ముసుగులు బయటపడుతున్నాయ్!

ఎంత దాచుకుందామని ప్రయత్నించిన మన నేతల అసలు నైజం బయటపడుతూనే ఉంటుంది. మొన్న ప్రణాళికా సంఘం మీటింగులో మన ప్రధాని అన్న ఈ మాటలు ఒక సారి చదవండి.

“ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై ఇస్తున్న సబ్సిడీలు ఈ ఒక్క ఏడాదిలోనే భారీస్థాయిలో రూ.లక్ష కోట్లను దాటుతున్నాయి. దీనర్థం.. మనం కొత్త పాఠశాలలు పెట్టలేకపోవచ్చు. ఆసుపత్రులు కట్టలేం. విద్యార్థులకు ఉపకార వేతనాలివ్వలేం. వ్యవసాయ రంగంపై ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవచ్చు. మౌలిక వసతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉండొచ్చు. అందుచేత సబ్సిడీలను హేతుబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ”
– ప్రధాని మన్మోహన్‌సింగ్‌

నాకైతే పై లైన్లు చదివాక మన్మోహన్ సింగుని ఒకటే ప్రశ్న అడగాలనిపించింది

“కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మన్మోహన్?”

ప్రైవేటు కంపెనీలు పెట్టే అడ్డమైన గడ్డి తినమరిగి ఇటువంటి  చెత్త వాగుడు వాగడం అలవాటైంది మన నేతలకు.

సబ్సిడీలు లక్ష కోట్లు దాటుతున్నాయని గుండెలు బాదుకుంటున్న మన్మోహన్ గారూ, మీకు ఈ కింది విషయాలు తెలియవా, లేక తెలిసీ దొంగనాటకాలు ఆడుతున్నారా?

1) అమెరికా, యురోపు దేశాలు వ్యవసాయానికి, పశుపోషణకు మన దేశంలో ఇస్తున్న దానికన్న అనేక రెట్లు ఎక్కువ సబ్సిడీలు ఇస్తున్నాయి. యురోపియన్ దేశాల్లొ ఒక్కో ఆవుకి సగటున రోజుకి 2 డాలర్ల విలువైన సబ్సిడీలు ఇస్తున్నారు. ప్రపంచంలో సగం జనాభాకి రోజుకు 2 డాలర్ల ఆదాయం కూడా లేదు. 

2) అమెరికాలో ఉన్న 20,000 పత్తి రైతులకు ఆ దేశం ఏటా ఇచ్చే సబ్సిడీల మొత్తం విలువ 470కోట్ల డాలర్లు! 

3) అమెరికాలో మొత్తం వరి ఉత్పత్తి విలువ 120 కోట్ల డాలర్లు ఉంటే వరి రైతులకు ఇచ్చే సబ్సిడి విలువ 140 కోట్ల డాలర్లు

4) స్పెషల్ ఎకనామిక్ జోన్ల పేరిట మీరు ఆడుతున్న కొత్త బాగోతం పుణ్యమా అని కేంద్ర ప్రభుత్వానికి అక్షరాలా లక్ష కోట్ల రూపాయల పన్ను నష్టం వస్తుందని సాక్షాత్తూ ఒక కేంద్ర మంత్రే మొత్తుకుంటున్నారు.

5) బ్యాంకులకు బడాబాబులు ఎగ్గొట్టిన సొమ్ము 3 లక్షల కోట్లు ఉందని సీపీఐ 2005 లోనే బయటపెట్టింది.

6) 1991 లో సరళీకృత ఆర్ధిక విధానాల పేరిట దాదాపు 10 లక్షల కోట్ల విలువైన చమురు. సహజ వాయువు నిక్షేపాలు ప్రైవేటు కంపెనీలకు అప్పనంగా ఒప్పజెప్పారు తమరు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న “రవ్వ” అనే ప్రభుత్వ చమురు బావిని ప్రైవేటు కంపెనీకి అమ్మి, దాని దగ్గర తిరిగి అధిక ధరలకు చమురు కొంటుంది మన కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి చచ్చు పనులు చేసి చమురు సబ్సిడీలు పెరిగిపోతున్నాయని మోసపు మాటలు ఎలా వస్తున్నాయి మీకు?

7) ప్రైవేటు కంపెనీలకు చౌక ధరలకు అప్పజెప్పిన బాక్సైట్, ఇనుము, ఇలుమినైట్ వంటి సహజ వనరుల విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటుంది.

పేదవారికి, రైతులకు ఇచ్చేవేమో సబ్సిడీలు.

ఐటీ, బీపీవో కంపెనీలు, SEZలకు ఇచ్చేవేమో “ప్రోత్సాహకాలు”.

ప్రజలకు ఏమైనా ఇవ్వాలంటే చాలా బాధేస్తుంది మన నాయకులకు.

కంపెనీలకు మాత్రం వేల, లక్షల కోట్లు పళ్లెంలో పెట్టి బహూకరిస్తారు.

ప్రజలు గమనిస్తున్నారు…వారు త్వరలోనే మేలుకుంటారు…

Note:

మన్మోహన్ సింగు ఎవరి రికమండేషన్ పై ప్రధాని అయ్యాడో ఇక్కడ చదవండి.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: