రైతుబాంధవునికి సముచిత పురస్కారం

పాలగుమ్మి సాయినాథ్ కు మెగసెసె అవార్డ్ వచ్చిన నాటి నుండీ అతని గురించి ఒక పోస్టు రాయాలనుకుని వాయిదా వేస్తూ వచ్చాను. మొన్న ఆదివారం ఈనాడులో ఎం.ఎల్. నరసింహా రెడ్డి సాయినాథ్ పై చక్కని వ్యాసం రాసాడు.

మిత్రుడు ఇస్మాయిల్ పెనుకొండ ఆపాటికే సదరు వ్యాసం గురించి తన బ్లాగులో ప్రస్తావించాడు.

అయినా ఒక రికార్డ్ ఉండాలని మొత్తం వ్యాసాన్ని దిగువ ఇస్తున్నాను.

రైతు బాంధవుడు

psainath

కంప్యూటర్లూ సాఫ్ట్‌వేర్ల గురించి మాత్రమే అంతా ఆలోచిస్తున్న ఈ ఆధునిక యుగంలో… ప్రియురాలి వంటి పట్నాన్నే కాదు… తల్లివంటి పల్లెను కూడా తలచుకోవాల్సిన అవసరం ఉందనుకున్నాడో వ్యక్తి! అనుకోవడమే కాదు, అకుంఠిత దీక్షతో నెలల తరబడి గ్రామాల వెంట తిరిగాడు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లాడు. అందుకు కారణమైన లోతుల్ని తరచిచూశాడు. అక్షరబద్ధం చేశాడు. పాలకుల, ప్రజల దృష్టికి తెచ్చాడు. ఆయనే పాలగుమ్మి సాయినాథ్‌. ఈ ఏడాది రామన్‌ మెగసెసే అవార్డు విజేత.

మనదేశంలో సేద్యం ఎప్పణ్నుంచో ఉంది. రైతూ ఎప్పణ్నుంచో ఉన్నాడు. సాగులో ఇబ్బందులూ అంత పాతవే. కానీ… సంస్కరణల కారణంగా తలెత్తుతున్న సమస్యలు మాత్రం కొత్తవి. వాటిని వెలికితీసి రైతన్నల వెతలను ప్రపంచానికి తెలియజేశారు పాలగుమ్మి సాయినాథ్‌. పేరు గొప్ప పాలకులు చేసే ఆర్భాటపు ప్రకటనలూ విధానాలూ ఆచరణలో, క్షేత్ర స్థాయిలో ఎలా డొల్లపోతున్నాయో ససాక్ష్యంగా నిరూపించే ప్రయత్నం చేశారు. బ్లిట్జ్‌ పత్రికలో విదేశీ వ్యవహారాల సంపాదకునిగా చేసిన సాయినాథ్‌… గ్రామీణ భారతం కోసం ఫ్రీలాన్సు జర్నలిస్టు అవతారం ఎత్తారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఫెలోషిప్‌తో దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో పర్యటించి 18నెలల్లో 84కథనాలతో అవినీతిపరుల గుండెల్లో దడ పుట్టించారు. మహారాష్ట్ర విదర్భ రైతుల ఆత్మహత్యల గురించి ఆయన రాసిన కథనాలతో ప్రధానమంత్రి కార్యాలయం కదిలింది. గత జూన్‌-జులై నెలల్లో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆ ప్రాంతాల్లో పర్యటించారు.
ఓ సీనియర్‌ జర్నలిస్టు మాటల ప్రకారం సాయినాథ్‌ అంటే… ీద బ్యాడ్‌బోయ్‌ ఆఫ్‌ ఇండియన్‌ జర్నలిజం’. ఆయన మాటల వెనుక నేపథ్యం తెలుసుకునే ముందు ఇంకా చాలా విషయాల గురించి ఆలోచించాల్సి ఉంది.

ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనదేశంలో 60 శాతం మందికి పైగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. కానీ మన పాలకులకు ఆ రంగమంటేనే అలవిమాలిన నిర్లక్ష్యం. సాఫ్ట్‌వేర్‌పైనో, సిమెంటు, ఉక్కు ఫ్యాక్టరీలపైనో, మరో రంగంపైనో చూపించిన శ్రద్ధలో కనీసం వందోవంతు కూడా దానిపై చూపించరు.

మనం రోజూ పత్రికలు తిరగేస్తుంటాం. ఏదో ఒక మూల “అప్పుల బాధ భరించలేక… ఆత్మహత్య” అని సింగిల్‌కాలం వార్త కనిపిస్తుంది. కానీ మనం దాన్ని కనీసం చూడనైనా చూడం. అలా చనిపోయింది ఎవరో, ఎందుకలా బలవంతంగా ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చిందో ఒక్కసారి కూడా మనసు పెట్టి చదవం. రోజూ తినే కూరగాయలు ఎలా వచ్చాయో, వాటిని పండించడానికి ఎందరు, ఎంత కష్టపడుతున్నారో వాళ్లకు జరుగుతున్న అన్యాయమేంటో ఆలోచించం.

ఆ రైతులే ఒక ఏడాదో, రెండేళ్లో సమ్మెచేస్తే…మేము ఈ పని చేయం, వేరేది చూసుకుంటాం అని భీష్మిస్తే…మన నోట్లోకి నాలుగు వేళ్లూ పోవు.రుచులు తీరవు. కడుపులు నిండవు.
మన జేబులిలా నిండుగా ఉండవు.ఆరుగాలం స్వేదం చిందించినా…ఎవరి ఆదరణకూ, కనీసం సానుభూతికి నోచని ఆ అభాగ్యజీవులే మన రైతన్నలు. మన అన్నదాతలు!
రుణమనే పొలాన్ని.. శరీరమనే నాగలితో దున్ని… ఎర్రటి ఎండలో చిందిన చెమట చుక్కల్ని సాగునీరుగా పోసి… శ్రమను నాటేసి… అలుపెరుగని కష్టాన్ని ఎరువుగా వేసి… నష్టమనే దిగుబడి పొంది… ఆత్మహత్య అనే ఆదాయాన్ని సంపాదించుకుంటున్నాడు మన రైతన్న!సేద్యమనే ఉద్యోగం వెుదలుపెట్టి… దాన్ని చేయలేక, చేసే చేవలేక… మధ్యలోనే బలవంతంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి… అర్ధాంతరంగా బతుకు నుంచి విరమించుకుంటున్నాడా మట్టిమనిషి! ఆ రైతన్న కథ, వ్యథ, విషాద గాథ కూడా వార్తేననీ, పాలకులు, ప్రజలతో పాటు అందరూ పట్టించుకోవాల్సిన అంశమేననీ అనుకున్నారు సాయినాథ్‌. అదే ఆయనకు బ్యాడ్‌బోయ్‌ అన్న బిరుదు సంపాదించి పెట్టింది.

* * *
ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక వేత్త, నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ మాటల్లో చెప్పాలంటే ఆకలి, దుర్భిక్షంపై ప్రపంచంలోనే అత్యంత లోతుగా అధ్యయనం చేసిన నిపుణుల్లో సాయినాథ్‌ ఒకరు. తాను ఎవరి గురించి రాస్తారో వారిని గౌరవిస్తారాయన. వారితో మమేకమై వాళ్లు చెప్పింది ఓపిగ్గా వింటారు. వారి సమస్యలకు కారణమైన విధానాలపైన, కారకులైన పాలకులపైన తీవ్రంగా స్పందిస్తారు. పాలకులను నిద్రలేపేలా ఆయన కథనాలు ఉంటాయి. ఆయన కలం, గళం రెండూ శక్తిమంతమైనవే. పేదలు, అణగారిన వర్గాల సమస్యలపై ఎంత తీవ్రంగా స్పందించి రాస్తారో, వారి తరఫున అంత కంటే గట్టిగా మాట్లాడతారు. రాతలోనూ, మాటల్లోనూ నిర్మోహమాటంగా తన అభిప్రాయాలు చెప్తారు. ీదేశం వెుత్తం మీదా గత పదేళ్లలో దాదాపు లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ అందుకు కారణమైన ఒక్క అధికారికి కూడా కనీస శిక్షపడలేదు’ అన్న సాయినాథ్‌ మాటలు కఠినంగా అనిపించొచ్చుగానీ అవి అక్షర సత్యాలు.

గ్రామాల్లోనే…

గత 14 సంవత్సరాలుగా సాయినాథ్‌ ఎక్కువ కాలం గ్రామాల్లోనే గడిపారు. ఏడాదికి దాదాపు 250 నుంచి 270 రోజులు పల్లెల్లోనే తిరుగుతారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌… ఇలా ఒకటికాదు రెండుకాదు, ఇన్నేళ్లల్లో ఆయన తిరిగిన దూరం దాదాపు 3లక్షల కిలోమీటర్లు. క్షేత్రపర్యటనలో ప్రజలు చెప్పేది ఓపిగ్గా వింటారు. వారి బాధల్ని ప్రత్యక్షంగా చూస్తారు. తాను రాసే విషయంలోగానీ అంకెల్లో గానీ ఎక్కడా పొరబాట్లు రాకుండా జాగ్రత్తపడతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాలూ వాటిపై ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచబ్యాంకు లాంటి సంస్థల ప్రభావాల గురించి లోతుగా అధ్యయనం చేసిన సాయినాథ్‌ ఒక సమస్యను భిన్నకోణాల్లో ఆలోచించి రాస్తారు. ఇన్ని మాటలెందుకు… పాలమూరు వలసలూ అనంతపురంలో రైతుల ఆత్మహత్యలూ అంతర్జాతీయ సమాజం దృష్టికి రావడానికి ఆయన రచనలే కారణం. వలస కూలీలుగా మారిన మహబూబ్‌నగర్‌ జిల్లా రైతులు 2000సంవత్సరంలో వారానికి ఒక బస్సులో ముంబాయి వెళ్లేవారు. 2004కి ఆ సంఖ్య 34బస్సులకు పెరిగింది. ఈ విషయాన్ని గుర్తించి ప్రపంచానికి చెప్పింది సాయినాథే. ఈ సమస్య తీవ్రతను తెలుసుకొనేందుకు వలసకూలీలతో కలిసి ఆయన బస్సులో ముంబయికి ప్రయాణం చేశారు. బస్సు డ్రైవరును కూడా వదలకుండా ప్రతి ఒక్కరితో మాట్లాడి కథనాలు రాశారు.

పాముకాటుతో రైతులు మరణించడానికీ ఆర్థిక సరళీకృత విధానాలకూ తీవ్రవాదానికీ సంబంధం ఉందంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ సాయినాథ్‌ పరిశోధనలో ఈ మూడింటికీ సంబంధం ఉందని తేలింది. తెల్లవారు జామున ఏ మూడింటికో కరెంటు ఇస్తోంది ప్రభుత్వం. వోటారు స్విచ్‌ వేయడానికి రాత్రిళ్లు పొలానికి వెళ్లిన రైతులు పాముకాటుకు గురైతే విరుగుడు మందు దొరకట్లేదు. పీపుల్స్‌వార్‌ నుంచి ఎల్టీటీఈ దాకా పాముకాటు మందును పెద్దఎత్తున కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడమే దానికి కారణమని తేలింది. ఈ చేదునిజం గురించి 2001లో ఆయన రాసిన కథనం అంతర్జాతీయంగా ప్రచురితమైంది. ఇలా గ్రామీణుల దుర్భర జీవితాల్ని కళ్లకు కట్టడమే కాదు, ప్రభుత్వాల మెడలు వంచి పట్టించుకునేలా చేయడానికి ఆయన అహర్నిశలూ కృషిచేస్తున్నారు.

మనవాళ్లే…

పూర్వీకులు ఆంధ్రులే అయినా సాయినాథ్‌ పుట్టిందీ పెరిగిందీ చెన్నైలో. మాజీరాష్ట్రపతి వి.వి.గిరి మనవడాయన(కూతురి కొడుకు). సాయినాథ్‌ తండ్రి పాలగుమ్మి సూర్యారావు కాకినాడ వాస్తవ్యులు. తాత జగన్మోహనరావు స్వాతంత్య్ర సమరయోధుడు. ఆ ప్రభావమేనేవో… అన్యాయాన్ని నిలదీసే దృక్పథం సాయినాథ్‌కు విద్యార్థిదశలోనే అలవడింది. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో రోమిల్లాథాపర్‌, కె.ఎన్‌.ఫణిక్కర్‌, సర్వేపల్లి గోపాల్‌, బిపిన్‌చంద్ర వంటి చరిత్రకారుల శిష్యరికం ఏ సమస్యనైనా భిన్నమైన కోణంలో చూసే అలవాటు నేర్పిందాయనకు. బలమైన వామపక్ష విద్యార్థి ఉద్యమానికి కేంద్రమైన జె.ఎన్‌.యు.లో చదువు ప్రగతిశీల భావాల వైపు వెుగ్గేలా చేసింది. అక్కడే హిస్టరీలో ఎమ్మే పూర్తిచేసుకొని యునైటెడ్‌ న్యూస్‌ ఆఫ్‌ ఇండియా(యు.ఎన్‌.ఐ.)లో చేరారు సాయినాథ్‌. వివిధ పత్రికలకు యు.ఎన్‌.ఐ. అందించిన వార్తల్లో ఎన్ని ప్రచురితమయ్యాయో లెక్కగట్టడం ఆయన పని. సెలెబ్రిటీల వార్తలకు ఇచ్చినంత ప్రాధాన్యం రైతులకూ ఇవ్వడంలేదనే విషయాన్ని సాయినాథ్‌ అప్పుడే గమనించారు. అదే సమయంలో… మనదేశంలోని 2,937 పాఠశాలల్లో అసలు ఉపాధ్యాయులే లేరంటూ ీనేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌’ విడుదల చేసిన నివేదిక ఆయన జీవితదృక్పథాన్నే మార్చేసింది. ఆ రిపోర్టు ఆధారంగా ఆవేదనతో ఆయన రాసిన వ్యాసం దేశంలోని ప్రముఖ పత్రికల్లో పతాకశీర్షికయింది. జర్నలిజం పట్ల ఆయనకు మమకారం ఏర్పడటానికి అదే కారణమైంది. దాంతో బ్లిట్జ్‌ పత్రికలో చేరారు. ఇదంతా 1983 నాటి మాట. పదేళ్లపాటు అందులోనే పనిచేశారాయన. 1993లో బ్లిట్జ్‌ పత్రిక నుంచి బయటకు వచ్చి ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా జీవితం ప్రారంభించారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఫెలోషిప్‌ కోసం జరిగిన ముఖాముఃలో… గ్రామీణ భారతం సమస్యల్ని వెలికితీయడంలో తన భవిష్యత్తు ప్రణాళిక గురించి వివరించినప్పుడు, ీదీనిపై మా పాఠకులకు ఆసక్తి ఉండదనుకుంటా’ అని ఓ బోర్డు సభ్యుడు అన్నాడు. ీవారి తరఫున మాట్లాడటానికి మీరు వాళ్లను ఆఖరిసారిగా ఎప్పుడు కలుసుకున్నారు’ అని ఘాటుగా సమాధానమిచ్చి మరీ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ీమీరు రాసిన అన్ని వ్యాసాలూ ప్రచురించలేం’ అన్న టైమ్స్‌ పత్రిక ఆ తర్వాత ఆయన రాసిన ఏ వ్యాసాన్నీ కాదనలేకపోయింది. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ నిధుల్ని నాయకులే స్వాహాచేయడం, కరవు, పేదరికం… తదితర అంశాలతో రాసిన ఆ కథనాలే ీఎవ్రీబడీ లవ్స్‌ గుడ్‌ డ్రాట్‌’ పేరుతో పుస్తకంగా వచ్చాయి.
అభివృద్ధి జర్నలిజం స్వరూపాన్నే మార్చేసిన సాయినాథ్‌ ఆ అంశంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతమైన చర్చ జరిగేలా చేశారు. ఈ విషయంలో ప్రసార సాధనాలను విమర్శించడానికి కూడా ఆయన వెనుకడుగు వేయలేదు. ీముంబాయిలో లాక్మే ఫ్యాషన్‌షో జరిగితే అధిక సంఖ్యలో అక్రిడేటెడ్‌ జర్నలిస్టులు హాజరయ్యారు. జాతీయ పత్రికలు, టెలివిజన్‌ ఛానళ్లలో ప్రముఖంగా ప్రచారం ఇచ్చారు. కనీస వేతనాల కోసం లక్షల మంది వ్యవసాయ కూలీలు ఢిల్లీలో ఆందోళన చేస్తే ఎవరూ పట్టించుకోలేదు’ అంటూ నిశితంగా విమర్శించారు. భారతదేశంలోని పత్రికలు పైనున్న ఐదుశాతం మంది గురించి పట్టించుకుంటే, తాను కింది నుంచి ఐదుశాతం మంది కోసం రాస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ప్రతి జర్నలిస్టు ఫొటోగ్రాఫర్‌ అయి ఉండాలనే సాయినాథ్‌ , గ్రామీణ భారతంలో మహిళల వెతలను చిత్రీకరించారు. వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ పేద మహిళల గురించి ప్రత్యేకంగా ఫోటో ఎగ్జిబిషన్‌ రూపొందించారు.

ఓ గిరిజన మహిళ. చెరువు దగ్గర నుంచొని కొంతమేర చీరను ఒంటికి చుట్టుకొని మిగిలిన భాగాన్ని ఉతుక్కుంటోంది. ఒరిస్సాలోని మల్కనగిరి జిల్లాలో నాకు కనిపించిన దృశ్యమిది. అలాగే… బీహార్‌లోని గొడ్డా జిల్లా లాల్మతియా గ్రామంలో ఓ వ్యక్తి మూడు బొగ్గుమూటల్ని సైకిల్‌మీద పెట్టుకొని అతి కష్టంగా లాక్కుని వెళ్తున్నాడు. మూడు క్వింటాళ్ల బరువుంటాయవి. అతనికి సాయం చేద్దామని ఐదునిమిషాలు తోయగానే అలసిపోయాన్నేను. కానీ అదే బరువుతో రోజూ 40కి.మీ. దూరం ప్రయాణించి వాటిని అమ్ముకుంటాడు అతను. అందుకు ముట్టే ప్రతిఫలం రూ.10. ఆ ప్రాంతంలో దాదాపు మూడువేల మందికి అదే ఆధారం’ అని చెబుతారు సాయినాథ్‌. వినడానికే గుండెలు తరుక్కుపోయే ఇలాంటి ఎన్నో దృశ్యాలను చూశారాయన. ఆ ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం, పదును ఆ కలంలో కనిపిస్తాయంటే ఆశ్చర్యమేముందిక!

– ఎం.ఎల్‌.నర్సింహారెడ్డి, న్యూస్‌టుడే, హైదరాబాద్‌

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: