బ్రిటీష్ సామ్రాజ్యవాదం నుండి అమెరికన్ సామ్రాజ్యవాదం దాకా

Jallianwalabagh

ప్రధమ భారత స్వాతంత్ర్య పోరాటపు 150వ, స్వాతంత్రపు 60వ వార్షికోత్సవం సందర్భంగా Incredible India వారు వెలువరించిన చిత్రం.

—————————————————

నిన్న మధ్యాహ్నం బ్రేక్ ఔట్ ఏరియా లో కూర్చుని చాయ్ తాగుతుంటే అడిగాడు మా కొలీగ్, రేపు జెండా వందనం ఎక్కడ చేస్తున్నావని. ఆఫీసంతా మూడు రంగుల బెలూన్లు, జెండాలతో నింపేశారు. ఇక Happy Independence Day సందేశాలకయితే లెక్కే లేదు.

అరవై వసంతాలయ్యింది కదూ మనకు స్వతంత్రం వచ్చి. మనుషులకయితే షష్టి పూర్తి అంటే జీవితపు చరమాంకానికి చేరుకున్నట్టే. ఒక జాతి ప్రస్థానంలో 60 ఏళ్లు పెద్ద సమయం కాకపోవచ్చు. కానీ గడచిన ఆరు దశాబ్దాలలో మనం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చామో చూసుకుంటే బాధ కలుగుతుంది. ఆనాడు పరపీడన నుండి జాతిని విముక్తి చేయాలని ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన ఎందరో అమరవీరులు ఇవ్వాళ ఈ జాతి నడుస్తున్న దారిని చూస్తే ఇందుకోసమేనా మేము పోరాడింది అని కుమిలిపోక తప్పదు.

జాతి యావత్తూ జెండా వందన సంబరాలలో మునిగి తేలుతుంటే, నా మదిలో మెదులుతున్న భావాలిలా ఉన్నాయి.

1) ఆనాడు 150 ఏళ్లు పోరాడింది బ్రిటీష్ సామ్రాజ్యవాదులను దేశం నుంచి వెళ్లగొట్టాలని. ఇవ్వాళ ఈ దేశపు నేతలు, ప్రజలు కలిసి అమెరికన్ సామ్రాజ్య వాదులకు ఎర్ర తివాచీ పరచి మరీ స్వాగతం పలుకుతున్నాం. ఎందుకిలా?

2) ఆనాడు బ్రిటీష్ వారు కూడా మొదలు వ్యాపారం కొరకే వచ్చామన్నారు. ఆ తరువాత మన పాలకులయ్యారు. ఇప్పుడు బహుళ జాతి కంపెనీలూ వ్యాపారం కొరకే ఈ దేశం లో అడుగు పెట్టాయి. వాటి వెనుకే అమెరికన్ ప్రభుత్వమూ, ప్రపంచ బ్యాంకూ మన దేశ అంతర్గత వ్యవహారాలలో వేలుపెట్టడం మొదలు పెట్టాయి. ఇవ్వాళ దేశంలో ఏ చట్టాలు ఉండాలో నిర్ణయించేది అమెరికా అని మనకు అర్ధం అవుతున్నదా?

3) లక్షల కోట్ల విలువైన చమురు, సహజ వాయువు, ఇనుము, బాక్సైట్, బెరైటిస్, ఇలుమినైట్, యురేనియం వంటి సహజ వనరులను ఇవ్వాళ చౌక ధరలకు ప్రైవేటు, విదేశీ కంపెనీలకు అప్పజెప్తున్నాం. ఇదే వనరులను ప్రభుత్వమే వెలికితీసి అమ్ముకుంటే చాలా డబ్బు సంపాదించవచ్చనీ, తద్వారా ఇప్పుడు కనపడుతున్న “అభివృద్ధి” అంతా ఎవరికీ మన భవిష్యత్తును తాకట్టు పెట్టకుండానే సాధించవచ్చన్న విషయం మన నేతలు చెప్పట్లేదు, మన ప్రజలూ అర్ధం చేసుకోవట్లేదెందుకు?

4) గడచిన 3 ఏళ్ల్లలో మన రాష్ట్ర ప్రభుత్వమే వివిధ ప్రైవేటు కంపెనీలకు, బహుళజాతి సంస్థలకు దాదాపు 50,000 ఎకరాల భూమినిని కారు చౌక ధరలకు ముట్టజెప్పింది. దేశమంతటా SEZ ల ఏర్పాటుకు లక్షల ఎకరాల భూములు ఇస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. సదరు SEZలలో భారత చట్టాలు వర్తించవు. అక్కడ పెట్టే వ్యాపారాలకు పన్నులు ఉండవు. ఒక విధంగా ఇవి సార్వభౌమ ద్వీపాలు. కంపెనీలపై ఇంత ప్రేమ చూపించే ప్రభుత్వాలు తాము బ్రతకడానికి, ఉండడానికి భూమి కావాలని అడిగిన పేదలకు తూటాలతోనే సమాధానం చెబుతున్నాయి. కళింగనగర్, సింగూర్, నందిగ్రాం, బషీర్ బాగ్, గంగవరం, ముదిగొండ…స్థలం మారినా, పార్టీలు మారినా అందరూ చేస్తున్నది ప్రైవేటు, విదేశీ కంపెనీల సేవే. మన దేశంలో మన దేశపౌరులనే చంపి బహుళజాతి కంపెనీలకు వ్యాపారం చేసుకొమ్మని స్వాగతం పలకడం ఏం న్యాయం?. దీనికోసమేనా మన పూర్వీకులు ప్రాణాలు త్యాగం చేసింది?

5) మొదలు నష్టం వస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు (PSU) లను అమ్ముతామని అబద్ధం చెప్పి ఆ తరువాత వేల కోట్ల రూపాయల లాభం వస్తున్న సంస్థలను అడ్డికి పావు శేరు ధరలకు అమ్మేస్తుంటే కళ్లుండీ కబోధుల్లా చూస్తూ కూర్చుంటారేమిటి ఈ దేశ ప్రజలు?

6) ఒకనాడు అలీనోద్యమ నిర్మాతగా పేరు తెచ్చుకుంది మన దేశం. మరి ఇప్పుడో? అమెరికాతో అణు ఒప్పందంవంటి దుర్మార్గ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ ఒప్పందం జరిగేలా విపరీతంగా డబ్బు వెదజల్లి అమెరికన్ సెనేట్ లో లాబీయింగ్ నిర్వహించాయి బహుళజాతి కంపెనీలు. సదరు ఒప్పందం ప్రపంచ దేశాల మధ్య అణ్వాయుధాల పోటికి దారి తీస్తోంది. కరెంటు కొరత తీర్చడానికి అన్న మిషతో దాదాపు 20000 కోట్ల డాలర్ల రక్షణ కొనుగోళ్లకు తెర తీసిందీ ఒప్పందం. లబ్దిదారులు యధాప్రకారం బహుళజాతి కంపెనీలే.

ఏమైంది బాపు ప్రవచించిన శాంతి సందేశం?

7) ఈ మధ్య మీరు రెక్సోనా, పెస్పొడెంట్, డెటాల్, లక్స్ లేదా హిందుస్తాన్ లీవర్ వారి అనేకానేక ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనలు చూసి ఉంటే ఒక ఆసక్తికరమైన విషయం గమనించి ఉంటారు. అనేక ఏళ్లుగా దాదాపు మధ్యతరగతి భారతీయుల దైనందిన జీవితంలో ఉపయోగపడే అధిక శాతం వస్తువులు తయారు చేసే కంపెనీగా పేరు తెచ్చుకున్న Hindustaan Lever Limited – HLL, ఒక బహుళజాతి కంపెనీకి (Unilever) భారతీయ అనుబంధ సంస్థ మాత్రమే.

మారిన పరిస్థితులలో ఇక ముసుగులు అక్కరలేదు అనుకుందేమో, సదరు కంపెనీ గత నెలలో తన పేరును Unilever India గా పేరు మార్చుకుంది.

60 ఏళ్ల స్వతంత్ర భారతం 10 శాతం ఆర్ధిక వృద్ధి రేటును నమోదు చేయగలిగింది కానీ మానవాభివృద్ధిలో మాత్రం ప్రపంచంలో 126వ స్థానంలోనే నిలబెట్టింది. భారతీయులు కొద్ది మంది బిలియనీర్లు అయ్యుండవచ్చు. కానీ స్వతంత్రం వచ్చిననాటికన్నా ఎక్కువమంది పేదలు ఉన్నారు ఇప్పుడు మన దేశంలో. అన్ని సామాజిక రంగాల్లో దయనీయమైన పరిస్థితులున్నాయి.

అందుకే ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం నాకు సంతోషం కలిగించట్లేదు.

స్వపరిపాలన, స్వావలంబన, ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ ఒక కొత్త స్వాతంత్ర పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందనిపిస్తోంది.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: