మా ఊరి శివారులో జరుగుతున్న యుద్ధానికి అనూహ్య ముగింపు (?)

నిన్న ఉదయాన్నే మా అన్న ఫోన్ చేశాడు. ఆయన చెప్పిన వార్త విని నేను షాక్ అయ్యాను.

“ఒక బ్యాడ్ న్యూస్, గులాబ్ సింగ్ చనిపోయాడు”

నాకో క్షణం పట్టింది తేరుకోవడానికి. “ఎలా”? అనడిగాను.

“మొన్న కర్ణాటక వెళ్తుండగా వీళ్ల కారును డీసీఎం ఢీ కొట్టిందట. డ్రైవర్ స్పాట్ డెడ్ అట, గులాబ్ సింగ్ నిన్న రాత్రి కింగ్ కోఠిలో ఉన్న కామినేని వోక్ హార్డ్ ఆస్పత్రిలో చనిపోయాడు, అతని భార్య ఇంకా కోమాలోనే ఉంది” చెప్పాడు మా అన్న.

ఆ వార్త నా గుండెల్ని పిండేసింది.

అతనెవరో రెండు నెలల క్రితం వరకూ నాకు తెలియదు. కానీ రెణ్ణెళ్లుగా అతణ్ణి ఒక విలన్ గా చూశాను నేను. అతని పై వ్యక్తిగతంగా ఏమీ ద్వేషం లేకపోయినా అతను పెట్టే స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ మా గ్రామాన్నీ, మా చుట్టుపక్కల గ్రామాలనూ ధ్వంసం చేస్తుందనే భయంతో గత రెండు నెలలుగా మేమంతా ఆ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమించాం.

గత వారమే గులాబ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ కి సంబంధించిన పర్యావరణ ప్రభావ నివేదిక (Environmental Impact Assessment Report) ను చదివాను. అందులో ఉన్న అనేక అబధ్ధాలను ఎత్తి చూపుతూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఒక ఉత్తరం కూడా రాసి పెట్టాను. దాన్ని రేపు పోస్టు చేద్దామనుకున్నాను. ఇంతలోనే పిడుగు లాంటి ఈ వార్త తెలిసింది.

గులాబ్ సింగ్ వర్మ వ్యక్తిగతంగా ఎటువంటి వాడో నాకు తెలియదు. కానీ అతను ఇక లేడంటే మాత్రం బాధ కలుగుతోంది. గులాబ్ సింగ్ మరణంతో ఇక మా పోరాటం దాదాపు ముగిసినట్లే…

ప్రతి మరణం మనలో కొద్ది సేపు అయినా వైరాగ్యం కలిగిస్తుంది. మనం ఎన్నో అనుకుంటాం, ఏమేమో సాధించాలనుకుంటాం, సంపాదించుకోవాలనుకుంటాం. కానీ ఒక్క క్షణంలో అంతా తారుమారవుతుంది.

ఉన్నంత కాలం సాటివారికి సాధ్యమైనంత మేలు చేయాలని, చివరికి మనతో పాటు వచ్చేది ఆ మంచి పేరేనని మనలో చాలామందిమి బ్రతికి ఉన్నాళ్ళూ తెలుసుకోం.

 

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: