మనకు నిజంగానే స్వతంత్రం వచ్చిందా?

రెండు రోజుల వ్యవధిలో శంషాబాద్ విమానాశ్రయం నడుపుతున్న జీఎమ్మార్ సంస్థ తీసుకున్న రెండు నిర్ణయాలు, దాన్ని ప్రభుత్వ శాఖలు “జీ హుజూర్” అంటూ శిరసావహించిన వైనం చూసిన నేను ఈ రెండు ముక్కలు రాయకుండా ఊరుకోలేకపోయాను.

మొదటిది మొన్నటి నుండి జీఎమ్మార్ విమానాశ్రయం వద్దకు ఆర్టీసీ బస్సులను రానివ్వవద్దని తీసుకున్న నిర్ణయం. బస్సులు ఉంటే సందర్శకుల తాకిడి ఎక్కువవుతుందనేది జీఎమ్మార్ ప్రతినిధులు ఇచ్చిన వింత వివరణ. వచ్చే అనేక దశాబ్దాల పాటు ప్రజల అవసరాలను తీర్చడానికి వేల కోట్ల పోసి నిర్మించారు కదా ఈ గొప్ప కళాఖండాన్ని. మొదలై నాలుగు రోజులు కాక ముందే సందర్శకుల తాకిడి తట్టుకోలేకపోతే ఎలా?   

ఇక నిన్న జీఎమ్మార్ మరో వింత నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్టు కాంప్లెక్స్ లోకి ద్విచక్ర, త్రిచక్ర వాహనాలని నిషేధించింది. కేవలం కార్లు, పెద్ద వాహనాల్లో వారే విమానాశ్రయంలోకి రావడానికి అర్హులట. మిగతా వాళ్ళని పోలీసులు విమానాశ్రయానికి 8 కిలోమీటర్ల ముందే చెక్ పోస్టు వద్ద ఆపేశారట.  

ఈ నిర్ణయాల వెనుక కారణాలు వేరే ఉన్నాయని అనిపిస్తోంది నాకు. ఆర్టీసీ చౌకగా ప్రయాణీకులను అక్కడికి చేరవేస్తే జీఎమ్మార్ వారి ఏసీ బస్సులు, క్యాబులు ఎవరు ఎక్కుతారు?  

ఎయిర్ పోర్టు నడిపితే వచ్చే డబ్బులు చాలట్లేదు జీఎమ్మర్ వారికి. ఇప్పుడు అక్కడికి వచ్చే రవాణా వ్యాపారం కూడా తామే చెయ్యాలనే దురాశ పుట్టింది కాబోలు. ఇప్పటిదాకా జీఎమ్మార్ వారికి కేవలం విమానాశ్రయమే రాసిచ్చారనుకున్నాను. దానికి వచ్చే దారులు కూడా దానికే హక్కుభుక్తం చేశారన్నమాట.

అయినా ప్రజల భవిష్యత్తుని వేలంపాటలో అమ్మేశాక ఇక ఫలితం మరోలా ఎందుకు ఉంటుంది? 

ఒక్కో సారి మనకు నిజంగానే స్వతంత్రం వచ్చిందా అని అనుమానం వస్తుంటుంది నాకు.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: