మా తాతలు పండించుకుని తిన్నారు!

ముఖ్య గమనిక: ఈ పోస్టులో కేవలం వ్యక్తిగత విషయాలే ఉన్నాయి. 

కొన్నాళ్ల క్రితం ఇంట్లో బియ్యం అయిపోయాయి. వెంటనే ఊర్లో ఉండే నాన్నకి ఫోన్ చేశాను బియ్యం పంపించమని. “ఇక్కడ కూడా అయిపోయాయి. షాపుకు పోయి కొనుక్కో” మని అట్నుంచి జవాబు.

మనస్సు కలుక్కుమంది అది విని.

ఎక్కడ్నుంచి ఎక్కడికొచ్చాం మనం!

గత 20 యేళ్లుగా ఇలా ఒక్కో సరుకూ పండించడం అనే దశ నుండి ‘కొనుక్కోవడం’ అనే దశకి మా కుటుంబం సాధించిన “అభివృద్ధి” ఒకసారి నెమరు వేసుకుంటే…

నల్గొండ జిల్లాలో మోత్కూరు మండలం, ఆరెగూడెం అనే చిన్న గ్రామానికి చెందినవాన్ని నేను. మూడు స్వంత బావులూ, ఒక బావి లో 1/3 పొత్తుతో కలిపి దాదాపు 50 ఎకరాల సేద్యయోగ్యమైన భూమి ఉండేది నాకు జ్ఞాపకం ఉండే నాటికి.

ఈ 50 ఎకరాల్లో మా తాత, నాన్న ఇద్దరూ కలిసి (అయిదారుగురు జీతగాళ్ల రెక్కల కష్టం సాయంతో) చాలా పంటలే పండించేవారు. నీటి సౌకర్యం ఉన్న తరి పొలాల్లో వరి పండేది. మా కుటుంబంలో దాదాపు అందరికీ (నేనూ, మా అక్కలూ, చెల్లెలూ) మా పొలాల్లో పండిన బియ్యమే నిన్న మొన్నటి వరకూ సరిపోయేవి. మొదట్లో మేము తినడమే కాక మార్కెట్ కు పంపేవారం. గత 5-6 యేళ్లుగా మా వరకే సరిపోతూ వచ్చాయా ధాన్యం.

ఇక ఆరు తడి పొలాల్లో మిర్చి, ఇంకా టొమాటొ, వంకాయ, గోకర కాయ (గోరు చిక్కుడు), వంటి కూరగాయలు, కొత్తిమీర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలూ పండేవి. చెలకల్లో చేను మధ్యలో కాసే దోసకాయలూ బాగానే ఉండేవి.

సెలవల్లో ఆరెగూడెం వెళ్తే ఈ కూరగాయలను తరాజులో జోకి ఎడ్ల బండిలో పోసి మోత్కూర్ లోని చిల్లర వ్యాపారులకు పంపుతూ క్షణం తీరిక లేకుండా నాయనమ్మ కనపడేది. తోట బావి దగ్గర ఉన్న పెద్ద కరివేపాకు చెట్టు నుంచి మాకు సరిపోయినంత కరివేపాకు వచ్చేది. సీజనులో దోసకాయల వంటి కూరగాయలు కోసి ఎండబెట్టి ఒరుగు చేసుకుని పచ్చి కూరగాయలు లేనప్పుడు తినేవాళ్లం.

వర్షాధార చెల్కా నేలల్లో కందులు, ఆముదాలు, పెసర్లు, ఉలవలు, బొబ్బర్లు, పొద్దు తిరుగుడు, వేరు శెనగ, జొన్న, మొక్కజొన్న పండించేవారు.

ఇంట్లోకి సరిపడా పప్పు ధాన్యాలను మిల్లుకు పంపి పప్పు పట్టించి వాడుకునే వాళ్లం. వేరుశనగ, పొద్దు తిరుగుడు నూనె తీయించి వాడుకునే వాళ్లం. నూనె తీయిస్తే వచ్చే చెక్క ఆవులకు, బర్రెలకు మేతగా పనికివచ్చేది.

ఇక బావి పక్కన 6 ఎకరాల స్థలంలో బత్తాయి, మామిడి తోట ఉండేది. తోటలోనే ఒక దబ్బకాయ, మూడు ఉసిరి, 2 నిమ్మ చెట్లు ఉండేవి. ఆపుడప్పుడూ పులిహోరకూ, ఏడాదికోసారి పచ్చడికీ ఉపయోగపడేవీ చెట్ల ఫలాలు.

సంవత్సరానికి మూడు కాతలు (అంగం, గైరంగం, ఎడకారు) కాసేది మా బత్తాయి తోట. ఇక మామిడిలోనయితే తోతాపురి, బంగినపల్లి, రసాలు…ఇవే కాక సంవత్సరం లో రెండుసార్లు కాసే పునాస రకమూ ఉండేది.

ఇక బావి చుట్టు దాదాపు అరడజను చింత చెట్ల నుండి చింతపండు వచ్చేది. ఎండాకాలంలో ఆ చింతపండును కొట్టి గింజలను తీయడం ఇప్పటికీ జ్ఞాపకమే.

చాలా ఏళ్లు పసుపు కూడా పండించారు నాన్న వాళ్ళు. అడపాదడపా ఉల్లిగడ్డ కూడా పండేది. ఒక ఏడాది మా నాన్న అరటి తోట వేశాడు కానీ అప్పటికి (80ల్లో) మార్కెట్ సౌకర్యాలు లేక అది కొనసాగించలేదు.

మా తాత ఉన్నన్ని రోజులూ గొర్రెల మంద ఉండేది. కొన్ని మేకలూ ఉండేవి. తాత మేక పాలు తాగేవాడు కానీ నాకవి అంతగా రుచించలేదు. పండగొచ్చిందంటే ఒక మేకనో, గొర్రెనో కోసేవారు. తాజా పొట్టేలు మాంసంతో చేసిన రకరకాల వంటకాలు నోరూరించేలా తయారయ్యేవి.

ఇక కోళ్ల సంగతి చెప్పనక్కర లేదు. ఎప్పుడు వంద కోళ్లకు తగ్గకుండా ఉండేవి మా బావి దగ్గర. వాటికి రోగాలు రాకుండా మా నాయనమ్మ అనేక చిట్కా వైద్యాలు చేసేది. చీమ కోళ్లు (తెలుసా ఎలా ఉంటాయో ఇవి? నల్లని శరీరంపై చిన్న తెల్ల చుక్కలుంటాయి) కూడా చాలా ఏళ్లు పెంచాము. అవి రాత్రి పూట చెట్ల పైన గడిపేవి. గుడ్లు ఏ రక్కిస పొదల్లోనో పెట్టేవి. మా ఇంటి పని మనిషితో కలిసి ఆ రక్కిస పొదల వెంట చీమ కోడిగుడ్ల కోసం చేసిన అన్వేషణ ఇంకో మధుర జ్ఞాపకం. ఈ ఈ కోళ్లున్న చోటికి పాములు దగ్గరికి రావని నమ్మకం.

మా పట్టా భూముల్లోనే రెండు కుంటలు (చిన్న చెరువులు) ఉండేవి. ప్రతీ యేడూ వర్షాకాలం నీటితో నిండిన ఈ కుంటల్లోనూ, మా వ్యవసాయ బావుల్లోనూ చేపపిల్లలు వేసేవాడు మా నాన్న. ఎండాకాలం వచ్చేనాటికి అవి మంచి సైజుకి ఎదిగేవి. నేనూ నాన్నా కలిసి గాలం పుచ్చుకుని బావి గట్ల మీదా, కుంట కట్ట మీదా గడిపిన రోజులు ఎన్నటికి తిరిగిరాని మధుర జ్ఞాపకం.

ఇంట్లో ఎప్పుడూ కనీసం రెండో మూడో పాలిచ్చే బర్రెలు ఉండేవి. నిన్నమొన్నటి దాకా పాలకు గానీ పాల ఉత్పత్తులకు గానీ కొదవుండేది కాదు..

అప్పట్లో మోత్కూర్ లోని కిరాణా షాపుకు వెళ్లి మేము కొనే సరుకులు – సబ్బులూ, మసాలా దినుసులు…

మరి ఇప్పుడో?

అటు ప్రకృతీ, ఇటు ప్రభుత్వమూ కలిసి వ్యవసాయం పైన ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధాటికి అందరి వ్యవసాయాల్లాగే మా వ్యవసాయమూ కుదేలైంది. నీరు పాతాళంలోకి పోయి బావుల్లో తుప్పలు మొలిచే పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల వరుస కరువుకు పదేళ్లు అల్లారు ముద్దుగా పెంచిన తోట నిలువునా ఎండిపోయింది. వరి పంట గగనమైంది. అటు మార్కెట్, ఇటు వర్షం రెండు పక్కలా దగా చేయడంతో చెల్క పంటలూ అటకెక్కాయి. ఇలా పాడీ, పంటా రెండూ దశలవారీగా కనుమరుగయ్యాయి.

మెల్లగా ఒకో వస్తువూ కొనుక్కోవడం మొదలు పెట్టిన మా కుటుంబం ఇప్పుడు చివరికి బియ్యం కూడా కొనుక్కునే స్థాయికి “అభివృద్ధి” సాధించింది.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: