వినాయక్ సేన్ విడుదల

Binayak-sen

Photo By: STRDEL/AFP/Getty Images

హక్కుల ఉద్యమకారుడు, చిన్న పిల్లల డాక్టర్ వినాయక్ సేన్ కు నిన్న సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ జైల్లో గత రెండేళ్లుగా మగ్గుతున్న ఈ గొప్ప మనిషి ఎట్టకేలకు స్వేచ్చా వాయువులు పీల్చగలిగాడు.

ఎటువంటి జవాబుదారీతనం లేకుండా, రూల్ ఆఫ్ లా ను తానే అతిక్రమించే రాజ్యం ఎంత దుర్మార్గంగా ప్రవర్తించగలదో వినాయక్ సేన్ ఉదంతం నిరూపిస్తుంది. ఈ దేశంలో న్యాయ, చట్ట వ్యవస్థలు కేవలం బలహీనులనూ, వారి పక్షాన ఉన్నవారినీ వేధించడానికి మాత్రమే పనికి వస్తాయని వినాయక్ సేన్ ను రెండేళ్లు బంధించి మరో సారి నిర్లజ్జగా చాటుకుంది మన భారత ప్రభుత్వం.

తనతో పాటు వైద్య విద్య నభ్యసించిన వారు విదేశాలు ఎగిరివెళ్లి కోట్లు గడించాలని అలోచించే సమయంలో చత్తీస్ గఢ్ లోని ఒక మారుమూల ప్రాంతంలో అభాగ్యులకు సేవచేయాలనుకోవడమే ఆ డాక్టర్ సాబ్ చేసిన పెద్ద తప్పు. చత్తీస్ గఢ్ లో మృగ్యమవుతున్న పౌరహక్కుల గురించి సేన్ పోరాటం చేయడం సహజంగానే అక్కడి బీజేపీ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. మావోయిస్టుల ఏరివేతకొరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హంతక ముఠా “సాల్వాజుడుం” సాగిస్తున్న అరాచకాలపై వినాయక్ సేన్ గళమెత్తడంతో ఆయన నోరును శాశ్వతంగా మూసేసేందుకు ఓ తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారు చత్తీస్ గఢ్ పోలీసులు.

నారాయణ సన్యాల్ అనే నక్సలైట్ నేతకు కొరియర్ గా పనిచేశాడనే కేసు ఆయనపై బనాయించారు. పోలీసులు నమోదు చేసిన కేసులోని లొసుగులను మీడియా ఎత్తిచూపినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హక్కుల ఉద్యమకారులు ఎంత ఆందోళన చేసినా చత్తీస్ గఢ్ ప్రభుత్వం ప్రతిస్పంధించలేదు. మనం రాసుకున్న చట్టాల ప్రకారమే వినాయక్ సేన్ కు బెయిల్ రావాల్సి ఉన్నా ప్రభుత్వం దాన్ని అడ్డుకుంది. రెండు దశాబ్దాలకు పైబడి ప్రజాజీవితంలో ఉంటున్న వినాయక్ సేన్ ను కరడుగట్టిన నేరస్థుల కన్నా ఘోరంగా చూసింది.

సేన్ ను విడుదల చేయాలని జరిగిన ఆందోళనల్లో ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతి గ్రహీతలు, కళాకారులు, రచయితలూ, హక్కుల ఉద్యమకారులూ పాల్గొన్నారు. ఆయనను అరెస్టు చేసిన ఏడు నెలలకు ఇండియన్ అకాడెమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ వినాయక్ సేన్ కు ఆర్. ఆర్. కీతన్ గోల్డ్ మెడల్ ను ప్రధానం చేసింది. గత ఏడాది జైలులో ఉండగానే ఆయనకు ప్రపంచ ప్రఖ్యాత జోనాధన్ మన్ అవార్డ్ కూడా లభించింది.

అసలు చత్తీస్ గఢ్ లో ఇప్పుడు “శాంతిని నెలకొల్పేందుకు” జరుగుతున్న ప్రయత్నాలకు అసలు కారణం వేరే ఉంది. ఏ దండకారణ్యంలోనయితే దుర్భర దారిద్ర్యంలో ఆదివాసులు మగ్గుతున్నారో అదే దండకారణ్యపు గర్భంలో అపార ఖనిజరాశులు దాగి ఉన్నాయి. వాటిపై పోస్కో, వేదాంత, టాటా, మిట్టల్, జిందాల్ వంటి స్వదేశీ, విదేశీ కంపెనీల కళ్లు పడ్డాయి. ఆ కంపెనీల దోపిడీకి అడ్డుగా నిలిచింది కేవలం మావోయిస్టులే. కాబట్టే ఇప్పుడక్కడ శ్మశాన శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉవ్విళ్లూరుతున్నాయి.

మన దేశపు యువతకు క్రికెటర్ ధోనీ తెలిసినంతగా వినాయక్ సేన్ ఎవరో తెలియక పోవచ్చు. వెల్లూర్ కాలేజీలో వైద్య విద్యనభ్యసించిన ఈ డాక్టర్ సాబ్ చత్తీస్ గఢ్ అడవుల్లో ఆదివాసీలకు దేవునిగా ఎలా మారాడో, ఇలాంటి మనిషిని అక్కడి ప్రభుత్వం ఒక నల్ల చట్టం కింద అరెస్టు చేసి రెండేళ్లు చీకటి కొట్టులో ఎందుకు బంధించిందో తెలుసుకునే తీరిక IPL మత్తునించి ఇంకా తేరుకోని జెనరేషన్ కు అవసరం అనిపించకపోవచ్చు. కానీ మనకు తెలియకుండానే ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలు ఎలా పతనమవుతున్నాయో, పైకి “ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం” అని పేరుతెచ్చుకున్న దేశంలో పాలకులు అనుసరిస్తున్న కౄర నిర్బంధం అసలు స్వరూపమేమిటో తెలియాలంటే మనం వినాయక్ సేన్ గురించి తెలుసుకోవాలి. ఈరోజు వాళ్ళు వినాయక్ సేన్ కొరకు వచ్చారు అని మనం మౌనంగా ఉంటే రేపు మన వంతే కావచ్చని మరువరాదు.

వినాయక్ సేన్ గురించి మరింత సమాచారం కొరకు చూడండి:

http://www.binayaksen.net/

http://www.tehelka.com/story_main37.asp?filename=Ne230208The_Doctor.asp

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: