ఏమీ చేయలేరని ఎగిరిపడకు నేస్తం

I may disapprove of what you say, but I will defend to the death your right to say it – Voltaire

తెలుగు బ్లాగుల్లో వివాదాలు కొత్తకాదు. అవి ఉండకూడదనీ కాదు. కానీ ఇటీవల కొందరు బ్లాగర్ల ప్రవర్తన గమనించిన తరువాత ఈ రెండు ముక్కలు రాయాలనిపించింది.

సహజంగానే కులం, వర్గం, ప్రాంతం, మతం వంటి విషయాల గురించి చర్చలు చాలా త్వరగా వేడెక్కిపోతాయి. ఇటువంటి చర్చలు పరస్పర దూషణల దాకా వెళ్లడం ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైంది. ముఖాముఖి జరిగే చర్చల్లో కన్నా ఇంటర్నెట్ లో మనుషులను అపార్ధం చేసుకునే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి అపార్ధాలే చివరికి చిలికిచిలికి గాలివానలు అవుతున్నాయి.

కత్తి మహేశ్ కుమార్ పై ఇటీవల ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేసిన భాస్కర్ రామరాజు అనే వ్యక్తి చాలా విద్యాధికుడు. మంచి బ్లాగులు రాస్తాడు. మహేశ్ రాసిన విషయాలపై ఆయనకు అభ్యంతరం ఉంటే దాన్ని వ్యాఖ్యల ద్వారా, బ్లాగ్ పోస్టుల ద్వారా వ్యతిరేకించే స్వేచ్చ రామరాజు గారికి ఉంది. ఒకవేళ మహేశ్ ఏదైనా అభ్యంతరకరమైన రాతలురాస్తే అతనిపై చట్టపరంగా చర్య తీసుకునే అవకాశమూ ఉంది.

కానీ రామరాజు గారు చేసిందేమిటి?

మహేశ్ పై వ్యక్తిగత ద్వేషం పెంచుకుని అతన్ని దళితుడని కులంపేరుతో హేళన చేయడం అమానుషం.

రామరాజు చేసిన పనిని ఖండించకుండా మహేశ్ పై విరుచుకుపడుతున్న బ్లాగు మిత్రులు ఒక విషయం పూర్తిగా మర్చిపోయినట్టు కనపడుతుంది.

రామరాజు కేవలం మహేశ్ పై అవమానకర వ్యాఖ్య చేసి ఊరుకోలేదు. అతను వేరే బ్లాగుల్లో మహేశ్ పేరుమీద కామెంట్లు రాయడం మొదలు పెట్టాడు ఈ మధ్య.

ఇలా వేరొకరి పేరు వాడుకుని కామెంట్లు చేయడం అత్యంత నీచమైన పని. స్వంతపేరు రాయకుండా అనామక కామెంట్లు రాస్తే కూడా సహించవచ్చు కానీ వేరే బ్లాగర్ పేరును దొంగతనంగా వాడుకున్న రామరాజు భాస్కర్ చేసింది నైతికంగానే కాదు చట్టప్రకారం కూడా తప్పే. అటువంటి వ్యక్తిని వెనకేసుకు వచ్చే బ్లాగర్లను ఏమనాలి?

మహేశ్ కు వ్యతిరేకంగా బ్లాగు పోస్టులు వేస్తున్న వారందరూ ఒకటి గుర్తుంచుకోవాలి. మహేశ్ అభిప్రాయాలతో మనం ఏకీభవించకపోవచ్చు, కానీ ఆ అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్చ అతనికి ఉందని గుర్తుంచుకోవాలి. ఒకవేళ అతను రాసేది నచ్చకపోతే అతన్ని తప్పకుండా నిలదీయొచ్చు, వాదించొచ్చు కానీ దొంగ పేర్లతో దాడులు చేయడం ఏం సంస్కృతి?

ఇక ఒకరిద్దరు బ్లాగర్లు అయితే “IP అడ్రస్ పట్టుకుని నువ్వేమీ చేయలేవు” అని కూడా మహేశ్ పై జోకులు విసురుతున్నారు.

సిగ్గుపడాలి మీరంతా.

తప్పు జరిగిందని తెలిసీ బాధితుడిని ‘నువ్వేమీ చేయలేవు’ అని గేలిచేస్తున్నందుకు.

ఇంటర్నెట్ లో మనకు anonymity ఉంటుందని, మారుపేర్లతో మనం ఏం చేసినా చెల్లుతుందని చాలామంది అమాయకంగా అనుకుంటుంటారు. కంప్యూటర్ల గురించి ఏమీ తెలియని వారేకాక సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న వారు కూడా ఇలా అనుకోవడమే విషాదం.

మనదేశంలో సైబర్ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి ఇప్పుడు. గత యేడాది సోనియా గాంధీ గురించి ఆర్కుట్ లో కామెంట్ రాసినందుకు జైలు పాలైన రాహుల్ వైద్ కేసు వివరాలు చూస్తే రెండు విషయాలు అర్థం అవుతాయి మనకు.

ఒకటి మన పోలీసులు సైబర్ నేరాలను పరిష్కరించే సత్తా కలిగి ఉన్నారు.

రెండు ఆర్కుట్, ఫేస్ బుక్, వర్డ్ ప్రెస్, బ్లాగర్, యాహూ, గూగుల్ …ఇలా మీరు ఏ సర్వీస్ వాడి తప్పుచేసినా సదరు కంపెనీ మన పుట్టుపూర్వోత్తరాలన్నీ పోలీసు వారికి చక్కగా అప్పజెప్పుతుంది.

కాబట్టి మిత్రులారా, మన పోలీసులు ఏమీచేయలేరనో, లేక ఇంటర్ నెట్ లో మనం Anonymous గా ఉన్నామనో ఏదిపడితే అది రాయకండి. మీరు ఇంటర్ నెట్ లో చేసే ప్రతిపనినీ ఏదో ఒక వ్యవస్థ రికార్డు చేస్తూనే ఉంటుందని, అవసరమైనప్పుడు తీగ లాగితే డొంకంతా కదులుతుందని మరువకండి. మారుపేర్లతో (ఇతరులను కించపరిచే) బ్లాగులు నడిపిస్తే మాడుపగులుతుందని గుర్తుంచుకోండి.

చివరగా ఒక మాట. మహేశ్ పై ఒంటికాలి మీద లేస్తున్న వారంతా గుర్తుంచుకోవాల్సిన సంగతి ఒకటుంది. మహేశ్ తన బ్లాగులో రాస్తున్న అనేక విషయాలు ఆయన ఇవ్వాళ కొత్తగా కనుక్కున్న విషయాలేమీ కావు. అవి గత కొన్ని దశాబ్దాలుగా విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న విషయాలే. గొప్ప గొప్ప మనుషులు చెప్పిన మాటలే అవి. అలాంటి విషయాలు రాస్తున్నందుకు మహేశ్ పై విషం కక్కడం వల్ల ఏ ప్రయోజనమూ సిద్ధించదు.

ప్రశ్నించే మనిషిని మనం చంపేయగలమేమో కానీ ప్రశ్న మాత్రం సజీవంగానే ఉంటుందని గుర్తుంచుకోండి.

—–

ఫిబ్రవరిలో చదువరి బ్లాగుల్లో దొంగలు పడ్డారంటూ రాసిన పోస్టు చదివారా?

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: