ఎమరాల్డ్ మిఠాయి దుకాణానికి వెళ్లారా?

 

హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న ఎమరాల్డ్ మిఠాయి దుకాణానికి వెళ్లారా మీరెప్పుడైనా? ఇప్పటిదాకా వెళ్లకపోతే వెంటనే బయల్దేరండి. 

విజయ్ రాం అనే కళాకారుడు నడుపుతున్నాడీ షాపుని. షాపు ముందరే మీకు నర్సరీల్లో ఉన్నట్టు కొన్ని మొక్కలు కనపడుతాయి. షాపులోకి అడుగుపెట్టిన కొద్ది క్షణాల్లోనే మీకు ఇది అలాంటి ఇలాంటి షాపు కాదని అర్థమవుతుంది. ఒక మూలకు రాగి బిందెలో మంచినీళ్లు ఉంటాయి. పక్కనే గోడకు వేలాడదీసిన కొన్ని తైలవర్ణ చిత్రాలు. వాటన్నిటిలో ఉండేది ఒకటే సందేశం. పర్యావరణాన్ని రక్షించండి, పుడమి తల్లిని కాపాడండి…ఇలా…

అన్నిటికన్నా మిన్నగా మీరు కొనే స్వీట్లను కాగితం సంచీలోనో, గుడ్డ సంచీలోనో ప్యాక్ చేసి ఇస్తారు. ఆ సంచీ మీద కూడా పర్యావరణ పరిరక్షణ గురించి నినాదాలు ఉంటాయి.

మీరు ఇదంతా చూసి ఆశ్చర్యపోతుంటే, సమయానికి విజయ్ రాం ఉంటే, మీ అదృష్టం బావుంటే, మీకో చక్కని బహుమతి కూడా ఇస్తాడు. అదేమిటనుకున్నారు? మీరు ఇందాక షాపులోకి వస్తుంటే చూశారే చిన్న కుండీల్లో ఉన్న మొక్కల్ని, అదో అవే విజయ్ రాం తన కస్టమర్లకు ఇచ్చే వెలకట్టలేని విలువైన బహుమతులు.

అంతే కాదు, మీకు షాపు వాళ్లిచ్చిన గుడ్డ సంచీ తిరిగి తెచ్చిస్తే, తదుపరి కొనుగోలు పై కొంత రాయితీ కూడా ఇస్తారు.

గుడ్డ సంచీ వాడకాన్ని విజయ్ రాం బాగా ప్రోత్సాహిస్తారు. సేవ్ (SAVE) అనే స్వచ్చంద సంస్థను స్థాపించి కొంత మంది దాతల సాయంతో ప్రజలకు గుడ్డ సంచీలు బహూకరిస్తుంటాడు. ఇటీవలనే ఇందిరా పార్కులో ఉదయం వాకింగుకు వచ్చే వందలాది మందికి ఈ గుడ్డ సంచీలు బహూకరించారు. 

రేపు అంటే 5 జూన్ నాడు చిల్కూరులోని బాలాజీ గుడి వద్ద పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజల చేత పర్యావరణ పరిరక్షణ గురించి ప్రతిజ్ఞ చేయించి వారికి గుడ్డ సంచీలు బహూకరిస్తారు.

ఒక కళాకారుడు మిఠాయి దుకాణం నడపడమే ఒక వింతైతే ఇంత నిబద్దతతో పర్యావరణ స్పృహను ప్రదర్శించడం చాలా అరుదు. వ్యాపారానికీ, పర్యావరణానికి పోటీ ఉండాల్సిన పనిలేదని, అవి రెండూ ఒకదానికొకటి సహకరించుకోవచ్చని చిన్న చిన్న పనుల ద్వారా చాటుతున్నాడు విజయ్ రాం.

బందరు లడ్డూ స్వస్థలమైన బందరు నుండి హైదరాబాదుకు జె.ఎన్.టి.యు లో ఫైన్ ఆర్ట్స్ కోర్స్ చేయడానికొచ్చిన ఈ యువకుడు చివరికి ఇలా బాధ్యతాయుతమైన వ్యాపారవేత్త అయ్యాడు.

ఈ మధ్యే కూకట్ పల్లి జె.ఎన్.టి.యు నుండి హైటెక్ సిటీకి వెళ్లే మార్గంలో ఒక కొత్త శాఖను కూడా తెరిచారు ఎమరాల్డ్ మిఠాయి షాప్ వారు. వీలుంటే ఒకసారి దర్శించి ఈ మంచి మనిషి వెన్నుతట్టండి.

విజయ్ రాం గురించి మరింత సమాచారం ఈ కింది లంకెల్లో ఉంది:

 
 

జూన్ 5 నాడు పర్యావరణ దినోత్సవం

మరిన్ని వివరాల కొరకు దర్శించండి: http://www.unep.org/wed/2008/english/

అన్నట్టు ప్రశాంతి నడుపుతున్న బత్తీబంద్ బ్లాగు చదువుతున్నారా?

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: