మదించిన దున్నపోతుల స్వైరవిహారం

1991లో ఆర్ధిక సరళీకరణ జరిగిన కొత్తల్లో స్టాక్ మార్కెట్ మధ్య తరగతి ప్రజలకు ఒక చక్కటి మదుపు సాధనం. తదనంతర కాలంలో కొద్దిమంది బడా వ్యక్తులు, సంస్థల చేతిలో అది బందీ అయిపోయింది. అమెరికా లాంటి దేశాల్లో వడ్డీ రేట్లు పెద్దగా లేని కారణంగా అనేకమంది విదేశీయులు మన స్టాక్ మార్కెట్లలో డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. ఈ మధ్య వ్యవహారం తారాస్థాయికి చేరింది. అమెరికన్ డాలర్ విలువ రోజు రోజుకీ పడిపోతుండటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) కోట్ల డాలర్లను మన స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడుతున్నారు. అయితే వాళ్లు చాలా సిస్టమాటిక్ గా చేస్తున్న ఒక మోసం వల్ల మన దేశపు సంపద మెల్లగా తీరాలు దాటుతోంది.

ఈ విదేశీ సంస్థలు (FII) ఇవ్వాళ పెట్టుబడులు పెట్టడం, ఒక వారం రోజులు ఆగి షేర్ల ధరలు పెరగగానే అమ్మేసుకోవడం అనే ఆట గత కొంతకాలంగా ఆడుతున్నారు. స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టి చిన్న ఇన్వెస్టర్లు చేతులు కాల్చుకుంటున్నారు. FIIలు షేర్లు అమ్మిన ప్రతిసారి నష్టపోయేది చిన్న ఇన్వెస్టర్లే. పోయిన వారం స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పుడు హరించుకుపోయిన మొత్తం 6,00,000 కోట్లని ఒక అంచనా. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ సంఘటన జరిగిన రెండు రోజులకే ఇవే FIIలు మళ్ళీ స్టాక్ మార్కెట్లోకి తిరిగి వచ్చారు. ఈ సారి వారు 50,000 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు. అంటే ఇలా వారు అమ్మకాలకు పాల్పడ్డ ప్రతీసారి లక్షల కోట్ల రూపాయలు సరిహద్దులు దాటుతున్నయన్నమాట.

ఇది నిరోధించాల్సిన ప్రభుత్వం ఒక వింత పని చేస్తోంది. కొంత కాలం కిందట ఒకే రోజు ఆర్ధిక మంత్రి, వాణిజ్య మంత్రి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, సెబీ చైర్మన్, ఒకే విధమైన ప్రకటనలు చేశారు. స్టాక్ మార్కెట్లో ఏమి జరుగుతుందో తమకు అర్ధం కావట్లేదని, చిన్న మదుపుదారులు అందులోకి వెళ్లకుండా ఉండాలని!. చూడండి పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందో. ఈ దేశపు స్టాక్ మార్కెట్లో ఏమవుతుందో ఈ దేశపు ఆర్ధిక వ్యవస్థను నడిపే నాలుగు స్థంభాలకు తెలియడం లేదట.

ఇక బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) అయితే ఒక అడుగు ముందుకు వేసి చిన్న మదుపుదారులు అసలు స్టాక్ ఎక్స్చేంజిలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని అన్ని దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. అసలు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏమిటి అర్థం? ప్రజల నుండి పెట్టుబడులు సేకరించి వారి యాజమాన్యంలోనే నడిచే కంపెనీ అని కదా. మరి ఇదేమిటి 60 యేళ్ల స్వతంత్ర భారత దేశంలోకి విదేశీ ఇన్వెస్టర్లను పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తాం, మన పౌరులను మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం క్షేమం కాదని హెచ్చరిస్తాం! ఇదేనా సరళీకరణ పేరిట మనం సాధించింది?

పోనీ మధ్య తరగతి ప్రజలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకుండా ఉంటే సరిపోద్ది కదా అని మీరు అంటుండవచ్చు. కానీ ఒక సారి ఈ నిజాలు చూడండి.

1) ఉద్యోగుల కష్టార్జితం అయిన  ప్రావిడెంట్ ఫండ్ (PF) నిధులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

2) ఇవ్వాళ మ్యూచువల్ ఫండ్స్, Stock Linked Insurance Plans వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మధ్య తరగతిలో అనేకులు స్టాక్ మార్కెట్లో పరోక్ష పెట్టుబడులు పెట్టారు

చిన్న ఇన్వెస్టర్లు ముందుకు రాక షేర్లు అన్నీ బడా కంపెనీలు, విదేశీ కంపెనీల చేతిలోకే వెళ్తే విధాన నిర్ణయాలు ఎవరి బాగు కొరకు జరుగుతాయో వేరే చెప్పనక్కరలేదు. 

ఈ మదించిన దున్నపోతుల స్వైరవిహారంలో నలిగిపోతున్న సగటు మానవుడు పాలకులకు పట్టడా?

 Previous Posts:

మారిషస్ లో అన్ని డబ్బులున్నాయా?

స్టాక్ మార్కెట్ లో టెర్రరిస్టుల డబ్బులు!

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: