మరో సారి జై తెలంగాణ

తెలంగాణ ఉద్యమం గురించి ఇప్పటికీ కొందరు మిత్రులు అవే పాత ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పీ చెప్పీ మా గొంతులు పడిపోతున్నాయి. తెలంగాణా ఎందుకు? ఏమిటి? ఎలా? వంటి ప్రశ్నలకు సమాధానంగా తెలగాణావాదులు చాలా సమాచారం ఇంటర్ నెట్ పైన పెట్టారు. దయచేసి దీన్ని చదవండి. తెలంగాణా ఆకాంక్షకు ఉన్న నేపధ్యం తెలుసుకోండి

Telangana FAQs

http://www.telangana.org/TelanganaFAQ.asp

Fazal Ali Commission Report (First SRC)

https://hridayam.wordpress.com/2007/01/27/first_src_telangana/

Articles About Telangana Movement

http://www.telangana.org/Papers.asp

GO 610

https://hridayam.wordpress.com/2007/06/21/610-reality/
http://discover-telangana.org/wp/2007/06/14/go_610/

Injustice in Irrigation

http://discover-telangana.org/wp/category/books/neellu_nijalu/

Injustice in History

http://discover-telangana.org/wp/category/compilations/reconstruction_of_telangana_history/

Sri Bagh Pact (Rayalaseema people were the first to doubt coastal Andhrites)

https://hridayam.wordpress.com/2007/08/01/sri-bagh-pact/


మరో సారి జై తెలంగాణ

వేలు చివర చిన్నగా కాలితేనే అల్లల్లాడిపోతామే అటువంటిది పెట్రోల్ పోసుకుని నిలువెల్లా దగ్ధం అవుతున్న ఈ యువకులకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం? అగ్ని కీలలు శరీరాన్ని దహించివేస్తుంటే ” జై తెలంగాణా” అనే నినాదం చేసేంత ఆపేక్ష ఎందుకు కలిగింది తెలంగాణాపై? వెయ్యి వోల్టుల కరెంటు తీగలను పట్టుకుని మరీ ప్రాణాలు తీసుకునే ఉద్యమ స్ఫూర్తి ఎలా రగిలిందీ యువకుల్లో?

మనలో చాలా మందికి ఈ యువకులు చేసింది పిచ్చి పని లాగానే కనిపించవచ్చు. వ్యక్తిగత లాభమే పరమావధిగా భావించే ఈ రోజుల్లో ఒక జాతి పోరాటం కొరకు ప్రాణాలే ఇవ్వడం “తెలివిలేని పని” గానే అభివర్ణింపబడవచ్చు.

శ్రీకాంత్ నాకు వ్యక్తిగతంగా తెలియదు. కానీ అతని కుటుంబం నాన్నకు బాగా తెలుసు. మా ఊరికి కొద్ది దూరంలోనే ఉన్న పొడిచేడు గ్రామానికి చెందిన శ్రీకాంత్ చదువుకునే రోజుల్లో మా ఇంటికి కూడా కొన్ని సార్లు వచ్చాడట. మొన్న ఉస్మానియా మార్చురీలో శ్రీకాంత్ మృతదేహం చూస్తుంటే అతన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే హత్య చేసింది అనే భావం కలిగింది.

తెలంగాణా కొరకు బలిదానాలు ఇక్కడి ప్రజలకు కొత్త కాదు. 1969లో 370 మంది నూనుగు మీసాల యువకులను కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం కాల్చి చంపింది. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఒక కొత్త పరిణామం. తెలంగాణా కొరకు తమ ప్రాణాలు తామే తీసుకోవడం మాటల్లో వర్ణించలేని మహోన్నత త్యాగం.

తెలంగాణా సాధన కొరకు ఆత్మార్పణ చేసుకోవాల్సిన అవసరం లేదని యువతరం గ్రహించాలి. బ్రతికి, పోరాడటం గొప్ప కానీ చనిపోవడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. మీ కుటుంబ సభ్యులకు గుండెకోత మిగల్చవద్దు తెలంగాణా బిడ్డలారా.

తెలంగాణా మన జన్మ హక్కు దాన్ని తప్పకుండా సాధించుకుంటాం కానీ దయచేసి ఇలా ప్రాణాలు తీసుకొవద్దు మిత్రులారా!

తెలంగాణా రాష్ట్ర ఉద్యమం ఎవరి స్వార్ధ ప్రయోజనాల కొరకో జరుగుతున్నది కాదు. 50 ఏళ్లుగా సాగుతున్న ప్రజల న్యాయమైన ఆకాంక్ష.

మొదటి ఎస్సార్సీ విస్పష్టంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలని చెప్పినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసింది. ఆంధ్ర రాష్ట్రంతో విలీనానికి తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు తెలంగాణా ప్రాంత నేతలు. ఆ అభ్యంతరాలను తీర్చడానికి ఒక “పెద్ద మనుషుల ఒప్పందం” పునాదిపైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.

ఆ ఒప్పందం పై సంతకాల తడి ఆరకుండానే దాన్ని ఉల్లంఘించడం మొదలైంది. ఉప ముఖ్యమంత్రి పదవి తెలంగాణావారికి ఇవ్వకపోవడం ద్వారా మొదలైన ఆ ఉల్లంఘనలు ఒక దశాబ్దంపైబడి కొనసాగాక 1969లో విద్యార్ధుల ఆధ్వర్యంలో మొదటి తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది.

ఈ ఉద్యమంపై కాంగ్రెస్ ఉక్కుపాదం మోపింది. 370 మంది యువకుల ప్రాణాలను తీసింది అప్పటి బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం. 1971 ఎలెక్షన్స్ లో తెలంగాణాలో ఉన్న 11 సీట్లలో 10 సీట్లు తెలంగాణా ప్రజా సమితి గెలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయలేదు. ప్రజా సమితి నేత చెన్నారెడ్డిని కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం ద్వారా మొదటి తెలంగాణా ఉద్యమాన్ని చల్లార్చింది కాంగ్రెస్.

తెలంగాణా ప్రజలను మభ్యపెట్టడానికి ఆ తరువాత అనేక మోసపూరిత ఎత్తుగడలకు పాల్పడింది “ఆరు సూత్రాల పధకం” అని “610 జివొ” అని…

1990ల్లో మళ్ళీ మొదలైన తెలంగాణా ఉద్యమం 2001లో కే.సీ.ఆర్ నేతృత్వంలోకి వచ్చింది. అప్పటి నుండీ పార్లమెంటరీ పంధాలో శాంతియుతంగా ఉద్యమం నడుపుతున్నది తెలంగాణా రాష్ట్ర సమితి. అయితే 2009 ఎన్నికల్లో తెరాసకు ఒక వింత పరిస్థితి ఎదురైంది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలన్నీ తెలంగాణాకు మద్ధతు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ మా ద్వారానే తెలంగాణ సాధ్యమని ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అవలంబించిన సమైక్యవాదాన్ని పక్కనపెట్టి తెలంగాణా రాష్ట్రానికి సై అంది. కొన్ని రోజులు మొహమాటాలు పడ్డ చిరంజీవి కూడా తామూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కట్టుపడి ఉన్నామని ప్రకటించాడు. మొదటి నుండీ తెలంగాణా ఉద్యమానికి బీజేపీ సపోర్ట్ చేస్తూనే ఉంది. తాజాగా భారత కమ్యూనిస్టు పార్టీ కూడా తెలంగాణాకు అనుకూలంగా తీర్మానం చేసింది .

తెలంగాణాలో మొత్తం 117 సీట్లు ఉంటే అందులో 109 సీట్లు తెలంగాణాకు అనుకూలం అన్న పార్టీలే గెలిచాయి. కానీ కేవలం తెరాసకు వచ్చిన సీట్లే చూపి తెలంగాణా వాదం బలహీనపడింది అనే వాదన కొందరు మొదలుపెట్టారు.

గత నెల 29నాడు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కే.సీ.ఆర్ ను ప్రభుత్వం అరెస్టు చేయడంతో ఒక్కసారిగా తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది.

ఈసారి ఉద్యమంలో ఒక గుణనాత్మక మార్పు వచ్చింది. విద్యార్ధులు, , సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో ఉద్యమంలోకి వచ్చారు. రోజు రోజుకూ తెలంగాణాలో ఈ ఉద్యమానికి ప్రజా మద్ధతు పెరుగుతోంది.

తెలంగాణాలోని అన్ని యూనివర్సిటీల, కాలేజీల విద్యార్ధులు ధర్నాలు, నిరసనలు మొదలుపెట్టారు. 10 జిల్లాల్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు చెందిన ప్రజలు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ABVP, TRSV, NSUI, AISF, AIYF, PDSU, TNSF ఇంకా అనేక విద్యార్ధి సంఘాలు, వివిధ కార్మిక సంఘాలు, లాయర్లు, డాక్టర్లు, జర్నలిస్టులు, ఆటో డ్రైవర్లు, సింగరేణి కార్మికులు, తాపీ మేస్త్రీలు, ఇలా అన్ని వర్గాల ప్రజలు రోడ్లమీదికి వచ్చి రాష్ట్ర సాధన కొరకు నినదిస్తున్నారు.

ఇదిలా ఉంటే శ్రీ కాంత్ ఆత్మాహుతితో మొదలైన యువకుల బలిదానాలు రోజు రోజుకూ ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 12 మంది యువకులు ఆత్మత్యాగం చేశారు.

ఒక వైపు కే.సి.ఆర్. ఆరోగ్యం క్షీణిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నాడు. రోశయ్య నా చేతిలో ఏమీ లేదు డిల్లీని అడగండి అంటే అక్కడ వీరప్ప మొయిలీ మాత్రం “తెలంగాణా గురించి రోశయ్యనే అడగండి” అనడం కాంగ్రెస్ దుర్మార్గపు వైఖరికి నిదర్శనం.మొన్న ఎన్నికల్లో జై తెలంగాణ అని ఓట్లు దండుకున్న తెలుగుదేశం ఇప్పుడు అవకాశవాద మౌనాన్ని పాటిస్తోంది. ఈ ద్వంద్వ ప్రవృత్తిని ఎండగట్టేందుకు ఇప్పటికే తెలంగాణా కాంగ్రెస్, తెదెపాల ఎమ్మెల్యేల ఇళ్లు కూడా ముట్టడిస్తున్నారు తెలంగాణావాదులు .

తెలంగాణాలో కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో బట్టలు ఉతకము అని రజకులు, జుట్టు కత్తిరించము అని నాయీ బ్రాహ్మణులు, మాంసం అమ్మమని అరె కటిక సంఘం నిర్ణయించాయి. ఆఖరికి మీ ఇళ్లలో ఎవరైనా చనిపోతే మేము అంత్యక్రియలకు కూడా పని చేయమని కాటి కాపరుల సంఘం తీర్మానించింది.

ప్రభుత్వ నిష్క్రియాపరత్వంతో కడుపుమండిన ఆందోళనకారులు అటు ప్రభుత్వ ఇటు ప్రైవేటు ఆస్థులకు పెద్ద ఎత్తున నష్టం కలిగిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. కొంతమంది మిత్రులు అనుకుంటున్నట్టు ఈ విధ్వంసం తెలంగాణావాదులెవరూ పధకం ప్రకారం చేయట్లేదు. మొన్న శ్రీకాంత్ అంతిమ యాత్రలో స్వయంగా పాల్గొన్న నేను తెరాస నాయకులు హరీశ్ రావు, కేటీఆర్ కార్యకర్తలను ప్రశాంతంగా ఉండమని వేడుకోవడం ప్రత్యక్షంగా చూశాను. తెలంగాణా కొరకు ఆత్మ బలిదానం చేసిన యువకుడి భౌతికకాయంతో ఊరేగింపుగా నగర వీధుల్లో వెళ్తున్న తెలంగాణావాదులు ఒక్క చిన్న హింసాత్మక సంఘటనకు కూడా పాల్పడలేదు. ఉద్యమంలో చెలరేగుతున్న విధ్వంసం ఎక్కడికక్కడ ఆవేశాలకు లోనవుతున్న ప్రజానీకం చేస్తున్నదే కానీ దాని వెనుకు తెరాసకానీ మరో పార్టీ కానీ లేదు.

తెలంగాణాలో ప్రభుత్వ ఆస్థులను ధ్వంసం చేయడం ద్వారా మన కళ్లను మనమే పొడుచుకున్నట్టు అవుతుంది. రేపు తెలంగాణా ఏర్పడ్డాక ఈ ప్రభుత్వ ఆస్థులను మళ్ళీ సమకూర్చుకోవడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని.

ఇక ప్రైవేటు ఆస్థులకు నష్టం కలిగించడం అస్సలు చేయకూడని పని. ఎనిమిదేళ్ళుగా ప్రశాంతంగా జరుగుతున్న మలిదశ తెలంగాణా ఉద్యమం ఇప్పుడు ఇలా హింసాత్మకంగా మారడం అస్సలు సమర్ధనీయం కాదు. మన పోరు ఆంధ్రా పాలక వర్గాలపైనే కానీ ఆంధ్రా నుంచి బ్రతకవచ్చిన సామాన్య ప్రజలపై కాదని గుర్తుంచుకోవాలి. ఉద్యమం హింసాత్మకంగా మారితే ప్రభుత్వానికి అది వరంగా మారుతుంది. కాబట్టి ఆందోళనకారులు వెంటనే హింసకు స్వస్తి చెప్పాలి. శాంతియుతంగా తెలంగాణా సాధించుకునేందుకు మనకు మార్గాలు మూసుకుపోలేదని గ్రహించాలి.

తెలంగాణా రాష్ట్ర ఉద్యమం ఈ స్థాయికి చేరకుండా ఆపే అవకాశాలు గత ఆరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేకసార్లు వచ్చినా కావాలనే ఈ సమస్యను నిర్ల్యక్షం చేశారు కాంగ్రెస్ నాయకులు.

కృష్ణా, గోదావరి జలాల పంపకాల్లో అసమానత ఉందని నెత్తీ నోరూ బాదుకుంటుంటే కృష్ణా జలాలను రాయలసీమకు తరలించేందుకు పోతిరెడ్డిపాడును వెడల్పు చేశాడు వైయెస్సార్. ఒక దశలోనైతే జేసీ దివాకర రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలు పులివెందులకు ఇచ్చాకనే తెలంగాణాను ఏర్పాటు చేస్తామనే అహంకారపు మాటలు అన్నాడు. పులివెందుల కృష్ణా బేసిన్లో లేనే లేదు దానికి కూడా కృష్ణా జలాలు ఇవ్వడం అంటే తెలంగాణా ప్రజలను అపహాస్యం చేయడమే. పులిచింతల కట్టడం కన్నా ముందు తెలంగాణాకు మేలుచేకూర్చే నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ కట్టమని తెలంగాణా వాదులు విన్నవించుకుంటే వైయెస్సార్ ప్రభుత్వం మాత్రం మొండిగా పులిచింతల కట్టడం ప్రారంభించింది. గోదావరి జలాలు అందక తెలంగాణా భూములు బీడుగా మారుతుంటే డెల్టాకు మూడో పంట అందించేందుకు పోలవరం కట్టడం ప్రారంభించింది కాంగ్రెస్ సర్కార్.

ఇక్కడ దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును టెస్టింగ్ కొరకు రెండు రోజులు మోటార్లు నడిపితే గోదావరి డెల్టా రైతులు ఆందోళనకు దిగారు.

తెలంగాణాలో మొదలు పెట్టిన భారీ ఎత్తిపోతల పధకాల్లో ఒక్కటి కూడా ప్రారంభించలేదు. ఇవి కేవలం కాంట్రాక్టర్లకు కాసులు కురిపించేందుకే పనికివస్తున్నాయి.

610 జీవో అమలు నత్తనడకన నడుస్తోంది. ఇలా తెలంగాణా ప్రజల న్యాయమైన డిమాండ్లను అపహాస్యం చేస్తూ సాగింది కాంగ్రెస్ పాలన.

ఒకేసారి మొదలైన కడప, నల్లగొండ యూనివర్సిటీలను చూస్తే అర్థం అవుతుంది తెలంగాణా పట్ల వివక్ష ఎంత దారుణంగా కొనసాగుతుందో. ఓ వైపు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి కనీస మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతుంటే అక్కడ కడప లోని యోగి వేమన యూనివర్సిటీకి అన్ని హంగులూ సమకూరాయి.

తెరాసను విచ్చిన్నం చేయడానికి చేసిన కృషిలో కొంతైనా తెలంగాణా ప్రజల ఆకాంక్షలను నిజం చేయడంలో పెట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. కే.సీ.ఆర్ ఉద్యమపధంలో కొన్ని లోపాలు జరిగి ఉండవచ్చు కానీ తెలంగాణా ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకు వచ్చింది మాత్రం నిస్సందేహంగా ఆయనే. కరడుగట్టిన సమైక్యవాదులైన తెలుగుదేశం, సి.పి.ఐ. లను “జై తెలంగాణా” అనిపించగలిగినవాడు కే.సి.ఆర్ మాత్రమే.

ఇవాళ తెలంగాణా ఉద్యమం కే.సి.ఆర్. స్థాయిని కూడా దాటిపోయింది. విద్యార్ధులు, ప్రజలు ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. కాబట్టి ఇక తక్షణమే తెలంగాణా రాష్ట్రం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది.

ప్రకటనలు

3 Responses to “మరో సారి జై తెలంగాణ”


 1. 1 sarath 12:21 సా. వద్ద డిసెంబర్ 6, 2009

  Dileep,
  Thanks for publishing the links. I have been thinking of doing the same after reading some silly comments about the current agitation in the blog sphere. All the material and facts have been there since a long time and I thought respected bloggers might have spent some time going through them rather than busy publishing posts casting baseless allegations.
  Chava

 2. 2 నాగార్జున ప్రతాపనెని 5:42 సా. వద్ద డిసెంబర్ 6, 2009

  chalaa bagundhi sir mee visleshana…….meerannattu eppudu udyamam TRS chetullo ledhu tealngana prajala chethillo vundhi..ekanina mana telangana manaki kavali………jai telangana

 3. 3 rahamthulla 4:46 సా. వద్ద జనవరి 8, 2010

  ముస్లిం ఫోరమ్ ఫర్ తెలంగాణా వాదనలుః

  * మజ్లిస్ పార్టీ ఒక్కటే తెలంగాణా ముస్లిములకు ప్రతినిధి కాదు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ముస్లిములకు భద్రత ఉండదని మజ్లిస్ పార్టీ చేసే వాదన నిజంకాదు.అలాగైతే తెలంగాణా లోని మిగతా జిల్లాల ముస్లిములు తెలంగాణా కావాలని ఉద్యమాలు ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు?సమైక్య రాష్ట్రంలో ముస్లిములకు వచ్చిన 4% రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణాలో పెరిగే అవకాశం ఉంటుంది.తెలంగాణా ఏర్పడితే ముస్లిములకు ఉద్యోగాలు,పదవులు జనాభా దామాషాలో పెరుగుతాయి.ఇక్కడ 224 ఏళ్లుగా ఉర్దూ అధికార భాషగా ఉంది.ప్రభుత్వ అధికారిక లావాదేవీలు ఉర్దూ భాషలోనే జరిగేవి.ఉర్దూ స్థానిక ప్రజాభాష కాబట్టి మళ్ళీ ఉర్దూకు మంచి ఆదరణ పూర్వ వైభవం వస్తుంది.గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జైళ్లలో మగ్గుతున్న వేలాదిమంది ముస్లిం యువకులు తిరిగి వచ్చి ఇక్కడే ఉద్యోగాలు,వ్యాపారాలు సంపాదించుకుంటారు.హైదరాబాద్‌ చుట్టూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించిన వేలాది ఎకరాల వక్ఫ్‌ భూములు,ముస్లిం ఆస్తులు విడిపించి పేదముస్లిములకోసం వినియోగించవచ్చు.ఇరుకు సందుల్లో పాతబస్తీల్లో దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్నముస్లింలను ఫుట్‌పాత్‌లపైనుండి సొంత గృహాల్లోకి తేవచ్చు.విద్యావంతులైన ముస్లిములు రౌడీషీటర్లు, ఐఎస్‌ఐ ఏజెంట్లు లాంటి నిందలు తొలగించుకొని బాధ్యతాయుతమైన తెలంగాణా సోదరులందరితో సమాన అవకాశాలు సాధిస్తారు.


Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

 • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: