నిజం కళ్ల ముందే నిలబడి ఉంది…

శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభోత్సవం భారతదేశ చరిత్రలో ఒక కీలక మలుపు అని కొన్ని పత్రికలు రాశాయి. అలా రాయడానికి వాటికి ఉన్న ప్రాతిపదిక వేరే కావొచ్చు కానీ నిజంగానే ఆ విమానాశ్రయం ప్రారంభోత్సవం దేశచరిత్రలో ఒక కీలక మలుపే. జాతి ప్రయోజనాలు ప్రైవేటు దొరల కాళ్లవద్ద మన పాలకులు ఎంత బాధ్యతారహితంగా తాకట్టు పెట్టారో నగ్నంగా ఆవిష్కృతమయిన సన్నివేశమది. ఈ దేశంలో జెండాలు మాత్రమే మారుతున్నాయని, అన్ని రాజకీయ పార్టీల ఎజెండాలు ప్రైవేటు, బహుళ జాతి సంస్థల పాదసేవకే అంకితమని సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రజలకు ప్రదర్శించిన మహా ఘట్టమది. గుక్కెడు మంచినీళ్ల దొరకక అల్లాడుతున్న పేద ప్రజలు కూడా “యూజర్ చార్జీలు” చెల్లించాలని, దేన్నైనా ఉచితంగా ఇస్తే విలువ తెలియదని గట్టున కూర్చుని నీతులు చెప్పే మధ్య, ఉన్నత తరగతుల వారి దిమ్మ తిరిగేలా “యూజర్ చార్జీల” రుచి చూపించిన రసవత్తర ఘట్టమది.

1200 కోట్ల అంచనా పెట్టుబడితో మొదలైన షంషాబాద్ విమానాశ్రయం ప్రాజెక్టులో ఆంధ్ర ప్రదేశ్ వాటా 13%, భారత ప్రభుత్వం వాటా ఇంకో 13% కాగా, జీఎమ్మార్ వారికి 63%, వారి జాయింట్ వెంచర్ పార్ట్నర్ మలేషియా ఎయిర్ లైన్స్ బెర్హార్డ్ వారికి 11% వాటాలు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో జీఎమ్మార్, ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఏకపక్ష ఒప్పందం చూస్తే ఎవరికైనా కళ్లు తిరిగిపోవడం ఖాయం. భుఇల్ద్, ఓపెరతె, ట్రన్స్ఫెర్ – భోట్) ప్రాతిపదికన నిర్మించిన ఈ విమానాశ్రయం 60 ఏళ్లపాటు జీఎమ్మార్ వారికే హక్కుభుక్తం అవుతుంది.

ఈ ఒప్పందం ఎంత మోసపూరితమో ఒక సారి చూడండి:

1) ఒప్పందం నాటి అంచనాల ప్రకారం చూస్తే జీఎమ్మార్ ఈ విమనాశ్రయానికి ఖర్చు పెట్టేది కేవలం 756 కోట్లు. ఈ మాత్రం డబ్బులు మన ప్రభుత్వాల వద్ద లేవనా ప్రైవేటు కంపెనీలను రంగంలోకి దించింది? ఆధునిక టెక్నాలజీ కావాలనుకుంటే అది ఇచ్చే సంస్థలు ఎన్ని లేవు? అయినా జీఎమ్మార్ చేసింది కూడా అదే కదా?

2) ఈ ఎయిర్ పోర్ట్ కు రోడ్ల అనుసంధానం కొరకు, ఇంకా ఇతర సేవల కొరకు ఇప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వానికి అయిన ఖర్చు 8000 కోట్లట. చూడండీ తమషా. 800 కోట్లు పెట్టుబడి పెట్టిన ఒక ఆసామి కొరకు 8000కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధపడింది మన ప్రభుత్వం. ఇంత పెట్టినవాళ్ళు ఆ 800 కోట్లు కూడా పెట్టేస్తే విమానాశ్రయం స్వంతమయ్యేది కదా?

3) ఈ ఒప్పందంలో అన్నిటికన్నా దుర్మార్గమైనది బేగంపేట విమానాశ్రయం మూసివేత. అంతే కాదు మరో 25 ఏళ్ల పాటు షంషాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల దూరంలో మరో విమానాశ్రయం నిర్మిచడానికి వీలు లేదట. నిజాం కాలంలో మొదలైన బేగంపేట ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉందో ఇప్పుడు కొత్తగా చెప్పనవసరం లేదు. అయినా నిజాం రాజుకు హైదరాబాద్ తో పాటు ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో వరంగల్ లో ఇంకో విమానాశ్రయం ఉండాలన్న ముందుచూపు ఉంటే, ఎంతో “విజన్” ఉన్న మన పాలకులు ఇంతా బాధ్యతారాహిత్యంగా ఎలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు? ప్రపంచానికే “దిశా నిర్దేశం” చేయగల ఈ గొప్ప సైబరాబాద్ కు రెండు విమానాశ్రయాలు ఎందుకు అక్కర లేదు? మాట్లాడితే విదేశాల అభివృద్ధిని చూపించే మన పాలకులకు తెలియదా విదేశాల్లో ఎన్నో నగరాల్లో రెండు విమానాశ్రయాలు ఉన్నాయని? నీతులు కేవలం ఇతరులకు చెప్పడానికేనా? ఎయిర్ పోర్టును తవ్వేసి షాపింగ్ మాల్స్ కట్టాలనుకునే వాళ్లను ఏమనాలి?

ఒప్పందం కుదుర్చుకుంది తానే కాబట్టి ఇప్పుడు బాబు తేలుకుట్టిన దొంగలా బేగంపేట గురించి ఏమీ మాట్లాడటంలేదు. కొత్త విమానాశ్రయానికి ణ్టృ పేరు పెట్టాలని గొడవ చేయడం అసలు సమస్యనుండి ప్రజలను పక్కదోవ పట్టించడమే.

4) 1991 లో ఆర్ధిక సరళీకరణ మొదలైన తరువాత ప్రభుత్వరంగ సంస్థలు కొన్ని రంగాల్లో గుత్తాధిపత్యం (Monopoly) కలిగి ఉన్నాయని, ఆయా రంగాల్లో పోటీ ఉండాలని, అప్పుడే వినియోగదారుడికి ప్రయోజనం వాటిల్లుతుందని మన్మోహన్ సింగ్ వంటి వాళ్ళు మనకు ఎన్నిసార్లు చెప్పలేదు. మరి ఇప్పుడు జీఎమ్మార్ ఎయిర్ పోర్ట్ కు మాత్రం పోటీ ఎందుకు ఉండొద్దు ?

5) ఇదే జీఎమ్మార్ సంస్థ టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో కూడా రెండో విమానాశ్రయం నిర్మించే కాంట్రాక్టు పొందింది. అక్కడ మొదటి ఎయిర్ పోర్ట్ ను ఏమీ మూసివేయట్లేదు. అంతే కాదు అక్కడ విమానాశ్రయంపై కేవలం 20 ఏళ్ల వరకు మాత్రమే జీఎమ్మార్ సంస్థకు హక్కు ఉంటుంది. ఈ సంగతులన్నీ జీఎమ్మార్ వారు తమ వెబ్ సైట్లోనే గొప్పగా రాసుకున్నారు. చదివి తరించండి. (http://www.gmrgroup.in/Airports/Sabiha_Gokcen_International_Airport_Limited.html)

ఒక చిన్న దేశమైన టర్కీ కూడా ప్రైవేటు కంపెనీల మెడలువంచి తనకు లాభదాయకంగా ఉండే ఒప్పందాలు కుదుర్చుకుంటుంటే. ఘనత వహించిన మనదేశ పాలకులేమో దేశ సార్వభౌమత్వాన్ని ప్రైవేటు దొరలకు తాకట్టు పెడుతున్నారు.

నిజం కళ్లముందే నిలబడి ఉంది. అలోచిద్దామా లేక ఎప్పటిలాగే తల తిప్పేసుకుందామా?

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: