ఎవరి స్వేచ్చ? ఎవరి వాణిజ్యం? ఎవరికి సబ్సిడీ?

నేను ముసుగులు బయట పడుతున్నాయి అని రాసిన పోస్టుపై వ్యాఖ్యానిస్తూ మిత్రుడు కిరణ్ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు ఈ పోస్టు.

1) ముందుగా నేను అమెరికాలో పత్తి రైతులకు ఇచ్చే సబ్సిడీ గురించి ఉటంకించిన గణాంకాలు తప్పు అయి ఉండవచ్చునను కిరణ్ అభిప్రాయపడ్డాడు. ఈ అంకెలను నేను యు.ఎన్.డి.పి వారు ప్రచురించిన మానవాబ్ధివృద్ధి నివేదిక (Human Development Report) 2005 నుండి తీసుకున్నాను. కింద screenshot ఇచ్చాను.

[“అభివృద్ధి” అనేది ఆ పదానికి మనం ఇచ్చే నిర్వచనం పై ఆధారపడి ఉంటుందని నేను ఇదివరకు కూడా ఒకటి రెండు సార్లు చెప్పాను. అనేక దేశాల్లో ఇప్పుడు అభివృద్ధిగా చూపించబడుతున్నది కేవలం ఆర్ధికాభివృద్ధి మాత్రమే. కొన్నేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి అనుబంధ యు.ఎన్.డి.పి “మానవాభివృద్ధి” అనే కొత్త కొలమానం ప్రవేశపెట్టింది. అభివృద్ధిని కొలవడానికి ఇప్పటివరకు మనకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ కొలమానం ఇది. ఈ సంస్థ ప్రతీ యేటా వార్షిక మానవాభివృద్ధి నివేదికలు ఇస్తుంది. 2005 నివేదికలో ధనిక దేశాలు పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలను సబ్సిడీల పేరిట, సుంకాల పేరిట ఎలా మోసం చేస్తున్నాయో సుధీర్ఘంగా చర్చించారు.]

2) ఇక అమెరికా ఇస్తున్న సబ్సిడీలు ఆ దేశపు జిడిపిలో కేవలం 0.06% అని. ఆ దేశం ఆల్రెడి అభివృద్ధి చెందిన దేశం కాబట్టి మౌలిక సౌకర్యాలపై ఖర్చు చేయవలసిన పని లేదని అందుకే సబ్సిడీలపై ఖర్చు పెట్టే సామర్ధ్యం దానికుందని కిరణ్ అన్నాడు.

ఇక్కడే ఉంది తిరకాసంతా. ఇప్పుడు మనం సబ్సిడీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ప్రపంచమంతా ఒకటే గ్లోబల్ మార్కెట్ కావాలనే డబ్ల్యు.టి.వో నేపథ్యంలో కదా మనం ఇప్పుడు సబ్సిడీల ప్రస్థావన తెచ్చింది. పొరుగు దేశంపై ఎటువంటి ప్రభావం చూపని రంగాల్లో ఒక దేశం ఎంత సబ్సిడీ ఇచ్చినా అడిగేవారు ఉండరు. ఇప్పుడు చిక్కల్లా ఒక పక్క ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాల్లోనేమో అన్ని దేశాలూ తమ మార్కెట్లు తెరిచి ఉంచాలి, అన్ని దేశాల్లో వాణిజ్య చట్టాలు సమానంగా ఉండాలి, స్వేచ్చా వాణిజ్యం అని ప్రవచిస్తారు. ఆచరణకు వచ్చే సరికి ధనిక దేశాలకు ఒక రూలు, పేద దేశాలకు ఇంకో రూలు ఉంటోంది.  

ధనిక దేశాలు దొంగదారిలో సబ్సిడీలు ఇస్తూ పేద దేశాలు మాత్రం సబ్సిడీలు ఇవ్వొద్దనడం ఏ విధంగా కరెక్టు? ఆ దేశం ధనిక దేశం కాబట్టి దాని దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అది దానిష్టం వచ్చినట్టు చేసుకుంటుంది అనే వాదన ఎలా సబబు? ఒక వైపు మన రైతులను గ్లోబల్ రధచక్రానికి కట్టివేసి “వాడు డబ్బున్నవాడు అందుకే వాడికో రూల్, నీకో రూల్” అంటే అటువంటి ఆటను ఎలా ఆడాలి? ఆడి ఎలా గెలవాలి? ఇటువంటి అపసవ్య విధానాల వల్ల కాదూ లక్షలమంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నదీ గడ్డపైన?

3) సబ్సిడీలను జిడిపిలో శాతంగా కొలవడం సరికాదు అని నా అభిప్రాయం. వాటిని తలసరి లెక్కన కొలిస్తే కొంచెం మేలేమో అలోచించాలి. గ్లోబల్ మార్కెట్లో ఏ వ్యవసాయ ఉత్పత్తి అమ్మకాలు అయినా ప్రపంచ మార్కెట్ రేట్లకే కదా జరిగేది. మరి అటువంటప్పుడు మాది ధనిక దేశం కాబట్టి మేం సబ్సిడీలు ఎక్కువ ఇస్తాం అంటే పేదదేశాల రైతులు అటువంటి మార్కెట్లో ఎప్పటికయినా పోటీపడగలరా? అలోచించండి ఒకసారి. అక్కడ 20,000 మంది పత్తి రైతులకు ఇచ్చే సబ్సిడీ మనబోటి దేశాల్లో ఎన్ని లక్షల మంది రైతుల ఉసురు తీస్తుందో ఆలోచించాలి. ధనిక దేశాల్లో గుప్పెడు మంది రైతుల ప్రయోజనాలు ఒకపక్క, వ్యవసాయం తప్ప మరొక ఉపాధిలేని కోట్లాదిమంది ప్రపంచ రైతులు ఇంకొక పక్క ఉన్నారీ సమస్యలో. ఎవరి ప్రయోజనాలకొరకు ఎవరిని బలిపెడుతున్నాం మనం?

4) ధనిక దేశాల్లో వ్యవసాయ సబ్సిడీలు ఇచ్చే విధానం వల్ల పేద దేశాలపై ఎంత ప్రభావం పడుతుందో 2005 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ స్పష్టంగా పేర్కొంది. అందులోంచి రెండు ఉదాహరణలు:

-2002 నుండి 2003 మధ్య అమెరికాలో టన్నుకు 415 డాలర్ల ఖర్చుతో పండించిన బియ్యాన్ని అక్కడి సబ్సిడీల పుణ్యమా అని టన్నుకు 274 డాలర్లకే ఎగుమతి చేశారు. 

– చక్కెర పండించడంలో ఎటువంటి అనుకూల పరిస్థితులు లేకపోయినా యూరోప్ ఖండం ప్రపంచ చక్కెర ఎగుమతుల్లో రెండో స్థానంలో ఉంది. దీనికి కారణం అక్కడి దేశాలు ఇస్తున్న సబ్సిడీలే. ప్రపంచ మార్కెట్లో చక్కెర రేటుకు నాలుగింతల మద్ధతు ధర ఉంటుంది యురోపియన్ దేశాల్లో. తత్ఫలితంగా అక్కడ 4 మిలియన్ టన్నుల మిగులు చక్కెర ఉంటోంది. ఇలా పోగుపడిన మిగులును దాదాపు 100కోట్ల డాలర్ల ఎగుమతి ప్రోత్సాహకాల (సబ్సిడీలకు మారుపేరు) సాయంతో ప్రపంచ మార్కెట్లో గుమ్మరించేస్తున్నాయీ దేశాలు.

ప్రపంచ వాణిజ్య సంస్థ ఉరుగ్వేలో సమావేశమయినప్పుడు ధనిక దేశాలు ఇస్తున్న సబ్సిడీల గురించి బాగా వ్యతిరేకత వచ్చింది. ఆ చర్చల్లో సబ్సిడీల్ని తగ్గించుకుంటామన్న అమెరికా, యూరోప్ దేశాలు తదనంతర కాలంలో తమతమ దేశాల్లో వ్యవసాయానికి సబ్సిడీలు ఇంకా పెంచేశారు. ఇది మోసం కాక మరేమిటి?

తమ దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు సబ్సిడీలు ఇవ్వడమే దారుణమయితే పేద దేశాల నుండి దిగుమతయ్యే వ్యవసాయోత్పత్తులకు భారీ స్థాయిలో సుంకాలు (టారిఫ్) విధించడం ద్వారా కూడా తమ తమ దేశాల్లోని వ్యవసాయరంగాలను రక్షించుకుంటున్నాయీ దేశాలు. 

మొన్న మొన్నటిదాకా వలస కాలనీల్లో దోచుకోగా మిగిలిందేమన్నా ఉంటే దాన్ని కూడా దోచుకోవడానికి ధనిక దేశాలు రచించిన పంచరంగుల వల ఈ గ్లోబలైజేషన్. అది పైకి చూస్తే మేడిపండులా నిగనిగలాడుతూనే ఉంటుంది. కానీ దాని పొట్ట నిండా మోసమూ, కుట్రా అనే పురుగులు నిండి ఉన్నాయి.

స్వేచ్చా వాణిజ్యం పేరిట జరుగుతున్న ఈ గ్లోబల్ దోపిడీ ఎవరి స్వేచ్చ? ఎవరి వాణిజ్యం కొరకు?

On a Related Note: మన దేశంలో కూడా దుర్వినియోగం అవుతున్న సబ్సిడీలు ఉన్నాయి. పేద కుటుంబాలు ఎన్నున్నాయో గణాంకాలు ఉన్నా కూడా మన రాష్ట్రంలో కోటి ఎనభై లక్షల తెల్ల కార్డుల వారికి 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తున్నామని నిస్సిగ్గుగా దోపిడీ చేసే వ్యవస్థను నెలకొల్పే నాయకుల వల్ల ఎంతో విలువైన ప్రజాధనం వృధా అవుతుందన్నది వాస్తవం.

సబ్సిడీలు తప్పక ఉండాలి. అవి అర్హులకే చేరాలి. అదీ నా అభిమతం.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: