కొమరం భీం చిత్ర పరిచయం

నవతరంగంలో నేను రాసిన కొమరం భీం చిత్ర పరిచయం పూర్తి పాఠం కింద ఇస్తున్నాను.
కొత్త ఔట్ లుక్ పత్రిక కవర్ స్టోరీలో ధరలు ఇంతగా పెరుగుతున్నా మన దేశంలో సామాన్య పౌరుడు పెద్దగా స్పందించట్లేదేమిటి, రోడ్డుపైకి వచ్చి ఏ ఆందోళనా చేయట్లేదేమిటి అనే విషయాన్ని చర్చించారు…
ఇప్పుడు కాలం మారిపోయింది. ధరలు పెరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు హర్తాళ్ కు పిలుపు ఇస్తే దాని వల్ల దేశంలో వాణిజ్య రంగానికి 10,000 కోట్ల నష్టం జరిగిందని లెఖ్ఖలు వేసే రోజులివి…
ఆన్లైన్ పిటీషన్లో ఓ సంతకం పారేస్తే చాలు సమస్యలు తీరిపోతాయని నమ్మే తరమిది. ఎర్రని ఎండలో చేసే ధర్నాలు ఎందుకోసమో చెప్పేదెవరు?
జీన్స్, టీషర్టులు వేసుకుని రోడ్డుపై కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహిస్తే మీడియా హడావిడి చేసే కాలమిది. అడవి బిడ్డల కాగడాల పోరును అర్థం చేసుకునేదెవరు?
గెలుపుకు మెట్లు అయిదున్నాయో అయిదొందలున్నాయో పుస్తకాలు రాసి మరీ చెప్పేవారున్నారు, కానీ ఓడిపోతామని తెలిసీ ప్రాణాలకు తెగించి పోరాడే వారి గురించి ఎవరు చెప్తారిప్పుడు?
నూతన ఆర్ధిక విధానాల ఫలాలను అందుకుంటున్న మధ్య తరగతి, ఇప్పుడు ఏ సమస్య మీదా స్వయంగా పోరాటం చెయ్యకపోవడమే కాదు పోరాటాలు, ఉద్యమాలను నిరసించడం, చిన్న చూపు చూడడం అలవాటు చేసుకుంది. ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతున్న ప్రజలు మాత్రం రోజు రోజుకీ శాంతియుత  పోరాట మార్గాలు మూసుకుపోతుండటంతో హింసత్మక ఉద్యమాలవైపు ఆకర్శితులవుతున్నారు.
ఆనాడు బ్రిటీష్ వారు మన దేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో వారిపై వీరోచితంగా పోరాడింది అడవి బిడ్డలే. ఇప్పుడు నల్ల దొరల అండతో అడవిని కాజేయడానికి వస్తున్న కొత్త బేహారులను ప్రాణాలొడ్డి అడ్దుకుంటున్నదీ ఆ గిరిపుత్రులే.
అయితే వారి పోరాటాలు విజేతలు రాసిన చరిత్ర పుటల్లోకి ఎక్కలేదు.
1930ల్లో అదిలాబాద్ జిల్లాలోని అసిఫాబాద్ దగ్గరలో ఉన్న జోడేఘాట్ ప్రాంతంలో నిజాం ప్రభుత్వ ఆగడాలకు వ్యతిరేకంగా పోరు రాజేసిన గోండు యోధుడు కొమరం భీం. “జల్, జంగల్, జమీన్” కొరకు తుపాకీ పట్టి పోరాడిన అతని జీవిత చరిత్రను రేఖామాత్రంగా తెలియజేస్తుంది గతవారం విడుదలైన “కొమరం భీం” సినిమా.
1990లో నిర్మాణమైన ఈ సినిమా 20 యేళ్ల తరువాత విడుదలకు నోచుకుంది. అల్లాణి శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గౌతం ఘోష్ సంగీతం అందించగా భూపాల్ రెడ్డి  కొమరం భీం పాత్రను పోషించారు.
అప్పుడు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ.టి.డి.ఎ.) లో ఉన్న ఐ.ఎ.ఎస్. అధికారి సుబ్రహ్మణ్యం గారు ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం వల్లనే ఈ చిత్ర నిర్మాణం సాధ్యం అయ్యిందని దర్శకుడు అల్లాణి శ్రీధర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మొన్న సెప్టెంబర్ 2 నాడు హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రి వై.యెస్. తో పాటు సుబ్రహ్మణ్యం గారు కూడా మరణించడం విషాదకరం.
ఎస్.ఎం. ప్రాణ్ రావు గారు కొమరం భీం భార్య సోం బాయి, భీం తో పాటు పోరాటంలో పాల్గొన్న అతని సహచరులతో మాట్లాడి, ఎంతో పరిశోధించి ఈ సినిమాకు స్క్రిప్ట్ రాశారు.
నిన్న సాయంత్రం నారాయణ్ గుడాలోని దీపక్ టాకీసులో కొంతమంది మిత్రులతో కలిసి ఈ సినిమా చూశాను.
నిజం చెప్పాలంటే ఇది ఒక Docu-Drama లాగా అనిపించింది నాకు.
కథలోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ ప్రాంతంలో అడవిలో నివసించే గోండులను నిజాం ప్రభుత్వ అధికారులు బాగా దోచుకుంటుంటారు. వారి నుండి అనేక పన్నులు వసూలు చేస్తూ, వారి గూడేలపైబడి అనేక విధాలుగా హింసిస్తూ ఉంటారు. ఒక సారి కొమరం భీం ఉండే గ్రామ పట్వారీ (Village Secretary) వచ్చి “మీరు అడవిని కొట్టి భూముని చదును చేస్కుంటే మీకు నిజాం ప్రభుత్వం పట్టాలు ఇస్తుందని చెబుతాడు. అది నమ్మి ఆ గోండులు కొంత భూమిని చదును చేసి సాగుచేసుకోవడం మొదలుపెడతారు. తీరా భూమిని దున్నే సమయానికి పట్వారీ దాన్ని కాజేసే ఉపాయం చేస్తాడు. ఆ భూములన్నీ ప్రభుత్వం ఒక ఆసామికి పట్టా చేయమని ఉత్తర్వులు ఇచ్చిందని గోండులు ఆ భూమిని ఖాళీ చేయాలని చెబుతాడు.
ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన గోండు నాయకుడిని చర్చలకు అని పిలిపించి ఆహారంలో విషం ఇచ్చి చంపుతాడు పట్వారి. జరిగిన మోసం అర్థం చేసుకున్న కొమరం భీం ప్రభుత్వాధికారులపైకి తిరగబడతాడు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు దగ్గరి నుండి తుపాకీ గుంజుకుని సాయుధుడవుతాడు. తోటి గోండులకు జరుగుతున్న మోసాలపై తిరగబడమని చెబుతాడు.
భీం చేస్తున్న పొరాటం గురించి తెలుసుకున్న పై అధికారులు కలవరపడతారు. భీం ను బంధించడానికి ఇంకొంతమంది పోలీసులను పంపుతారు. భీంపై కేసులు పెడతారు. సమీపంలోని టౌన్లో ఉన్న న్యాయవాదిని కలుస్తాడు భీం. “నువ్వు గూడెంలో ఉంటే పోలీసులు గూడెంపై బడతారు. నువ్వు అడవిలోకి పారిపోతే, పోలీసులు నీ వెంట బడతారు, గూడెం ప్రశాంతంగా ఉంటుంది” అన్న ఆ న్యాయవాది సలహా మేరకు భీం అజ్ఞాతంలోకి వెళతాడు. అక్కడే సోం బాయిని వివాహం చేసుకుంటాడు.
కొంత కాలానికి గూడేనికి తిరిగివచ్చిన భీం గోండులను సమావేశపరచి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిస్తాడు.
ప్రాణాలకు తెగించి ఈ పోరాటం ఎందుకు చేయాలన్న భార్య ప్రశ్నకు బదులిస్తూ…
గెలిస్తే మనం తలెత్తుకుని తిరుగుతామని, ఓడిపోయి మరణిస్తే మన పిల్లలు తలెత్తుకుని తిరుగుతారని చెబుతాడు భీం.
భీం తిరుగుబాటును అణచివేయడానికి అసిఫాబాదుకు ఒక కొత్త అవ్వల్ తాలుఖ్దార్ (District Collector) ను పంపిస్తుంది నిజాం ప్రభుత్వం. భీం న్యాయవాది ద్వారా “పోరాటం విరమిస్తే 30 ఎకరాల భూమిని నజరానాగా ఇస్తానని” కబురు పంపుతాడు అవ్వల్ తాలుఖ్దార్.
కానీ భీం ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. అడవిలోని గోండులందరికి 30 ఎకరాల భూమి ఇస్తుందా ప్రభుత్వం అని ప్రశ్నిస్తాడు.
చివరికి జోడేఘాట్ కొండపైకి పెద్ద ఎత్తున బలగాలను తీసుకుని దండయాత్రకు బయలుదేరుతాడు అవ్వల్ తాలుఖ్దార్. ఉన్న కొద్దిపాటి ఆయుధ సంపత్తితో పోలీసులను మొదటి రోజు నిలువరించగలుగుతాడు భీం. అయితే ఆ రోజు రాత్రి ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో జోడేఘాట్ ను వెనుకవైపునుండి చుట్టుముట్టిన నిజాం పోలీసులు భీం గోండు సైన్యంపై దొంగదెబ్బ తీస్తారు.
సూర్యోదయం అవుతుండగా పోలీసు బుల్లెట్లకు కొమరం భీం నేలకొరుగుతాడు.
ఉదయించే సూర్యుడి బ్యాక్ డ్రాప్ లో భీం నేలకొరిగే దృశ్యం ఈ చిత్రానికే తలమానికం
ఓడిపోయి కూడా నైతిక విజయం సొంతం చేసుకున్న ఈ గోండు వీరుని కథను చెప్పే సినిమా విడుదలైన రోజునే అదే ఆదిలాబాదు జిల్లాలో పోలీసుల చేతిలో అజాద్ హత్యకు గురికావడం బహుశా  కాలం మారినా మారని ఆదివాసుల జీవితాన్ని, వారి పోరాటాలకు ప్రభుత్వ ప్రతిస్పందనను తెలియజేస్తుంది.
చాలా తక్కువ ఖర్చుతో తీసినా చెప్పాల్సిన కథను సూటిగా, చక్కగా చెప్పాడు దర్శకుడు. భూపాల్ రాసిన పాటలు ఆకట్టుకుంటాయి. పచ్చని ఆదిలాబాద్ అడవుల అందాలను భవానీ శంకర్ కెమెరా అద్భుతంగా చిత్రీకరించింది.
ఈ సినిమాకు 1990 లోనే రెండు నంది బహుమతులు వచ్చాయి (ఉత్తమ దర్శకుడు, ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం)
మేము చూసిన దీపక్ టాకీస్ లో ప్రొజెక్షన్, సౌండ్ రెండూ బాగోలేవు. ఈ వారమైతే ప్రసాద్స్ లో కూడా ఒక షో వేస్తున్నారు. అక్కడ వీలు కాకపోతే కనీసం డీవీడీ రిలీజయ్యాకనైనా చూడాల్సిన సినిమా ఇది. పెద్దగా హంగులు లేకుండా నిర్మించిన సినిమా కాబట్టి ఒక డాక్యుమెంటరీ చూస్తున్నామని అనుకోండి, కానీ చూడ్డం మాత్రం మానకండి.
ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: