిలా ఉంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మనుగడ లేకుండా పోవడం ఖాయం.

 3. 3 Praveen Sarma 10:44 ఉద. వద్ద ఆగస్ట్ 2, 2010

  తెలంగాణా విషయంలో చంద్రబాబు స్పష్టంగా మాట్లాడితేనే అతనికి రాజకీయ భవిష్యత్ ఉంటుంది. ఆజం జాహీ మిల్, రామగుండం ఫెర్టిలైజర్స్ ఫాక్టరీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు మూసి వెయ్యించి తెలంగాణా కార్మికులని భిక్షగాళ్లని చేసిన తెలుగు దేశం పార్టీని తెలంగాణా ప్రజలు అంత సులభంగా నమ్మరు.

 4. 4 నవీన్ గార్ల 11:06 ఉద. వద్ద ఆగస్ట్ 2, 2010

  నిజమే, ఇది తెలంగాణా ప్రజల విజయం.

 5. 5 Satyanveshi 11:22 ఉద. వద్ద ఆగస్ట్ 2, 2010

  లోక్‌సత్తా పార్టీని కూడా కాంగ్రేస్, టీడీపీ, పీఆర్పీ లతో జత కలిపి తెలంగాణాకి ద్రోహం చేసింది అనడం సబబు కాదు. కాంగ్రేస్, టీడీపీ, పీఆర్పీ లలాగా లోక్‌సత్తా డిసెంబరు 9 కి ముందు ఒకలాగా, తరువాత మరోలా మాట్లాడలేదు.

 6. 6 p.kusumai 12:04 సా. వద్ద ఆగస్ట్ 2, 2010

  :->)
  :->( also!
  pch!!!!!!!!?????????
  vidhi lIla!

 7. 7 Ravi 12:45 సా. వద్ద ఆగస్ట్ 2, 2010

  2204 , 2009 జనరల్ ఎన్నికలలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికలలో కూడా తెలంగాణా పాట పాడి ప్రజలను మభ్యపెట్టాలని చూసింది.
  2009 ఎన్నికలలో ప్రత్యెక కమిటీ వేసి పరిశోధించి పరిశీలించి మరీ తెలంగాణాకు అనుకూల నిర్ణయం తీసుకున్న తెలుగు దేశం పార్టీ కూడా మళ్ళీ తెలంగాణా పాట పాడి, దానికి తోడు బాబ్లీ నాటకం కూడా రసవత్తరం గా ఆడి మరీ ప్రజలను ఏమార్చాలని చూసింది.
  రెండు పార్టీలూ డబ్బును నీళ్ళలా ఖర్చు చేసాయి.

  అయినా ప్రజలు ఈ నీతీ నిజాయితీ లేని దగుల్భాజీల లం … కథలు బాగా అర్ధం చేసుకున్నారు.
  దిమ్మతిరిగి పోయేలా సమాధానం చెప్పారు.

  ఇప్పుడు ఒక్కొక్క కాంగ్రెస్ తెలుగు దేశం నేత ఎట్లా మాట్లాడుతున్నాడో చూసి జనం తెగ నవ్వుకుంటున్నారు.
  అంతా పతివ్రతల మే ననీ , తప్పంతా తమ అధిష్టానలాడే ననీ ఎంత సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారో.
  తెలంగాణా ప్రజా చైతన్యం అవకాశ వాద రాజకీయాలకు తప్పక చరమ గీతం పాడుతుంది.
  అయితే ఇప్పుడు టీ ఆర్ ఎస్ కూడా గతం లో మాదిరిగా తప్పులు చేయకుండా మరింత నిబద్ధతతో వాన్ గార్డ్ లా కృషిచేయాల్సిన అవసరం వుంది.

  జై తెలంగాణా !

 8. 8 కొండముది సాయికిరణ్ కుమార్ 1:54 సా. వద్ద ఆగస్ట్ 2, 2010

  చాలా కరెక్టుగా చెప్పారు. ఇకనైన, మునుపు చేసిన తప్పులు తె.రా.స. చేయదని ఆశిద్దాం.

 9. 9 NRI 11:17 సా. వద్ద ఆగస్ట్ 2, 2010

  చైతన్య వంతుడైన ఓటరు ప్రజాస్వామ్యానికి చాలా మంచిది. ఇక్కడ తెరాస ముక్కోడు ఏదో పొడిచేసినట్టు , కాంగ్రెస్ , తెదెపా లు ఏదో కోల్పోయినట్టు కాదు. తెలంగాణ ఇచ్చుడో ఆత్మహత్యల కొనసాగింపుడో అది దేశ భద్రత ను దృష్టిలోపెట్టుకోవాసి చేయాల్సిన నిర్ణయం.

  ఓటర్లకు అభినందనలు, ఈ మాత్రానికి తెలగాన ఇచ్చేస్తామంటే మీరు అడుసులో కాలేసినట్టే. మొత్తం ఆంధ్రా, సీమ, తెలంగాన కలిసి విడిపోవడానికి ఆందోళన చేసినా అణిచివేయబడుతుంది, బడాలి అని నా అభిప్రాయము. ఇందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుంది.

 10. 10 vaps 3:07 ఉద. వద్ద ఆగస్ట్ 3, 2010

  dileep garu,
  how can you say that tdp & chandrababu naidu’s fight to stop bhabli project is a drama? Do you think these protests do not have any good intentions behind them? what is wrong if Chandra babu did not campaign in the by-elections? It is obvious that the party doesn’t have a clear stand on the issue and people have decided the fate of their candidates. I think you are trying to link both the issues by making some assumptions here. To my knowledge, the project is illegal and affects the interests of the people in northern telangana region. Being a political party, TDP is trying to stop it by bringing the issue to forefront and applying pressure on the state & central govts to act quickly. Question: Can others use the same language against you(like telangana drohi) as you are speaking against the people who are trying to protect the interests of people in this region. Sorry for not posting in telugu.

  regards


Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

 • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: