మా ఊరి శివారులో జరుగుతున్న యుద్ధం – 2

మరునాడు ఉదయమే గులాబ్ స్టీల్స్ యజమాని స్థానికంగా ఉంటున్న నేతలను కలిశాడు. మా చిన్నాన్నను కూడా కలిసి ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు. ఈ పాటికే స్థానిక ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చాడని కూడా వార్తలు వినిపించసాగాయి.

ఫ్యాక్టరీ వస్తే ఉద్యోగాలు వస్తాయని, భూముల ధరలు పెరుగుతాయనే అభిప్రాయంతో స్థానికుల్లో ఒకరిద్దరు ఉన్నారని నాకు తెలిసింది.

ఫ్యాక్టరీ నుండి వచ్చే కాలుష్యం బయటికి రాకుండా అత్యాధునిక మెషీన్లు ఏర్పాటు చేస్తున్నానని, కాలుష్యాన్ని కరెంటుగా మార్చుతామని, వెనుకబడ్డ తెలంగాణలో ఈ ఫ్యాక్టరీ వల్ల ఎంతో అభివృద్ధి (?) జరుగుతుందనీ, కొన్ని “స్వార్ధ శక్తులు కావాలనే ఈ పరిశ్రమకు అడ్డుతగులుతున్నాయి” అంటూ గులాబ్ స్టీల్స్ యజమాని గులాబ్ సింగ్ వర్మ ఒక కరపత్రం కూడా వేశాడు.

ఇదేదో అంత సులభంగా అయిపోయేలా లేదనిపించింది నాకు. వెంటనే నేను వస్తున్నానని చిన్నాన్నకు ఫోన్ చేశాను. మొన్న శనివారం నాడు మోత్కూర్ లో మా స్వగృహంలో అన్ని రాజకీయ పార్టీల నేతలను, పత్రికా విలేకరులను పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశాం. నా లాప్ టాప్ సాయంతో వచ్చిన వారికి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ గురించి మొత్తం వివరించాను. ఇక్కడ సమావేశం ముగిసాక ఫ్యాక్టరీ కట్టబోయే స్థలానికి అతి సమీపంలో ఉండే శివనగర్ అనే గ్రామం వద్దకు వెళ్లి అక్కడ కూడా రైతులను, గ్రామస్థులను సమావేశపరచి ఫ్యాక్టరీ గురించి వివరించాం.

స్పాంజ్ ఐరన్ పరిశ్రమను కాలుష్య నియంత్రణ మండలి అత్యంత కాలుష్య కారక Red క్యాటగిరిలో చేర్చింది. గాలి, నీరు, భూమి అన్నీ విపరీతంగా కలుషితమయ్యి ఆ ఫ్యాక్టరీ సామర్ధ్యాన్నిబట్టి దానికి కొన్ని కిలోమీటర్ల వరకూ చెట్లు, పశువులు, మనుషుల ఆరోగ్యాలను దెబ్బతీస్తుందని మనవద్ద సమాచారం ఉంది. పరిశ్రమ పెట్టే ముందు అందరు యజమానులూ తాము కాలుష్య నియంత్రణ చేస్తామనే నమ్మబలుకుతారు. అయితే కాలుష్య నియంత్రణ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. స్పాంజ్ ఐరన్ వంటి పరిశ్రమల లాభదాయకత ఎంత తక్కువ ఖర్చులో ఉత్పత్తి సాధించామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. దాంతో ఎక్కడా ఈ పరిశ్రమలు కాలుష్య నియంత్రణా చర్యలు చేపట్టట్లేదు.

మరునాడు ఈ సమావేశాల గురించి స్థానిక పత్రికల్లో వార్తా కధనం వచ్చింది. ఉదయం 7 గంటలకే స్థానిక నాయకుడొకరు మా ఇంటికి వచ్చాడు. ఫ్యాక్టరీ ఏర్పాటును సమర్ధిస్తూ, నేను చేస్తున్న పని సరికాదని నాకు నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు. నేను నా నిర్ణయంలో మార్పేమీ ఉండదని ఫ్యాక్టరీ వల్ల నష్టాలే అధికంగా ఉన్నాయని ఖరాకండిగా చెప్పాను.

నేను హైదరాబాద్ వచ్చేశాక గులాబ్ సింగ్ వర్మ ఏకంగా మా ఇంటికి వచ్చాడట. నాన్నను కలిసి చాలాసేపు మాట్లాడాడట. నాన్న కాలుష్యం గురించి ప్రస్తావిస్తే ఎటువంటి కాలుష్యం రాదని నమ్మబలికాడట. అవసరమైతే “ఏ సాయం అయినా చేస్తానని” నర్మగర్భంగా మాట్లాడాడట. గ్రామస్థులం మొత్తం కలిసి ఫ్యాక్టరీ వద్దని నిర్ణయం తీసుకున్నామని, నేనేమీ సాయం చేయలేనని నాన్న చెప్పాడట.

అదేరోజు గులాబ్ సింగ్ వర్మ మోత్కూర్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలని కలిశాడు. ఫ్యాక్టరీకి గ్రామస్తులను ఒప్పించడానికి ఒక కొత్త ప్రతిపాదన తెరమీదికి తీసుకువచ్చాడు.

చత్తీస్గడ్ రాజధాని రాయ్ పూర్ వద్ద ఉన్న ఒక స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీకి కొద్దిమంది రైతులను తీసుకు వెళ్లి చూపించుకువస్తానని అక్కడ ఎలా ఉందో చూశాకే ఇక్కడ ఒప్పుకొమ్మన్నది ఆ ప్రతిపాదన సారాంశం.

దీనికి కొద్దిమంది వ్యతిరేకించారు. ఈపాటికే స్పాంజ్ ఐరన్ పరిశ్రమ కాలుష్యం ఎలాఉందో తెలుసు కనుక కొత్తగా చూసేదేమీ లేదని, ఒకసారి వెళ్తే వాడి మాయలో పడతామనీ ఒక వర్గం వాదించగా, ఒక సారి చూసొస్తే అనుమానాలు తీరిపోతాయి గదా అని మరొక వర్గం వాదించింది. రైతులను రెండు వర్గాలుగా విడగొట్టి వారి ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం మొదలయ్యింది. గులాబ్ సింగ్ అన్ని రాజకీయ పార్టీల స్థానిక నేతలపై రాష్ట్ర స్థాయి నేతలతో ఒత్తిడి చేయించి ఈ పర్యటనకు ఒప్పించాడు.

ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి.

1) రాయ్ పూర్ మన దేశంలోనే అత్యంత కలుషిత నగరంగా (చెడ్డ) పేరు తెచ్చుకుంది. ఆ ఖ్యాతికి స్పాంజ్ ఐరన్ పరిశ్రమే ముఖ్య కారణం.

2) ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి విధి విధానాలు రూపొందించింది. నివాస గృహాలు, వ్యవసాయ భూములు, తోటలకు, ఈ పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రదేశానికి మధ్య కనీసం ఒక కిలోమీటర్ దూరం ఉండాలని నిబంధనలు ఉన్నాయి. గులాబ్ స్టీల్స్ పరిశ్రమ శివనగర్ గ్రామానికి 300-400 మీటర్ల లోపే ఉంటుంది. ఫ్యాక్టరీ స్థలానికి 200 మీటర్ల దూరంలోనే తోటలు ఉన్నాయి. ఇక్కడ పరిశ్రమకు అసలు అనుమతి ఇవ్వ కూడదు.

3) స్పాంజ్ ఐరన్ వంటి పరిశ్రమలు అటు ముడి సరుకు దొరికే దగ్గరో, ఇటు తయారు చేసిన ఉత్పత్తి అమ్ముకునే మార్కెట్ కు దగ్గరో ఉండాలి. కానీ గులాబ్ ఐరన్ ముడి సరుకులైన ఇనుప ఖనిజం కర్ణాటకలోని బళ్లారి దగ్గర నుండి, బొగ్గు సింగరేణి కాలరీస్ నుండి రావాలి. మార్కెట్ కూడా వేరే రాష్ట్రాల్లో ఉంది. ఇక ఈ ప్రాంతంలో అసలే నీటి ఎద్దడి. ఫ్యాక్టరీ పెట్టి నీటికొరకు బోర్లు వేస్తే చుట్టుపక్కల రైతుల బోర్లన్నీ ఎండిపోవడం ఖాయం. ఎక్కడైతే చౌకగా భూమి దొరుకుతుందో, ఎక్కడైతే స్థానికుల నుండి వ్యతిరేకత రాదో అక్కడ నెలకొల్పాలనే అలోచనే కనిపిస్తుంది తప్ప ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి మరే సహేతుక కారణమూ లేదు.

రేపు కొంతమంది రైతుల బృందాన్ని తీసుకుని గులాబ్ సింగ్ రాయ్ పూర్ వెళ్తున్నాడు.

రాయ్ పూర్ వెళ్లాక అక్కడ గులాబ్ సింగ్ చూపించే ఒక్క పరిశ్రమే కాక చుట్టుపక్కల ప్రజలను కూడా విచారించమని మా చిన్నాన్నకు చెప్పాను. ఈ పర్యటనకు వచ్చినంత మాత్రాన ఫ్యాక్టరీ ఏర్పాటుకు సుముఖం అని అర్థం కాదని గులాబ్ సింగ్ కు స్పష్టం చేయమని చెప్పాను.

ఒరిస్సాలో ఈ పరిశ్రమను బ్యాన్ చేయడంతో మన రాష్ట్రంలో కొత్తగా ఈ పరిశ్రమ పెట్టుకుంటామనే దరఖాస్తులు ఎక్కువ అయ్యాయి. ఒక్క నల్లగొండ జిల్లాలోనే ఇంకొక నాలుగైదు స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలకు దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. ఈ ఫ్యాక్టరీ పెట్టనివ్వకపోతే మీకందరికీ కూడా నష్టమే అని గులాబ్ సింగ్ ఇతర కొత్త ఫ్యాక్టరీల వారికి చెప్తున్నాడని తెలియవచ్చింది. ఏదో ఒకటి చేసి ఈ ఫ్యాక్టరీకి అనుమతి సంపాదించాలనే పట్టుదల అతనిలో కనపడుతోంది. మరొక వైపు కలెక్టరుకు, కాలుష్య నియంత్రణ మండలికి ఫ్యాక్టరీకి తాము వ్యతిరేకమని చెబుతూ చుట్టుపక్కల రైతులందరి సంతకాలతో ఒక లేఖను ఇవ్వాలని ఇంకొక బృందం ప్రయత్నం మొదలుపెట్టింది.

ఈ పోరులో గులాబ్ సింగ్ విజయం సాధించకుండా నా శాయశక్తులా కృషి చేస్తాను. ఈ పోరాటం ఎలా సాగుతుందో ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తుంటాను.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: