సమైక్యాంధ్రలో రెండు ప్రాజెక్టుల కథ!

రెండో ఎస్సార్సీ గురించి నాగరాజు గారు స్పందిస్తూ మంచి ప్రశ్నలు అడిగారు. అయితే ఒక్కో ప్రశ్నకు వివరణ ఒక్కో పోస్టు ద్వారా ఇస్తేనే సముచితంగా ఉంటుందని నీటి పంపకంపై ఈ పోస్టు.

నాగరాజు గారూ, నీటి వనరుల వినియోగం గురించి మీ అవగాహన కరెక్టే. మొదటి నుంచీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్షకు ప్రధాన ప్రేరణ నీటి పంపకంలో ఉన్న వివక్షనే.

తెలంగాణ ప్రాంతం ఎక్కువ ఎత్తులో ఉండడం మూలాన నీటిని ఎత్తిపోతల ద్వారానే ఇవ్వాలని. అందుకే ఇక్కడ ప్రాజెక్టులు కట్టలేదని సమైక్య వాదులు తరచూ చెప్తుంటారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వేర్వేరు న్యాయం ఎలా అమలవుతుందో అర్థం చేసుకునేందుకు మన కళ్లముందే డజన్ల కొద్దీ ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ ఏకరువు పెడుతూ అనేక పుస్తకాలే వచ్చాయి. అయితే మచ్చుకు రెండు ప్రాజెక్టుల కథ చూడండి.

పోలవరం ప్రాజెక్టు:

ప్రధాన ఉద్దేశ్యం గోదావరి డెల్టాకు సాగు నీరు అందించడం. వైజాగ్ పరిసర ప్రాంతాల పరిశ్రమలకు నీరు అందించడం. 

ఈ ప్రాజెక్టు కడితే దాదాపు లక్షన్నర మంది గిరిజనులు నిరాశ్రయులు అవుతారు. ఇది స్వతంత్ర భారత దేశంలో అతి పెద్ద Tribal Displacement. దాదాపు 150 గిరిజన గ్రామాలు మునిగిపోతాయి. ప్రాజెక్టు నీరు భద్రాచలం పట్టణాన్ని కూడా ముంచి వేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మునిగే గ్రామాల్లో అత్యధికం తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. దీనిపై సిపీఎం, ఇంకా అనేక ప్రజా సంఘాలు ఎంత ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ నిర్వాసితులకు సరైన పునరావాస పధకం లేదు.

ఏ అనుమతులూ  లేకుండానే ప్రాజెక్టునిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. కోర్టు రెండు సార్లు నిర్మాణం ఆపివేయమని చెప్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు. చత్తీస్ గడ్, ఒరిస్సా రాష్ట్రాలు తమ గ్రామాలు మునిగిపోతాయని గొడవ చేస్తే, రాష్ట్ర సరిహద్దుల వెంట ఒక రక్షణ గోడ కట్టి నీరు అటు వెళ్లకుండా చూస్తాననే అబ్సర్డ్ వాదన కూడా చేస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. పై కోర్టుల్లో ప్రాజెక్టు కావాలని తీవ్రంగా పోరాడుతోంది.

ఇక అన్నిటికన్నా గొప్ప విషయం. ఇంకా ప్రాజెక్టు కట్టకుండానే ఫుల్ స్పీడ్ లో   భారీ కాలువలు నిర్మించేస్తుంది. ఈ కథకు ఒక బ్రహ్మాండమైన కొసమెరుపు కూడా ఉందండొయ్.

ఇదే గోదావరి నది పై తాడిపూడి, పుష్కరం అనే రెండు ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల కాలువలు, పోలవరం ప్రాజెక్టు కాలవల పక్క పక్కనే పెనవేసుకుని ప్రవహిస్తాయట!

వడ్డించే వాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా ఫర్వాలేదనే సామెతకు నిలువెత్తు నిదర్శనం కాదూ ఈ పోలవరం? ఇప్పటికే కడుపు నిండి ఉన్న డెల్టాకు నీరు ఇంకా ఎక్కువ నీరు అందించడం సబబా? దశాబ్దాలుగా ఎండి బీళ్లయిన తెలంగాణా భూములకు నీళ్లందించాలా? ఏది ప్రాదాన్యతాంశం కావాలి మన ప్రభుత్వాలకు?

వాస్తవాలు ఇలా ఉంటే పొద్దున లేస్తే “మనం కలిసి ఉండాలి, రాష్ట్రం ముక్కలు కావొద్దు” అని సెంటిమెంటల్ గా ఫీల్ అయితే సరిపోద్దా?

ఇక ఇంకో ప్రాజెక్టు కథ చూద్దాం.

అదే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC)

తెలంగాణకు నీటి విషయంలో జరిగిన అన్యాయనికి ఇంతకన్నా మంచి సాక్ష్యం ఉండదు. తెలంగాణలో దాదాపు 2.5 లక్షల ఎకరాల ఆయకట్టును సాగుచేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు పాతికేళ్ల క్రితం ప్రారంభించారు. నీరు పోవడానికి ఒక సొరంగం తవ్వవలసి వస్తే, దానికి పర్యావరణ అనుమతి రాలేదని ఒక దశాబ్దం పాటు పని నిలిపేశారు. సొరంగం తవ్వడానికి బ్లాస్టింగ్ చేస్తే పక్కనే ఉన్న అభయారణ్యంలో పులులు బెదిరిపోతాయనే కారణంతో ఏళ్ల తరబడి ఈ ప్రాజెక్టును ఆపారు. అదే పోలవరం ప్రాజెక్టుకయితే లక్షన్నర మంది మనుషులు మునిగిపోయినా ఫర్వాలేదంటున్నారు మన ప్రభుత్వ పెద్దలు.

చంద్రబాబు హయాంలో ఇంకో అడుగు ముందుకు వేసి, ప్రాజెక్టు పేరుతో సహా (ఎలిమినేటి మాధవ రెడ్డి ప్రాజెక్టు- AMR) అన్నీ మార్చేశారు. నాగార్జున సాగర్ డ్యాంకు మోటర్లు పెట్టి పైప్ లైన్ల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా దీని డిజైన్ మార్చేశారు.  

వర్షా కాలంలో మన సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు నిండి గేట్లు ఎత్తి లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసే సందర్భాల్లో ఈ AMR కాలువలకు ముష్టి 1000 లేదా 2000 క్యూసెక్కుల నీరు మోటార్ల ద్వారా తోడిపోస్తారు. మీకు ఒక పోలిక చెబుతాను. గత వర్షాకాలం నేను పని మీద విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ AMR కాలువకి 1000 క్యూసెక్కులు వదిలిన రోజు ప్రకాశం బ్యారేజీకున్న మూడు కాల్వలకు (ఏలేరు, రైస్, బందరు కాల్వలు) కలిపి వదిలింది 30,000 క్యూసెక్కులు.

ప్రతి ఎన్నికలలో తెలంగాణ ప్రజలకు ఈ SLBC ఉరఫ్ AMR ప్రాజెక్టును తాయిలంలా చూపడం ఒక దశాబ్దం పాటు అన్ని ప్రధానపార్టీలూ చేశాయి. మొన్న రాజశేఖర రెడ్డిగారు ఆర్భాటంగా జలయజ్ఞం చేపట్టినప్పుడు కూడా సొరంగం పూర్తి చేస్తామని నమ్మబలికాడు. మూడున్నరేళ్లు గడిచాయి. ఎక్కడి గొంగలి అక్కడే ఉంది. 

తెలంగాణకు ఇంకా జరుగుతున్న మోసానికి మౌన సాక్షిగా విజయవాడ నేషనల్ హైవే నెంబర్ 9 పైన నకిరేకల్ టౌన్ రావడానికి పది కిలోమీటర్ల ముందు ఈ AMR కాలువ కనపడుతుంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఇంత ఉధృతంగా సాగుతున్న కాలంలో అధికారంలోకి వచ్చిన వైఎస్, తొలి నాళ్లలో ఒక సభలో మాట్లాడుతూ “గోదావరి నీళ్లు డెల్టాకు, కృష్ణ నీళ్లు రాయలసీమకు” అని అసలు ఎజెండా ధైర్యంగా బయట పెట్టాడు. తెలంగాణ బతుకు ఇలానే ఉండబోతోందని నేరుగానే చెప్పాడాయన.  ఇప్పుడు గోదావరి నీటిని కోస్తాకు అందివ్వడానికి పోలవరం ప్రాజెక్టు, సాగర్ లింక్ కెనాల్ శరవేగంగా నిర్మాణం అవుతున్నాయి.  కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరణ కొరకు ఉద్దేశించిన పులిచింతల రాకెట్ స్పీడ్ తో నిర్మాణం  పూర్తి చేసుకుంటోంది. ఇక అక్రమంగా రాత్రీ పగలూ నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు అయితే భారత దేశంలోనే సరికొత్త రికార్డు.

ఓ వైపు డెల్టాలకు మూడో పంట కొరకు భారీ ప్రాజెక్టులు శరవేగంగా నిర్మితమవుతాయి, మరో వైపు నెర్రెలుబారిన తెలంగాణ నేల తడపడానికి నాలుగు చుక్కలు విదిలిస్తారు దయగల మారాజులు.

ఇదీ సమైక్యాంధ్రలో తెలంగాణకు జరిగిన/జరుగుతున్న అభివృద్ధి!

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: