సోంపేట ప్రజలకు మిగిలేదీ బూడిదా, చీకటీ మాత్రమే

పొద్దున్నే మిత్రుడు మధు కాగుల ఫోన్ చేశాడు. మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దు గ్రామం హిందూపూర్ వద్ద కృష్ణా నది ఒడ్డున శేషాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పేరిట ఒక కొత్త థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని, దీని కొరకు రైతుల నుండి దాదాపు 1000 ఎకరాల నల్ల రేగడి భూములను సేకరించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయని, దీన్ని వ్యతిరేకిస్తూ తాము ఉద్యమిస్తున్నామని చెప్పాడు. ఈ ప్రాజెక్టు వల్ల వందలాది రైతులు ఉపాధి కోల్పోవడంతో పాటు మనకు జీవధార అయిన కృష్ణమ్మ కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుందని వివరించాడు.
నేను నిట్టూర్చాను.
మధ్యాహ్నం వార్తలు చూద్దామని ఆన్ లైన్ లో టీవీ చానెల్ చూస్తే అటు చివర శ్రీకాకుళం జిల్లా సోంపేటలో పేదవాడి గుండెలపై పేలిన పోలీసు తూటాలు ముగ్గురి ప్రాణాలు బలిగొన్నాయనే వార్త తెలిసి కలత చెందాను.
ఒక ప్రాంతమని లేదు, ఒక రాష్ట్రమని లేదు  ఇవ్వాళ దేశంలో “అభివృద్ధి” కి సామాన్యునికి మధ్య పోరు జరగని ప్రాంతం ఏదీ లేదు.
సింగూర్
పోలేపల్లి
కళింగనగర్
గంగవరం
నంది గ్రాం
చిలమత్తూర్
కాకినాడ
బైలడిల్ల
బయ్యారం
ఊర్ల పేర్లు మాత్రమే మారుతాయి. ఒక చోట గని, ఒక చోట రింగు రోడ్డు, ఒక చోట థర్మల్ పవర్ ప్రాజెక్టు, మరో చోట ప్రత్యేక ఆర్థిక మండలి. ఎక్కడ చూసినా అభివృద్ధి టెర్రరిస్టుల దాడుల్లో పిట్టల్లా రాలుతున్న ప్రజలే కనపడతారు.
ఇవ్వాళ “వెనకబడ్డ” శ్రీకాకుళం ప్రపంచ రికార్డు సాధించేందుకు సిద్ధమవుతోంది. బహుశా ప్రపంచంలో ఇన్ని విద్యుత్ ప్లాంటులు ఉన్న జిల్లా మరొకటి ఉండదేమో.
సంతబొమ్మాళి మండలంలో ఈస్టుకోస్టు ఎనర్జీ
సూర్యచక్ర థర్మల్‌ ఎనర్జీ
మేఘవరం ఎనర్జీ
సోంపేట మండలంలోని బీల భూముల వద్ద నాగార్జున ఎనర్జీ
రణస్థలం మండలంలో ఆశ్రిత ఎనర్జీ
కంచిలి మండలంలో నమ్రత ఎనర్జీ సంస్థ

కొవ్వాడ వద్ద అణు విద్యుత్ కేంద్రం

కానీ హఠాత్తుగా శ్రీకాకుళం జిల్లాలో ఇంత “అభివృద్ధి” ఎందుకు జరుగుతుందని ఎవరికైనా అనుమానం రాక మానదు. దీని వెనుక ఉన్న మతలబు ఒకటే. ఈ విద్యుత్ కేంద్రాలకు బాగా ఎక్కువ విస్తీర్ణపు భూములు, అధిక మొత్తంలో నీరు కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల వల్ల జరిగే ప్రత్యక్ష, పరోక్ష నష్టాలు తెలిసి ఉద్యమించని అమాయక ప్రజలు కావాలి. ఇదో ఈ అమాయక ప్రజలు ఉంటారనే ఈ అభివృద్ధి గద్దలు ఇవ్వాళ శ్రీకాకుళంపై వాలాయి.

సోంపేట మండలంలో ఇప్పుడు నాగార్జున కంపెని వారు థర్మల్ పవర్ ప్లాంటు పెట్టడానికి ప్రయత్నిస్తున్న స్థలంలో ఒక పెద్ద నీటి మడుగు ఉంది. దీన్ని స్థానికులు “బీల” అంటారు. వందల ఎకరాల్లో విస్తరించిన ఈ బీల  చుట్టుపక్కల రైతులకు, మత్స్యకారులకు ప్రధాన జీవనాధారం. అయితే మన ప్రభుత్వ పెద్దలకు ఈ బీల “పనికిరాని భూమి” కింద కనపడింది. ఇంకేం దీన్ని సదరు కంపెనీకి రాసిచ్చేశారు.

ఒక సారి ఈ థర్మల్ ప్లాంటు నిర్మాణం అయితే 30 గ్రామాల ప్రజలకు కల్పతరువులా ఉన్న బీల అదృశ్యం అవుతుంది. ఇంతా చేసి ఈ ప్రాజెక్టు “మర్చంట్ పవర్ ప్రాజెక్టు” అంటే దీంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నాగార్జున కంపెనీ రాష్ట్రానికి ఇవ్వదు. ఖరీదుకట్టే షరాబును వెతుక్కుంటూ వెళ్తాయి ఈ సోంపేట విద్యుత్ వెలుగులు. కంపెనీ యజమానికి దండిగా కాసులు కురిపించే ఈ విద్యుత్ కేంద్రం స్థానికులకు మిగిల్చేది మాత్రం బూడిదా, చీకటీ మాత్రమే.

బ్రతుకుతెరువును హరించే ఈ కంపెనీ మాకొద్దంటూ సోంపేట పరిసర గ్రామాల ప్రజలు అనేక నెలలుగా ఉద్యమిస్తున్నారు. నిరాహార దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు. కలెక్టర్ నుండి డిల్లీ పెద్దల దాకా అందరినీ కలిసి తమ గోడు వెలిబోసుకున్నారు.

అయితే అభివృద్ధి టెర్రరిస్టులు కనికరించలేదు. మొన్నటికి మొన్న ఒక పోలీసు అధికారి సోంపేట ప్రాంత ప్రజలను “ప్రాజెక్టు అడ్డం వస్తే కాల్చి పారేస్తాం” అని బెదిరించారట.

ఇదిగో ఇవ్వాళ అన్నంత పనీ చేశారు.

అహా ఎంత ప్రజాస్వామిక దేశం మనది.

“అభివృద్ధి” కొరకు త్యాగాలు చేయాలని సన్నాయి నొక్కులు నొక్కే వారిప్పుడు “ఎవరి అభివృద్ధికి ఎవరు త్యాగం చేయాలనే” ప్రశ్నకు జవాబు చెప్పాలి.

సోంపేట ప్రాజెక్టు వ్యతిరేక ఆందోళన నేపధ్యం గురించి తెలుసుకోవడానికి కీ.శే బాలగోపాల్ రాసిన ఈ వ్యాసం చదవండి.

అభివృద్ధి పిడికిలిలో చిన్నజనం

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: