ఎవరన్నారు అతను అనాధ అని?

అగ్నిని ముద్దాడే దాకా అతను అనాధే కావొచ్చు. కానీ ఆ క్షణం నుండీ కోట్లాది మందిమి అతనికి ఆత్మ బంధువులమయ్యాము. తెలంగాణా సాధన కొరకు అతను ఎంచుకున్న మార్గం మనం హర్షించకపోవచ్చు. కానీ మన రాజకీయ నాయకుల క్షుద్ర క్రీడలో మరో విలువైన ప్రాణం గాలిలో కలిసింది.
మొన్న ఉస్మానియా విద్యార్ధులు ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి నేను ఉస్మానియా వద్దకు వెళ్లాను. అక్కడ రహదారిని ర్యాపిడ్ ఆక్షన్ ఫోర్స్, ఇంకా పారా మిలిటరీ బలగాలు రహదారిని దిగ్బంధం చేశాయి.
కొద్దిసేపట్లోనే ఉస్మానియా విద్యార్ధులు వేలాదిగా తరలి అక్కడికి ఊరేగింపుగా వచ్చారు. వారికి, పోలీసులకు మధ్య దాదాపు మూడు గంటల సేపు పెనుగులాట జరిగింది. పోలీసుల బ్యారికేడ్ల నుండి తప్పించుకున్న కొంత మంది విద్యార్ధులు విద్యానగర్ వైపు వెళ్లారు. వారి వెంట నేనూ వెళ్లాను. ఆ బృందాన్ని పోలీసులు విద్యానగర్ వద్ద, నారాయణగుడా వద్ద నిలువరించారు.
అక్కడి నుండి ఇంటికి వచ్చాను. వచ్చి టీవి ఆన్ చేస్తే అగ్నికి ఆహుతవుతున్న యాదయ్య కనపడ్డాడు. మనసు వికలమయ్యింది. ఆ దృశ్యాలు నన్ను జీవితాంతం వెంటాడుతాయి.  నేను తీసిన ఫొటోలు డౌన్లోడ్ చేసి చూస్తే రెండు మూడు ఫొటోల్లో యాదయ్య కనబడ్డాడు. ప్రతి ఫొటోలో ఏదో తీవ్రమైన ఆలోచనలో, ఆవేదనలో ఉన్నట్టు కనపడుతున్నాడు. ఒక బార్ లో క్యాషియర్ గా పనిచేసే యాదయ్య , తన జీతాన్ని అనాధల, అభాగ్యుల కొరకు ఖర్చు చేసే వాడని అతడి సన్నిహితులు చెపుతుంటే హృదయం ద్రవించి పోయింది ఇటువంటి గొప్ప మనిషిని మనం కోల్పోయామే అని. యాదయ్య అక్కడికి వచ్చే ముందే ఆత్మాహుతికి సిద్ధమై వచ్చాడని అతని బ్యాగులో దొరికిన ఫొటో ఆల్బం, సర్టిఫికేట్లు, సూసైడ్ నోట్ చూస్తే అర్థం అవుతుంది.  ఎంత తల్లడిల్లిపోయాడో బిడ్డ… నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే రాజకీయ పార్టీల ధోరణి చూసి.
డిసెంబర్ 7 నాడు అఖిల పక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు – చంద్రబాబు నాయుడు మొదలుకొని చిరంజీవి వరకూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్ధతు ప్రకటించి మూడు రోజుల్లోనే మాట మార్చిన తీరు దేశ చరిత్రలోనే అతి పెద్ద మోసం. అయిదేళ్లుగా సోనియా గాంధీ ఎలా చెబితే అలా చేద్దాం అని చిలకపలుకులు పలికిన లగడపాటి, రాయపాటి, టిజి వెంకటేశ్, దివాకర రెడ్డి; ఆరు నెలలు విస్తృతంగా అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలు “అధ్యయనం” చేసి మరీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మద్ధతు ప్రకటించిన తెలుగుదేశం నేత చంద్రబాబు; సామాజిక తెలంగాణా సాధన కొరకు తెలంగాణాలోని పది జిల్లాలూ కాళ్లరిగేలా తిరిగిన చిరంజీవి ఇప్పుడు సిగ్గు లేకుండా మాట మార్చారు. వీరే ఈ ఆత్మహత్యలకు ప్రత్యక్ష కారకులు.
డిసెంబర్ 9 నాడు సాక్షాత్తూ ఈ దేశ హోం మంత్రి చేసిన ప్రకటనను ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నం చూసి తట్టుకోలేని తెలంగాణా ప్రజలు ఇలా విపరీతమైన చర్యలకు ఒడిగడుతున్నారు. 2004 నుండి తెలంగాణాకు మద్ధతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, 2009 నుండి జై తెలంగాణా అంటున్న తెలుగుదేశం పార్టీలే ఇప్పుడు తెలంగాణా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ద్వారా ఈ ఆత్మహత్యలను నివారించగలవు.
ఒక మోసం మరువకముందే మరొకటి. ఒక వెన్నుపోటు నెత్తురు ఇంకక ముందే మరొకటి.
నా తెలంగాణా  కోటి గాయాల వీణ ఈనాడు.
తెలంగాణా వచ్చే వరకు అలుపు లేని పోరాటం చేద్దాం తమ్ముళ్లూ, అన్నలూ దయచేసి ఆత్మాహుతులకు పాల్పడకండి. బతికి మన తెలంగాణా మనం సాధించుకుందాం
ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఛలో అసెంబ్లీ దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు:   http://picasaweb.google.co.in/konatham.dileep/ChaloAssembly#
ప్రకటనలు

5 Responses to “ఎవరన్నారు అతను అనాధ అని?”


 1. 3 Konatham Dileep 3:19 ఉద. వద్ద ఫిబ్రవరి 23, 2010

  వర్మ గారు,

  తెలంగాణా ఉద్యమానికి మీరు ప్రకటిస్తున్న మద్ధతుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు

 2. 4 satya 4:12 సా. వద్ద ఫిబ్రవరి 23, 2010

  ప్రపంచం డిసెంబర్ 9 తర్వాత ఎన్నో రోజులు, గంటల్ని చూసింది. కాని తెలంగాణ వారు మాత్రం అక్కడే ఆగిపోయారు. రాజకీయపార్టీలు వంచించింది తెలంగాణ ప్రజల్ని కాదు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళని.

 3. 5 telugODu 5:06 ఉద. వద్ద మార్చి 2, 2010

  “అమరజీవివి నీవి యాదయ్యా
  అందుకో జోహార్లు యాదయ్యా!
  నిన్ను బలిగొన్నట్టి నీచులను దునిమాడి
  నిన్ను గన్నట్టీ ఈ తెలుగు గడ్డను మేము
  స్వాతంత్ర్యముగ జేసి శాంతించెదమెగానీ
  నీ పేరు నిలపకనే యాదయ్యా
  మేము నిదురైన బోమోయి యాదయ్య”


Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

 • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: