ఉద్యమంపై వ్యాఖ్యానించే ముందు ఒక్క క్షణం

ఒక వైపు మహోధృతంగా సాగుతున్న తెలంగాణా ఉద్యమంలో మా భూమిపుత్రులు తమ ప్రాణాలు తామే అర్పించుకుంటుంటే కొందరు సమైక్యవాదులు, తెలంగాణ వ్యతిరేకులు బ్లాగుల్లో అవాకులు చవాకులు పేలుతున్నారు. తెలంగాణా ఉద్యమం ఎందుకు జరుగుతుందో అనేక సార్లు వివరించినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయని వీరు కేసీఆర్ ను విమర్శించే నెపంతో తెలంగాణా ప్రజలను దూషిస్తున్నారు.

విధ్వంసం విధ్వంసం అని గుండెలు బాదుకుంటున్నవారు ఒక సారి అలోచించండి ఇప్పటికే 25 మంది యువకులు తెలంగాణ కొరకు తమ ప్రాణాలు తామే తీసుకున్నారు. తమ దేహాలను అగ్నిగోళాలుగా మార్చుకుని “జై తెలంగాణా” అని నినదిస్తున్నారు, ఉరి తాళ్లను ముద్దాడుతున్నారు, బుల్లెట్లను గుండెల్లో దింపుకుంటున్నారు, గరళాన్ని దిగమింగుతున్నారు, రైలు పట్టాలపై శిరచ్చేధం చేసుకుంటున్నారు, సెల్ టవర్లు, నీటి ట్యాంకులపై నుండి “జై తెలంగాణ” అని దుంకుతున్నరు.

ఇంకొక ప్రాణం కూడా వృధా కావొద్దు అని మేము ఇక్కడ విజ్ఞప్తులు, విన్నపాలు చేసుకుంటున్నాం.

మీకొకటే విజ్ఞప్తి. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. అందరికీ భావ ప్రకటనా స్వేచ్చ ఉందీ దేశంలో. సమైక్య రాష్ట్రం ఎందుకు అవసరమో తప్పకుండా మీ అభిప్రాయాలను రాయండి. సమైక్యత సాధించడం కొరకు చేయాల్సిన కృషి తప్పకుండా చేయండి. కానీ ఒక్క నిముషం అలోచించండి. అసలే అవేశాలు రగులుతున్న ఈ సమయంలో మీరు చేసే ఈ అనాలోచిత వ్యాఖ్యలు వాతావరణాన్ని ఇంకా కలుషితం చేస్తాయి. అమెరికాలోనో, కెనడాలోనో కూర్చుని మీరో వెకిలి వ్యాఖ్య చేసి మీ నోటి కుతి తీర్చుకుని ఆనందపడవచ్చు. కానీ అలాంటి వ్యాఖ్యలు ఒక్కోసారి బడబాగ్నిని రగల్చవచ్చు. అది అమాయకులనే దహించివేస్తుంది.

అలాగే తెలంగాణా వాదులు కూడా సంయమనం పాటించాలి. ఆంధ్రా మిత్రులను దూషించి అనవసరంగా మన ఉద్యమంపై దురభిప్రాయం కలుగజేయరాదు. మన పోరు కోస్తాంధ్ర పాలకవర్గాలతోనే కానీ కోస్తాంధ్ర ప్రజలతో కాదని గుర్తెరగాలి.

సమైక్య రాష్ట్రం ఉండాలనుకోవడం తప్పుకాదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం ప్రజా ఉద్యమం. దీనిపై దయచేసి వెకిలి రాతలు రాయకండి.

మీకు ధ్వంసం అవుతున్న ఆస్థులు కనపడుతున్నాయి. మాకు ధ్వంసం అవుతున్న తెలంగాణా భవిష్యత్ తరంపై ఆందోళనగా ఉన్నది.

ప్రకటనలు

10 Responses to “ఉద్యమంపై వ్యాఖ్యానించే ముందు ఒక్క క్షణం”


 1. 1 kiran velijala 5:07 ఉద. వద్ద డిసెంబర్ 7, 2009

  బ్లాగ్లోకం చాలా చిన్నది దిలీప్! దీన్ని ఎవరో చదివి బడబాగ్నులు రగిలించుకునేంత సీన్ లేదు. ఇక్కడ మనం మనం మాట్లాడుకోవడమే! ఎవరికీ దీని గురించి తెలీదు, ఇవన్నీ చదివే తీరికా లేదు.

 2. 2 prabhakarmandaara 5:37 ఉద. వద్ద డిసెంబర్ 7, 2009

  చాలా బాగా చెప్పారు.
  నిజాం వ్యతిరేక తెలంగాణా సాయుధ పోరాట మప్పుడు ఎంతోమంది ఆంధ్రులు మద్దతు తెలిపారు. ఆ పోరాటం లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కథలు, నవలలు, కవితలు రాసి ఆ ఉద్యమ వ్యాప్తికి దోహదపడ్డారు. కొందరు తమ ప్రాణాలు కూడా త్యాగం చేసారు.
  కానీ ఇప్పుడు ఎందుకో అట్లాంటి సుహృద్భావం కనిపించడం లేదు.

  కనిపించక పోవడమే కాదు అవహేళనలు, వెటకారాలు, వ్యంగ్యాలు, వెకిలి రచనలు, వ్యాఖ్యలతో తెలంగాణాను, తెలంగాణా ప్రజలను నొప్పిస్తున్నారు.
  ఇది చాలా బాధాకరంగా వుంది.
  చిల్లర అంశాలను పక్కన పెట్టి 54 సంవత్సరాలుగా నలుగుతున్న తెలంగాణా అస్తిత్వ సమస్యను సహృదయంతో అర్ధం చేసుకునేందుకు, అధ్యయనం చేసేందుకు వారు ప్రయత్నించాలని నేను కూడా మీతోపాటే అభ్యర్ధిస్తున్నాను.

 3. 3 సుజాత 5:42 ఉద. వద్ద డిసెంబర్ 7, 2009

  దిలీప్,
  మీరు ఈ టపాను బహుశా నా పోస్టు కు వాచ్చిన వ్యాఖ్యల నుద్దేశించి రాసినట్లు తోస్తోంది.

  ఒకసారి వ్యాఖ్యలన్నీ మళ్ళీ చదివాను. అందులో కొన్ని తెలంగాణా సోదరులకు అభ్యంతరకరంగానే ఉన్నాయి. కానీ భావప్రకటనా స్వేచ్ఛ ను గౌరవిస్తూ వాటిని డిలీట్ చేయడం లేదు. పైన కిరణ్ చెప్పినట్లు బ్లాగ్లోకంలో జరిగే చిన్న చిన్న పరిణామాలను గుర్తించే తీరిక ఉద్యమకారులకు ఉందా?

  కానీ విచక్షణ పని చేయనపుడు ఎంతటి చిన్న వ్యాఖ్య అయినా అగ్నికి ఆజ్యం పోసే అవకాశం ఉంది. ఆవేశాలను రెచ్చగొట్టడం,ద్వేషాలను పెంచుకోవడం సమైక్యాంధ్ర వాదుల అభిమతం కాదు.అందువల్ల ఈ ఉద్యమం సంగతి ఒక కొలిక్కి వచ్చేదాకా ఆ టపాను డ్రాఫ్ట్ లో ఉంచుతున్నాను. టపాను కానీ, వ్యాఖ్యలు కానీ డిలీట్ చేయడం లేదు.

  ధన్యవాదాలు!

 4. 4 నాగప్రసాద్ 5:49 ఉద. వద్ద డిసెంబర్ 7, 2009

  >>”ఇప్పటికే 25 మంది యువకులు తెలంగాణ కొరకు తమ ప్రాణాలు తామే తీసుకున్నారు. తమ దేహాలను అగ్నిగోళాలుగా మార్చుకుని “జై తెలంగాణా” అని నినదిస్తున్నారు, ఉరి తాళ్లను ముద్దాడుతున్నారు, బుల్లెట్లను గుండెల్లో దింపుకుంటున్నారు, గరళాన్ని దిగమింగుతున్నారు, రైలు పట్టాలపై శిరచ్చేధం చేసుకుంటున్నారు, సెల్ టవర్లు, నీటి ట్యాంకులపై నుండి “జై తెలంగాణ” అని దుంకుతున్నరు.”

  తమ ప్రాణాలను తీసుకోవడం ఎందుకు? ప్రాణాలకు తెగించే అంత ధైర్యం ఉన్నవారికి, తమ నాయకులను నిలదీసే ధైర్యం లేదా? తమదేహాలను అగ్ని గోళాలుగా మార్చుకోవడం కాదు, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారాన్ని అనుభవించి దోచుకున్న M.L.A ల, M.P. ల దేహాలను అగ్నిగోళాలుగా మార్చండి. బ్రతుకులు బాగు చేస్తామని చెప్పి, ఆ సంగతే మర్చిపోయిన వారి మెడకు తగిలించండి ఉరితాళ్ళు. అన్యాయంతో పోరాడి అసువులు బాసినవాడే హీరో. అలాంటప్పుడే పోయిన వారి ప్రాణాలకు విలువ చేకూరేది. ఆకలి చావులకు కారణమైన నాయకుల మీద పోరాడమనండి. అప్పుడు నేను కూడా అంటాను “జై తెలంగాణ” అని. ఆనందంతో చప్పట్లు కొడతాను. వారి పోరాటాన్ని స్పూర్తిగా తీసుకొని, పది మందికీ చెబుతాను.

 5. 5 Konatham Dileep 5:54 ఉద. వద్ద డిసెంబర్ 7, 2009

  సుజాత గారూ,

  మీ పోస్టుకు ప్రతిస్పందనలే కాదు, చాలా సీనియర్ బ్లాగర్లు కూడా ఉద్యమిస్తున్న తెలంగాణా ప్రజలను అవహేళన చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి అవహేళనలే ఇవ్వాళ ఉద్యమానికి ఒక మూల కారణం. తాము ఎంతో ప్రేమించే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలు అవుతుందన్న వారి ఆవేదనను అర్థం చేసుకోగలం. కానీ ఇది ఒక చారిత్రక అవసరంగా గుర్తించమని విజ్ఞప్తి చేస్తున్నాను.

  తెలంగాణా ప్రజల పోరాటం గురించి ఎంతో ఓపికగా వివరిస్తున్నాం, వెబ్ లో ఎంతో సమాచారం పెట్టాం. ఇది చదివి అందరూ ఉద్యమానికి మద్ధతు పలకాల్సిన అవసరం లేదు. కనీసం ఈ ఉద్యమ నేపధ్యం తెలుసుకుని కాస్త మర్యాదగా చర్చిస్తే అదే చాలు. ఇప్పటికే ఆవేశాలు రగులుతున్న ఈ క్షణంలో ఎక్కడినుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని భయపడుతున్నాం.

  ఉద్యమంలో చెలరేగే హింస, విధ్వంసం తెలంగాణాకే నష్టదాయకం అని మా స్థిరమైన అభిప్రాయం.

 6. 6 Konatham Dileep 6:09 ఉద. వద్ద డిసెంబర్ 7, 2009

  సుజాత గారూ,

  చెప్పడం మరిచాను. బ్లాగు పోస్టును డ్రాఫ్ట్ గా మార్చినందుకు ధన్యవాదాలు.

  పైన ప్రభాకర్ గారు చెప్పినట్టు తెలంగాణా సాయుధ పోరాటం జరిగే రోజుల్లో విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పోరాటంలో పాల్గొని అసువులుబాసిన అమరవీరుల స్ఫూర్తిగా చెబుతున్నాను. తెలుగు వారు ఇలా కలిసి ఉండి కలహించుకునే బదులు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నా సోదర భావంతో మెలగవచ్చు.

 7. 7 Konatham Dileep 6:32 ఉద. వద్ద డిసెంబర్ 7, 2009

  నాగ ప్రసాద్ గారూ,

  కరెక్టుగా నా మనసులోని మాటను చెప్పారు. గత వారం రోజులుగా మేము తెలంగాణా యువకులను కోరుతున్నది అదే. “మన నాయకులను నిలదీద్దాం. మీరు ప్రాణాలు తీసుకోవద్దు. తెలంగాణా ఇచ్చేదాకా ఇక్కడి నాయకులకు నిలువనీడ లేకుండా చేయమని”

  అన్ని తెలంగాణా జిల్లాలో ప్రజలు ఈపాటికే స్థానిక నాయకులను తరమడం మొదలుపెట్టారు. గత వారం రోజులుగా తెలంగాణా కాంగ్రెస్ నాయకులంతా హైదరాబాద్, డిల్లీలోనే కాలం వెళ్లదీస్తున్నారు.

  ఇప్పటికే తెలంగాణా కాంగ్రెస్ నాయకులను సాంఘిక బహిష్కారం విధించారు ప్రజలు. చాకలి వారు బట్టలు ఉతకడం లేదు. నాయీ బ్రాహ్మణులు క్షవరం చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆఖరికి కాటికాపరులు కూడా తెలంగాణా కాంగ్రెస్ నాయకులు మరణిస్తే అంత్యక్రియలు కూడా చేయమని చెప్పారు.

  చైతన్యానికి మారుపేరైన తెలంగాణా ప్రజలు ఇక ఉపేక్షించరు…

 8. 8 srinivas 8:08 ఉద. వద్ద డిసెంబర్ 7, 2009

  గౌరవనీయులు వ్యాస కర్త గారు …
  కింది బ్లాగును కామెంటును ఒకసారి చూడండి

  http://naradalokam.blogspot.com/2009/12/blog-post.html

  “చెత్త రాతలు మానెయ్యరా వెధవ!
  నీకు దమ్ముంటే – తెలంగాణ ఉద్యమానికి మద్దత్తివ్వు.
  లేకపోతే మూసుకుని కూర్చో.

  కాదుకూడదు అని ఇంకా సమాధానాలు కావాలంటె – తెలంగాణ వెళ్ళి అడుగు చెబుతారు సమాధానాలు”

 9. 9 Konatham Dileep 9:30 ఉద. వద్ద డిసెంబర్ 7, 2009

  Srinivas gaaru,

  My apologies on behalf that anonymous guy. I have added the following two lines to my post:

  “అలాగే తెలంగాణా వాదులు కూడా సంయమనం పాటించాలి. ఆంధ్రా మిత్రులను దూషించి అనవసరంగా మన ఉద్యమంపై దురభిప్రాయం కలుగజేయరాదు. మన పోరు కోస్తాంధ్ర పాలకవర్గాలతోనే కానీ కోస్తాంధ్ర ప్రజలతో కాదని గుర్తెరగాలి.”

 10. 10 Suuren 1:00 సా. వద్ద డిసెంబర్ 7, 2009

  ‘స్థానిక నాయకులను నిలదీయడం’ లో మీరు ఎందుకో కాంగ్రెస్ నాయకులపైనే ప్రత్యేక శ్రద్ధ పెడ్తున్నట్టుంది. ఒక్కొక్క టీఆరెస్ ఎమ్మెల్యే ఎన్ని రోజులుగా పదవిలో ఉన్నదీ (ఏ పార్టీ నుంచైనా) ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసిందీ కొంచెం స్టడీ చేసి మరీ ఈ తరిమికొట్టుడు కార్యక్రమం చేస్తే బాగుంటది.


Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

 • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: