మౌన సాక్షులమేనా?

నిన్న పని ఉండి ఆఫీసుకు లీవ్ పెట్టాను. సాయంత్రం పొరపాటున ఏదో న్యూస్ చానెల్ చూస్తే అందులో శాసనసభలో పెద్ద దారుణం జరిగిపోయినట్టుగా బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. అప్పుడు మొదలుపెట్టి దాదాపు నాలుగు గంటల పాటు ఏ తెలుగు సినిమా ఇవ్వనంత లైవ్ వినోదం అందించారు మన ప్రజా ప్రతినిధులు. ఒకరి గోత్రాలు ఒకరికి బాగా తెలుసు కాబట్టి ప్రజలకు ఎదుటివాడి గుట్టు మట్లు తెలియజెప్తున్నారు. తమకన్నా ఎదుటివాడే పెద్ద దొంగ అని నమ్మించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు.

మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ ను తెలుగుదేశం వ్యూహత్మకంగా ఇరికిస్తే నిన్న అదే ఉచ్చులో చంద్రబాబును ఇరికించింది కాంగ్రెస్. ఈ ఇద్దరి ఎత్తుల పై ఎత్తుల సమరంలో ప్రజలకు మాత్రం రాజకీయాలపై విరక్తి పుడుతుంది. అందరు దొంగలే అనే ఒక సినికల్ స్టేజికి చేరుకున్నారు ప్రజలు. ప్రజాస్వామ్యానికి ఇవి అత్యంత ప్రమాదకర పరిస్థితులు.

మైనింగ్ లీజుల గురించి వైయెస్ ను చంద్ర బాబు నిలదీస్తే నువ్వున్నప్పుడు చేసిన నిర్వాకం ఇదీ అంటు ఎదురుదాడి చేశాడు ముఖ్యమంత్రి. ప్రాజెక్టుల అవినీతి గురించి ప్రశ్నిస్తే నీ హయాంలో 2 కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టుకు నేను 200 కోట్లు కేటాయించాను అనేది జవాబు. సాక్షి పత్రిక షేర్ల గురించి ప్రశ్నిస్తే దేవేందర్ గౌడ్ మాట్రిక్స్ కంపెనీ షేర్లు 70 రూపాయలకు కొని 1500 రూపాయలకు అమ్మలేదా అని జవాబు. ఇదీ వరస. 

ఇద్దరు గజదొంగలు కలిసి రాష్ట్రాన్ని గత పదిహేనేళ్లుగా ఇలా దోచుకు తింటుంటే మనం మౌన సాక్షుల్లాగే ఉంటున్నామా?

 — —

సాక్షి పత్రికతో తమ మూలాలు కదిలిపోయే ప్రమాదం కనపడ్డట్టుంది పాపం ఈనాడు, ఆంధ్ర జ్యోతి బాగానే హోంవర్క్ చేస్తున్నాయి. నిన్న శాసనసభలో చంద్రబాబు సాక్షి పత్రికకు ఎక్కడి నుండి ఎలా పెట్టుబడులు వచ్చాయో చిట్టా విప్పారు. బహుశా ఈ కీలక సమాచారం ఆ “రెండు పత్రికల” పనే అయి ఉంటుంది.

ఈనాడులో ప్రచురితమైన సదరు చిట్టా చదివితే అవినీతి ఎంత వ్యవస్థీకృతమయ్యిందో కళ్ళకు కడుతుంది. చదవండో సారి: 

సాక్షి పత్రిక పూర్తిగా అవినీతి సొమ్ముతో పెట్టారని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీవ్రంగా విమర్శించారు. ”సత్యమేవ జయతే” అని సాక్షి పత్రికలో చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ‘సాక్షి’లో పెట్టుబడుల పేరుతో వివిధ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. తాము పెట్టిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం శాసనసభలో చంద్రబాబు ముగింపు ఉపన్యాసం చేస్తూ సర్కారు అవినీతిపై నిప్పులు చెరిగారు. ఆయన ప్రసంగం అనంతరం అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్‌ ప్రకటించారు. సభను నిరవధికంగా వాయిదా వేశారు. ”ల్యాంకో సంస్థకు రూ.10వేల కోట్లు విలువ చేసే వక్ఫ్‌ భూములు కట్టబెట్టి డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు సాక్షిలో పెట్టుబడులు పెట్టారు. అరబిందో కంపెనీకి జడ్చర్ల వద్ద ఎస్‌ఈజెడ్‌ ఇచ్చి సాక్షిలో వాటా కింద రూ.8 కోట్లు తీసుకున్నారు. మీ బినామీ కంపెనీ షేర్లను రూ.10 విలువ చేసేవి రూ.350కు పెంచారు. సాక్షి పత్రికలో మొత్తం రూ.356 కోట్లు అవినీతి సొమ్ము పెట్టుబడులుగా మారింది” అని అన్నారు. అవినీతిలో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కేస్‌ స్టడీగా పేర్కొన్నారు. ”సాక్షి పత్రికలో క్యారామెల్‌ ఏసియా హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ రూ.50.03 కోట్లు, ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌కు మైనింగ్‌ లీజులు ఇచ్చి రూ.34.02 కోట్లు, గిల్‌క్రిస్ట్‌ ఇన్వెస్టుమెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి రూ.52.69 కోట్లు వాటా కింద ముడుపులు తీసుకున్నారు. పి.వి.పి. బిజినెస్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నాదర్‌గుల్‌ వద్ద ప్రభుత్వ భూములకు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి సూర్యప్రకాశరావు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. దీనికి అతను సాక్షిలో వాటా కింద రూ.48.61 కోట్లు పెట్టారు. హెట్రో గ్రూపుకు జడ్చర్ల వద్ద రెండు ఎస్‌ఈజడ్‌లు ఇచ్చి రూ.13.12 కోట్లు, ట్రిడియంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌కు జడ్చర్ల వద్ద ఎస్‌ఈజడ్‌ ఇచ్చి రూ.6.80 కోట్లు, పయనీర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ సంస్థకు బంజారాహిల్స్‌లో హోటల్‌ కట్టుకోవడానికి వీలుగా నిబంధనలు సడలించినందుకు పెన్నా ప్రతాపరెడ్డి రూ.19.44 కోట్లు, రామ్కీ ప్రాజెక్ట్సుకు గచ్చిబౌలి వద్ద ఎకరం రూ.1.50 కోట్లతో 19 ఎకరాలు ఇచ్చారు. దీనికి వారు రూ.7.70 కోట్లు, ఆల్ఫా విల్లాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.29.16 కోట్లు, సందేశ్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.23.33 కోట్లు… ఇలా సాక్షిలో వాటాల కింద రూ.356 కోట్లు ముడుపులు తీసుకువచ్చారు. సాక్షిలో పెట్టుబడులు మొత్తం అవినీతి సొమ్ము” అని చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం సాక్షి పత్రిక షేరు రూ.350 చేశారని తెలిపారు. దీని ప్రకారం కంపెనీ పూర్తి విలువ రూ.3500 కోట్లు చేశారన్నారు. ఇందులో రూ.2450 కోట్లు నల్లధనం ఉందన్నారు.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: