వేట అదే వేటు అదే నాటి కధే అంతా

రాత్రి 8:15కి బండి స్టాండ్ వేసి ఇంట్లోకి వస్తుంటే వచ్చిందా ఫోన్. అటునుంచి నా బెంగాలీ కొలీగ్. “ఎక్కడున్నావ్” అని ఆదుర్దాగా అడిగాడు. ఇప్పుడే ఇంట్లోకి వస్తున్నానని బదులిచ్చాను. “కోటీలో, లుంబినీ పార్కులో బాంబ్ బ్లాస్ట్స్ అయ్యాయి. నువ్వు జాగ్రత్త” అని చెప్పాడతను. పరుగున వెళ్లి టీవీ ఆన్ చేశాను. తననూ జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇక ఫ్రెండ్స్ కు, బంధువులకు ఫోన్ చేయడం మొదలు పెట్టాను.

దిల్ సుక్ నగర్ లో షాపింగ్ చేస్తున్న మా అక్కకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పాను. తను ఇంటికి వెళ్లిన గంటకు తెల్సింది దిల్ సుక్ నగర్ లో బాంబు లభ్యమైన ప్రదేశం లోనే నిలబడి అంతక్రితం తను నాతో ఫోన్ మాట్లాడిందని. నాకైతే ఒళ్లు జలదరించింది. దాదాపు నలభై ఐదుగురు అమాయకులను బలిగొన్న హైదరాబాద్ జంట బాంబు దాడుల దరిమిలా ఇప్పుడు టెర్రరిజం ఏకంగా మన ముంగిట్లోకే వచ్చింది.

అయితే గత రెండు రోజులుగా అన్ని మీడియాల్లో వస్తున్న ప్రతిస్పందనలు చూస్తుంటే మాత్రం నిస్పృహ కలుగుతోంది. టెర్రరిస్టులను ఎదుర్కోవాలంటే మనం ఇక రొటీన్ కి భిన్నంగా ఆలోచించాలి .

1) ముందుగా మాట్లాడాల్సింది మతోన్మాదం గురించి. ఇలాంటి సంఘటన జరగగానే అటు బీజేపీ నుండి ఇటు మజ్లీస్ దాకా సంఘటనకు రంగు పూసి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తారు. ప్రజలు (మనం) ఒక విషయం స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. ఇటువంటి దారుణాలకు తెగబడే ముష్కరుల ప్రధాన లక్ష్యం ఈ దేశపు మతసామరస్యతను దెబ్బతీసి, సమాజంలో అల్లకల్లోలం రేపి తద్వారా ఈ దేశాన్ని దెబ్బతీయడం. అన్నట్టు చెప్పడం మరిచాను. ఈ బాంబు దాడి వార్త వస్తున్నప్పుడే 1993 బొంబాయి అల్లర్లలో శివసేన అధ్యక్షుడు బాల్ థాకరే ముస్లిములను చంపమని స్వయంగా తన అనుచరులకు ఆదేశాలు జారీ చేశాడన్న సాక్ష్యాలు వెలువడ్డాయి. మతోన్మాదులు రెండు వైపులా ఉన్నారన్న్న నిజం ఇప్పటికయినా మనందరం అర్ధం చేసుకోవాలి. మొన్నటి సంఘటనలో దాదాపు హిందువులతో సమానంగా ముస్లింలూ మరణించారనీ, ఇంతకు ముందు ఇదే దుండగులు ఏకంగా ముస్లిముల పవిత్ర మక్కా మసీదుపై కూడా దాడి చేశారనీ మనం గుర్తుంచుకోవాలి. ఉన్మాదానికి మతం లేదు. ఫలానా మతం వాళ్లే ఇలా చేస్తారు అనే అనుమానాలు వదలాలి. చంపే వాడు రాక్షసుడు. చనిపోయే అమాయకులందరూ మానవులే. టెర్రరిస్టుల కుట్రలు ఫలించకుండా ఉండాలంటే ఇటువంటి సంఘటనలు హిందూ ముస్లిం ఐక్యతను ఇంకా పెంచాలి. అప్పుడే ఆ దుండగులకు చెంపపెట్టులా ఉంటుంది.

2) మెటల్ డిటెక్టర్లు పెట్టాలి, భధ్రత పెంచాలి, ఇలాంటి పనులు చేసే వాళ్లను కాల్చి చంపాలి….ఇవి మొన్నటి బాంబు దాడికి ప్రతిస్పందనగా వినవస్తున్న మాటలు, సూచనలు. టెర్రరిజం మూలాలు లోతుగా అధ్యయనం చేయకుండా వస్తున్న అపరిపక్వ ప్రతిస్పందనలు ఇవి. ఇవ్వాళ టెర్రరిజం ప్రపంచం లోని అనేక దేశాలను వణికిస్తున్నది. ఎంతో “అభివృద్ధి” చెందిన అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా ఉగ్రవాదులు చిత్తం వచ్చిన చోట దాడులకు తెగబడుతున్నారు. ప్రపంచ చరిత్రను యధాలాపంగా తిరగేసినా ఈ టెర్రరిజం మూలాలు ఎక్కడున్నాయో తెల్సుస్తుంది. ఇప్పుడు జడలు విప్పి కరాళ నృత్యం చేస్తున్న జిహాదీ ఉగ్రవాదం ప్రాణం పోసుకున్నది అఫ్ఘానిస్తాన్ కొండ కోనల్లో. దానికి పాలు పోసి పెంచింది అమెరికా. బిలియన్ల కొద్దీ డాలర్ల డబ్బు, ఆయుధాలు పాకిస్తానీ ఐ.ఎస్.ఐ. ద్వారా జిహాదీలకు చేరవేసింది అమెరికా. ఇప్పటికీ సీమాంతర ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాకిస్తాన్ ను తన “మిత్ర దేశం” గా పరిగణిస్తుంది అమెరికా. ప్రపంచంలో ఏ దేశమూ, ఏ ఉగ్రవాద సంస్థా చేయనన్ని ఉగ్రవాద చర్యలు అమెరికా చేసింది. ఇన్ని చేసినా మనం ఇవ్వాళ అణు ఒప్పందం పేరిట అదే అమెరిక చంకనెక్కుతున్నాం. టెర్రరిజం బాధిత దేశంగా ఉన్న భారత దేశం ప్రపంచంలోనే అతి పెద్ద టెర్రరిస్టు దేశంతో నెయ్యం చేయడమేమిటి. ఈ ఆలోచనలు ఎప్పుడైనా మన బుర్రలోకి వస్తున్నాయా? మూలాలు ఆలోచించకుండా దాడి జరిగిన ప్రతిసారీ గుండెలు బాదుకుంటే ఒరిగేదేమిటి?

3) ఇప్పుడంతా గ్లోబలైజేషన్ యుగం. ఇక్కడ అమ్మేవాడూ, కొనేవాడు తప్ప మనిషనేవాడు ఉండడు. గణాంకాలే మానవాభివృద్ధికి సూచికలవుతాయి. కానీ కొన్ని “అభివృద్ధి” గ్రాఫులు ఆకాశంలోకి దూసుకుపోవాలంటే మనుషుల రక్త మాంసాలు ఇంధనంగా కావాలి. ఒక సారి అమెరికా ఆయుధ మార్కెట్ ను గమనించండి. ప్రపంచంలోనే అతి పెద్ద ఆయుధాల ఎగుమతిదారు అమెరికా. చిన్న పిస్తోళ్లు, ఏకే-47 వంటి అత్యాధునిక మరతుపాకులు, భుజంపై నుంచి పేల్చగలిగే స్టింగర్ విమాన విధ్వంసక క్షిపణుల నుండి మొదలుకొని భయంకరమైన ఆర్డిఎక్స్, రసాయన, క్రిమి, అణ్వాయుధాల దాక అమెరికన్ బహుళజాతి కంపెనీలు అమ్మని జనహనన ఆయుధం లేదు. ఇలా అమ్ముతున్న చాలా అయుధాలకు లెక్కా పత్రం ఉండదు. ఇందులో చాలా భాగం ఉగ్రవాదులకే సరఫరా అవుతున్నాయన్నది బహిరంగ రహస్యమే. ఎన్ని ఎక్కువ తుపాకులు, బాంబులు, బుల్లెట్లు అమ్మితే కంపెనీలకు అంత లాభం. సదరు కంపెనీలు పచ్చగా ఉండాలంటే మనుషుల బలి నిత్యం జరుగుతుండవలసిందేగా. అందుకే ఇన్ని “అధికారిక”, “అనధికారిక” యుద్ధాలు. మన స్నేహితులూ, బంధువులూ, మనకేమీ కాని లక్షలమంది అమాయకులు బలవన్మరణం పాలు కాకూడదంటే అమెరికా తన విధానాలు మార్చుకునేలా మనం వత్తిడి చేయగలగాలి.

4) బాంబు పేలిన పది నిముషాల్లోనే ఇది ISI కుట్ర అని మన ముఖ్యమంత్రి మొదలుకొని చిన్నా, పెద్ద అధికారులు, నేతలూ నిర్ధారించేశారు. దేశంలో ఏ టెర్రరిస్టు సంఘటన జరిగినా అది లష్కరే తోయిబా పని అనో, ఐ,ఎస్.ఐ. పని అనో పది నిముషాల్లోనే ప్రకటనలు ఇచ్చేయడం ఆ తరువాత ఇంకో సంఘటన జరిగేంత వరకూ నిద్ర పోవడం అలవాటైంది. జరిగిన సంఘటన ఎందుకు జరిగిందో పరిశొధించాల్సిన అవసరం ఉంది. పైకి కనపడేవి అన్నీ నిజాలు కావు. సంఘటన జరిగిన ప్రదేశంలో ఎన్నో కీలక ఆధారాలు లభ్యమవుతాయి. మన మీడియా, ప్రజలు, పోలీసుల బాధ్యతారాహిత్యం వలన సంఘటనా స్థలంలో ఆధారాలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది.

5) చట్టాలు కఠినంగా ఉండాలని అద్వానీ గారంటే, రాష్ట్రం లో శాంతి భధ్రతలు క్షీణిస్తున్నాయని బాబుగారు సెలవిచ్చారు. పోలీసులకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని మరో పెద్దాయన అభిప్రాయపడ్డారు. పోటా వంటి చీకటి చట్టాలను తెచ్చేది పేరుకు టెర్రరిస్టుల కొరకు. వాటిని ప్రయోగించేది మాత్రం అమాయకులపైన, రాజకీయ ప్రత్యర్ధులపైన. ప్రభుత్వ వ్యతిరేక కవితలు రాసినందుకు మన రాష్ట్రంలో రివేరా అనే కవిని పోటా చట్టం కింద నిర్భందించడమే దీనికి చక్కని ఉదాహరణ. నేతలకు, పోలీసులకు చిత్తశుద్ధి ఉండాలే కానీ ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి. కొత్త నల్ల చట్టాలు అమాయకులను వేధించడానికే ఉపయోగపడుతాయి.

ఈ రాష్ట్రంలో పోలీసులకు ఇప్పటికే అధికారం ఎక్కువైపోయింది. మొన్న ముదిగొండలో AK-47లు ఉపయోగించి నిరాయుధులను పిట్టలను కాల్చినట్టు కాల్చేయడం, నిన్న వాకపల్లిలో 11 మంది గిరిజన యువతులపై అత్యాచారం, పోలీసుల ఆకృత్యాలకు తాజా ఉదాహరణలు మాత్రమే. అమాయకులను కాల్చి చంపడంలో ఆంధ్రా పోలీసులది దేశంలోనే పెద్ద రికార్డు. వీరికి అధికారాలు ఎక్కువ చేస్తే కొరివితో తలగోక్కోవడమే.

ఇక చివరగా బాబుగారి సంగతి. ఏమన్నారు బాబుగారూ రాష్ట్రం లో శాంతి భధ్రతలు క్షీణిస్తున్నాయా? భలే వారే మీరు. అక్రమ ఆయుధంతో ఇద్దర్ని టపా, టపా కాల్చి పారేసి, ఆనక దొంగ నాటకంతో ఆసుపత్రిలో చేరి డబ్బుతో న్యాయదేవత కళ్లు మూసేసిన బాలయ్యలాంటి నేరస్తులతో మీరు కజరారే…కజరారే అని తైతక్కలు ఆడుతుంటే, శాంతి భధ్రతలు క్షీణించక ఏమవుతాయి చెప్పండి?

చంద్రబాబే కాదు టెర్రరిస్టులతో, నేరస్తులతో సంబంధాలు ఉన్నయని రూడి అయిన సంజయ్ దత్, గోవిందా, సల్మాన్ ఖాన్ వంటి హీరోల సినిమాలు డబ్బులు పెట్టి చూస్తున్న మనమూ ఒక సారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. టెర్రరిజం పై యుద్ధం అంటే ఓ దేశం పై బాంబులు వేయడం, ఒకరిద్దరిని కాల్చి పారేయడం కాదు. ఇటువంటి వ్యక్తులను శిక్షించడం కూడా. దానికి మనం సిద్ధంగా ఉన్నామా? బంద్ లూ, ధర్నాలూ, ఆరోపణలు మాని కొంచెం ఈ దిశగా ఆలోచిద్దామా ఇకనైనా?

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: