విఫల స్మరణలు

 2007 సంవత్సరాన్ని విశ్లేషిస్తూ ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా ఇటీవలే పదవీ విరమణ చేసిన కె. రామచంద్ర మూర్తి గారు రాసిన ఈ చక్కని వ్యాసం నాకెంతో నచ్చింది. ఇది మీరూ తప్పక చదవాలి.

—- 

సంపాదకీయం

చరిత్ర అంటే పుస్తకాలలో నిక్షిప్తమైన భూతకాలం మాత్రమే కాదు. అది ప్రజల స్మృతిలో , సమాజం జ్ఞాపకాలలో ఆనవాళ్లుగా మిగిలిపోయిన మైలురాళ్లు. అది ప్రస్తుతంలోకి పదే పదే చొచ్చుకువచ్చే గతం. యుగాలు గడచిన తరువాత, యుగధర్మాలు మారినతరువాత చరిత్రలోని సంఘటనలు కేవలం పర్వదినాలుగా, జాతరలుగా మారిపోవచ్చు, మూలకారణంలోని స్ఫూర్తి లోపించవచ్చు. కానీ, వర్తమానంలో ప్రాసంగికత మిగిలిన అంశాలకు సంబంధించిన గతచరిత్ర కేవలం మొక్కుబడి స్మరణతో సంతృప్తి చెందదు. సమకాలికమైన జీవశక్తితో సమాజం మీద ప్రభావం వేస్తూనే ఉంటుంది. దూరదృష్టీ చైతన్యశక్తీ కలిగిన సమాజాలు చారిత్రక ఘటనలను వర్తమాన కర్తవ్యాలకు ప్రేరణగా స్వీకరిస్తాయి. 2007 సంవత్సరం భారతీయ సమాజానికి గొప్ప స్మృతి సందర్భాలను అందించింది. ప్రప్రథమ స్వాతంత్య్రపోరాటంగా పరిగణించే 1857 తిరుగుబాటుకు ఈ ఏడు 150 సంవత్సరాల పండుగ జరిగింది.

చిన్నతనంలోనే అసమానమైన మేధాశక్తిని, సమాజ భవితవ్యం మీద సమ్యక్‌దృష్టినీ సంపాదించుకున్న త్యాగశీలి సర్దార్‌ భగతసింగ్‌కు ఇది శతజయంతి సంవత్సరం. భారత స్వాతంత్య్రానికి షష్టిపూర్తి. ఈ మూడు మహాసందర్భాలను భారతీయ సమాజం, ప్రభు త్వాలు ఎట్లా జరుపుకున్నాయో, వాటి నుంచి ఏ సందేశాన్ని మననం చేసుకున్నాయో గమనిస్తే – దీర్ఘకాలికమైన జాతి అవసరాలకు తగినంతగా ఈ స్మరణను వినియోగించుకోలేదని బాధ కలుగుతుంది. వర్తమాన భారతంలోని అనేక సంక్షోభాలకు, సంఘర్షణలకు మూలకారణాలను, పరిష్కారాలను అన్వేషించడానికి లభించిన ఒక అవకాశాన్ని పోగొట్టుకున్నామేమో అనిపిస్తుంది. మిత్రభేదాలతో కొంత, వర్తకబుద్ధితో కొంత, సైనిక శక్తితో మరికొంత- కొద్దికొద్దిగా భారతదేశాన్ని కబళిస్తున్న బ్రిటిషు సామ్రాజ్యవాదిని, భారతీయ రైతాంగం, చేతివృత్తులవారు, పాలకులు కలసి సర్వశక్తియుక్తులను కూడగట్టుకుని చేసిన యుద్ధం 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర పోరాటం.

అది తెల్లవాళ్లు నిరసనగా పేర్కొన్న సిపాయిల పితూరీ కాదు. చివరి మొగల్‌కు భారత ప్రజల తరఫున సేనాధిపత్యాన్ని కట్టబెట్టిన విప్లవకారులు తెల్లవారి నిష్క్రమణ తరువాత అవతరింపజేయవలసిన నవ ప్రజాస్వామ్యాన్ని కూడా కలగన్నారు. మార్క్స్‌ చెప్పినట్టు- యూరోపియన్లు తమను ఉద్ధరించడానికి రాలేదని భారతీయులు గుర్తించి సంకల్పపూరితంగా చేసిన తిరుగుబాటు అది. వర్తకముఖంతో మాత్రమే ఉన్న నాటి వలససామ్రాజ్యవాదితో భారత ప్రజలు చేసిన యుద్ధం నేటికీ ప్రాసంగికమైనది. అది అంతిమంగా విఫలమైన జనయత్నమే కావచ్చును. కానీ అందులోని త్యాగసాహసాలు, దేశభక్తి అనన్యమైనవి. అన్నిటి కంటె మించి- భారతీయులలోని హిందువులు, ముస్లిములు కలసికట్టుగా జరిపిన పోరాటం అది. ఆ పోరాటం నుంచి ఇంగ్లీషువాడు ఒక గుణపాఠాన్ని నేర్చుకుని, విభజించి పాలించే పన్నాగాలను రచిస్తే, మన సమాజం ఇప్పటికీ ఆ విభజన నుంచి కోలుకోలేకుండా ఉన్నది, 1857 పోరాటం నుంచి కూడా ఐక్యతాసందేశాన్ని గ్రహించలేకుండా ఉన్నది.

నాడు ఉత్తరభారతమంతా అట్టుడికిపోతుంటే, దక్షిణాన బ్రిటిషువారి సంస్కరణ, విద్యాభిక్షలతో పరవశించిన నవ మధ్యతరగతి నేడు దేశమంతా వ్యాపించిపోయింది. మెకాలే అవసరం లేకుండానే, గ్లోబల్‌ వినియోగం కోసం విద్యాసేద్యం జరుగుతున్నది. 1857 నాటి పోరాట అంశాలకు ఇంతటి సందర్భశుద్ధి ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు నిర్వహించిన స్మారకసమావేశాలు- స్థూపాల వద్ద నివాళులకో, చరిత్రపాఠాల చర్వణానికో పరిమితమైపోయింది. ఆవేశపూరిత యువ విప్లవవాదిగా ఒక ఆరాధ్యప్రతిమగా, చిహ్నంగా మాత్రమే భగత్‌సింగ్‌ను గుర్తించాలని పాలకులు, ప్రభుత్వాలు ఆశిస్తూ వచ్చాయి. దాదాపుగా అలాగే జరుగుతూ వస్తోంది. భగత్‌సింగ్‌ గాంధీమార్గానికి భిన్నంగా చరించిన విప్లవకారుడు మాత్రమే కాదు. అతను ఆలోచనాపరుడు, మేధావి, సిద్ధాంత నిబద్ధతకు ప్రతీక. తాను చేస్తున్నది యుద్ధమన్న స్పృహ ఉన్న రాజకీయవాది. అతన్ని త్యాగానికి, సాహసానికి మాత్రమే ప్రతీకగా గుర్తిస్తే, నష్టపోయేది జాతే. అతని పుట్టిన ఊళ్లో ప్రదర్శనశాలలు ఏర్పాటుచేస్తేనో, నాలుగుచోట్ల అతని విగ్రహాలు స్థాపిస్తేనో షహీద్‌ వాస్తవ వారసత్వం అతని ప్రజలకు అందదు.

1857 ఈస్ట్‌ ఇండియా పాలనమీద జాతి సామూహిక తిరుగుబాటు అయితే, భగత్‌సింగ్‌, అతని అనుచరుల పోరాటం రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం మీద నవభారతయువతరం ప్రకటించిన యుద్ధం. అంతర్జాతీయ పరిణామాలను ఆకళింపుచేసుకుని కొత్త స్వప్నాలను సాకారం చేసుకోవాలని చేసిన ప్రయత్నం. సామ్రాజ్యవాదం లోతుపాతులు పూర్తిగా అవగాహనకు వచ్చిన తరువాత వినిపించిన శంఖారావం. వృత్తి ఉద్యోగావశాలే పరమార్థంగా, పైపైకి ఎదగడమే సిద్ధాంతంగా, పరాయి వినోదాలమత్తులో జోగడమే సంస్కృతి గా మారిపోతున్న యువతరానికి భగత్‌సింగ్‌ స్ఫూర్తిని అందజేయడానికి- ప్రభుత్వాలు కాదు కానీ- ప్రజాసంస్థలు, ఉద్యమాలు మరింత ప్రయత్నం జరిపి ఉండవలసింది. లౌక్యం, ఆచరణాత్మకత, స్వార్థం తప్ప ఆదర్శం అన్న మాటే తెలియని తరానికి భగత్‌సింగ్‌ జీవితాన్ని తెలియజెప్పి లోచూపు ఇవ్వవలసింది.

ఇక అరవయ్యేళ్ల స్వాతంత్య్రం గురించి చెప్పేదేముంది? స్వాతంత్య్రం, స్వరాజ్యం, స్వదేశీ- వంటి భావనలన్నిటికీ కాలదోషం పట్టిందని అధికార సిద్ధాంతులే ప్రకటిస్తున్నప్పుడు- జెండా వందనం శుష్కవేడుకగానే మిగులుతుంది తప్ప, దేశభక్తితో పులకించిపోయే సందర్భంగా ఎట్లా ఉంటుంది? మనకు సంక్రమించిన స్వాతంత్య్రం స్వభావమే అంతనో, లేక స్వాతంత్య్ర ఫలాలను ఏ గద్దలో ఎత్తుకుపోయాయో తెలియదు కానీ, ఇప్పుడు అనుభవిస్తున్న వర్తమానానికి మూలం అరవయ్యేండ్ల కిందటి ఆ శుభదినంలో ఉన్నదంటే పెద్దగా కృతజ్ఞత అనిపించే అవకాశం లేదు. అమెరికాతో అణుఒప్పందం సార్వభౌమాధికారాన్ని వదులుకోవడం అవుతుందనీ, ప్రత్యేక ఆర్థికమండళ్లు సంస్థానాలను పునరుద్ధరిస్తున్నాయని విమర్శలు ముసురుకుంటున్నప్పుడు మన దేశం అరవయ్యేళ్ల పండుగ జరుపుకుంది.

తలుపులు బార్లా తెరచిన దేశం ‘ క్విట్‌ ఇండియా’ సందర్భాన్ని ఏమని గుర్తు చేసుకోగలదు? అరవయ్యేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకోవడంలో ఇన్ని సమస్యలున్నప్పటికీ- ప్రభుత్వాలు బాగానే అట్టహాసం చేశాయి. ప్రజలకు స్ఫూర్తి అందకున్నా, ఆనవాయితీ నెరవేరింది. రెండేళ్ల కిందట బెంగాల్‌ విభజనకూ, వందేమాతరానికీ శతజయంతి, గత ఏడాది సత్యాగ్రహానికి నూరేళ్ల పండుగ జరుపుకున్న భారతీయసమాజం దైనందిన జీవితంలో స్పృశించే , ముచ్చటించే అంశాలు వేరు. దేశానికి భాగ్యవిధాతలుగా ఉన్నవారి ప్రాధాన్యాలు వేరు. గాంధీవాదమైనా పాప్యులర్‌ సినిమాగా వస్తే తప్ప చెల్లుబాటు కాదు. ప్రజలందరూ కలసి ఉండాలని, పెత్తనం చేసేవారిపై పోరాడాలని, అలోచన, అవగాహన, త్యాగం, సాహసం- గొప్ప విలువలని గుర్తుచేసే గుణపాఠాలు, సందర్భాలు ఎవరికీ అక్కరలేదు. అందుకే 2007 మోసుకొచ్చిన జాతీయసందర్భాలు ప్రజలను పెద్దగా ప్రభావితం చేయకుండానే వెళ్లిపోయాయి.

 ———————–

2007 ఆగస్టు 15 నాడు నేను రాసిన పోస్టు “బ్రిటీష్ సామ్రాజ్యవాదం నుండి అమెరికన్ సామ్రాజ్యవాదం దాకా” ఇక్కడ చదవండి.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: