తెలంగాణ పై కాంగ్రెస్ దుష్టపన్నాగం

తెలంగాణ ప్రజలను మరోసారి వంచించడానికి కాంగ్రెస్ పార్టీ సమాయుత్తమవుతున్నదని వార్తలు వెలువడుతున్నాయి. కొత్త రాష్ట్రాల ఏర్పాటును పర్యవేక్షించడానికి కేంద్రం రెండో ఎస్సార్సీ వేయనున్నట్టు అన్ని వార్తా చానెళ్లు బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేస్తున్నాయి. ఇటు రాష్ట్రంలో కొత్త పార్టీల ఏర్పాటుతో, అటు కేంద్రంలో బీజేపీ పునరుత్థానంతో ఠారెత్తిన కాంగ్రెస్ చివరి అస్త్రంగా ఈ దుష్ట పన్నాగం పన్నుతున్నట్టుంది.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిరవధికంగా వాయిదా వెయ్యడమే రెండో ఎస్సార్సీ అంతిమ లక్ష్యం.

తెలంగాణ ఏర్పాటును మొదటి ఎస్సార్సీ అయిదు దశాబ్దాల ముందే ఎలా సిఫారసు చేసిందో ఇక్కడ చదవచ్చు.

నేటికి సరిగ్గా ఏడాది క్రితం 8 జనవరి 2007 నాడు రెండో ఎస్సార్సీ నాటకం పై నేను రాసిన పోస్టు యధాతధంగా…

తెలంగాణా సమస్యను పరిష్కరించడానికంటూ కాంగ్రెస్ ఎత్తుకున్న రెండో ఎస్సార్సీ పల్లవి అత్యంత దుర్మార్గమైనది, మోసపూరితమైనది. ఈ ఆలోచన కార్యరూపం దాల్చక ముందే తెలంగాణవాదులంతా మేల్కోవాలి. మొదటి ఎస్సార్సీ విస్పష్టంగా తెలంగాణ ఏర్పాటును సిఫారసు చేసాక ఇంకోసారి ఆ ప్రహసనానికి తెర తీయడం అనవసరం. తెలంగాణ ఉద్యమం అంత ఉధృతంగా సాగుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొత్తం దేశంలోనే ఇంకొకటి లేదు. ఒకటి రెండు ప్రతేక వాదనలు కొంచెం చెప్పుకోదగిన స్థాయిలో వున్నప్పటికీ, వాటికి తెలంగాణ ఉద్యమానికి వున్నంత చరిత్ర కాని, ప్రజామోదం కాని లేవు. ఆయినా స్వాతంత్రం వచ్చాక ఎన్నో రాష్ట్రాలను ఎస్సార్సీ ఆమోదం లేకుండానే ఇచ్చి (1956 లో ఆంధ్రప్రదేశ్ నుండి మొన్నటి జార్ఖండ్, చత్తీస్ గడ్, ఉత్తరాంచల్ వరకూ ఎస్సార్సీ నివేదికతో పనిలేకుండానే ఏర్పాటయ్యయి.) ఇప్పుడు తెలంగాణ దగ్గరికికొచ్చేసరికి ఒకదాని తరువాత ఒక మెలిక పెట్టడం, తెలంగాణవాదుల సహనాన్ని పరీక్షించడమే.

తెలంగాణా ప్రజలు గత అయిదు దశాబ్దాలుగా ఎన్నోసార్లు తమకు ప్రతేక రాష్ట్రం కావాలని చెప్పారు. మొన్నటికి మొన్న కరీంనగర్ ఉప ఎన్నికల్లో వారు విస్పష్టంగా తెలంగాణ రాష్ట్రం కొరకు తమ ఆమోదాన్ని తెలిపారు. కాంగ్రెస్ నాయకులేమో ఇంకా వారి అనుమతి కావాలి, వీరి అనుమతి కావాలి అంటూ నాటకాలు ఆడుతున్నారు. రెండో ఎస్సార్సీ అనే ఈ కాంగ్రెస్ ఎత్తుగడ చాలా ప్రమాదకరమైంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే దురుద్దేశంతో ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రత్యేక వాదనలు ముందుకు తెచ్చి ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం జోరుగా సాగుతోంది. ఇక ఎస్సార్సీ అంటే దేశవ్యాప్తంగా వున్నవీ లేనివీ అన్ని కలిపి ఒక వంద రాష్ట్రాలకు డిమాండ్ వుంది అని సాకు చూపించొచ్చు. రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం చేసేందుకే కాంగ్రెస్ ఈ కుట్రపూరిత ఎత్తుగడను ఎంచుకుంది. తెలంగాణవాదులంతా అప్రమత్తమై దీన్ని తిప్పికొట్టవలసిన అవసరం వుంది.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: