తిరుపతమ్మకు అవార్డొచ్చింది

తెలంగాణా ప్రాంతంపై మన రాష్ట్ర పాలకుల నేరపూరిత నిర్ల్యక్షానికి నల్లగొండ జిల్లాను అనేక దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ భూతం ఒక ఉదాహరణ. పక్కనే కృష్ణమ్మ నీరు శిశువుకు దక్కని స్థన్యంలా పారుతూ అటు డెల్టాకు సాగు నీరు, ఇటు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందిస్తుంటే నల్లగొండ జిల్లా ప్రజలు మాత్రం ఫ్లోరిన్ విషపు జలాలతో గొంతు తడుపుకుంటున్నారు. స్వతంత్రం వచ్చిన ఆరు దశాబ్దాల తరువాత కూడా ప్రజలకు తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లను ఇవ్వలేని మనం “అభివృద్ధి” సాధించామని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి.

పల్లెలు గొంతులో పచ్చి విషం నింపుకుంటుంటే వేలకోట్ల ప్రపంచ బ్యాంక్ డబ్బుతో రాజధాని నగరానికి కృష్ణ నీరు కొండలు గుట్టలూ దాటి ఖరీదు కట్టే షరాబులను వెదుక్కుంటూ  పైపులైన్లలో పరుగులు పెడుతోంది.  నగరంలో కోకకోలా ప్లాంట్లకూ ఈ నీరే రెండు పైసలకు లీటర్ ధరకు సరఫరా అయి మనకు “కిన్లే” అనే 12 రూపాయల మినరల్ వాటర్ సీసా రూపంలో లభ్యమవుతుంది.

వాటర్ బోర్డు వారి Dial A Tanker ప్రకటన చూశారా? 250 రూపాయలకే “స్వచ్చమైన, సురక్షితమైన” 5000 లీటర్ల నీరు. అంటే 5 పైసలకు లీటర్ నీరు. మరి నల్లగొండ నుండి మోసుకొచ్చి, శుద్ధి చేసి నగర ప్రజలకు పైపుల్లో, ట్యాంకర్లలో, ఇప్పుడయితే ఏకంగా సీసాల్లో (వాటర్ వర్క్స్ వారు మినరల్ వాటర్ కూడా అమ్ముతున్నారు) సరఫరా చేయగల వనరులు, సాంకేతిక విజ్ఞానం మన దగ్గర ఉంది. కానీ అదేం చిత్రమో నల్లగొండ జిల్లాలోని పల్లెలకు మాత్రం మంచి నీరు ఇవ్వలేదు మన ప్రభుత్వం. బహుశా వారికి “మార్కెట్” సైజు సరిపోలేదేమో

అయినా నేటి “మార్కెట్” లో మనుషులకు ఎక్కడుంది స్థానం… ఇక్కడంతా అమ్మకందారులు కొనుగోలుదారులే కదా.

నీరు పల్లమెరుగు అనేది పాత సామెత. ఇప్పుడైతే నీరు “మార్కెట్” నే ఎరుగును.

లక్షల మంది పౌరులు విషపూరితమైన నీరు తాగి జీవచ్చవాలుగా మారుతుంటే మన ప్రభుత్వాలేమో కుంభకర్ణ నిద్ర నటిస్తున్నాయి. మాకు తాగేందుకు గుక్కెడు నీళ్లిప్పించమని నల్లగొండ వాసులు అనేక ఏళ్లుగా చేస్తున్న విజ్ఞప్తులు, ఉద్యమాలు మన నేతల చెవికి సోకట్లేదు.

ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకోని ప్రభుత్వాల నిర్ల్యక్షాన్ని ఎండగట్టే ఉద్దేశంతో దుశ్చర్ల సత్యనారాయణ అనే సామాజిక ఉద్యమకారుని నేతృత్వంలో 1994 పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు 500 మంది నల్లగొండ ఫ్లోరిన్ బాధితులు నల్లగొండ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేశారు. ఈ చర్య ద్వారా సమస్య గురించి దేశవ్యాప్తంగా తెలిసింది కానీ పరిష్కారం మాత్రం లభించలేదు.

ఈ సమస్య తెరమీదికి వచ్చినప్పుడల్లా నాలుగు రోజులు మీడియా హడావిడి చేస్తుంది, ఆ తరువాత షరా మామూలే. ప్రతీ ఎన్నికల రుతువులో రాజకీయ నాయకులు రావడం, ఫ్లోరిన్ సమస్య నుండి విముక్తి కలిగిస్తామని వాగ్ధానలు చేయడం, ఎన్నికలు ముగియగానే ముఖం చాటేయడం…ఇదీ తంతు.

మొన్న శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ ఫ్లోరిన్ సమస్య తెర మీదికి వచ్చింది. అనేక ఏళ్లుగా ఫ్లోరిన్ బాధితుల పోరాటానికి Poster Child గా నిలిచిన తిరుపతమ్మ మరోసారి ప్రభుత్వ నిర్ల్యక్షాన్ని నిరసిస్తూ  ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసింది. అయితే ఏదో చిన్న కారణంతో అధికారులు ఆమె నామినేషన్ తిరస్కరించారు.

తిరుపతమ్మకు ఈ యేడాది యంగ్ ఉమన్‌ అచీవర్‌ అవార్డు లభించిందని తెలిసి చాలా సంతోషం కలిగింది. ఇవాళ్టి ఈనాడు వసుంధరలో తిరుపతమ్మ పై వచ్చిన కథనం కింద చదవండి:

క’న్నీటి’ పోరాటం… ఓ తిరుపతమ్మ కథ

tirupatamma-flouride-victim1

స్వయంగా ఫ్లోరోసిస్‌బారిన పడి చక్రాల కుర్చీలేనిదే అడుగేయలేని ఈ యువతి ఢిల్లీదాకా వెళ్లింది. తమ సమస్య పరిష్కారం కోసం నినదించింది. పేరు తిరుపతమ్మ. ఊరు నల్గొండ జిల్లాలోని మారుమూల వట్టిపల్లి గ్రామం. ఆ పోరాటపటిమ ఆమెకు ‘యంగ్‌ ఉమన్‌ అచీవర్‌-2009’ అవార్డును తెచ్చిపెట్టింది. ఈ నెల 20న అవార్డు అందుకున్న తిరుపతమ్మ ఈనాడు కార్యాలయానికి స్వయంగా వచ్చింది. ‘వసుంధర’తో మాట్లాడింది.

‘మేం తాగుతున్నవి నీళ్లుకాదు…. మా కన్నీళ్లు.

నల్గొండ జిల్లాని పట్టిపీడిస్తున్న ఫ్లోరోసిస్‌ సమస్య గురించి ఏళ్ల తరబడి మా గోడువెళ్లబోసుకుంటున్నాం. పాలకులు వింటూనే ఉన్నారు. ఏళ్లూపూళ్లూ గడుస్తున్నా సమస్య జటిలమౌతోందేకానీ.. సులభతరం కాలేదు. కనీసం రాబోయే తరానన్నా రక్షించాలి. భావితరం బాగుండాలనే నా ఈ ఉద్యమం.’ అంటూ సుమారు 475 గ్రామాల వారికి ఫ్లోరోసిస్‌నుంచి విముక్తి కోరుతూ ఉద్యమిస్తోందీ యువతి. మానవత్వంతో స్పందిస్తే భావితరాలు బాగుంటాయి. లేదంటే ఈ సమస్య క్రీనీడలా మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. చరిత్రలో ఓ చీకటిఅధ్యాయంగా మిగులుతుంది… అంటున్న ఈ యువతి గొంతులో ఆవేదన సుడులు తిరుగుతుంది.

 

దేశభవిష్యత్తును భుజాలకెత్తుకోవాల్సిన భావితరం మరొకరి ఆసరా లేకుండా అడుగేయలేని దుస్తితినెదుర్కొనడం ఎంత దౌర్భాగ్యం. ఈ దుస్థితి నల్గొండ జిల్లాలోని ఫ్లోరోసిస్‌ బాధిత యువతను నిర్వీర్యం చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది తిరుపతమ్మ. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన ఆమె చదువుకున్నది పదో తరగతి. ‘అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే. ఫ్లోరోసిస్‌ కారణంగా నడవలేని దుస్థితి. ఒక్కోసారి అమ్మానాన్నలే విసుక్కునేవారు. అది తట్టుకోలేక చనిపోవడానికి ప్రయత్నించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే..మృత్యువు నాకు సహకరించలేదు. బ్రతికాను. ఇందులో నా తప్పేకాదు.. నాలాంటి వాళ్ల తప్పుమాత్రం ఏముంది చెప్పండి? మా ప్రాంతంలో ఇంటికొక్కరైనా నాలాంటి వాళ్లున్నారు. తర్వాత అనారోగ్యంతో అమ్మ చనిపోయింది. ఓ స్వచ్చంధ సంస్థ సాయంతో ఎస్‌టీడీ నడుపుతూ ఇప్పటి వరకు సంసారాన్ని ఈడ్చుకొస్తున్నాను. రేపటి తరానికి ఈ శాపం వద్దనుకున్నాను. అందుకే 2000లో ‘ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి’లో చేరాను. అప్పటి నుంచి నావంతు పోరాటం సాగిస్తున్నాను’.. అంది తిరుపతమ్మ.

tirupatamma-flouride-victim

2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్రిగూడ జడ్పీటీసీ స్థానానికి పోటీచేసింది తిరుపతమ్మ. ‘ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేవారికి ఎందుకు విన్నవించుకోవాలి. అందుకే ఓ మార్పు కోసం..చైతన్యం కోసం నేనే ఎన్నికల్లో నిలబడ్డాన’ంది తిరుపతమ్మ. అలా ఎన్నికల్లో నిలబడ్డ తిరుపతమ్మ 1775 ఓట్లను గెలుచుకుంది. ఓటుకోసం ఎంతైనా వెచ్చించే నాయకుల మధ్య స్వచ్చంధంగా అన్ని ఓట్లు దక్కించుకోవడం మామూలు విషయం కాదుకదా? ‘ఇది నా ఒక్క సమస్యే కాదు. జిల్లాలో నాలాంటి వారు 28,000మంది డిజేబుల్డ్‌ ఫించన్‌ తీసుకుంటున్నారు. అందులో 60శాతం ఆడవాళ్లే.. అందుకే ఈ ఎన్నికల్లోనూ పోటీచేయడానికి సిద్ధమయ్యాను. స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తే అఫడవిట్‌లో ఆస్తులకు సంబంధించిన వివరాల్లేవంటూ తిరస్కరించారు. నిజానికి అధికారం..పదవి కోసం ఈ ఎన్నికల్లో నిలబడలేదు. మా సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకురావడానికే దీనిని వేదికగా ఎంచుకున్నాను. ఎన్నికల బరిలో ఉండుంటే కచ్చితంగా మా గొంతు వినిపించి ఉండేవాళ్లం అంటేందామె.

తిరుపతమ్మలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్‌, ఫిిక్కీ ఫౌండేషన్‌, టాటాపవర్‌, శ్రీరామా ఛారిటబుల్‌ ట్రస్టులు సంయుక్తంగా ఏటా ఇచ్చే ‘యంగ్ ఉమన్‌ అచీవర్‌-2009’ అవార్డుకు ఈ ఏడాది తిరుపతమ్మ ఎంపికయింది. ఎందరో ప్రముఖుల సమక్షంలో అవార్డును అందుకోవడం చాలా గర్వంగా ఉందంటుంది తిరుపతమ్మ.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: