శవాలూ, వాటిపై పేలాలూ…

ఈపాటికే ఈ దుర్ఘటన గురించి టీవీల్లో చూసి, పేపర్లలో చదివి మళ్లీ బ్లాగుల్లో ప్రతిస్పందనలు చదివి ఉంటారు కాబట్టి మళ్లీ లోతుగా వెళ్లను. కానీ నిన్న జరిగిన రెండు సంఘటనలపై నా మనసులో మెదిలిన రెండు భావాలు మీతో పంచుకోవాలి.

శనివారం (8 సెప్టెంబర్) ఉదయం ఇంకా నిద్రలేవక ముందే ఫోన్ వచ్చింది స్వర్ణకు. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ అయిన షీలా, నరేశ్ లు పూనే నుండి పని మీద హైదరాబాద్ వచ్చారట. అమీర్ పేటలోని ఏదో హోటల్లో దిగారట. బ్రేక్ ఫాస్ట్ కి నాగార్జున సర్కిల్ లో ఉన్న చట్నీస్ రెస్టారెంటుకు వెంటనే బయల్దేరి రావాలని ఫోన్ లో సందేశం.

పదిహేను నిమిషాల్లో తయారై వెళ్లాం రెస్టారెంటుకు. అక్కడి టిఫిన్ రుచిగా ఉన్నా రేట్లు చూసి గుండె గుభేలంది. టిఫిన్ చేశాక షాపింగ్ చేయాలంటూ స్వర్ణను వారి కారులో తీసుకువెళ్లింది షీలా. నేనేమో నరేశ్ ను నా బైక్ పై కూర్చోబెట్టుకుని బయల్దేరాను. సరిగ్గా బ్రిసా ముందుకు (నిన్న ఫ్లై ఓవర్ కూలిన ప్రదేశం) వచ్చి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం. నరేశ్ కు ఈ ఫ్లై ఓవర్ కొత్త టెక్నాలజీతో కడుతున్నారనీ, ఇలాంటి ఒక భారీ ఫ్లై ఓవర్ షంషాబాద్ విమానాశ్రయం వరకూ కడుతున్నారని వివరించాను.

నిన్న సాయంత్రం దుర్ఘటన సంగతి తెలిశాక మనం ప్రమాదాలకు ఎంత చేరువగా బ్రతుకుతున్నామో మరోసారి అర్ధం అయ్యింది నాకు.

సరే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం. నేతల అవినీతి గురించి అందరూ అల్రెడీ చెప్పారు కాబట్టి నేను ఇంకో విషయం కూడా దానికి జత చేద్దామనుకుంటున్నాను.

ప్రమాదం జరగగానే హుటాహుటిన అక్కడికి చేరవలసింది 108 అంబులెన్సులు. సహాయక బృందాలు. అంతే కానీ చంద్ర బాబులు, జనార్ధన రెడ్డిలు కాదు.

అసలే అస్తవ్యస్థ ట్రాఫిక్ తో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతుంటే, శవాలపై పేలాలు ఏరుకునే రకంగా తయారయ్యారు మన నేతలు. ప్రమాదం జరిగిన వెంటనే అనుచరగణంతో దిగిపోవడం, సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తూ దీనికి ప్రభుత్వ అవినీతి, అలసత్వమే కారణమని, వెంటనే ముఖ్యమంత్రి దిగిపోవాలని స్టేట్మెంట్లు ఇవ్వడం ఫ్యాషనైపోయింది.

అయ్యా, అందరూ ఆ తానులో ముక్కలనే విషయం ప్రజలకు తెలుసు. రాజకీయాలు ఏమైనా ఉంటే రేపు, ఎల్లుండి మాట్లాడుకోవచ్చు. దయచేసి ప్రమాదాలు, దుర్ఘటనలు జరగగానే మీరు అక్కడ వాలిపోకండి. కొన ఊపిరితో ఉన్నవాళ్ల ఉసురు తీయకండి.


మళ్లీ Deja vu

కేకే పుత్రరత్నం వెంకట్ తన వ్యాపార భాగస్వామి ప్రశాంత్ రెడ్డిని కాల్చి చంపాడన్న వార్త Breaking News గా చూడగానే ఆ రూంలో కూర్చున్న మా స్నేహితులు ఇప్పుడు వెంకట్ కేర్ హాస్పిటల్లో చేరుతాడా, లేక అపోలో హాస్పిటల్లో చేరుతాడా అని జోకులు వేసుకున్నారు.

ఇప్పుడు ప్రతీ దానికీ ఒక ఫార్ములా ఉంది. ఎన్ కౌంటర్ కు ఒక ఫార్ములా, పోలీసు కాల్పులకు ఇంకో ఫార్ములా, ఇలాంటి గొప్పోల్ల “కాల్పులకు” మరో ఫార్ములా.

సో, బాలయ్య బాబు కనిపెట్టిన ఈ కాల్పుల ఫార్ములా నాటకాన్ని ఇప్పుడు మన వెంకట్ బాబు ఎలా రక్తి కట్టిస్తున్నాడో చూడండి.

అన్నట్టు నేరాలను అదుపు చేయాలంటే “కఠినమైన చట్టాలు” ఉండాలని మనం తెగ గోలపెడుతుంటాం కదూ?

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: