రెండో ఎస్సార్సీ అంటే రెండో సారి మోసపొమ్మనే అర్ధం!

ఎస్సార్సీ పై నేను రాసిన పోస్టు పై బాల సుబ్రహ్మణ్యం గారి వ్యాఖ్యకు జవాబు ఇవ్వడంతో పాటు రెండో ఎస్సార్సీ ఎందుకు వద్దో వివరించడం ఈ పోస్టు ఉద్దేశ్యం. ముందు కొటేషన్లలో ఉన్నవి బాల గారి వ్యాఖ్యలు. కింద నా సమాధానాలు.

“SRC బూతుమాటేమీ కాదు. అది ఒక విధివిధానం. ఒక సత్సంప్రదాయం. ప్రజా డిమాండ్లకు ఒక శాస్త్రీయ విశ్లేషణ పద్ధతి.”

థియరిటికల్ గా మీరు చెప్పింది కరెక్టే కానీ మొదటి ఎస్సార్సీ విషయంలో ఏమి జరిగిందో తెలిసుంటే మీరు ఇలా మాట్లాడరు. ఎస్సార్సీ అనే తంతు ద్వారా ఏమి జరుగుతుందో అందరికన్నా తెలంగాణా ప్రజలకే ఎక్కువ తెలుసు సార్!. అయినా ఒక పక్క మొదటి ఎస్సార్సీ నివేదికనే అమలు చేయని ప్రభుత్వం మళ్లీ ఇంకో ఎస్సార్సీ వేస్తానని అంటే, దాన్ని మీరు ఎలా సమర్ధిస్తున్నారో మాకు అర్ధం కావట్లేదు.

మొదటి ఎస్సార్సీ ఏమన్నదో ఇవ్వాళ ఆంధ్రజ్యోతి పత్రిక స్పష్టంగా రాసింది. (ఒక మెయిన్ స్ట్రీం పత్రిక ఇంత స్పష్టంగా తెలంగాణ గురించి ఒక నిజాన్ని రాయడం నాకు ఎరుక ఉన్నంతలో ఇదే ప్రధమం)

జనవరి 10, 2008 ఆంధ్రజ్యోతి

తొలి ఎస్సార్సీ ఏమన్నది?

హైదరాబాద్‌, జనవరి 9 (ఆన్‌లైన్‌): రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ కోసం జస్టిస్‌ ఫజల్‌అలీ నేతృత్వంలో 1953 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం తొలి ఎస్సార్సీ నియమించింది (హోంమంత్రి గోవింద్‌వల్లబ్‌ పంత్‌ పర్యవేక్షణలో). కె.ఎం.ఫణిక్కర్‌, హెచ్‌.ఎన్‌.కుంజ్రు సభ్యులు. ఇది సుమారు రెండేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించింది. నాయకుల వాదనలు పరిశీలించింది. వివిధ వర్గాల అభిప్రాయాలు, విజ్ఞప్తులు, వాదనలు స్వీకరించింది. 1955లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దేశంలోని 27 రాష్ట్రాలను భాషా ప్రయుక్తంగా 16 రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని సూచించింది. వివిధ కారణాల రీత్యా తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగించాలని సిఫార్సు చేసింది.

అవేంటంటే… 
– పలు కారణాలు, ఇరుప్రాంతాల ప్రయోజనాల రీత్యా తెలంగాణ, ఆంధ్రలను వేర్వేరు రాష్ట్రాలుగానే కొనసాగించాలి. 1961 సాధారణ ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ ఆమోదంతో ఇరుప్రాంతాలను విలీనం చేయొచ్చు. 

– రెండు రాష్ట్రాల ప్రజల ఉమ్మడి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వాటిపై ఈ మధ్యకాలం లో వారిమధ్య ఏకాభిప్రాయం కుదిరితే విలీనం కావచ్చు. లేనిపక్షంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగాలి.

– ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆ రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి. కాని తెలంగాణ ప్రాంతానికి ఆర్థిక వనరుల సమస్యలు ఎదురయ్యే అవకాశాల్లేవు. తెలంగాణలో భూమిశిస్తు వసూళ్లు, ఎక్సైజ్‌ ఆదాయం అధికంగా ఉంది. ఒకవేళ విశాలాంధ్ర ఏర్పడితే తెలంగాణ ప్రాంతంలోని ఆర్థిక స్థిరత్వాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి బదులు ఆంధ్ర ప్రాంతపు ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కోవడానికి ఉపయోగించే ప్రమాదముంది.

– భవిష్యత్తులో కృష్ణా, గోదావరి జిలాల వినియోగం కోసం ప్రాజెక్టులు చేపట్టినపుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తన న్యాయమైన వాటాను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

– ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో మహబూబ్‌నగర్‌, నల్గొండ, హైదరాబాద్‌, వరంగల్‌ (ఖమ్మం కలుపుకుని), మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, బీదర్‌ జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని మునగాల పరగణాను కలుపుకుని హైదరాబాద్‌ రాష్ట్రాన్ని యథావిధిగా కొనసాగించాలి.” 

“ప్రత్యేక తెలంగాణా కొద్దిమంది యొక్క ఆకాంక్ష మాత్రమే. దేశంలో ఇలాంటి డిమాండ్లు పాతిక ఉన్నప్పుడు SRC వెయ్యడమే సరైన పద్ధతి. “అలా కాదు, మేం అడిగాం కాబట్టి వెంటనే ఇచ్చెయ్యాలి” అంటే-దేనికైనా ఒక రాజ్యాంగబద్ధమైన విధీ విధానమూ అక్కర్లేదంటారా ? మన దేశంలో దేనిమీదా రిఫరెండమ్‌లూ ప్లెబిసైట్లూ నిర్వహించే అలవాటెలాగూ లేదు.కనీసం ఒక కమిటీ కమిషనూ సర్వే పరిశీలనా కూడా అవసరం లేదంటారా ?”

సార్ ఇదివరకు కూడా చెప్పాను. మేము అడిగాం కాబట్టి ఇవ్వమని అనట్లేదు. సరిగ్గా యభై ఏళ్ల క్రితం మొదటి ఎస్సార్సీ చేసిన సిఫారసు అమలు చెయ్యమంటున్నాం. అది కూడా అడగొద్దంటే ఎలా?

తెలంగాణ ఎంత మంది ఆకాంక్షనో మొన్న కరీంనగర్ ఎన్నికలో ఓటర్లు చూపించారు. నల్లగొండ జిల్లా ఆలగడప గ్రామంలో జరిగిన నమూనా ప్లెబిసైట్ లో 95% మించి తెలంగాణకు మద్ధతు ఇచ్చారు. అంతెందుకు ఇప్పుడు తెలంగాణా కావాలా వద్దా అని ఒక ప్లెబిసైట్ నిర్వహించమనండి చూద్దాం. అలా చేస్తే ఏమవుతుందో తెలుసు కాబట్టే ఎస్సార్సీ అనే దుర్మార్గపు ఎత్తుగడ ఎంచుకుంది కాంగ్రెస్. దేశంలో ఏ రాష్ట్ర డిమాండుకూ తెలంగాణకు ఉన్నంత ప్రజా మద్ధతు కానీ చరిత్ర కానీ లేవు.

ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. రామ చంద్రమూర్తి గారు ఇవ్వాళ తన సంపాదకీయంలో ఏమన్నారో కూడ ఒక సారి చదవండి:

“తొలి ఎస్సార్సీకి నివేదిక సమర్పించడానికి ఇరవైరెండు నెలలు పట్టింది. సుమారు లక్షన్నర అభ్యర్థనలు కమిషన్‌కు అందాయి. ఇప్పుడు చెబుతున్న రెండవ ఎస్సార్సీ కేవలం రెండు ప్రాంతాలకు సంబంధించినదే అయినప్పటికీ, ఈ హైటెక్‌ యుగంలో మరింత హెచ్చుస్థాయిలో అభ్యర్థనలు వస్తాయి కనుక తాడోపేడో తేలడానికి ఏళ్ళూపూళ్ళూ పట్టడం ఖాయం. రెండో ఎస్సార్సీ అంటే ఇక తెలంగాణను నిరాకరించడమే అని వినిపిస్తున్న విమర్శలను కాదనలేం.”

“దేశంలో SRC ప్రమేయం లేకుండా ఏర్పడ్డ రాష్ట్రాలు ఏడే ఉన్నాయి. మిగతా 21 రాష్ట్రాలూ SRC ద్వారానే ఏర్పడ్డాయి.ఝార్‌ఖండు వగైరా ఉల్లంఘనలు పోగా మిగిలిన నాలుగు రాష్ట్రాల ఏర్పాటుకూ SRC అవసరం లేదు కాబట్టి వెయ్యలేదు.ఉదాహరణకు ఒకప్పుడు విదేశంగా ఉన్న సిక్కిమ్ ఇండియన్ యూనియన్‌లో ఒక రాష్ట్రంగా చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసినందువల్లా కొత్తఢిల్లీకి NCR (National Capital Region) గా క్రొత్త ప్రతిపత్తి కట్టబెట్టడానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించుకోవడం వల్లా అక్కడ కొత్త రాష్ట్రాలేర్పడ్డాయి. ”

మీరు అన్నట్టు ‘ఏడే’ రాష్ట్రాలు ఎస్సార్సీ లేకుండా ఏర్పడ్డాయని అనుకుందాం. ఏం ఏడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? (అసలైతే ఎస్సార్సీ అవసరం లేకుండానే మన దేశంలో ఇప్పటికి ఏర్పడ్డవి 14 రాష్ట్రాలు)

అన్నట్టు మీరు గమనించారో లేదో తెలియదు, ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చెయ్యమని మొదటి ఎసార్సీ చెప్పలేదు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడ్డ తెలుగు వారి ఆంధ్ర రాష్ట్రమూ ఎస్సార్సీ ప్రమేయం లేకుండానే పుట్టింది. రెండు సార్లు మన తెలుగు ప్రజల రాష్ట్రాలే ఎస్సార్సీ ప్రమేయం లేకుండా ఏర్పడ్డాయి.

“ప్రత్యేక తెలంగాణాలూ, ప్రత్యేకాంధ్రలూ లేకుండానే ఆంధ్రప్రదేశ్ 2009 శాసనసభ ఎన్నికల్ని జరుపుకుంటుంది.”

ప్రజల సహనాన్ని సుదీర్ఘ కాలం పరీక్షిస్తే ఏమవుతుందో ప్రపంచ చరిత్ర అనేక సార్లు రుజువు చేసింది. తెలంగాణ ఉద్యమం భవిష్యత్తు మీరే చూస్తారు. 2009 ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చివరి ఎన్నికలు అని నా అభిప్రాయం.

 ————————–

మొదటి ఎస్సార్సీ నివేదిక పేజీలు స్కాన్ చేసి పెట్టాను వాటిని ఇక్కడ చూడొచ్చు: https://hridayam.wordpress.com/2007/01/27/first_src_telangana/

కాంగ్రెస్ ఎస్సార్సీ నాటకంపై ఎన్. వేణుగోపాల్ రాసిన చక్కని విశ్లేషణ ఇక్కడ చదవచ్చు:

http://kadalitaraga.wordpress.com/2007/01/09/varthamaanam_maralanidela_src/

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: