ఇల్లు తగులబెట్టుకుని బొగ్గులేరుకుంటున్నాం మనం

మన నేతలకు ప్రతిపక్షంలోకి రాగానే ప్రజల కష్టాలు బాగా అర్థం అవుతాయి. అనేకానేక సమస్యలను తీసుకుని రోడ్డెక్కుతారు, ధర్నాలూ, రాస్తారోకోలూ, సభలూ ఓహ్! ఒక్కటేమిటి తమ చివరి రక్తపు బొట్టువరకూ ప్రజాశ్రేయస్సుకే అంకితమని ప్రతినలు పూనుతారు. కుర్చీదక్కగానే సీన్ రాత్రికి రాత్రే మారిపోతుంది. అప్పుడు వారు చెప్పేవారు, ప్రజలు వినేవారు అవుతారు. అభివృద్ధి జరగాలంటే ప్రజలు “త్యాగాలకు సిద్ధం కావాలని” పిలుపులిస్తారు, “మైండ్ సెట్ మార్చుకోవాలని” సలహాలిస్తారు, ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే రాజకీయ లబ్ది కొరకే అని విమర్శిస్తారు, మరో అడుగు ముందుకేసి “అభివృద్ధి నిరోధకులు” అని ముద్ర గుద్దేస్తారు.

వరికి మద్ధతు ధర కొరకు చంద్రబాబు నేతృత్వంలో డిల్లీ వెళ్లిన బృందానికి ప్రధాని అపాయింట్-మెంట్ కూడా ఇవ్వలేదని చదివాక,  అధికారంలో ఉన్న మన నేతలు ఎవరి ప్రయోజనాల కొరకు పాటుపడతారో మరోసారి అర్థం అయ్యింది. ప్రజలకు ఏ మేలూ చేయక, బహుళ జాతి కంపెనీలకు, అమెరికాకు ప్రయోజనం చేకూర్చే ఏకపక్ష అణు ఒప్పందం గురించి నెలల తరబడి వాదిస్తున్న మన్మోహన్ సింగు గారికి రైతుల గురించి మాట్లేడేందుకు పది నిముషాల సమయం లేకపోయింది పాపం.  ప్రైవేటు కంపెనీల సేవలో తరిస్తున్నప్రభుత్వాలకు ప్రజల సమస్యలు సహజంగానే కంటికి కనిపించవు.

1991 నుంచీ మొదలైన “సంస్కరణల” వల్లే ఇప్పటి “అభివృద్ధి” సాధ్యమైందని సమాజంలోని ఒక సెక్షన్ గుడ్డిగా వాదిస్తోంది.

ఆర్ధిక సరళీకరణ పేరుతో 1991 లో దేశంలోని సంపదను బహుళజాతి, ప్రైవేటు కంపెనీలు దోచుకునేందుకు తలుపులు బార్లా తీశారు మన ప్రభుత్వాధినేతలు. జరుగుతున్న పరిణామాల వల్ల లాభపడ్డ మధ్య తరగతిలోని ఒక సెక్షన్ ఈ సంస్కరణలను బాగా వెనకేసుకురావడం మొదలైంది.

లక్షల కోట్ల విలువైన ఖనిజ వనరులను కారు చౌకగా విదేశీ, ప్రైవేట్ కంపెనీలకు ఎలా అప్పజెప్తున్నారో ఇదివరకు ఒక సారి “దేశంలో దొంగలు పడ్డారు” అనే శీర్షిక కింద రాశాను. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

దేశంలో స్టీల్ ధరలు పెరిగి సామాన్యుడు ఇళ్లు కట్టుకోవడం భారంగా మారుతుంటే, మన ప్రభుత్వాలు ప్రైవేటు, బహుళజాతి కంపెనీలకు అతి తక్కువ ధరలకు ఇనుప ఖనిజం ఎగుమతి చేసేందుకు అనుమతులు ఇస్తున్నారు. ఏటా వేలకోట్ల విలువైన ఇనుప ఖనిజం ఓడల్లో దేశ సరిహద్దులు దాటుతోంది.

ఇక నిన్న “ఈనాడు” పత్రిక అయిదు లక్షల కోట్ల విలువైన విశాఖ బాక్సైట్ దోపిడీ గురించి ఒక కథనం వెలువరించింది.

ఇప్పుడు దేశంలో జరుగుతున్న “అభివృద్ధిని” చూస్తుంటే మనం ఇల్లు తగులబెట్టుకుని బొగ్గులేరుకుంటున్నాం అనిపిస్తుంది. 

లక్షల కోట్ల విలువ చేసే వనరులు కాళ్ల కింద పెట్టుకుని నిధుల కొరకు ప్రపంచ బ్యాంక్ ను దేబిరించడం దేనికి, అది షరతులు పెడితే దానికి తలూపి మన ఖనిజాలు బహుళజాతి, ప్రైవేటు కంపెనీల అప్ప జెప్పి, ఆ కంపెనీలు నాలుగు క్లర్కు ఉద్యోగాలు విదిలిస్తే అవే పదివేలని మురిసిపోవడం ఏమిటి? అన్నం పెట్టే వ్యవసాయాన్ని బలిపెట్టి, విదేశీ కంపెనీలకు దేశాన్ని దోచిపెట్టడం ఏమిటి?

ఈ నిజాలు మనకు అర్ధం ఆయ్యేదెన్నడు?

మన వనరులపై మనకే హక్కు ఉండాలని కదూ మనం స్వతంత్ర పోరాటం చేసింది?

 ఒకసారి ఈనాడు ఆర్టికల్ చదవండి…

———————————————————

దొడ్డిదారిన ‘ఖైమా’
లక్షల కోట్ల విలువైన విశాఖ బాక్సైట్‌ నిల్వలు

ఎన్‌.విశ్వప్రసాద్‌, హైదరాబాద్‌ – న్యూస్‌టుడే

అవి ఐదు లక్షలా 82 వేల కోట్ల రూపాయల విలువైన అల్యూమినియం ఉత్పత్తికి ఉపయోగపడే బాక్సైట్‌ నిల్వలు. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో ఈ నిక్షేపాలున్నాయి. అనంతపురం జిల్లా ఓబుళాపురం ఇనుప ఖనిజ గనుల కంటే ఎంతో విలువైన ఈ బాక్సైట్‌ నిక్షేపాలపై పెద్దల కన్నుపడింది. ప్రభుత్వ ముఖ్యుల సాయంతో దొడ్డిదోవన వాటిని చేజిక్కించుకోబోతున్నారు. కాలపరిమితులేం పెట్టకుండా, ఇంతవరకు ధరనే నిర్ణయించకుండా లక్షల కోట్ల రూపాయల విలువైన నిల్వలను ప్రభుత్వ ముఖ్యులు ఓ సిమెంట్‌ పరిశ్రమ అధినేతకు అర్పించబోతున్నారు.

vizag-bauxite2

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు చెందిన రస్‌ అల్‌ ఖైమా అనే ఎమిరేట్‌ ప్రభుత్వం విశాఖ జిల్లాలో బాక్సైట్‌ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిందని ఈ ఏడాది ప్రారంభంలో సర్కారు ప్రకటించింది. తర్వాత ఫిబ్రవరి 14న దానితో అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకుంది. వేరే దేశానికి చెందిన ప్రభుత్వంతో ఒప్పందం కావడంతో అప్పట్లో దీనిపై సందేహాలు వ్యక్తం కాలేదు. అవగాహన ఒప్పందం తాలూకు ప్రతిని న్యూస్‌టుడే సేకరించి పరిశీలించినప్పుడు.. జరుగబోయే దోపిడీ కళ్లకుగట్టింది.

రాష్ట్రంలోని విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో అత్యంత విలువైన బాక్సైట్‌ ఖనిజ నిల్వలున్నాయి. వీటివల్ల ప్రజలందరికీ ప్రయోజనం దక్కాలంటే ప్రభుత్వ రంగం ద్వారానే వినియోగంలోకి తీసుకురావడం శ్రేయస్కరమని 1975లో అప్పటి రాష్ట్రప్రభుత్వం భావించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ఉత్తర్వు (జీవో 999) జారీ చేసింది. రెండు జిల్లాల్లో బాక్సైట్‌ నిక్షేపాలు 550 మిలియన్‌ టన్నులు ఉంటాయని అంచనా. తర్వాత ఆ ప్రాంతాలన్నీ గిరిజన ప్రాంతాలుగా నోటిఫై కూడా అయ్యాయి. సమతా వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ ప్రాంతాలను మైనింగ్‌ కోసం గిరిజనేతరులకు ఇవ్వకూడదు. ఈ నిబంధనకు తూట్లు పొడిచి ఈ నిక్షేపాలను తమ వారికి ధారాదత్తం చేసేందుకు వీలుగా ప్రభుత్వ పెద్దలు వ్యూహం పన్నారు. రస్‌ అల్‌ ఖైమా ప్రభుత్వాన్ని రంగంలోకి దింపారు. ప్రభుత్వ రంగానికి చెందిన ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)ని పావుగా ఉపయోగించి తమ ఉద్దేశాలకు అనుగుణంగా ఎంఓయూను రూపొందించారు.

ఇదీ దొడ్డిదారి

ఎంఓయూ ప్రకారం రాష్ట్రంలో ఏటా పదిలక్షల టన్నుల అల్యూమినా, రెండున్నర లక్షల టన్నుల అల్యూమినియం తయారు చేసే రిఫైనరీ, స్మెల్టర్‌ యూనిట్లను దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం రస్‌ అల్‌ ఖైమా, ఆ ప్రభుత్వం తరపున పెట్టుబడులు పెట్టే సంస్థ, దానికి సంబంధించిన సహాయకులు ఇక్కడ ఒక లిమిటెడ్‌ కంపెనీని నమోదు చేయాలి. ఇక్కడ సహాయకుడు అంటే ప్రభుత్వంలోని ముఖ్య వ్యక్తులకు అత్యంత ఆప్తుడైన ఓ సిమెంటు పరిశ్రమ అధినేత. కంపెనీలో సింహభాగం ఆయనదే.

దారుణం

కొత్తగా ఏర్పాటు చేసే అల్యూమినియం కంపెనీకి ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ విశాఖ జిల్లా చింతపల్లి మండలం జెర్రెల ప్రాంతంలో 1649 హెక్టార్లలో 224 మిలియన్‌ టన్నుల నిక్షేపాలనుంచి బాక్సైట్‌ను వెలికితీసి సరఫరా చేయాలని ఎంఓయూలో నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గాని, ఖనిజాభివృద్ధి సంస్థ గాని.. సదరు అల్యూమినియం కంపెనీ నడచినంత కాలం మరో కంపెనీకి బాక్సైట్‌ను అమ్మడమో, సరఫరా చేయడమో చేయకూడదని ఆంక్ష విధించారు. ఇంతకుమించిన దోపిడీ లేనేలేదని నిపుణులు చెబుతున్నారు. ‘జెర్రెల ప్రాంతంలోని బాక్సైట్‌ నిక్షేపాలు అత్యంత విలువైనవి. అక్కడ ఒక హెక్టారు విస్తీర్ణంలో కనీసం లక్షా 36వేల టన్నుల బాక్సైట్‌ దొరుకుతుంది. దాని ద్వారా 27,200 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి చేయొచ్చు (ఒక టన్ను అల్యూమినియం ఉత్పత్తికి ఐదు టన్నుల బాక్సైట్‌ అవసరమని అంచనా). టన్ను అల్యూమినియం ధర రూ.లక్షా 30 వేల వరకు ఉంది. ఈ లెక్కన ఒక హెక్టారులో దొరికే బాక్సైట్‌ ద్వారా రూ.353 కోట్ల విలువైన అల్యూమినియాన్ని తయారుచేయొచ్చు. ప్రారంభించే కంపెనీ స్థాయిని బట్టి దానికి ఏటా 4.5 మిలియన్‌ టన్నుల ముడిసరకు చాలు. సాధారణంగా 30 ఏళ్ల కాలపరిమితిని దృష్టిలో పెట్టుకుని నిక్షేపాలు కేటాయిస్తారు. ఈ లెక్కన దానికి అవసరమయ్యేలా 135 మిలియన్‌ టన్నులను కేటాయిస్తే సరిపోయేది. అలా కాకుండా అక్కడున్న మొత్తం 224 మిలియన్‌ టన్నల నిక్షేపాలున్న ప్రాంతాన్నీ ఆ కంపెనీకే దఖలు పర్చడం దోపిడీ’ అని వారు అంటున్నారు. నిజానికి జిర్రెల ప్రాంతంలో ప్రస్తుత అంచనాలకంటే ఎక్కువ నిక్షేపాలు దొరికే అవకాశముందని చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకోకుండా ప్రభుత్వం ఆ కంపెనీకి నిక్షేపాలన్నీ రాసిచ్చిందని ఆక్షేపిస్తున్నారు.

vizag-bauxite1

ధరపై కమిటీ!

వీధిలో చిన్న సరకులు అమ్మేవారు సైతం ముందు రేటు చెప్పి బేరం కుదిరాకే సరకు విక్రయిస్తారు. ప్రస్తుత ధరల ప్రకారం రూ.5.82 లక్షల కోట్ల విలువైన అల్యూమినియం ఉత్పత్తి చేసేందుకు వీలైన బాక్సైట్‌ నిక్షేపాలను గుండగుత్తగా అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. వాటి ధరను మాత్రం తర్వాత ఖరారు చేయాలని నిశ్చయించింది. ధర ఖరారుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించాలని ఎంఓయూలో పేర్కొన్నారు. దాని ప్రకారం సర్కారు జీవో విడుదల చేసింది. ధరల కమిటీ ఛైర్మన్‌గా పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి ఉంటారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఐవీఆర్‌కె కృష్ణారావు, ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ రాజగోపాల్‌, మరో ఐఏఎస్‌ అధికారి సుతీర్థ భట్టాచార్య తదితరులు సభ్యులు.

తేలని వాటా

అల్యూమినియం కంపెనీ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు కొంత వాటా ఇవ్వాలని ఎంఓయూలో పేర్కొన్నారు. ఆ వాటా ఎంతో చెప్పలేదు. ధరపై ఏర్పాటు చేసే కమిటీయే దీనిపైనా నిర్ణయం తీసుకుంటుందని రాశారు. బాక్సైట్‌ వెలికితీతకు అవసరమైన యంత్రాలను ఖనిజాభివృద్ధి సంస్థ కొనుగోలు చేయవచ్చు, లేదా అద్దెకు తీసకోవచ్చు. అద్దె ఛార్జీలనూ పై కమిటీయే ఖరారు చేస్తుంది.

పన్ను రాయితీలు

మెగా ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రాజెక్టులకు వర్తించే అన్ని రకాల మినహాయింపులను దీనికి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రవేశ పన్ను తదితరాల నుంచీ మినహాయింపులు ఇస్తారు. అటవీ, పర్యావరణ సంబంధ అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచీ తీసుకునే బాధ్యతా ఖనిజాభివృద్ధి సంస్థదే.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: