మా ఊరి శివారులో జరుగుతున్న యుద్ధం – 1

రెండు వారాలకిందట ఒక దగ్గరి బంధువు పెళ్లికి వెళ్లాను. భోజనాలయ్యాక కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుతుండగా మా చిన్నాన్న చెప్పాడా విషయాన్ని. మా ఊరి పక్కనే కొత్తగా ఒక స్పాంజ్ ఐరన్ కర్మాగారం పెడుతున్నారట. దాని గురించి 30 ఏప్రిల్ నాడు ఒక ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరుపుతున్నారట. ఆ ఫ్యాక్టరీ వల్ల నష్టాలేమైనా ఉంటాయా అని అడిగాడు చిన్నాన్న. నాకు స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ గురించి ఎక్కడో చదివినట్టు గుర్తు – బాగా కాలుష్యం సృష్టిస్తాయని. ప్రజాభిప్రాయ సేకరణలో దానిని వ్యతిరేకించమని చెప్పాను.

ఇంటికి వచ్చాక ఆ పరిశ్రమ గురించి కాస్త పరిశోధించాను. స్పాంజ్ ఐరన్ పరిశ్రమ అత్యంత కాలుష్య కారక పరిశ్రమల్లో ఒకటి. నిబంధనలు యధేచ్చగా ఉల్లంఘించే ఈ పరిశ్రమలు అవి ఉన్న అన్ని చోట్లా పరిసర గ్రామాల ప్రజలకు కడగండ్లు సృష్టిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఈ పరిశ్రమలు మూసివేయాలనే ఉద్యమాలు నడుస్తున్నాయి. ఒరిస్సా ప్రభుత్వమైతే మొన్న మార్చ్ 31 నాడు 9 స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ రాష్ట్రంలో ఇక కొత్తగా స్పాంజ్ ఐరన్ పరిశ్రమలకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయించారు.

మన రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో 4 మండలాల రైతులు అక్కడ ఉన్న స్పాంజ్ ఐరన్ పరిశ్రమలు తమ పంట పొలాలను. పండ్ల తోటలను నాశనం చేస్తున్నాయని కనుక వాటిని మూసివేయాలని హైకోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణలో భాగంగా హైకోర్టు బాధిత రైతులకు ఫ్యాక్టరీల యాజమాన్యాలు దాదాపు కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

ఇక నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద గల ఆశీర్వాద్ స్టీల్స్ అనే పరిశ్రమ తమ భూములను కాలుష్యంతో సర్వనాశనం చేసిందని, దానిని తొలగించాలని అక్కడి రైతులు దాదాపు మూడేళ్లు పోరాటం చేయగా పోయిన సంవత్సరం కాలుష్య నియంత్రణ మండలి ఆ ఫ్యాక్టరీని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదంతా తెలుసుకున్నాక ఆ పరిశ్రమ వస్తే పరిస్థితి ఎలా మారబోతుందో అర్థమయ్యింది నాకు. వెంటనే ఆ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పాల్సిందిగా మా బంధువులకు ఫోన్ చేసి మాట్లాడాను. ఈ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్న స్థలం చుట్టుపక్కల ఉన్న భూములన్నీ మా పెదనాన్నలవీ, చిన్నాన్నలవే. ఆ భూముల్లో నిమ్మ, బత్తాయి, మామిడి తోటలే కాక ఇతర ఆహార పంటలు కూడా సాగు చేస్తున్నారు. వరుసకు నాకు అన్నలయ్యే ఇద్దరు ఆ ఫ్యాక్టరీకి కూతవేటు దూరంలోనే వ్యవసాయం చేస్తున్నారు.

30వ తారీఖు నాడు గులాబ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ & పవర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రజాభిప్రాయ సేకరణకు టెంట్లు, వంటలతో ఒక పెళ్ళికి చేసినట్టు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. అక్కడికి దాదాపు రెండు ఫర్లాంగుల దూరంలోనే శివనగర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రజలు ఈ ప్రజాభిప్రాయ సేకరణ స్థలానికి వచ్చారు. వారితో పాటు పక్కనే ఉన్న ఆరెగూడెం, ముశిపట్ల గ్రామాల ప్రజలు కూడా అక్కడికి వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లు చూసి వారు కోపోద్రిక్తులయ్యారు. టెంట్లు లాగి పడవేశారు. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన జాయింట్ కలెక్టర్ ఈ వ్యతిరేకత చూసి ఆశ్చర్య పోయాడు. ఎండలోనే కూర్చుని ప్రజల విజ్ఞప్తులన్నీ రాసుకున్నాడు. ప్రభుత్వానికి ఇక్కడి ప్రజల వ్యతిరేకత తెలియజేస్తానని హామీ ఇచ్చాడు.

కానీ మరునాటికే పరిస్థితి మారింది.

(ఇంకా ఉంది)

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: