చింత తెలంగాణకు, నీళ్లు డెల్టాకు

 “సమైక్యాంధ్రలో రెండు ప్రాజెక్టుల కథ!”  పోస్టుకు కొనసాగింపు ఇది.

వైజా సత్య గారూ,

సామరస్యంగా మంచి చర్చకు ఆస్కారం కల్పించినందుకు కృతజ్ఞతలు. తెలంగాణా గురించి చర్చ జరిగే ప్రతి సందర్భంలోనూ వెలుతురు కన్నా వేడి ఎక్కువ పుడుతుంది, అందుకే కీలకాంశాలు మరుగున పడిపోతాయి.

తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడానికి నా అవగాహనలో ఉన్న కారణాలు ఇవి:

1) కృష్ణా, గోదావరి నదులు రెండూ తెలంగాణా ప్రాంతంలో చాలా దూరం ప్రయాణం చేశాకనే ఆంధ్రలో ప్రవేశిస్తాయి. తెలంగాణాలో కనుక వీటిపై భారీ ప్రాజెక్టులు కడితే తమకు నీటి కొరత ఏర్పడుతుందేమోనని డెల్టా వాసుల భయం. అందువల్లనే ప్రభుత్వాలు తెలంగాణా ప్రాజెక్టుల పట్ల ఆసక్తి చూపకపోవడం, చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనా దశాబ్దాల తరబడి ఆ ప్రాజెక్టుల్ని మూలన పడేయడం జరుగుతోంది. అయితే ఈ భయం హేతురహితమైనది అని నా అభిప్రాయం ఎందుకంటే ప్రతీ యేటా మనం సముద్రం పాలు చేస్తున్న నీరు మనం వాడుకుంటున్న నీటికి పదిరెట్లు ఉంది.

2) కర్ర ఉన్న వాడిదే బర్రె అనే సాంత మీకు తెలుసు కదా? డబ్బు ఎక్కువ అయితే అది చివరకు అధికారాన్ని వశపరుచుకుంటుంది. అధికారం వస్తే అది ఆధిపత్య భావనను పెంపొందిస్తుంది.

ఎవరికి వారు తమ ప్రాంతం అభివృద్ధి చెందాలనుకోవడం సహజమే. ఆంధ్ర ప్రాంతం వారు కూడా దానికి మినహాయింపేమీ కాదు.  రాష్ట్ర ప్రభుత్వంపై మొదటి నుండీ ఆంధ్ర నేతల ప్రభావం ఎక్కువ ఉండటం వలన నిధులు, నీళ్లు, ఉద్యోగాలు అక్కడికి తరలి వెళ్తున్నాయి. ఇదేదో ఆంధ్ర ప్రాంతం వారొక్కరే చేసినది కాదు. ప్రపంచ చరిత్రలో అనేక చోట్ల రెండు అసమ ప్రాంతాలను కలిపి ఉంచిన ప్రతీసారి ఇలా అభివృద్ధిలో అసమానతలు ఇంకా ఎక్కువ అయ్యాయి.. కాటన్ దొర పుణ్యమా అని వ్యవసాయం పచ్చగా ఉండటం, వ్యవసాయ మిగులు ఇతర పరిశ్రమలలో (మొదలు రైస్ మిల్లులు, తరువాత సినిమాలు, అటుపై పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, సాఫ్ట్ వేర్…) పెట్టుబడులు పెట్టగలగడంతో పాటు తెలంగాణ ప్రాంత వనరులను ఉపయోగించుకోవడం వల్లనే ఆంధ్ర ప్రాంతం ఇంత అభివృద్ధి చెందింది. 

ఇక పులిచింతల గురించి కొన్ని సంగతులు: 

పులిచింతల ప్రాజెక్టు కేవలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. దీనికి స్వంత ఆయకట్టు లేదు. ప్రకాశం బ్యారేజి కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లాలోని అయిదు గ్రామాలు మునిగిపోతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2004లో పులిచింతల పనులు ప్రారంభం అయ్యాయి. పోయిన వారం నేను వార్తా పత్రికల్లో చదివిన దాని ప్రకారం వచ్చే ఖరీఫ్ పంట నాటికి పులిచింతల 15 TMCల నీటిని నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. ఇంత వేగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కావడం కేవలం యాధృచ్చికం అని నమ్మమంటారా? నేను రాసేవేవి అరోపణలు కావు, మీరు ఒకసారి వీటిని cross-check చేసుకోవచ్చు.

గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద ఒక భారీ డాం కట్టి నీటిని మళ్ళించి కృష్ణా నదిపై ఉన్న పులిచింతల ప్రాజెక్టులో కలపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు అనుమతుల ఫైలు అప్పుడే అన్ని లాంచనాలు పూర్తి చేసుకుంటోంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా కృష్ణా నీటిని రాయలసీమకు తరలించే పనికి కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలనుండి వ్యతిరేకత రాకుండా ఉండడానికే ఇంత వేగంగా పులిచింతల కడుతున్నారు.

పులిచింతలకు కొద్ది దూరంలోనే తెలంగాణా ప్రజలకు కూడా ఉపయోగపడే ఇంకో చక్కని ప్రాజెక్టు కట్టొచ్చు.. దాని పేరే సాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు. నాగార్జున సాగర్ లో విద్యుత్ ఉత్పత్తికి వాడిన నీటిని ఆపి నిల్వచేసి మళ్లీ సాగర్ లోకి పంపే అద్భుత ప్రాజెక్టు ఇది. దీని నిర్మాణం చేస్తే సాగర్ కుడి, ఎడమ కాల్వల కింద ఉన్న వారికి ఎంతో ఉపయోగం. కానీ ఆశ్చర్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి కనీసం మాట్లాడట్లేదు.

పునరావాసం గురించి ఎన్ని ఆందోళనలు జరిపినా పట్టించుకోకుండా శరవేగంగా జరుగుతున్న పులిచింతల నిర్మాణం, సమైక్య రాష్ట్రంలో ఎవరి మాట చెల్లుబాటు అవుతున్నదో తెలిపే నిలువెత్తు సాక్ష్యం. కొత్త ఆయకట్టు అభివృద్ధి చేయండి మొర్రో అంటే ఉన్న ఆయకట్టుకు మూడో పంటలు ఇచ్చే రెండు ప్రాజెక్టులు ఈ సమైక్య రాష్ట్రంలో బహువేగంగా నిర్మాణం అవుతున్నాయి.

ఒక సారి అలోచించండి ఫ్రెండ్స్! ఉదయం నుండీ సాయంత్రం వరకు రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ చుట్టే పరిభ్రమించే ఈ కాలంలోనే ఇంత పక్షపాత ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంటే ఇక తెలుగు భాష, తెలుగు తల్లి వంటి సెంటిమెంట్లు మాకు అర్థరహితంగా అనిపించవా?

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: