మా ఊరి శివారులో జరుగుతున్న యుద్ధం – 3

మొదటి భాగం

రెండో భాగం

గత వారం ఒక బస్సు నిండా రైతులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఒక స్వచ్చంద సంస్థ ప్రతినిధితో ఓ బృందం రాయ్ పూర్ బయలుదేరింది. వెనుక గులాబ్ సింగ్ తన కారులో బయలుదేరాడు. నేను ముందే మా బంధువులకు ఫోన్ చేసి అక్కడ ఏమేం పరిశీలించాలో చెప్పాను.

వారు బయలుదేరాక రెండు రోజులకు అక్కడి నుండి వచ్చిన వార్త నన్ను ఒక క్షణం ఆశ్చర్యపరచింది. ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో గులాబ్ సింగ్ కారును పోలీసులు పట్టుకున్నారన్నది ఆ వార్త సారాంశం. ఉప ఎన్నికల సందర్భంగా పోలీసులు రొటీన్ గా వాహనాలు చెక్ చేస్తుండగా అధిక మొత్తంలో మద్యం బాటిళ్లు ఉన్న గులాబ్ సింగ్ కారు వారి కంటబడింది. ఇంకేముంది కారులోని మద్యం స్వాధీనపరచుకుని గులాబ్ సింగ్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ పోలీసు వారికి తాను ఎన్నికల్లో మద్యం పంచడానికి రాలేదని, వేరే పని మీద వెళ్తున్నాని చెప్పి ఒక ఆరు గంటల తరువాత బయట పడ్డాడు గులాబ్ సింగ్. ఏదోలా జనాన్ని మత్తులో ముంచి తనకు అనుకూలంగా మార్చుకోవాలనే మనవాడి ప్లానుకు అలా ఆదిలోనే హంసపాదు పడింది.

తీరా రాయ్ పూర్ వెళ్లాక అక్కడ అతను చూపించాలనుకున్న ఫ్యాక్టరీ ఒక పారిశ్రామిక వాడలో ఉందట. దానికి ఎటూ పది కిలోమీటర్ల దూరంలో వ్యవసాయం ఆనవాళ్లేమీ లేవట. పోనీ ఫ్యాక్టరీ ఎలా ఉందో చూద్దామనుకుంటే సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం ఎవరినీ గేటులోపలికి అనుమతించేది లేదని తెగేసి చెప్పిందట. అంత దూరం వెళ్లిన బృందం అసలేమీ చూడకుండానే, అర్థం చేసుకోకుండానే ఉస్సూరంటూ తిరుగుముఖం పట్టింది.

దారి పొడవునా వెళ్ళినవారికి మద్యం, బిర్యానీల సరఫరా సాగిందని తెలిసింది. బహుశా దీని ఫలితమేనేమో తిరిగి వచ్చాక కొందరు ఫ్యాక్టరీకి మద్ధతుగా మాట్లాడటం మొదలు పెట్టారు.

ఇక ఇలా కాదని మా అన్నయ్య ఇంకొందరు రైతులు కలిసి నిన్న ఆదివారం నాడు ఒక జీపులో చుట్టుపక్క గ్రామాలకు వెళ్ళి ప్రజలు విషయం వివరించి కలెక్టరుకు ఇవ్వడానికి ఒక వినతి పత్రంపై సంతకాల సేకరణ మొదలుపెట్టారు.

ఇది తెలిసిన గులాబ్ సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వీరి పై ఫిర్యాదు చేశాడు. మా వాళ్లు చేస్తున్న దాంట్లో చట్టపరంగా తప్పేమీ లేదు. అసలు ఏమని ఫిర్యాదు చేసి ఉంటాడా అని అని ఆరాతీస్తే తెలిసింది ఇది… పక్క గ్రామంలో సంతకాల సేకరణలో ఉన్న మా అన్నకి స్థానిక ఎస్సై ఫోన్ చేసి “మీరు అనుమతి లేకుండా జీపుకు మైక్ కట్టుకొని ప్రచారం చేస్తున్నారు కనుక వెంటనే ఆ మైక్ ఆపివేయండి” అని చెప్పాడట! సరే అని మావాళ్ళు మైక్ లేకుండా తమ పని కానిచ్చారట.

చూడండి ఒక తప్పుడు పని చేసే వ్యక్తికి మన పోలీసులు ఇచ్చే సపోర్టు ఎలా ఉందో.

ఇవ్వాళ మా అన్నయ్య వాళ్లు నల్లగొండ వెళ్లి కలెక్టరును కలిసి వినతి పత్రం ఇస్తున్నారు. నా తరఫున నేను కూడా కలెక్టరు గారికి ఒక ఉత్తరం రాస్తున్నాను.

చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో…

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: