ఇప్పుడు మనందరం సాక్షులం!

saakshi newspaper

టీవీల్లో First Day First Show తరహా కార్యక్రమాలు చూసిన ప్రేరణతో ఇవ్వాళ మొదలైన “సాక్షి” పత్రిక తొలిరోజు సంచికపై నా అభిప్రాయం తెలియజేస్తున్నాను.

పేపర్ చేతిలోకి తీసుకోగానే నాకు అర్థమైన మొదటి విషయం ఇది కొంచెం “బరువైన” పత్రిక అని! ఇది మొదటి రోజు కాబట్టి ఇన్ని అనుబంధాలు ఇచ్చారో లేక ప్రతి రోజూ ఇలానే ఉండబోతుందో తెలియదు. రెండు రూపాయలకు ఇంత “బరువు” పత్రిక ఇస్తే చాలా మంది జనాలు పత్రికలో వార్తల కొరకు కాకపోయినా ఈ “బరువు” ప్రాతిపదికన పత్రికను కొంటారని ప్రచురణకర్తల ధీమా కాబోలు. మొత్తం 52 పేజీలు ఉన్నాయి ఆరంభ సంచికలో.

అన్ని పేజీలు రంగుల్లో అని ఈ పాటికే కొన్ని వందల హోర్డింగుల్లో చదివాం కదా. రంగుల పేజీలు కాబట్టి చూడడానికి కంటికి ఇంపుగానే కనిపిస్తుంది పత్రిక. ప్రధాన వార్తలతో పాటు మిగతా అన్ని పత్రికల్లాగే మహిళల పేజీ, సినిమా పేజీ, విద్య, ఉద్యోగాలకు కెరీర్ పేజీ, స్పోర్ట్స్ పేజీ వంటివి ఉన్నాయి.

రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిల్లో ముఖ్య నగరాల వాతావరణ వివరాలు, WoW Hyderabad వంటి పత్రికలో ఇచ్చే హైదరాబాద్ ఆర్ట్ గ్యాలరీలు, పర్యాటక విశేషాలు, క్లబ్బులు, పబ్బుల వివరాలు, విమానాల వేళలు తెలుగు దినపత్రికల్లో కొత్త విషయం.

వార్తల క్వాలిటీ విషయానికి వస్తే తొలిరోజే దానిపై వ్యాఖ్యానించడం అంత సరికాదు అని నాకు అనిపించింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలనుండి కొంచెం స్థాయి ఉన్న జర్నలిస్టులను (కార్టూనిస్టులతో సహా) చేర్చుకున్నాక వార్తల రిపోర్టింగ్ సహజంగానే బాగానే ఉంటుంది.

రేపటి నాడు పత్రిక ఎటువంటి పాలసీ అవలంభిస్తుందో తొలిరోజు వైయెస్ జగన్ రాసిన (ఆయన పేరిట రాసిన అనాలేమో) సంపాదకీయం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. తాము పత్రిక పెట్టిందే కొన్ని పత్రికల (ఈనాడు అని చదువుకోవాలి మనం) పక్షపాత వైఖరి వల్ల అని, తమ పత్రిక మంచి ప్రభుత్వానికి (అంటే నాన్న గారి పరిపాలన అని చెప్పనక్కరలేదనుకుంటా) మద్ధతుగా నిలుస్తుందని జగన్ గారు సూటిగానే చెప్పారు.

ఇక ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ తివారీ నుంచి మొదలుకొని చిరంజీవి, నాగార్జున, సి.పి.ఐ. నారాయణ, సి.పి.ఎం రాఘవులు, ఎం.ఐ.ఎం. అసదుద్దీన్ ఓవైసి, బీ.జే.పీ కిషన్ రెడ్డి, పుల్లెల గోపీచంద్, భూమిక ఇలా రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులంతా హాజరయ్యారు. వక్తల్లో అనేకులు సాక్షి పత్రిక “నిష్పక్షపాతంగా” ఉండాలని ఆకాంక్షించారు (ఇంకేం చెయ్యగలరు పాపం)

ఇక పత్రికలో ఉన్న ప్రభుత్వ ప్రకటనల చిట్టా చూడండి:

1) వ్యవసాయ శాఖ – 2 ఫుల్ పేజీలు
2) పర్యాటక శాఖ – 1 ఫుల్ పేజీ
3) ఆర్టిసీ – 1/4 పేజీ
4) రవాణా శాఖ – 1/2 పేజీ
5) గ్రామీణాభివృద్ధి శాఖ – 1/4 పేజీ
6) శిల్పారామం – 1/4 పేజీ
7) పౌర సరఫరాల శాఖ – 1/6 పేజీ
8 ) హుడా – 1/6 పేజీ
9) కుటుంబ సంక్షేమ శాఖ – 1/6 పేజీ
10) ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి – 1/6 పేజీ
11) గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య శాఖ – 1/6 పేజీ
12) ఆం.ప్ర పారిశ్రామిక మౌళిక వసతుల శాఖ – 1/4 పేజీ

రేపటి నాడీ సాక్షి పత్రిక కాంగ్రెస్ ప్రభుత్వ మద్ధతుతో పార్టీ ప్రచార కరపత్రం అయ్యే సూచనలు, సంకేతాలు తొలిరోజు పత్రిక చూస్తేనే అర్థమవుతున్నాయి.  

సుమారు 500 కోట్ల పెట్టుబడితో సాక్షి పత్రికను స్థాపించారని వార్తలు వినవస్తున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి పుత్ర రత్నం ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. ఒక ఉక్కు ఫ్యాక్టరీ, ఒక వార్తాపత్రిక, ఒక టీవీ చానెల్ ఇలా వేల కోట్ల రూపాయల సంస్థలను స్థాపిస్తూ పోతున్న వైనం చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. 

ప్రజలేమనుకుంటారో అన్న కనీసపు భావన లేకుండా సిగ్గూ ఎగ్గూ లేకుండా రాష్ట్రంలో నడుస్తున్న దోపిడీ పాలనలో మరో మల్టీ కలర్ మజిలీకి ఇప్పుడు మనందరం సాక్షులం!

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: