వృధా కాదు నీ మహోన్నత త్యాగం

నిన్న రాత్రంతా ప్రయాణం చేసి తెలతెలవారుతుండగా నిద్రపోయిన నన్ను ఒక దుర్వార్త నిద్రలేపింది.

ఎం.సి.ఏ. ఫైనల్ ఇయర్ విద్యార్థి కొండేటి వేణుగోపాల్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మాహుతి చేసుకున్నాడన్న ఆ వార్త తెలుసుకుని తల్లడిల్లిపోయాను. నేను నా స్కూలు చదువులు మొదలుపెట్టిన సూర్యాపేట ముద్దుబిడ్డ వేణుగోపాల్.

యూనివర్సిటీ బొటానికల్ గార్డెన్ వెనుక, టాగోర్ ఆడిటోరియం ముందు భాగంలో ఒక బండపై తనని తాను కాల్చుకుని మాడి మసి బొగ్గైన వేణుగోపాల్ మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక ప్రశ్న.

తమ అశల సాధనకు ఉన్న అన్ని ప్రజాస్వామిక పద్ధతులు మూసుకుపోయాక ప్రజలు ఏం చేస్తారు?

ఎన్నికల మానిఫెస్టోల్లో తెలంగాణా ఇస్తామని చెప్పి, ప్రచారం చేసిన అన్ని పార్టీలు ఇప్పుడు మాట మార్చడం బహుశా స్వతంత్ర భారత దేశంలోనే జరిగిన అత్యంత పెద్ద మోసం.

ఇలా చేశాక ఇక ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఎలా ఉంటుంది?

అరవై యేళ్లుగా మోసపోతున్న తెలంగాణా ప్రజలకు ఇక మిగిలి ఉన్న పోరాట రూపాలేమిటి?

అన్నీ తెలిసి మౌన వ్రతం పాటిస్తున్న డిల్లీ పెద్దలను కదిలించేందుకు ఇంకేం చేయాలి ఇక్కడి ప్రజలు?

అతని ఆత్మాహుతి ఒక మహోన్నత నిరసన.

ఓటు వేయించుకునే దాకా తెలంగాణా కొరకు పోరాటం చేస్తామని బీరాలు పలికే దగాస్టార్లు ఇప్పుడు గోడ దూకి “తెలంగాణా ఉద్యమం ప్రజల్లో లేదు. అది కేవలం రాజకీయ నాయకులదే” అని సిగ్గూ ఎగ్గూ లేకుండా అబద్ధాలు ఆడుతున్నప్పుడు, “తెలంగాణాకు మేము వ్యతిరేకం కాదని” అర్థం కాని తికమక ప్రకటనలు ఇచ్చే కాంగ్రెస్, సి.పి.ఎం. తె.దే.పా.ల తీరు చూసి గుండెమండిన తెలంగాణా ప్రజలు ఇదిగో ఇలా తమ నిరసన తెలుపుతున్నారు.

అతని మరణం ఒక ధిక్కారం.

హింస పేరిట తెలంగాణా ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, “మమ్మల్ని మేము ఆహుతి చేసుకోవడమే ఈ ఉద్యమంలో జరుగుతున్న అతి పెద్ద హింస” అని ఇక్కడి ప్రజలు తమ ఆత్మ బలిదానాల ద్వారా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.

అనేక దశాబ్దాలుగా రాజకీయ నాయకుల మోసాన్ని చూస్తున్న తెలంగాణా యువత వారి పట్ల ఎంత ఆగ్రహంగా ఉన్నారో నిన్న వేణుగోపాల్ భౌతికకాయం వద్ద పరామర్శించడానికి వచ్చిన కే.సి.యార్, దామోదర్ రెడ్డి, హరీశ్ రావు వంటి నాయకులకు ఎదురైన అనుభవం చెబుతోంది. ఏ పార్టీ నాయకుడిని కూడా వదలట్లేదు వారు. అందర్నీ ఘెరావ్ చేశారు. తిట్టిపోశారు.

మరి కొన్ని రోజులైతే ఏ పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలోనో మంచి ఉద్యోగం చేసే అవకాశం ఉన్న ఈ యువకిశోరం బలిదానం తెలంగాణా ప్రజల్లో ఉన్న రాష్ట్ర కాంక్షకు ఒక నిదర్శనం. వాటిని గుర్తించకుండా ఇవ్వాళ ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు చేసిన దౌర్జన్యకాండ ఇక్కడి ప్రజలలో ఇంకా ఆగ్రహావేశాలు రగిలిస్తుంది. ఇంకా ఉద్యమ స్ఫూర్తిని పెంపొందిస్తుంది. రాష్ట్రం ఏర్పడేదాకా తెలంగాణా ప్రజలు విశ్రమించరు.

వేణుగోపాల్ రెడ్డి ఆత్మ బలిదానం వృధా కాదు!

ఇంకొక్క ప్రాణం కూడా పోవడానికి వీలులేదు. బ్రతికి మన తెలంగాణా సాధించుకుందాం.

నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో తీసిన ఫొటోలు ఇక్కడ చూడండి.

http://picasaweb.google.com/konatham.dileep/TelanganaVenugopalReddy#


ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: