రాజకీయమా వీరాభిమానమా?

అసలే సినిమావాళ్లు ఆపై రాజకీయాలు, ఇక పరిస్థితులు మరోలా ఎందుకు ఉంటాయి?

మన “ఫ్యాన్స్” సినిమా విడుదల రోజు చేసే పాలాభిషేకాలూ, కట్టే కటౌట్లు, బ్యానర్లు  చూస్తే అసలు వీళ్లు తమకొరకు, తమవాళ్ల కొరకు ఎప్పుడైనా ఇంత కష్టపడ్డారా అనిపించక మానదు. సరే సరిగా చదువుకోని వాళ్లే ఇలా చేస్తారనుకోవడానికీ లేదు. అమెరికాలో ఉన్న మన వారు ఇంటర్నెట్ సినిమా చర్చా వేదికల్లో కొట్టుకు చచ్చేతీరు, వాడే భాష చూసి మనకు ఈ మొత్తం సినిమాల పైనే విరక్తి కలగడం ఖాయం. దీనికి తోడు చిరంజీవి, బాలకృష్ణల ఫ్యాన్స్ మధ్య వైరం వెర్రితలలు వేసి కుల రంగు పులుముకుని నానా చండాలంగా తయారైంది. ఇప్పుడు చిరంజీవి రాజకీయరంగ ప్రవేశం దాదాపుగా ఖరారు అవడంతో పరిష్తితి ఇంకా ఉద్రిక్తంగా తయారైంది.

నిన్న రాజశేఖర్ పై జరిగిన దుర్మార్గమైన దాడి కొంతమంది దుండగులకు రోజురోజుకీ చట్టం పై, పోలీసు వ్యవస్థపై ఎంత చిన్న చూపో చెబుతోంది (లేక అవసరమైతే వాటిని కొనేయవచ్చు అనే ధీమానో). నగరం నడిబొడ్డున ఒక ప్రముఖ నటుడిపై, పోలీస్ స్టేషన్ ఎదురుగా దాడి జరిగిందంటే ఇక సామాన్యుడి భద్రత ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు

ఇక నిన్నదాడి జరిగిన తీరు కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. రాజశేఖర్ పై దాడి చేసిన మూకకు నాయకత్వం వహించిన బచ్చు రాజా అనేవాడు ఒక పెద్ద రౌడీ షీటర్ అనీ, అతను వడ్డేపల్లి నర్సింగరావు, దానం నాగేందర్ అనే ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు అనుచరుడనీ తెలిస్తే ఇందులో ఏదో మతలబు ఉందని అనిపించక మానదు. నిన్న రాజశేఖర్ వెనుక నిలబడి దొంగ చూపులు చూస్తున్న దానం నాగేందర్ ను చూస్తే ఈ అనుమానాలు ఇంకా బలపడటం ఖాయం. ఇక దాడి చేసినవారు ఆ సంఘటనను వీడియో తీసి మరీ టీవీ చానెళ్లకు పంపించారంటే వారు నిస్సందేహంగా బరితెగించిన వారైనా అయి ఉండాలి లేక ఇది చిరంజీవికి చెడ్డ పేరు తెచ్చేందుకు జరిగిన ఉద్దేశ్యపూర్వక కుట్రైనా అయి ఉండాలి.
 
ఒక వైపు జరిగిన దుర్ఘటనకు బాధపడి ఇక వివాదానికి పుల్ స్టాప్ పెడదామని చిరంజీవి అనుకుంటుంటే, మోహన్ బాబు లాంటి మనుషులు ఆ సంఘటనను కూడా స్వంత కక్షలు తీర్చుకోవడానికి ఒక వేదికలా ఉపయోగించుకోవడం జుగుప్స కలిగించింది.  సందట్లో సడేమియాలా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎవరి విధేయతలు, అసలు రంగులు వాళ్లు చాటుకున్నారు

ఏదేమైనా ఇది భవిష్యత్ పరిణామాలకు ఒక సూచిక లాగుంది. హీరోల అభిమానులు ఇటీవల విపరీత చర్యలకు ఒడిగడుతున్నారు. ఇప్పుడు వారి అభిమాన హీరోలు రాజకీయనాయకులైతే పరిస్థితి ఇంకా దిగజారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యర్ధులను దెబ్బతీయడానికి జరిగే ఈ ఎత్తుల పైఎత్తుల క్షుద్రక్రీడలో ఎన్ని అమాయక జీవితాలు బలికానున్నాయోనని భయం కలుగుతున్నది.

రాజకీయం అనే రొచ్చుగుంటలోకి ఏ ఉద్దేశ్యాలతో దిగినా తనకూ ఆ మకిలి అంటక మానదు అని చిరంజీవికి అర్థం అవుతుందా? తనకన్న ముందు రాజకీయాల్లోకి వచ్చిన NTRకి చివరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయో చిరంజీవికి తెలుసు కదా? స్వయంకృషితో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ అందరివాడు ఇలా రాజకీయాల్లోకి వచ్చి కొందరివాడు అవబోతున్నాడా?

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

ట్విట్టర్ పై తెలంగాణ

Error: Twitter did not respond. Please wait a few minutes and refresh this page.

a

గణాంకాలు

  • 94,898 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: