మారని కాంగ్రెస్ నీచబుద్ధి

తెలంగాణాకు ఇతర విషయాల్లో జరిగిన అన్యాయాలను కాసేపు పక్కన పెడితే ఈ న్యాయమైన ఆకాంక్షని కాంగ్రెస్ చేస్తున్న అవహేళన చూస్తుంటే కడుపు రగిలిపోతుంది.

తెలంగాణాపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన ప్రతిసారీ నాకు విపరీతమైన కోపం వస్తుంది ఆ తరువాత ఈ దేశానికి వీరు తప్ప మరో ప్రత్యామ్న్యాయం లేరనే నిజం గుర్తుకువచ్చి భయం వేస్తుంది. ప్రపంచంలో మరే దేశంలోనయినా కాంగ్రెస్ పార్టీ అంతటి దుర్మార్గమైన పార్టీ ఉంటుందని నేననుకోను. రాజకీయాలంటే ప్రజలకు విరక్తి కలిగే విధంగా రాజకీయం నెరపుతూ గత 6 దశాబ్దాలుగా ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు కాంగీయులు.

దాదాపు 10 కోట్ల మంది తెలుగు ప్రజానీకం పది రోజులుగా పడుతున్న ఆవేదన, 20పై చిలుకు యువకుల ఆత్మార్పణ, ఒక పార్లమెంటు సభ్యుడి ఆమరణ నిరాహార దీక్ష తరువాత కూడా తెలంగాణా అంశాన్ని కాంగ్రెస్ జటిలం చేస్తున్న విధానం చూస్తుంటే అసలు ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం అనేది మిగిలి ఉందా అని అనుమానం వస్తున్నది. ప్రజలను ఇంత దారుణంగా వంచించడం బహూశా కాంగ్రెస్ పార్టీకొక్కదానికే సాధ్యమవుతుందనుకుంటా.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణా ఎమ్మెల్యేలు వైయెస్ నేతృత్వంలో సోనియాగాంధీ ని కలిసి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నది మొదలు ఈ రోజు దాకా ఆ పార్టీ నాయకులు తెలంగాణా విషయంలో ఆడిన నాటకాలు చూస్తే రక్తం సలసల మరగడం ఖాయం.

2004 ఎన్నికల ప్రచారంలో టీ.ఆర్.ఎస్. కండువా భుజంపై వేసుకుని కరీంనగర్ సభలో “మీ మనసులో ఉన్నది ఏమిటో నాకు తెలుసు” అని నర్మగర్భంగా సోనియమ్మ మాట్లాడినప్పుడు తెలంగాణా ప్రజలు ఉప్పొంగిపోయారు. కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టో తో మొదలుపెట్టి యు.పి.ఎ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కామన్ మినిమం ప్రోగ్రాములో తెలంగాణా చేర్చారు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రసంగాల్లో చేర్చారు. ఈ తిరకాసు మాటలను పట్టుకుని కేసియార్ తెలంగాణా ఎల్లుండే వస్తుందని ఇక్కడి ప్రజలను నమ్మించాడు.

ఆ తరువాత ప్రణబ్ కమిటీ ప్రహసనం. ఎనిమిదే వారాల్లో తెలంగాణాపై “ఏకాభిప్రాయం” తేవడానికి వేసిన కమిటీ ఏం చేసిందో ఎక్కడుందో ఇప్పుడెవరికీ తెలియదు.

తెలగాణా గురించి అడిగితే “విషయం సోనియా గాంధీ చేతిలో పెట్టాం” అని అరిగిపోయిన రికార్డును వేస్తూ అయిదేళ్ళూ నెట్టుకొచ్చింది కాంగ్రెస్.

మళ్లీ 2009 ఎన్నికల ముందు సోనియా చెబితే వైయెస్ రాష్ట్ర శాసన సభలో తెలంగాణా ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం “సానుకూలంగా ఉంది” అనే వాక్యం చెప్పి రోశయ్య కమిటి అని ఇంకో దాన్ని వేశాడు. శాసనసభ చివరి సమావేశం చివరి రోజు వేసిన కమిటీ ఏమి సాధించగలదో తెలియనిదెవరికి?

తాజా ఉద్యమం మొదలైనా గత పది రోజులుగా ఇదే తంతు. “తెలంగాణా సమస్యను కాంగ్రెస్ మాత్రమే పరిష్కరించగలదు”, “తెలంగాణపై హైకమాండ్ త్వరలోనే నిర్ణయిస్తుంది”, “సోనియాతో తెలంగాణ అంశం చర్చించాను, ఆమె త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని నాకు నమ్మకం ఉంది”, “తెలంగాణాపై ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తున్నాం”, “తెలంగాణా అంశాన్ని కాంగ్రెస్ సీరియస్ గా పరిశీలిస్తోంది”

ఇదీ వరస. పైన మాట్లాడిన ఏ మాటకూ దమ్మిడీ విలువలేదని చేప్పేవాడికి స్పష్టంగా తెలుసు, కానీ నాటకం కొనసాగిస్తూనే ఉంటారు. ఎదుటివాడు ఏమైనా అనుకుంటాడేమోననే సిగ్గూ లజ్జా ఉండదు.

ఓ వైపు తెలంగాణా అంతటా రోజురోజుకీ ఆందోళనలు మిన్నంటుతుంటే ప్రకటనలు, చర్చలంటూ కాలక్షేపం చేసి నిన్న సాయత్రం మేడం ఆదేశించారని హడావిడిగా అఖిలపక్ష సమావేశం నిర్వహించిన రోశయ్య, తీరా అన్ని పార్టీల నేతలు అక్కడికి వచ్చాక వారిని “తెలంగాణాపై మీ పార్టీ వైఖరి ఏమిటి?” అని అడిగి అందరూ తమ తమ వైఖరి చెప్పాక “ఇంత పొద్దుపోయినా పిలవగానే సమావేశానికి వచ్చినందుకు కృతజ్ఞతలు” అని సమావేశాన్ని ముగించాడట. ఇంతా చేసి తెలంగాణపై తామేమీ నిర్ణయం తీసుకోలేమని అధిష్టానమే చూసుకుంటుందని చావు కబురు చల్లగా చెప్పేసరికి ప్రతిపక్షాలు, ప్రజలూ ఆగ్రహంతో ఊగిపోయారు.

ఇవ్వాళ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ మళ్ళీ అదే పాట “తెలంగాణ పై ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తున్నాం”

రాష్ట్రంలో తెలుగు దేశం, పీఅర్పీ, బీజేపీ, సి.పి.ఐ, టీఅరెస్, కాంగ్రెస్ (?) తెలంగాణకు మద్ధతు ఇస్తున్నాయి. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం అయిన బీజేపీ తెలంగాణా బిల్లు పెడితే మద్ధతు ఇస్తామని ఎప్పుడో ప్రకటించింది. అనేక చిన్న పార్టీలు కూడా తెలంగాణకు మధతు ఇచ్చాయి. ఇక కాంగ్రెస్ సాధించదలుచుకున్న ఏకాభిప్రాయం ఏమిటో వారికే తెలియాలి. స్వంత పార్టీలో ఏకాభిప్రాయం అనుకుందామంటే అక్కడ మేడం మాటే ఫైనల్ కదా.

ఓవైపు కేసియార్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వైద్యులు చెబుతుంటే కాంగ్రెస్ మాత్రం తెలంగాణపై అదే గందరగోళం కొనసాగిస్తున్నది.

రేపు తెలంగాణా పై అంతిమ నిర్ణయం వస్తుందని ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఊదుతున్నారు. కానీ ఇవ్వాళ కేంద్రం నుండి దిగిన 15 కంపనీల బిఎస్సెఫ్, సీఅర్పీఎఫ్ బలగాలు అటు ఉస్మానియా, ఇటు కాకతీయ యూనివర్సిటీల్లో మోహరించాక కాంగ్రెస్ తెలంగాణ సమస్యను ఇప్పుడిప్పుడే తేల్చే ఉద్దేశ్యం లేదని అర్థం అవుతుంది.

కేసీయార్ ప్రాణాలకు ఏమైనా జరిగితే కలిగే విపత్కర పరిణామాలు కూడా ఆ పార్టీ పట్టించుకోవట్లేదంటే అధికారం కొరకు కాంగ్రెస్ ఎంతటి నీచపు ఎత్తుగడలు వేయగలదో మరోసారి స్పష్టమైంది.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: