గడ్డిపరకతో విప్లవం

వేళ్లు వెతుక్కుంటున్న మనుషులు అంటూ బ్లాగు మొదలుపెట్టిన కొత్తలో నేనో పోస్టు చేశాను. పది మందీ నడిచే దారిలో నడవకుండా సమాజానికి ఉపయోగపడే కొత్త దారులు వేసే గొప్ప మనుషుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉన్నత విద్యను అభ్యసించి కూడా వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టి రైతులోకానికి ఎంతో మేలు చేస్తున్న కొందరు గొప్ప మనుషుల గురించి మొన్న ఈనాడు ఆదివారంలో ఒక వ్యాసం వచ్చింది. ఈ వ్యాసాన్ని మీరందరూ తప్పక చదవాలి.

ఇందులో పేర్కొన్న వారిలో గొర్రెపాటి నరేంద్రనాధ్ గారిని నేను నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ లో విద్యుత్ చార్జీల గురించి జరిగిన ఒక సెమినార్ లో కలిశాను. వారు ఇటీవలే “ఇట్లు ఒక రైతు” అనే పేరుతో తమ ఆత్మకథను వెలువరించారు. రెండు వారాల క్రితమే ఆ పుస్తకాన్ని చదివాను.

ఇక డక్కన్ డెవలప్ మెంట్ సొసైటి సతీష్ గారు జహీరాబాద్ లో సాంప్రదాయ పంటల పరిరక్షణ కొరకు చేస్తున్న కృషి గురించి, ఇటీవలే వారు నెలకొల్పిన “సంఘం రేడియో” స్టేషన్ గురించీ ఎన్నో సార్లు చదివాను. మొన్ననే ఉప్పలపాటి ప్రశాంతి DDS గురించి ఒక చక్కని ఆర్టికల్ పంపించారు.

గొరిపర్తి లక్ష్మీ నరసిమ్హ రాజు యాదవ్ గారు పండించిన పంటల గురించీ, వ్యవసాయంలో ఆయన సాధించిన రికార్డుల గురించీ నా చిన్ననాటి నుండీ “అన్నదాత” పత్రికలో చదువుతూనే ఉన్నాను.

ఈనాడు లో వచ్చిన వ్యాసం కింద చదవండి:

gaddiparaka-title

ఆ ఐదుగురూ ఉద్యోగాలు వద్దనుకున్నారు. సంపాదన కాదనుకున్నారు. పట్టాలు పక్కనపెట్టారు. మట్టిమీద మమకారంతో, పంట మీద ప్రేమతో రైతన్నలుగా మారిపోయారు. ఆ శ్రమజీవుల అనుభవాల పంట…

పరాకుగా చూస్తే ఇది ఎలాంటి ప్రత్యేకతలూ లేని మామూలు గడ్డిపరక. గాలికెగిరిపోయేంత దుర్బలమైన గడ్డిపరక. కానీ, దీని శక్తి ఏపాటిదో నాకు తెలుసు. ఏదో ఒకరోజు ఈ గడ్డిపరకతోనే విప్లవం మొదలవుతుంది. – మసనోబు ఫుకుఓకా

farmer2

* * *

నరేన్‌, రాజు, కిషన్‌, సతీష్‌, రత్నం ఈ ఐదుగురికీ…గడ్డిపరక-పరమాద్భుత సృష్టిలా కనబడింది. ముట్టుకుని మురిసిపోవాలనిపించింది. ముద్దుపెట్టుకుని పరవశించాలనిపించింది. రెండుచేతులూ ఛత్రిలా ఎత్తిపట్టి మండుటెండల నుంచి గాలీవానల నుంచి కాపాడుకోవాలనిపించింది.ఏ చిడపీడల చూపూ పడకుండా కళ్లతో కంచె వెయ్యాలనిపించింది. అద్భుత శక్తులుగనకుంటే, ఆ బక్కపలచ గడ్డిపోచకు సృష్టిలోని శక్తినంతా ధారపోయాలనిపించింది. …

ఇలా ఒక్కోచోట ఒక్కొక్కరు, ఒక్కో సమయంలో ఒక్కొక్కరు, ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు గడ్డిపరకతో ప్రేమలో పడ్డారు. సేద్యం అన్న మాటే వాళ్లకి, ఏ గాంధర్వ వాద్యంలాగానో వినబడింది. ఆ మట్టికి చేతులెత్తి మొక్కాలన్నంత భక్తి పుట్టుకొచ్చింది. పచ్చదనమే అసలు ధనమన్న నిర్ణయానికొచ్చారు. ఆ ప్రేమే ఐదుగురినీ ఇక్కడికి చేర్చింది. ఈ కథలో హీరోల్ని చేసింది. ప్రేమంటే అల్లాటప్పా ప్రేమ కాదు. పట్టాల్నీ పట్టణవాసపు సౌఖ్యాల్నీ పక్కనపెట్టేంత నిఖార్సైన ప్రేమ. లక్షణమైన ఉద్యోగాల్ని క్షణం కూడా ఆలోచించకుండా వదిలేసుకునేంత అవ్యాజమైన ప్రేమ. ఉన్నదంతా మట్టిపాలైనా, ఆ మట్టిలోంచే అద్భుతాలు పండించాలనుకునే ఆశావాద ప్రేమ. లోకమంతా ఏకమై నవ్వినప్పుడు కూడా, నాపచేను పండుతుంది కాచుకోండనే జగమొండి ప్రేమ. మట్టిలో పరమాన్నపు రుచిని కనుగొన్న ప్రకృతిప్రేమ. ఆ బురద గంధాన్ని ఒళ్లంతా పూసుకుని మురిసిపోయే అమలిన ప్రేమ. గొడ్ల చావడి పక్కన, ఎండుగడ్డి పరుపుమీద ఆదమరిచి నిద్రపోయేంత ప్రగాఢమైన ప్రేమ.

చుట్టూ ఉన్న ఆకలి, చుట్టేస్తున్న కాలుష్యం, చేవ తగ్గిన పంటలు, ధరల మంటలు…

అన్నిటికీ ఒకే పరిష్కారం.

గడ్డిపరకే సమాధానం! …అని మట్టిసాక్షిగా చెప్పగల తిరుగులేని ప్రేమ. అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ భావాల విత్తులు ఎప్పుడు వెులకెత్తాయో, ఎలా మొక్కలయ్యాయో, ఎన్ని ఆటుపోట్లకు తట్టుకుని చెట్టంతయ్యాయో మీరే చదవండి…

ఉద్యమాల రైతు

‘వన్‌ స్ట్రా రెవల్యూషన్‌’…

అనువదిస్తే ‘గడ్డిపరకతో విప్లవం!’

ఎక్కడో జపాన్‌లో ఫుకుఓకా అనే వ్యవసాయ తాత్వికుడు తనకై తాను సృష్టించుకున్న పచ్చాపచ్చని ప్రపంచం గురించి చదువుతుంటే, గొర్రెపాటి నరేంద్రనాథ్‌ మనసు పులకించింది. ఆ సేద్యంలో రసాయనాల దుర్వాసనల్లేవు. నాగేటి చారల్లేవు. నీటి నిల్వల్లేవు. ప్రకృతి మెడలు వంచే వ్యవసాయం కాదది. ప్రకృతి మెడచుట్టూ చేతులేసి, ప్రేమిస్తూ చేసే వ్యవసాయం. సేద్యమంటే అదీ అనిపించింది! అంతే, మనసు సొంతూరి మీదికి మళ్లింది. సహచరి ఉమాశంకరితో కలిసి చిత్తూరు జిల్లాలోని వెంకట్రామాపురానికి బయల్దేరారు.

gorrepati-narendranath

ఆ జంట స్వేచ్ఛాయాత్రలో ఇది మరో మలుపు. గతంలోనే ఒకట్రెండు మజిలీలు దాటారు. ఇద్దరూ ఢిల్లీ యూనివర్సిటీలో సహపాఠీలు. సోషియాలజీలో పీజీ చేశారు. ఆ తర్వాత ఆమె డాక్టరేట్‌ చేశారు. ఆయన బ్యాంకు ఉద్యోగంలో చేరారు. ఎందుకో ఆ కొలువు ఇరుకిరుకుగా అనిపించింది నరేంద్రనాథ్‌కి. తనదారి అదికాదని అర్థమైంది. సరిగ్గా ఆ సమయానికి ప్రొఫెసర్‌ రజినీ కొఠారీ, ధీరూభాయ్‌ షేట్‌, గిరీ దేసింగ్‌కర్‌, అషిస్‌నంది, క్లాడ్‌ అల్వారిస్‌ లాంటి మేధావులంతా…పెట్టుబడిదారి ‘అభివృద్ధి’ నమూనాకీ కమ్యూనిస్టు దృక్పథానికీ మధ్యేమార్గంగా…లేదంటే, వాటికి అతీతంగా గాంధేయమార్గంలో ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టే పన్లో ఉన్నారు. ‘లోకాయన్‌’ వాళ్ల సంస్థ. నరేన్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ బృందంలో చేరిపోయారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం పోరాడారు. పౌరహక్కుల ఉద్యమాల్లో పాల్గొన్నారు. కానీ ఎక్కడో నిరాశ. చేసేది తక్కువ. ఉపన్యాసాలు ఎక్కువ. అదే ఆయనకు నచ్చలేదు. నరేన్‌ చేతల్ని ఇష్టపడే మనిషి. అప్పుడే ఫుకుఓకా పుస్తకం చదివారు. ఆ వ్యవసాయ జీవనశైలి ఎంతగా ప్రభావితం చేసిందంటే, వెంకట్రామాపురానికి బయల్దేరే దాకా మనసు మనసులో లేదు.

వెళ్లాక, అదో ప్రపంచం.అతనికి సేద్యం కొత్త. అన్నీ ప్రయోగాలే. ఉమాశంకరికి పల్లెజీవితం మరీ కొత్త. భాష కూడా కొత్తే. ఆమె పుట్టింటివారు తమిళులు. ఇద్దరూ వ్యవసాయ జీవితానికి అలవాటుపడేలోపు కరవ్చొంది. అదీ మామూలు కరవు కాదు. ఏలిననాటి శనిలాంటి, ఏడేళ్ల కరవు. హైదరాబాద్‌లో ఆస్తిపాస్తులు అమ్మగా వచ్చినడబ్బంతా సేద్యంలో కరిగిపోయింది. లెక్కతీస్తే రెండు లక్షల అప్పు మిగిలింది. ముప్ఫైరెండు ఎకరాల సేద్యం మిగిల్చిందేం లేదు. భారతీయ రైతులందర్నీ పీడిస్తున్న సమస్యలే ఆయన్నీ ఇబ్బంది పెట్టాయి. అయినా నరేన్‌ వెనక్కితగ్గలేదు. సేంద్రియ పద్ధతుల్లో చాలా ప్రయోగాలు చేశారు. ఎక్కడ ఏ రైతు పర్యావరణ ప్రియమైన పద్ధతులు పాటిస్తున్నారని తెలిసినా అక్కడికెళ్లొచ్చారు. తన పొలంలో పాటించి చూశారు. మామిడి పంట తీశారు. వరి పండించారు. చెరకు పండించారు. బెల్లం ఆడించారు. శ్రీ పద్ధతిలో వ్యవసాయం చేశారు. రాబడి దిగుబడులకంటే, రైతు జీవితమే ఆయనకెక్కువ ఆనందాన్నిచ్చింది.

ఆయన దృష్టిలో వ్యవసాయమంటే పంటలూ దిగుబడీ ఒక్కటే కాదు. పల్లెలు, గ్రామీణ జీవితం, అట్టడుగు ప్రజలు, వాళ్ల హక్కులు, బాధలూ బాధ్యతలూ అన్నీ. ముందుగా ఆయన అంటరానితనం మీద పోరాటం ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలతో భావసారూప్యం ఉన్న వ్యక్తులతో కలిసి పాదయాత్రలు చేశారు. 630 కిలోమీటర్లు తిరిగి, 250 పల్లెల్లో అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

పొలం దళితులకు ఆర్థికంగా అండనిస్తుంది. సామాజికంగా హోదానిస్తుంది. అందుకే నరేన్‌ బృందం భూసంస్కరణల మీద దృష్టిపెట్టింది. ఐదేళ్లలో దాదాపు ఆరువేల ఎకరాల భూమిని పేదల ఆధీనంలోకి తెచ్చింది. సత్యవేడులాంటి ప్రాంతాల్లో సెజ్జుల కారణంగా నిర్వాసితులైన రైతుల కోసమూ ఆయన పోరాడారు. వ్యవసాయంలో ఉన్నట్టే, ఇక్కడా మిశ్రమ అనుభవాలే. కిందిస్థాయి అధికారుల నిర్లిప్తత, రాజకీయాలు, కోర్టు వ్యాజ్యాలు అడుగడుగునా అడ్డొచ్చాయి. సేద్యంలో అయినా ఉద్యమంలో అయినా ఆయన రవ్వంత కూడా నిరాశపడ లేదు. ఆ అనుభవాల్ని, జ్ఞాపకాల్ని ‘ఇట్లు ఒక రైతు’ పేరుతో పుస్తకంగా రాశారు.

నరేన్‌ ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రి పడకమీద ఉన్నారు. వ్యాధి పెడుతున్న ఇబ్బంది కంటే, సొంతూరికీ సేద్యానికీ దూరంగా ఉన్నానన్న బాధే ఎక్కువ. వెంకట్రామాపురంలోని పంటలు కూడా తమ దోస్తు ఎప్పుడు తిరిగొస్తాడా అని ఎదురు చూస్తుంటాయేవో!

‘సంప్రదాయ’ సేద్యం

pv-sateesh

… రాసేవాళ్లకు భ్రమలెక్కువ. తాము ఉద్ధరించి వెలుగు చూపించకపోతే, ప్రపంచమంతా చికట్లోనే మగ్గిపోతుందన్న పిచ్చి నమ్మకం. అవకాశం వస్తే చాలు, తెలిసిందీ తెలియందీ పేజీలకు పేజీలు గుప్పిస్తుంటారు. ఇక ఏమారుమూల పల్లెకో వెళ్లినప్పుడైతే, ‘ఎంత వెనుకబాటుతనం? ఎంత అజ్ఞానం? ఎన్ని మూఢనమ్మకాలు? ఇంకానా, ఇరవై ఒకటో శతాబ్దంలోనా…’ అంటూ ఒకటే గగ్గోలు. జాతీయ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న రోజుల్లో పి.వి.సతీష్‌ కూడా అలానే ఆలోచించేవారు. దూరదర్శన్‌ వాళ్లు పంచాయతీ ఆఫీసుల్లో, ప్రభుత్వ స్కూళ్లలో ప్రజాటీవీలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు… ఆయనకూ ఓ కీలక బాధ్యత అప్పగించారు. దీంతో వారంలో నాలుగైదురోజులు పల్లెల్లోనే గడపాల్సి వచ్చేది. అప్పుడే సామాన్యులతో తొలి భేటీ! పరిచయాలు పెరిగేకొద్దీ, కబుర్లు వినేకొద్దీ…ఆ మాటల లోతు, ఆ భావాల గాఢత అర్థంకాసాగింది. పల్లెలంటే ఏమిటో అప్పుడే తెలిసింది. పల్లెల్లోని సంప్రదాయ విజ్ఞానం మీద ఎక్కళ్లేని గురి కుదిరింది. అంతలోనే, ఆ ప్రాజెక్టు పూర్తయింది. మళ్లీ దూరదర్శన్‌లో జాతీయ కార్యక్రమాల బాధ్యతలు అప్పగించారు. వరల్డ్‌కప్‌ హాకీ, ఏషియన్‌ గేమ్స్‌, కామన్వెల్త్‌ సమావేశాలు, రిలయన్స్‌ కప్‌ క్రికెట్‌…అంతర్జాతీయ కార్యక్రమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడమంటే మాటలు కాదు. అదీ పదీపన్నెండు కెమెరాలతో ప్రత్యక్ష ప్రసారాలంటే మీడియా ఉద్యోగిగా పెద్ద బాధ్యతే. అయినా సతీష్‌ మనసులో అసంతృప్తే. మనసు పల్లెల చుట్టే తిరిగేది. ఇక రాజీపడలేకపోయారు. రిలయన్స్‌కప్‌ ఫైనల్స్‌ పూర్తికాగానే ఉద్యోగానికి రాజీనామా చేశారు. మెదక్‌ జిల్లాలోని జహీరాబాద్‌ వచ్చేశారు. మిత్రులతో కలిసి దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (డీడీఎస్‌) స్థాపించారు. గ్రామీణ విజ్ఞానాన్నీ, సంప్రదాయ పంటల్నీ కాపాడుకునే ప్రయత్నం ప్రారంభించారు. దళిత మహిళలతో సంఘాలు పెట్టించారు.

డీడీఎస్‌ కార్యక్రమాలతోపాటూ ఏడెకరాల్లో సొంత సేద్యమూ వెుదలైంది. పల్లెజనమే ఆయన కన్సల్టెంట్లు. తోటి రైతులే గురువులు. విత్తనాల గురించి, నాట్ల గురించి, కలుపు గురించి, కోతల గురించి, నూర్పిళ్ల గురించి…అంతా వాళ్లే నేర్పారు. సతీష్‌ చేసిందొక్కటే, ఆ దార్లో నడవడం. ‘ఇప్పటికీ నేను చేస్తున్న పని అదే’ అంటారాయన. సతీష్‌ తన పొలంలో జొన్నలు, సజ్జలు, రాగులు, మినుములు, కొర్రలు, చెరకు… దాదాపు పదహారు రకాల పంటలు పండిస్తున్నారు. అన్నీ సేంద్రియ పద్ధతుల్లోనే. పొలానికెళ్లినప్పుడైతే, ఆ బ్రహ్మచారి పిల్లల తండ్రి అయిపోతారు. ఆ కంకుల్ని, ఆ మొక్కల్ని, ఆ పిందెల్ని, ఆ గడల్ని… బిడ్డల్లా మురిపెంగా చూస్తారు. రచన, డాక్యుమెంటరీల రూపకల్పన, కమ్యూనిటీ మీడియాలో అంతర్జాతీయ పాత్ర, ఉపన్యాసాలు, సంఘసేవ, పరిశోధన-ఎన్ని వ్యాపకాలున్నా ఆయన తొలి ప్రేమ వ్యవసాయమే! ‘సేద్యాన్ని మించిన ఆనందం ఎక్కడా లేదు’…మనస్ఫూర్తిగా చెబుతారు సతీష్‌.

చిన్నమండవ పెద్దకానుక

mandava

‘దీనిపేరు మండవ వీడర్‌’ … కిషన్‌రావు మామూలుగానే చెబుతారు. కానీ మనకే, కించిత్‌ గర్వంగా చెబుతున్నట్టు అనిపిస్తుంది. మేధావులు మెచ్చుకునేంత గొప్ప ఆవిష్కరణ కాకపోవచ్చు కానీ, రైతులకు నిజంగా పనికొచ్చే ప్రయత్నమిది. దాన్నిప్పుడు పొరుగు రాష్ట్రాల్లోని శ్రీవరి రైతులూ వాడుతున్నారు. అఫ్గాన్‌, శ్రీలంక తదితర దేశాలు కూడా దిగుమతి చేసుకున్నాయి.

మండవ కిషన్‌ స్వగ్రామం. మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ ముగించుకుని, ఐఐటీ కాన్పూర్‌లో పరిశోధకుడిగా పనిచేస్తున్న పర్చా కిషన్‌రావును అమాంతంగా వెనక్కి లాక్కొచ్చిన అయస్కాంతం ఆ పల్లె. ఖమ్మం జిల్లాలో ఉంది. అక్కడ రెండు మండవలున్నాయి. కిషన్‌రావు సొంతూరు చిన్నమండవ.

ఇంజినీరింగ్‌ చదివిన యువకుడు విదేశాలకెళ్లాలనో, పెద్దపెద్ద సంస్థల్లో పనిచేయాలనో ఎవరైనా కోరుకుంటారు. దాన్ని అత్యాశనీ అనలేం. కానీ కిషన్‌… పెట్టేబెడా సర్దుకుని కాన్పూర్‌ నుంచి నేరుగా సొంతూరికొచ్చేశారు. ఇక తిరిగివెళ్లేది లేదని తేల్చిచెప్పేశారు. ఆయనకి వ్యవసాయమంటే ఇష్టం. అందులోనూ వ్యవసాయంలోని స్వేచ్ఛాజీవితం ఇష్టం. ఎంతపెద్ద ఉద్యోగికైనా బాసంటూ ఉంటాడు. ఎంత చిన్న సేద్యగాడికైనా యజమాని ఉండడు. రైతే రాజు.

కిషన్‌ హర్యానా దాకా వెళ్లి మూడు పాడిగేదెలు కొనుక్కొచ్చారు. అప్పటిదాకా ఆ పల్లెలో పాడి ఓ వ్యాపారం కాదు. పాలు అమ్ముకునే అవకాశమూ తక్కువే. దీంతో ఓ పాలకేంద్రం స్థాపించాలనే ఆలోచన వచ్చింది. జనం నుంచి కూడా మంచి స్పందనే వచ్చింది. పక్క ఊళ్లవారూ ముందుకొచ్చారు. ఆ ఇంజినీరు తొలి ప్రాజెక్టు విజయవంతమైంది. ఆతర్వాత చేపలు పెంచారు. మిర్చి పండించారు. మామిడితోట వేశారు. సేంద్రియ పద్ధతులు పాటించారు. కొంత నష్టం, కొంత లాభం. రైతు జీవితమే అంత. సగం కష్టం, సగం సుఖం!

శ్రీసాగు ఆయన్ని బాగా ఆకర్షించింది. కారణం…ఆ పద్ధతిలో ఖర్చు తక్కువ. నీటి అవసరమూ తక్కువే. నీటి యుద్ధాలు జరుగుతున్న పరిస్థితుల్లో అలాంటి పద్ధతులే కావాలి. అప్పులపాలవుతున్న రైతుకు అలాంటి మార్గాలే కావాలి. వర్షాలు రాగానే ఒక ఎకరంలో వేశారు. మంచి ఫలితాలొచ్చాయి. ‘వీడర్‌’లో ఏవో సాంకేతిక సమస్యలున్నట్టు తెలిసిపోయింది. ఇంజినీరింగ్‌ బుర్రతో కొన్ని మార్పులు చేశారు. ‘మండవ వీడర్‌’ను డిజైన్‌ చేశారు. ఆ అనుభవంతోనే… వరల్డ్‌వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ లాంటి సంస్థలు పొరుగు రాష్ట్రాల్లోని రైతులకు శ్రీసాగు మీద శిక్షణ ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించాయి. తనకిష్టమైన వ్యాపకమే కాబట్టి, సంతోషంగా ఒప్పుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ వెళ్లారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌ వెళ్లారు. నెలరోజుల్లో ముప్ఫైమంది రైతులకు శ్రీపద్ధతి గురించి చెప్పారు. చక్కని ఫలితాలొచ్చాయి. ఈ ఏడాది అక్కడ ఇరవైవేలమంది ‘శ్రీ’ వరి పండిస్తున్నారు. వాళ్లంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో కిషన్‌ శిష్యులే. మండవ వీడర్‌ వాడుతున్న వారే.

రైతే ‘రాజు’…

నరసింహరాజు యాదవ్‌ ఓ నిర్ణయం తీసుకునుంటే…ఇప్పటికే సైనికాధికారి హోదాలో పదవీవిరమణ చేసేవారు. శౌర్యచక్రలూ, పరమవీర చక్రలూ ఓ డజను దాకా వచ్చేవి. ఏ ఉన్నతాధికారికో శాల్యూట్‌ చేస్తున్న ఫొటో… ఆయన ఇంట్లో గోడకి వేలాడేది. ఆ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి, ఆయన పదవీవిరమణ చేయాల్సిన అవసరమే రాలేదు. రాదు కూడా. శౌర్యచక్రలూ పరమవీరచక్రలూ లేవు

goriparti-laxmi-narsimharaju

కానీ…అంతకంటే ఘనమైన పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ అందుకున్నారు. భారతీయ రైతుకు తొలి గుర్తింపు! ఎవరికో శాల్యూట్‌ చేస్తున్న ఫొటో…ఆయన ఆల్బమ్‌లో ఒక్కటీ కనిపించదు. ప్రతిచోటా తలెత్తుకునే!

ఉత్తమం వ్యవసాయం. మధ్యమం వ్యాపారం. అధమం ఉద్యోగం. అధమాధమం యాచకం …గొరిపర్తి నరసింహరాజుకు వాళ్ల నాన్నగారు నూరిపోసిన మాటలివి. అందుకే ఎన్‌సీసీలో కత్తిలాంటి క్యాడెట్‌ అనిపించుకున్నా, మూడుసార్లు రిపబ్లిక్‌డే పరేడ్‌లో పాల్గొన్నా, రాష్ట్రపతి మెడళ్లు అందుకున్నా… ఎప్పుడూ యూనిఫామ్‌ ఉద్యోగాల గురించో ఇంకో కొలువు గురించో ఆలోచించలేదు. సైన్యంలో కమిషన్డ్‌ ఆఫీసర్‌ హోదా కోరి వరించినా కాదనుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నాక కూడా నల్లకోటు వద్దనుకుని, పచ్చని పొలాలవైపే వెళ్లారు. వరి, బాసుమతి వరి, వేరుసెనగ, మినుము, పప్పుధాన్యాలు, టొమాటో, మిరప, పూలసాగులో అనేకానేక కొత్త వంగడాల్ని సాగుచేశారు. దేశంలో ఎవరూ పండించనంత పండించారు. తాను పండించడమే కాదు, తోటి రైతులనూ ప్రోత్సహించారు. అదీ రైతు మనసు! నేలంటే రాజుకు ప్రాణం. మట్టికి హాని జరిగితే తట్టుకోలేరు. అందుకే సేంద్రియ ఎరువులే వాడుతున్నారు. రికార్డులంటారా, ఆయన పొలంలో విరగ పండిన పంటలానే… బోలెడన్ని. బాసుమతి బియ్యాన్ని పంజాబ్‌ రైతులకంటే బాగా పండించి ‘సింగ్‌ ఈజ్‌ నాట్‌ కింగ్‌…రాజుగారే రారాజు’ అని నిరూపించారు. ఆయన కొబ్బరిచెట్టుకు 20 గెలలు, మామిడిచెట్టుకు రెండున్నర వేలకాయలు కాచాయి. ఉలవ వెుక్క 20 అడుగులు పెరిగింది. రాజుగారి హస్తవాసి ప్రపంచానికంతా తెలిసింది. ఆయన ఆస్ట్రేలియాకెళ్లి అంతర్జాతీయ సెమినార్లో మాట్లాడారు. ఇజ్రాయిల్‌, సింగపూర్‌ రైతులకు చిట్కాలు చెప్పారు.

పద్మశ్రీ అందుకోడానికి రాష్ట్రపతి భవన్‌ వెళ్లినా, మర్యాదపూర్వకంగా కలుసుకోడానికి రాజ్‌భవన్‌ వెళ్లినా, సచివాలయం వెళ్లినా, సీఎం నివాసానికెళ్లినా ఆయన చెప్పేదొక్కటే… ‘రైతులకు రుణమాఫీలొద్దు, సబ్సిడీలొద్దు. గిట్టుబాటు ధరలు ఇవ్వండి చాలు’. ఆ ఒక్క విషయంలో పాలకులు స్పందిస్తే, రాజుగారు తనకు భారతరత్న వచ్చినంత సంతోషిస్తారు!

పదహారణాల రైతు

nagaratnam-nayudu

గుడివాడ నాగరత్నంనాయుడు పుట్టుకతోనే రైతు. డిప్లొమా ఇంజినీరింగ్‌ కోర్సు చేస్తున్నా, ఓ ప్రైవేటు సంస్థలో చిఫ్‌ ఇంజినీరుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నా …ఆయన మనసు మాత్రం ఉద్యోగి మనసు కాదు. పదహారణాల రైతు మనసు. అందుకే, పది రూపాయల వస్తువును పాతిక రూపాయలకు అమ్మాల్సివచ్చినప్పుడో మానవత్వాన్ని పక్కన పెట్టాల్సివచ్చినప్పుడో ఆయన గుండె విలవిల్లాడిపోయేది. ఓదశలో ఆ ఒత్తిడి తట్టుకోలేకపోయారు. వ్యవసాయం తప్ప ఇంకేం చేయకూడదనే నిర్ణయానికొచ్చారు. భార్య సత్యవతి కూడా మద్దతిచ్చారు. హైదరాబాద్‌ శివార్లలో ఓ ఎకరం కొని… ఆ దంపతులు రంగంలో దిగారు. అక్కడన్నీ రాళ్లూరప్పలూ. ఎక్కడ చూసినా ముళ్లకంపలు. ఆత్మవిశ్వాసం ముందు బీడునేలైనా తలవంచాల్సిందే. తొందర్లోనే ఆ భూమి వ్యవసాయ యోగ్యమైంది. మెల్లగా, ఒకటి పక్కన ఏడు చేరి…పదిహేడెకరాల సేద్యమైంది. ఎకరాకి 92 సంచుల వరి పండించి…శాస్త్రవేత్తలతోనూ శభాష్‌ అనిపించుకున్నారాయన.

స్టాక్‌ ఎనలిస్టులా, కార్పొరేట్‌ నిపుణుడిలా వ్యవసాయంలోనూ ఆయనకో పక్కా వ్యూహం ఉంది. ఎప్పుడూ మిశ్రమ పంటలే పండిస్తారు. ఒకటి దెబ్బతీసినా, ఇంకోటి ఒడ్డున చేరుస్తుంది. ‘మార్కెట్‌ అవసరాల్ని దృష్టిలో పెట్టుకోకపోతే, రైతుకు రైతే శత్రువు అవుతాడు’ అన్నది నాయుడి హెచ్చరిక. మార్కెట్‌ అవసరాలకనుగుణంగానే, విదేశీ పూల మొక్కల పెంపకం చేపట్టారు. అదిప్పుడు లాభాల సువాసనలు వెదజల్లుతోంది.

నాగరత్నంనాయుడికి దిగుబడి కంటే, లాభాలకంటే స్వావలంబన ఇష్టం. అందుకే ఇంటికి అవసరమైన బియ్యం, కందిపప్పు, కూరగాయల నుంచి కుంకుడుకాయల దాకా అన్నీ తన పొలంలోనే పండిస్తారు. ‘డబ్బు పెట్టి కొంటే, రైతుకీ ఉద్యోగస్తుడికీ తేడా ఏముంటుంది?’ అంటారు. నిజమే, రైతు ఇచ్చేవాడే కావాలి. పుచ్చుకోకూడదు. అలాగని టెక్నాలజీ సౌఖ్యాలకూ దూరం కాలేదు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆయన రెండంతస్తుల ఇల్లు… సంప్రదాయం, ఆధునికత కలగలిసినట్టు ఉంటుంది. ఇంట్లోకి కాలుపెట్టగానే విత్తనాల సంచులు, ధాన్యం నిల్వలు. రెండడుగులు లోపలికేస్తే ప్లాస్మా టీవీ. ఎదురుగా…జార్జిబుష్‌ హైదరాబాద్‌ వచ్చినప్పటి ఫొటో. మన పంటల గురించి నాగరత్నంనాయుడే ఆయనకి వివరించారు. పైఅంతస్తుకెళ్తే ఇంజినీరింగ్‌ చదువుతున్న కూతురి గది. అందులో ఇంటర్నెట్‌ సిస్టమ్‌.

ఏ రైతూ నేను, నా జీవితం, నా పంట… అనుకోడు. నాగరత్నంనాయుడు రాష్ట్రమంతా తిరిగి ఫ్లోరీకల్చర్‌ గురించి మంచి దిగుబడి ఇచ్చే పద్ధతుల గురించి రైతులకు వివరిస్తున్నారు. ఒకట్రెండు చోట్ల ఆయన్ని అపహాస్యం చేసినవారూ ఉన్నారు. వాళ్లే, తప్పుతెలుసుకుని పశ్చాత్తాపపడ్డారు కూడా.

స్వేచ్ఛాగానం

అపర్ణ-నాగేష్‌…ఈ కంప్యూటర్‌ ఇంజినీర్ల జంట అమెరికాలో ఉద్యోగాలు మానేసి చిత్తూరు జిల్లాలోని ఓ పల్లెటూరికి వచ్చింది. దళితవాడలో కాపురం పెట్టింది. వ్యవసాయాన్ని ప్రేమించింది. వనసంరక్షణ సమితుల ద్వారా పచ్చదనాన్ని ప్రోత్సహించింది. గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో ఉన్నతవిద్యావంతులైన ధీరేంద్ర సోనేజీ దంపతులు… రెండెకరాల్లో ఓ కుటుంబం తమకు కావాల్సిన ధాన్యం, కూరగాయలు పండించుకుని తృప్తిగా బతకొచ్చని నిరూపిస్తున్నారు. ఇలాంటివారు ఇంకెంతమందో?

దిగుబడులు అంతంతమాత్రమని తెలుసు. పెద్దగా లాభాలుండవని తెలుసు. కరెంటు కష్టాలు కాటేస్తాయని తెలుసు. దళారులదే పెత్తనమని తెలుసు. భూగర్భజలాలు అడుగంటాయని తెలుసు. కనీస వసతుల్లేని పల్లెల్లో బతుకు దుర్భరమనీ తెలుసు. అయినా, ఇంతమంది వ్యవసాయాన్నే ఎందుకు ఇష్టపడుతున్నారు? మట్టినెందుకు ప్రేమిస్తున్నారు? స్వేచ్ఛలోని ఆనందం, ఆ శ్రమైకజీవన సౌందర్యం, పచ్చదనం మీద మక్కువ, నలుగురికీ అన్నంపెట్టాలన్న ఆలోచన, ఆ జీవనశైలి…అదే వాళ్లను పట్టణాల నుంచి రప్పిస్తోంది. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అవరోధాలున్నా… ఏదో ఒకరోజు వ్యవసాయానికి దశ తిరుగుతుందని నమ్ముతున్నారీ గడ్డిపరక విప్లవకారులు. ఏ ఉద్యమమైనా బలమైన నమ్మకంలోంచే పుడుతుంది.

By- కె.జనార్దనరావు

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: