ఉద్యమం హింసాత్మకం చేయడానికి కుట్ర జరుగుతోంది

నిన్న ఉస్మానియాలో పోలీసులు సృష్టించిన భీభత్సం గత నెలన్నరగా తెలంగాణా ఉద్యమాన్ని ఏదో ఒక విధంగా అణచాలని ప్రయత్నిస్తున్న శక్తుల పన్నాగమే అని స్పష్టంగా రుజువులున్నాయి.

సంఘటనా స్థలంలో ఉన్న ఆంధ్రజ్యోతి విలేకరి ఎంతో ధైర్యంతో ఈ కుట్రను బట్టబయలు చేశాడు. చదవండొక సారి.

పూర్తి వార్త చదవడానికి పై బొమ్మపై క్లిక్ చేయండి.

మొన్న వేణుగోపాల్ రెడ్డి చనిపోయినట్టు తెలిసిన మరుక్షణం నుండి అతని దేహాన్ని అక్కడినుండి వీలైనంత త్వరగా తరలించాలని పోలీసులు చేయని ప్రయత్నం లేదు. వేలాది మంది విద్యార్ధులు పోలీసుల ప్రయత్నాలను అడ్డుకున్నారు. పోస్టుమార్టం కూడా యూనివర్సిటీలోనే జరిపించారు. ఆ తరువాత వేణు మృతదేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఆర్ట్స్ కాలేజీకి తరలించారు.

మంగళవారం రాత్రంతా విద్యార్ధులు అంటూనే ఉన్నారు పోలీసులు ఏ క్షణాన్నైనా విరుచుకుపడి వేణు దేహాన్ని అక్కడినుండి తరలిస్తారని. అందుకే అంత చలిలోనూ ఉస్మానియా విద్యార్ధులు ఆర్ట్స్ కాలేజి వద్దే రాత్రంతా జాగారం చేశారు. ఉదయం వారు వేణు దేహాన్ని ఊరేగింపుగా అసెంబ్లీ ముందు గన్ పార్క్ లో ఉన్న తెలంగాణా అమరవీరుల స్తూపం వద్దకు తీసుకువెళ్ళాలని అనుకున్నారు.

తెలంగాణా ఉద్యమంలో అమరులైన వారిని అ స్తూపం వద్ద కాసేపు ఉంచే సాంప్రదాయం ఉంది. ఇప్పటి ఉద్యమంలో మొదటగా ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంత్ చారి దేహాన్ని కూడా అమరవీరుల స్థూపం వద్ద కాసేపు ఉంచిన తరువాతే అతని స్వగ్రామం పొడిచేడు తీసుకువెళ్లారు. ఆరోజు కూడా శ్రీకాంత్ దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ నుండే నేరుగా పొడిచేడు తరలించాలని పోలీసులు విఫలయత్నం చేశారు. అయితే విద్యార్ధులు పోలీసులను ఒప్పించి చాలా శాంతియుతంగా అఫ్జల్ గంజ్ నుండి గన్ పార్క్ వరకూ ఊరేగింపుగా వచ్చారు. ఆ రోజు శ్రీకాంత్ అంతిమయాత్రలో అంబులెన్స్ ను పోలీసులు ఎక్కడ బలవంతంగా హైజాక్ చేస్తారోనన్న ఆందోళనతో ఆ అంబులెన్స్ వెనుక ఒక రక్షణ వలయంగా మేము నడిచాం. గుండెల్లో ఎంతో బాధ ఉన్నా, కట్టలు తెంచుకునేందుకు సిద్ధంగా విద్యార్ధుల ఆగ్రహం ఉన్నా ఆ రోజు ఊరేగింపు అత్యంత శాంతియుతంగా సాగింది. ఊరేగింపు ముందు నడిచిన హరీశ్ రావు వంటి నేతలు కూడా అంతిమ యాత్ర సజావుగా జరిగేటట్టు చూసుకున్నారు.

నిన్న కూడా ఉస్మానియా విద్యార్ధులు, ప్రజా సంఘాల నేతలు, జే.ఏ.సి. నాయకులు పోలీసులకు తాము శాంతియుతంగా అంతిమ యాత్ర చేపడతామని ఎంతో నచ్చజెప్పారు. అయినా పోలీసులు వినకుండా కుట్ర పూరితంగా వేణు దేహం ఉన్న అంబులెన్స్ ను హైజాక్ చేశారు. అన్నిటికన్నా ఘోరం నిన్న యూనివర్సిటీలో మఫ్టీ పోలీసులే యూనిఫార్మ్ ధరించిన పోలీసులపై రాళ్లదాడి మొదలుపెట్టారు. ఇది తమపై బలప్రయోగం చేయడానికి పోలిసులు పన్నిన కుట్ర అని అర్థం చేసుకున్న విద్యార్ధులు వెంటనే రాళ్ళు రువ్వుతున్న మఫ్టీ పోలీసులను పట్టుకుని ఒకరిని పోలీసు అధికారులకు అప్పజెప్పారు. అయినా ఇదేం పట్టించుకోకుండా తాము అనుకున్నది చేసి చూపించారు పోలీసులు. ఫైబర్ లాఠీలతో విద్యార్ధులను విచ్చలవిడిగా బాదారు. భాష్పవాయు గోళాలు ప్రయోగించారు, రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. రెచ్చిపోయిన కొంత మంది విద్యార్ధులు పోలీసులపైకి రాళ్ల్లు రువ్వుతుంటే వారిని తోటి విద్యార్ధులే అడ్డుకుని శాంతపరిచారు. ఈ హింస ఆపమని పోలీసులకు చేతులెత్తి దండాలు పెట్టారు.

ఈ నెలన్నరలో ఉస్మానియాలో విద్యార్ధులను రెచ్చగొట్టడానికి పోలీసులు చేయని ప్రయత్నం లేదు. ఒక రోజైతే ఏ కారణం లేకుండానే పక్కనే ఉన్న మాణీకేశ్వరి నగర్ బస్తీలోకి వెళ్ళి రోడ్డుపై వెళ్తున్న సామాన్య ప్రజలను లాఠీలతో మోదారు. మరో రోజు మెస్ లో వంట చేసే వ్యక్తిని దొరకబుచ్చుకుని చావబాదారు. ఆ రోజు కూడా నేను ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉన్నాను. ఈ విషయం గురించి ఇక్కడ రాశాను.

ఉస్మానియాలో 29 నవంబర్ నాడు విద్యార్ధులపై విచక్షణారహితంగా లాఠీచార్జీ చేయించినందుకు బదిలీ అయిన కర్కోటక పోలీస్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర మళ్లీ నిన్న యూనివర్సిటీలో సంఘటనా స్థలంలో పోలీసులను పర్యవేక్షించడం దేనిని సూచిస్తుంది? శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఉస్మానియా విద్యార్ధులను రెచ్చగొట్టి వారిని హింసాకాండకు పురికొల్పే పధకం ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయని ఒక సారి యూనివర్సిటీకి వెళ్ళి చూస్తే అర్థం అవుతుంది.

ఉద్యమంలో హింస చెలరేగేలా చేసి ఆ తరువాత ఇది శాంతి భద్రతల సమస్యగా మాత్రమే పరిగణించే దశకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ సాయంతో చేస్తున్న కుట్ర ఇది. అందుకే ఇవ్వాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “ఆపరేషన్” నిర్వహించడానికి స్టీఫెన్ రవీంద్ర, మహేశ్ చంద్ర లడ్డా వంటి “ఎన్ కౌంటర్ స్పెషలిస్టులు” రంగంలోకి దింపబడ్డారు.

ఎంత రెచ్చగొట్టినా తెలంగాణా ప్రజలు సహనంతో రాష్ట్రం సాధించుకుంటారు. తమని తాము బలిదానం చేసుకోవడమే ఈ ఉద్యమంలో జరుగుతున్న అతి పెద్ద హింస.


ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: