నీ మద్ధతు ఎవరికి మన్మోహన్?

మొన్న మన్మోహన్ పై నేను చిరాకుపడి రోజు గడిచిందో లేదో పేపర్లో మరో పిడుగు లాంటి వార్త. విదేశాల నుంచి దాదాపు 8 లక్షల టన్నుల గోధుమలు దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్న ఆ వార్త మన దేశం ఎటువంటి “అభివృద్ధి” సాధిస్తున్నదో కళ్లకు కడుతుంది. అయితే గోధుమల దిగుమతి కొత్త విషయం కాకపోయినా ఈ గోధుమలకు మన వాళ్లు చెల్లిస్తున్న రేటు చూసి ఆశ్చర్యపోయాను నేను. మన రైతుల దగ్గర అతి కష్టం మీద 1000 రూపాయలకు క్వింటాల్ గోధుమలు కొనే ప్రభుత్వం, 1600 రూపాయల దాకా వెచ్చించి గోధుమల దిగుమతి చేసుకుంటోంది!

గడచిన కొన్నేళ్లుగా మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రేటు పడిపోతూ వస్తోంది. మొదట ప్రత్తి, మిర్చి, పొగాకు వంటి వాణిజ్య పంటలు అటు తరువాత పూలమొక్కలు, ఇతర ఎగుమతి పంటలు వేయించేందుకు మన రైతులను “ప్రోత్సాహించిన” ఫలితమిది. అంతర్జాతీయ మార్కెట్ల కొరకు అలోచించాలని మన రైతులను పగలనకా రాత్రనకా బ్రెయిన్ వాష్ చేశారు మన బాబులు. నమ్మిన రైతులు  జొన్నలు, సజ్జలు, వరి, గోధుమలు పండించడం తగ్గించి వాణిజ్య పంటల వలయంలో ఇరుక్కున్నారు. పెట్టుబడికి అప్పులు తెచ్చి, పండిన పంటకు గిట్టుబాటు ధరలేక మన దేశంలో గడచిన కొన్నేళ్లలోనే దాదాపు లక్ష మంది రైతులు బలవన్మరణం పాలయారు.

గత పదిహేనేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల ఫలితంగా దేశంలో వ్యవసాయం అంతరించే దశకు చేరుకుంది.  ఆహార భద్రతా అవసరాల రీత్యా తప్పనిసరి పరిస్థితిలో విదేశాల నుంచి గోధుమల వంటివి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. పోయినేడాది మనం 6.7 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమల దిగుమతి చేసుకున్నాం.

 క్వింటాల్ కు దాదాపు 1600 రూపాయలకు విదేశీ కంపెనీల నుండి గోధుమలు కొనే విశాల హృదయం ఉన్న మన పాలకులు ఇక్కడి రైతుల దగ్గర మాత్రం 1000 కే క్వింటాల్ గోధుమలు కొంటారు. ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? మన రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు రూపాయి పెంచమంటే గింజుకుని చస్తారు మన ప్రధానుల వారు. మద్ధతు ధర పెంచడం అంత సులభం కాదని, అలా పెంచితే వినియోగదారులకు అది పెనుభారం అవుతుందని నమ్మబలుకుతారు. రాజకీయాలు చెయ్యొద్దని విసుక్కుంటారు. విదేశాల నుంచి ఎక్కువ ధరకు లక్షల టన్నుల ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునేటప్పుడు మాత్రం మన నేతలకు ఇవేవి గుర్తుకు రావు. 

“అభివృద్ధి” ఎవరిదో, ఆ వెలుగు వెనకున్న నీడ ఏమిటో అర్ధమవుతోందా ఫ్రెండ్స్?

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: